అరబ్‌ దేశాల పర్యటనలో గురుదేవ్‌..కాప్ 28 సదస్సులో ప్రసంగించనున్న శ్రీ శ్రీ రవిశంకర్ | Gurudev Sri Sri Ravi Shankar to Address COP28 In Dubai | Sakshi
Sakshi News home page

అరబ్‌ దేశాల పర్యటనలో గురుదేవ్‌..కాప్ 28 సదస్సులో ప్రసంగించనున్న శ్రీ శ్రీ రవిశంకర్

Published Sat, Dec 9 2023 9:55 AM | Last Updated on Sat, Dec 9 2023 10:08 AM

Gurudev Sri Sri Ravi Shankar to Address COP28 In Dubai - Sakshi

ప్రపంచ ప్రఖ్యాత మానవతావాది, ఆధ్యాత్మికవేత్త గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ తన వారం రోజుల పర్యటన నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఎమిరేట్స్ నాయకత్వంతో వ్యూహాత్మక సంభాషణలు సహా, వాతావరణ మార్పులపై చర్చించే కాప్ 28 సదస్సులో ఉన్నత స్థాయి చర్చలలో పాల్గొంటున్నారు. శాంతి స్థాపన, సంక్షోభ నివారణ, సమస్యల పరిష్కారం, పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిక్షణ తదితర అంశాలలో శ్రీశ్రీ రవిశంకర్ గణనీయమైన పాత్ర పోషిస్తున్న విషయం విదితమే. ​పర్యటనలో భాగంగా శ్రీశ్రీ మొదటగా ఫుజైరా పాలకుడు, సుప్రీం కౌన్సిల్ సభ్యుడైన గౌ. షేక్ హమద్ బిన్ మొహమ్మద్ అల్ షర్కీతో అతని రాజ నివాసంలో సమావేశమై, ధర్మబద్ధమైన మానవ విలువల్ని పెంపొందించటం, శాంతియుత సహజీవనపు ఆవశ్యకత సహా విస్తృతమైన అంశాలపై చర్చించారు.

​భారతదేశంలోని 70 నదులు ఉపనదుల పునరుద్ధరణ, పునరుజ్జీవనానికి, 36 దేశాల్లో 8 కోట్ల 12 లక్షల చెట్లను నాటేందుకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తిగా, అలాగే 22 లక్షల రైతులను స్థిరమైన, పర్యావరణ అనుకూలమైన, సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా చేసిన వ్యక్తిగా, గురుదేవ్ తన అభిప్రాయాలను కాప్ 28 సమావేశాలలో పంచుకోనున్నారు. ధార్మిక విశ్వాసాలను పాటించే సమాజాలను భూ పరిరక్షణకు ఎలా సమీకరించాలనే అంశంపై శ్రీశ్రీ ప్రసంగించనున్నారు. బ్రహ్మ కుమారీస్కు చెందిన మోరీన్ గుడ్‌మాన్ వరల్డ్ విజన్ ఇంటర్నేషనల్కు చెందిన యుకికో యమదా మోరోవిక్ వంటి ఇతర ధార్మిక నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంతేగాక ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమాన్ని ప్రారంభించి కీలకోపన్యాసం చేయనున్నారు. పర్యావరణ హితమైన సుస్థిరమైన జీవనశైలిని పెంపొందించేందుకు మానవ కార్యకలాపాలకు పర్యావరణానికి మధ్య సమతుల్యాన్ని సాధించేందుకు మొదటగా మనలో రావలసిన అంతర్గత పరివర్తన యొక్క ప్రాముఖ్యతను, అంతర్గత పరివర్తనకు మార్గాలను శ్రీశ్రీ వివరిస్తారు.

అనంతరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ వార్షిక అంతర్జాతీయ సదస్సులో ఎమిరేట్స్ దేశపు సహన, పరస్పర సహజీవన శాఖా మంత్రి గౌ. షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్, ఇతర ప్రముఖులతో కలసి గురుదేవ్ గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. ​కాప్28 పర్యావరణ సదస్సులో భాగంగా ఏర్పాటు చేయబడ్డ అనేక కార్యక్రమాలలో భాగంగా, గురుదేవ్ డిసెంబర్ 6న కొలంబియన్ పెవిలియన్‌లో ప్రధానోపన్యాసం చేయనున్నారు. కొలంబియా ప్రభుత్వం, ఫార్క్ వేర్పాటువాదుల మధ్య 52 సంవత్సరాలపాటు కొనసాగిన వివాదానికి ముగింపు పలికేందుకు, దౌత్యం, చర్చల ద్వారా ఏకాభిప్రాయ నిర్మాణానికి 2015 సంవత్సరంలో జరిపిన చర్చలను, వాటి ఫలితాన్ని, సభ్యులతో శ్రీశ్రీ పంచుకోనున్నారు.

మానవత్వానికి, ప్రేమకు, ఏకాభిప్రాయ సాధనకు ప్రాధాన్యమిచ్చే గురుదేవ్ విధానాలు సంఘర్షణలతో అతలాకుతలమౌతున్న ప్రజలకు ఆశారేఖలుగా దారిచూపుతాయనడంలో సందేహం లేదు. ​ప్రపంచ శాంతి, సామరస్యం కావాలంటే మొదటగా వ్యక్తిగతమైన ప్రశాంతత కావాలని గురుదేవ్ అంటారు. అందుకు అనుగుణంగా ఈ ఆరు రోజల అరబ్బుదేశాల పర్యటనలో చివరగా గురుదేవ్ దుబాయ్ లోని అల్ నాసర్ క్లబ్ - అల్ మక్టూమ్ స్టేడియంలో 15 వేల మందికి పైగా ప్రజలతో ధ్యానం చేయించనున్నారు. అరబ్బు దేశాలలో అభివృద్ధికి కృషిచేసిన వ్యాపారవేత్తలను, సంఘ సేవకులను, సన్మానిస్తున్న ఈ కార్యక్రమానికి రిజర్వు చేసిన టికెట్లు పూర్తిగా అమ్ముడైపోయినట్లు నిర్వాహకులు ప్రకటించారు.

(చదవండి: ప్రధాని జస్టిన్‌ ట్రూడో కఠిన నిర్ణయం.. విదేశీ విద్యార్ధులకు భారీ షాకిచ్చిన కెనడా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement