fossil fuels
-
శిలాజ ఇంధనాలకు రాయితీలు తగ్గితేనే...
శిలాజ ఇంధనాల వినియోగం నానాటికీ పెరుగుతున్నందు వల్ల కాలుష్యం మరింత పెరుగుతోంది. అందుకే ప్రపంచ దేశాలు ఆ ఇంధనాలపై ఇస్తున్న సబ్సిడీలను తగ్గించాలని వివిధ అంతర్జాతీయ సంస్థలూ, సదస్సులూ దశాబ్దాలుగా పిలుపునిచ్చాయి. ఉదాహరణకు కాప్– 21 సదస్సులో 40 కంటే ఎక్కువ దేశాలు శిలాజ ఇంధన సబ్సిడీలను తొలగించడానికి ఒక ఉమ్మడి ప్రకటన చేశాయి. అయినా కూడా పారిశ్రామిక దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు శిలాజ ఇంధనాల ఉత్పత్తి, వినియో గానికి బడ్జెట్ బదిలీలు, పన్ను మినహాయింపులు, ఆర్థిక హామీలు అందజేస్తూనే ఉన్నాయి. ఈ సబ్సిడీల వలన వాతావరణానికి ప్రాథమికంగా హాని చేస్తున్న శిలాజ ఇంధనాల ఉపయోగం పెరుగుతూనే ఉన్నది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి తగిన చర్యలు లేకపోవడంతో వర్ధమాన దేశాలు కూడా ముందడుగు వేయడానికి సిద్ధంగా లేవు. 2023లో భారతదేశంలో మొత్తం ఇంధన సబ్సిడీలు రూ. 3.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ‘ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్’ చేసిన కొత్త పరిశోధన ప్రకారం ఇవి గత తొమ్మిదేళ్లలో గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దేశంలో ఇంధన వనరుల డిమాండ్ పెరగడంతో పాటు, 2022లో ప్రపంచ ఇంధన సంక్షోభం నేపథ్యంలో, ప్రభుత్వం 2023లో అన్ని రకాల ఇంధన వనరుల లభ్యతను విస్తరిస్తూ హైబ్రిడ్ విధా నాన్ని అవలంభించింది. పెరుగుతున్న ఇంధన వినియోగం, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తరువాత అంతర్జాతీయ ఇంధన ధరల సంక్షోభం ప్రభావం, అనేక దేశాలు అనుకున్న లక్ష్యాలకు వ్యతిరేకంగా శిలాజ ఇంధనాలకు మద్దతును గణనీయంగా పెంచాయి. భారతదేశం కూడా ఈ దిశ గానే అనేక చర్యలు అమలులోకి తెచ్చింది. 2022– 2023లో గరిష్ఠ స్థాయికి చేరుకున్న శిలాజ ఇంధన ధరల ప్రభావం నుంచి పేద, మధ్య తరగతి కుటుంబాలను ఆదుకోవడానికి భారత ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ రిటైల్ ధరలను పరిమితం చేసింది. పన్నులను తగ్గించింది. వ్యాపారులు, వినియోగ దారులకు ప్రత్యక్ష నగదు బదిలీలు చేసింది. ఆయా చర్యల ఫలితంగా చమురు, గ్యాస్ సబ్సిడీలు 2022తో పోలిస్తే 2023లో 63 శాతం పెరిగాయి. అయితే, 2023లో మొత్తం ఇంధన సబ్సిడీలలో బొగ్గు, చమురు, గ్యాస్ సబ్సిడీలు దాదాపు 40 శాతం కాగా, కాలుష్య రహిత ఇంధన వనరుల (క్లీన్ ఎనర్జీ)కు సబ్సిడీలు 10 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. మిగిలిన సబ్సిడీలలో ఎక్కువ భాగం విద్యుత్ వినియోగానికీ, ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినవీ ఉన్నాయి. ఇదే కాలంలో బొగ్గు సబ్సిడీలు కూడా 17 శాతం పెరిగాయి. మొత్తంగా క్లీన్ ఎనర్జీ సబ్సిడీల కంటే శిలాజ ఇంధన సబ్సిడీలు ఐదు రెట్లు ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం 2023లో ప్రభుత్వ ఆధీనంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలకు ప్రత్యక్ష బడ్జెట్ బదిలీల ద్వారా చమురు, గ్యాస్ రంగానికి గణనీయమైన మద్దతును అందించింది. ఈ కాలంలో, మొత్తం చమురు – గ్యాస్ సబ్సిడీలు కనీసం రూ.70,692 కోట్లకు పెరి గాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వ సబ్సిడీల కారణంగా వరి, గోధుమలు, మక్కలు, చెరుకు వంటి ఆహార సంబంధిత ఉత్పత్తుల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేయ డానికి చాలా మంది మొగ్గుచూపుతున్నారు. ఒకవైపు ఆహార భద్రత సాధించటానికీ, ఆకలి తగ్గించడానికీ వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం... ఇంకొక వైపు సబ్సిడీలు ఇచ్చి అదే ఆహార పంటలను ఇతరత్రా ఉపయోగాలకు మళ్ళిస్తోంది. ఇందువల్ల కలిగే దీర్ఘకాలిక దుష్ప్రభావం ఊహించలేని విధంగా ఉండవచ్చు. 2020 ఆర్థిక సంవత్సరంలో, కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి మొత్తం ఇంధన ఆదాయం రూ. 6,99,565 కోట్లుగా అంచనా. ఇది మొత్తం ప్రభుత్వ ఆదాయంలో దాదాపు 17 శాతం. ఇంధన వనరుల నుంచి వచ్చే ఆదా యంలో ఎక్కువ భాగం (83శాతం) చమురు, గ్యాస్ నుండి వస్తోంది. పునరుత్పాదక ఇంధనం నుంచి 1 శాతం కంటే తక్కువే వస్తోంది. ఈ ఆదాయం కూడా ఎక్కువగా కేవలం రెండు పన్నుల నుండి వస్తోంది: కేంద్ర ఇంధన ఎక్సైజ్, రాష్ట్ర స్థాయి వ్యాట్. శిలాజ ఇంధన శక్తి వనరుల వల్ల ఆదాయం 2030 నాటికి అదనంగా రూ. 30 వేల కోట్ల నుంచి రూ. 3,40,000 కోట్లకు పెరగవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ ఆదాయం కోల్పోవటానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. క్రమంగా ఈ ఆదాయం మీద ఆధార పడటం తగ్గించడానికి కూడా సుముఖంగా లేవు. అయితే శిలాజ ఇంధనాల వల్ల ఆదాయం మాత్రమే కాదు భారం కూడా ఉంటుంది. ఇంధనాల ధరలో ప్రతిబింబించని ఖర్చుల భారం చాల ఎక్కువ. ఒక అంచనా ప్రకారం ఈ భారం ప్రభుత్వ ఆదాయానికి ఐదు రెట్లు ఎక్కువ. ఈ భారం రకరకాలుగా ఉంటుంది. ప్రధానంగా నీరు, గాలి, ఇతర ప్రకృతి వనరుల కాలుష్యం వల్ల కలిగే మరణాలు, అనారోగ్య సమస్యలు, వాటిని అధిగమించడానికి కల్పించవలసిన మౌలిక సదుపాయాల రూపంలో ఈ భారాన్ని చూడవచ్చు. అందుకే కాలుష్య రహిత ఇంధన (క్లీన్ ఎనర్జీ) ఉత్పత్తులు పెంచడానికి చర్యలు తీసుకోవాలని అనేక అంతర్జాతీయ సంస్థలు అంటున్నాయి. ప్రపంచ వాతా వరణ సదస్సులలో కాలుష్య రహిత ఇంధనాల వైపు ఉత్పత్తి, వినియోగ రంగాలు మారాలని ఎప్పటి నుంచో ఒత్తిడి ఉంది. ‘గ్లాస్గో కాప్ 26’ సదస్సులో బొగ్గు ఆధా రిత విద్యుత్, ఇతర ఇంధన ఉపయోగాలను క్రమంగా తగ్గించాలని పెట్టిన ముసాయిదా తీర్మానాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకించింది. కేవలం బొగ్గు కాకుండా అన్ని రకాల శిలాజ ఇంధనాల ఉపయోగం క్రమంగా తగ్గించాలని వాదించింది. దుబాయి కాప్ 28 సదస్సులో ఈ దిశగా అన్ని రకాల శిలాజ ఇంధనాలను దశల వారీగా తగ్గించాలనే తీర్మానం దాదాపు ఖరారు అయినా సర్వామోదం పొందలేదు. పెరుగుతున్న కర్బన కాలుష్యం కారణంగా భూమి ఉష్ణోగ్రతలు పెరిగి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తు న్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదకర శిలాజ ఇంధ నాలపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా వాటికి రాయితీలు తగ్గించాలి. అది సాధ్యం కావాలంటే సమూల ఆర్థిక పరివర్తనం అవసరం. ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. క్లీన్ ఎనర్జీ అందుబాటులోకి వస్తే ఆర్థిక వృద్ధి సుస్థిరం అవుతుంది. శిలాజ ఇంధన దిగుమతుల మీద ఆధారపడిన ఆర్థిక అభివృద్ధి సుస్థిరం ఎప్పటికీ కాలేదు. ప్రకృతిని కలుషితం చేస్తూ అభివృద్ధి దిశగా పయనించడం దుర్భరంగా ఉంటుంది. అందుకే కర్బన కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా అవసరమైన వాతా వరణ లక్ష్యాలను చేరుకోవడం కోసం ఒక ఆచరణాత్మక దృష్టి అవసరం. ప్రభుత్వం శిలాజ ఇంధన పన్ను ఆదా యంలో కొంత భాగాన్ని కొత్త కాలుష్య రహిత శక్తి వనరుల వైపు మళ్ళించాలి. సుస్థిర అభివృద్ధికీ, సమాన ఫలాలు అందరికీ అందించే ఆర్థిక వ్యవస్థకూ ఇంధనాల కూర్పు చాల కీలకం. డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
మూత్రం నుంచి విద్యుత్
పాలక్కడ్: కాలుష్యకారక శిలాజ ఇంథనాలకు బదులు పునరుత్పాదక ఇంథనంపై ప్రపంచం దృష్టిపెట్టాలన్న ఆకాంక్షల నడుమ ఐఐటీ పాలక్కడ్ పరశోధకులు పునరుత్పాదక ఇంథనాన్ని మూత్రం నుంచి ఉత్పత్తిచేసి ఔరా అనిపించారు. సంబంధిత పరిశోధనా పత్రాన్ని ప్రముఖ ఆన్లైన్ జర్నల్ ‘సపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ’లో ప్రచురించారు. ఈ పునరుత్పాదక విద్యుత్ తయారీ కోసం వారు కొత్తగా ఎలక్ట్రో కెమికల్ రిసోర్స్ రికవరీ రియాక్టర్(ఈఆర్ఆర్ఆర్)ను తయారుచేశారు. ఇందులో మూత్రాన్ని నింపి ఎలక్ట్రోరసాయనిక చర్యల ద్వారా విద్యుత్‌ను, సహజ ఎరువును ఉత్పత్తిచేస్తారు. ఈ విద్యుత్‌తో స్మార్ట్ఫోన్లును చార్జ్చేయొచ్చు. విద్యుత్ దీపాలను వెలిగించవచ్చు. రీసెర్చ్ స్కాలర్ వి.సంగీత, ప్రాజెక్ట్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీజిత్ పీఎం, డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్‌లో రీసెర్చ్ అసోసియేట్ రీను అన్నా కోషీల బృందం ఈ పరిశోధన చేపట్టింది. ఈఆర్ఆర్ఆర్ ద్వారా నైట్రోజన్, ఫాస్పరస్, మెగ్నీషియంలు ఎక్కువగా ఉండే సహజ ఎరువునూ పొందొచ్చని ఐఐటీ పాలక్కడ్ ఒక ప్రకటనలో పేర్కొంది. అమ్మోనియా సంగ్రహణి, క్లోరినేషన్ గది, ఎలక్ట్రికల్ గొట్టాల సమన్వయంతో ఈ రియాక్టర్ పనిచేస్తుంది. ఇందులో మెగ్నీషియంను ఆనోడ్‌గా, గాలి కార్భన్ను కాథోడ్‌గా వాడతారు. థియేటర్లు, షాపింగ్ మాల్స్ ప్రాంగణాల్లో మూత్ర విసర్జన ఎక్కువ. ఇలాంటి చోట్ల ఈ రియాక్టర్ల ద్వారా ఎక్కువ స్థాయిలో విద్యుత్‌ను ఉత్పత్తిచేసి అక్కడి విద్యుత్దీపాలను వెలిగించవచ్చు. ప్రస్తుతం ఈ సాంకేతికత ప్రయోగ దశలోనే ఉందని ఐఐటీ పాలక్కడ్ స్పష్టంచేసింది. ఈ టెక్నాలజీపై పేటెంట్ కోసం బృందం ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. ప్రాజెక్టుకు కేంద్రమే నిధులిచ్చింది. -
శిలాజ ఇంధనాలకు బైబై
దుబాయ్: హరిత గృహ వాయువుల ఉద్గారానికి, తద్వారా భూతాపానికి, భూగోళంపై ప్రకృతి విపత్తులకు, జీవకోటి మనుగడకు పెనుముప్పుగా పరిణమించిన శిలాజ ఇంధనాల వాడకానికి వీడ్కోలు చెప్పే దిశగా అడుగులు వేసేందుకు దాదాపు 200 దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు దుబాయ్‌లో జరుగుతున్న ‘కాప్–28’ సదస్సులో చరిత్రాత్మక ఒప్పందానికి అన్ని దేశాలు మద్దతు పలికాయి. ‘శిలాజ ఇంధనాల వాడకం మానేద్దాం.. మార్పు సాధిద్దాం’ అంటూ ప్రతిన బూనాయి. కాప్–28 సదస్సులో బుధవారం చివరి సెషన్ జరిగింది. శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా కీలక ఒప్పందాన్ని సభ్యదేశాల ప్రతినిధులంతా ముక్తకంఠంలో ఆమోదించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మార్మోగింది. 2050 నాటికి నెట్‌జీరో(సున్నా) ఉద్గారాలే లక్ష్యంగా ఒప్పందంలో 8 సూత్రాల ప్రణాళికను జోడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ఏడాది కాప్ సదస్సులో చెప్పుకోదగ్గ తీర్మానాలేవీ ఉండబోవన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. భూగోళాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు మనుగడ ఉంటుందని కాప్–28 అధ్యక్షుడు సుల్తాన్ అల్–జబేర్ తేలి్చచెప్పారు. పారిస్ ఒప్పందాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని, ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పని చేయాలని, పటిష్టమైన, నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టాలని కాప్–28 సదస్సు పిలుపునిచ్చింది. ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాన్ని గణనీయంగా తగ్గించాల్సిన బాధ్యత అన్ని దేశాలపైనా ఉందని స్పష్టం చేసింది. చేతలు కావాలి: బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తగ్గించుకోవాలని గతంలో జరిగిన కాప్ సదస్సుల్లో ప్రత్యేకంగా సూచించారు. ఈసారి మాత్రం ఈ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. బొగ్గుతో విద్యు త్ను ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలో చైనా, భారత్ ముందంజలో ఉన్నాయి. తమ విద్యుత్ అవసరాలు తీర్చుకోవడానికి బొగ్గుపై ఆధారపడుతున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించడానికి బుధవారం ఆమోదించిన ఒప్పందమే అతిపెద్ద కార్యాచరణ ప్రణాళిక అని సుల్తాన్ అల్–జబేర్ అన్నారు. కాప్–28 టాప్ 10 చరిత్రాత్మక శిలాజ ఇంధన ఒప్పందంతో కాప్–28 సదస్సు ముగిసింది. ఇలాంటి కాలుష్య ఇంధనాల వాడకాన్ని క్రమంగా నిలిపివేయడానికి ప్రపంచ దేశాలు అంగీకరించాయి. పెట్రోల్, డీజిల్, బొగ్గు వినియోగం అంతమయ్యే దిశగా అడుగులు పడ్డాయని చెప్పొచ్చు. 1. చరిత్రాత్మక శిలాజ ఇంధన ఒప్పందంతో కాప్–28 సదస్సు ముగిసింది. ఇలాంటి కాలుష్య ఇంధనాల వాడకాన్ని క్రమంగా నిలిపివేయడానికి ప్రపంచ దేశాలు అంగీకరించాయి. పెట్రోల్, డీజిల్, బొగ్గు వినియోగం అంతమయ్యే దిశగా అడుగులు పడ్డాయని చెప్పొచ్చు. 2. సంపన్న దేశాల నిర్వాకం వల్లే వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. వాటి వల్ల పేద దేశాలు నష్టపోతున్నాయి. పేద దేశాలకు వాటిల్లుతున్న నష్టానికి గాను బడా దేశాలు పరిహారం ఇవ్వాలన్న ప్రతిపాదన చాలాఏళ్లుగా ఉంది. ఈ సదస్సులో దానికి కార్యరూపం వచి్చంది. వాతావరణ మార్పుల వల్ల నష్టపోయే పేద దేశాలకు ఆర్థిక సాయం అందించడం కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. 3. నిర్దేశిత గడువు కంటే నెట్జిరో కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తామని కెనడా, బెల్జియం వంటి దేశాలు ప్రకటించాయి. 2030 నాటికి ఉద్గారాలను 50 శాతం తగ్గించుకుంటామని దుబాయ్ వెల్లడించింది. 4. 2030 కంటే ముందే గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాన్ని అరికట్టడానికి శుద్ధ ఇంధనాల వనరుల వాడకాన్ని గణనీయంగా పెంచుకోవాలని నిర్దేశించారు. 5. క్లైమేట్ యాక్షన్ కోసం సంపన్న దేశాల నుంచి నిధులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనపై చర్చలు జరిగాయి. 6. జీవ వైవిధ్యానికి, మానవళికి ఎలాంటి హాని కలగకుండా వాతావరణ మార్పుల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని నిర్దేశించారు. 7. ప్రస్తుతం అమల్లో ఉన్న పారిస్ ఒప్పందం లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శిలాజ ఇంధనాల వినియోగం, ఉత్పత్తిని తగ్గించుకోవాలని ఆదేశించారు. 8. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ క్లైమేట్ ఫండ్ తరహాలో క్లైమేట్ ఫైనాన్స్, సపోరి్టంగ్ ఫండ్స్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు కొన్నిదేశాలు, సంస్థలు మద్దతు ప్రకటించాయి. 9. కాప్–26 సదస్సు ఫలితాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కర్బన్ ఉద్గారాల సమాచారాన్ని నమోదు చేసే విషయంలో నిబంధనలు సవరించారు. 10. అన్ని దేశాల, అన్ని వర్గాల అవసరా లను దృష్టిలో పెట్టుకొని శిలాజ ఇంధనాల నుంచి ఇతర ప్రమాద రహిత ఇంధనాల వైపు క్రమానుగతంగా మారాలని సూచించారు. -
Licypriya Kangujam: నిండు సభలో... నిగ్గదీసి అడిగిన అగ్గిస్వరం
వాన కురిస్తే, హరివిల్లు విరిస్తే మురిసే చిన్నారి హృదయాలకు ప్రకృతి ఆత్మీయ నేస్తం. అలాంటి అందమైన, ఆత్మీయమైన ప్రకృతి ఎదుట విలయ విధ్వంసం కరాళనృత్యం చేస్తుంటే... లిసిప్రియలాంటి చిన్నారులు ‘పాపం, పుణ్యం ప్రపంచ మార్గం’ అని ఊరుకోరు. ప్రకృతికి సంబంధించి మనం చేస్తున్న పాపం ఏదో, పుణ్యం ఏదో కళ్లకు కట్టేలా ప్రచారం చేస్తారు. దుబాయ్‌లో జరిగిన ‘యునైటెడ్ నేషన్స్ క్లైమెట్ చేంజ్ కాన్ఫరెన్స్–2023’లో తన నిరసనను బహిరంగంగా తెలియజేసింది మన దేశానికి చెందిన పన్నెండు సంవత్సరాల లిసిప్రియ కంగుజామ్. ‘శిలాజ ఇంధనాలను అంతం చేయండి... భవిష్యత్తును, భూగోళాన్ని కాపాడండి’ అంటూ నినదించింది. కొద్దిసేపు ప్రసంగించింది. ఆమె నిరసనను ప్రపంచ ప్రతినిధులు కొందరు చప్పట్లతో ఆమోదం పలికారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మణిపుర్‌కు చెందిన క్లైమెట్ యాక్టివిస్ట్ లిసిప్రియ గురించి.... లిసిప్రియ కంగ్జామ్ మణిపుర్‌లోని బషిక్హోంగ్లో జన్మించింది. తల్లిదండ్రుల ద్వారా, స్కూల్లో ఉపాధ్యాయుల ద్వారా విన్న పర్యావరణపాఠాలు ఈ చిన్నారి మనసుపై బలమైన ప్రభావాన్ని చూపాయి. పర్యావరణ సంరక్షణ కోసం తనవంతుగా ఏదైనా చేయాలనుకుంది. ఏడు సంవత్సరాల వయసులోనే అందరూ ఆశ్చర్యపడేలా పర్యావరణ సంబంధిత విషయాలు మాట్లాడేది. 2018లో ప్రకృతి విధ్వంసంపై మంగోలియాలో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సదస్సులో తండ్రితో కలిసి పాల్గొంది. ఈ సదస్సులో వక్తల ఉపన్యాసాల నుంచి ఎన్నో కొత్తవిషయాలు నేర్చుకుంది. ఈ సదస్సు ప్రియ జీవితాన్ని మార్చేసిన సదస్సు అని చెప్పవచ్చు. ఈ సదస్సు స్ఫూర్తితో ‘చైల్డ్ మూమెంట్’ అనే సంస్థను మొదలుపెట్టింది. మొక్కల పెంపకం వల్ల ప్రకృతికి జరిగే మేలు, ప్రకృతి విధ్వంసం వల్ల జరిగే నష్టాలు... మొదలైన వాటి గురించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్నో స్కూల్స్‌లో ప్రచారకార్యక్రమాలు విరివిగా నిర్వహించింది. 2019లో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరిగిన యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంది. ఇదే సంవత్సరం అంగోలా దేశంలో జరిగిన ఆఫ్రికన్ యూనియన్ సదస్సులో పాల్గొంది. ఈ సదస్సులో ఎంతోమంది దేశాధ్యక్షులతో పాటు ప్రియ ప్రసంగించడం విశేషం. చిన్నవయసులోనే ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్‌గా ప్రపంచవ్యాప్తంగా పెద్ద పేరు తెచ్చుకుంది లిసిప్రియ. ప్రియకు డబ్బులను పొదుపు చేయడం అలవాటు. అవి తన భవిష్యత్ అవసరాలకు ఉద్దేశించి కాదు. సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించడం కోసం పొదుపు చేస్తుంటుంది. 2018లో కేరళ వరద బాధితులకు సహాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి లక్షరూపాయలు విరాళంగా ఇచ్చింది. దిల్లీలోని వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని‘సర్వైవల్ కిట్ ఫర్ ది ఫ్యూచర్’అనే డివైజ్‌కు రూపకల్పన చేసింది. ఈ జీరో బడ్జెట్ కిట్ వాయుకాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఎవరైనా, ఎక్కడైనా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ పరికరాన్ని పంజాబ్ అసెంబ్లీలో లాంచ్ చేసింది ప్రియ. వాతావరణ మార్పులపై కార్యచరణ కోసం, మన దేశంలో క్లైమెట్ లా కోసం వందలాదిమందితో కలిసి దిల్లీలోని ఇండియా గేట్ దగ్గర ప్రదర్శన నిర్వహించింది. ‘సందేశం ఇవ్వాలనుకోవడం లేదు. సమస్యను అర్థం చేసుకోమని చేతులు జోడించి వినమ్రంగా వేడుకుంటున్నాను’ అంటుంది లిసిప్రియ. యాక్ట్ నౌ దుబాయ్‌లో జరిగిన క్లైమేట్ కాన్ఫరెన్స్–2023లో 190 దేశాల నుంచి 60,000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. చిన్నారి ప్రియ ధైర్యంగా వేదిక మీదికి వచ్చి ‘అవర్ లీడర్స్ లై, పీపుల్ డై’ అని గట్టిగా అరిచింది. సదస్సు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ తరువాత ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. ‘ఎవరు ఈ అమ్మాయి?’ అంటూ చాలామంది ఆరా తీశారు. చిన్న వయసు నుంచే పర్యావరణ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్న ప్రియ గురించి తెలుసుకొని ఆశ్చర్యానందాలకు గురయ్యారు. శిలాజ ఇంధనాలను అంతం చేయండి... భవిష్యత్తును, భూగోళాన్ని కాపాడండి. – లిసిప్రియ నా నేరం ఏమిటి? నిరసన తరువాత అధికారులు నన్ను 30 నిమిషాలకు పైగా నిర్బంధించారు. నేను చేసిన నేరం ఏమిటంటే పర్యావరణ సంక్షోభానికి ప్రధాన కారణం అయిన శిలాజ ఇంధనాలను దశల వారీగా తొలగించమని అడగడం. నన్ను ‘కాప్ 28’లో లేకుండా చేశారు. – లిసిప్రియ, యాక్టివిస్ట్ -
ఐదు రెట్ల మరణాలు.. ఆందోళన కలిగిస్తున్న తాజా నివేదిక
శిలాజ ఇంధనాల నిర్మూలనకు సాహసోపేతమైన చర్యలు తీసుకోకుంటే వాతావరణ సంక్షోభం మరింత మంది జీవితాలను ప్రమాదంలో పడేస్తుందని తాజా నివేదిక ఒకటి ఆందోళన కలిగిస్తోంది. 100 మందికి పైగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. వాతావరణ చర్యను ఆలస్యం చేయడం వల్ల 2050 నాటికి ఉష్ణ సంబంధిత మరణాలు దాదాపు ఐదు రెట్లు పెరుగుతాయని ప్రముఖ సైన్స్ జర్నల్ లాన్సెట్‌లో నవంబర్ 14న ప్రచురితమైన వార్షిక కౌంట్‌డౌన్ నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మానవుల ఆరోగ్యం శిలాజ ఇంధనాల నిర్మూలనపైనే ఆధారపడి ఉందని పేర్కొంది. మానవాళికి ముప్పు ఓ వైపు మానవాళి ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నప్పటికీ, వాతావరణ మార్పులతో వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు కానీ, బ్యాంకులు కానీ, కంపెనీలు కానీ మేల్కోవడం లేదని, శిలాజ ఇంధనాల వినియోగాన్ని, విస్తరణను ప్రోత్సహిస్తూనే ఉన్నాయని నివేదిక రూపకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలు చమురు, గ్యాస్ ఉత్పత్తి ప్రణాళికల విస్తరణ, ఫైనాన్సింగ్‌తో శిలాజ ఇంధనంవైపు పయనిస్తూ మానవ మనుగడకు ముప్పు తెస్తున్నాయని లాన్సెట్ కౌంట్‌డౌన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రధాన రచయిత మరీనా రొమనెల్లో సీఎన్ఎన్ వార్తా సంస్థతో పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థకూ నష్టమే ప్రపంచం శిలాజ ఇంధనాలపై ఆధారపడటం కొనసాగితే , దాని పర్యవసానాలు మానవ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థకు కూడా విపత్తుగా మారవచ్చని రోమనెల్లో నొక్కిచెప్పారు. 1800ల చివరిలో పారిశ్రామిక పూర్వ యుగం నుంచి ఈ గ్రహం ఇప్పటికే దాదాపు 1.2 డిగ్రీల సెల్సియస్ వేడెక్కింది. ఇది 2 డిగ్రీలకు చేరుకుందంటే ప్రపంచ దేశాలు 50 శాతం కార్మిక సామర్థ్యాన్ని నష్టపోతాయని, తద్వారా అపారమైన ఆర్థిక నష్టాలకు దారి తీస్తుందని నివేదిక హెచ్చరించింది. -
జీవ ఇంధనాల కూటమి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ దిశగా భారత్ కీలకమైన ముందడుగు వేసింది. ‘ప్రపంచ జీవ ఇంధనాల కూటమి’ని ప్రకటించింది. భూతాపానికి, తద్వారా పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల వాడకం తగ్గించుకోవాలని, ఇందుకోసం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి వాడుకోవాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. జీ20 శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జీవ ఇంధనాల కూటమిపై ప్రకటన చేశారు. ఈ కూటమిలో చేరాలని, పుడమిని కాపాడుకొనేందుకు చేతులు కలపాలని జీ20 సభ్యదేశాలకు పిలుపునిచ్చారు. ‘వన్ ఎర్త్’ అంశంపై జరిగిన చర్చలో మోదీ మాట్లాడారు. ‘జీ20 శాటిలైట్ మిషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ అబ్జర్వేషన్’ను కూడా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ‘గ్రీన్ క్రెడిట్ అంకురార్పణ’పై కార్యాచరణ ప్రారంభించాలని జీ20 దేశాలను కోరారు. ఇంధన బ్లెండింగ్ రంగంలో ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని, పరస్పరం సహకరించుకోవాలని, ఈ విషయంలో ఎంతమాత్రం జాప్యం తగదనిమోదీ స్పష్టం చేశారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి వాడుకోవడం చాలా ఉత్తమమని అభిప్రాయపడ్డారు. లేకపోతే ప్రత్యామ్నాయంగా మరో రకమైన బ్లెండింగ్ మిక్స్‌ను అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు. స్థిరమైన ఇంధన సరఫరా కావాలని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ సైతం ముఖ్యమేనని తేలి్చచెప్పారు. ప్రపంచ జీవ ఇంధనాల కూటమిలో భారత్, అర్జెంటీనా, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇటలీ, మారిషస్, సౌతాఫ్రికా, యూఏఈ, అమెరికా సభ్యదేశాలుగా ఉన్నాయి. కెనడా, సింగపూర్ పరిశీలక దేశాలుగా ఉన్నాయి. క్లీన్ ఎనర్జీ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని, అత్యధిక ప్రాధా న్యం ఇస్తున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఈ మేరకు వైట్‌హౌస్ ఒక ప్రకటన చేసింది. సమీకృత ఇంధన పరివర్తన వాతావరణ మార్పులు అనే పెనుసవాళ్లు ఎదురవుతున్న నేటి తరుణంలో ‘ఇంధన పరివర్తన’ చాలా అవసరమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. సమీకృత ఇంధన పరివర్తన కోసం కోట్లాది డాలర్లు వ్యయం చేయాల్సి ఉంటుందని, అభివృద్ది చెందిన దేశాలు దీనిపై మరింత చొరవ తీసుకోవాలని సూచించారు. క్లైమేట్ ఫైనాన్స్ కోసం ఏటా 100 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు అభివృద్ధి చెందిన దేశాలు 2009లో అంగీకరించడం హర్షణీయమని పేర్కొన్నారు. అయితే, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో అభివృద్ధి చెందిన దేశాలు విఫలమవుతున్నాయని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏమిటీ కూటమి? ప్రపంచంలో ప్రజలందరికీ శుద్ధమైన సౌర శక్తి చౌకగా అందాలని భారత్ ఆకాంక్షించింది. ఇందుకోసం 2015లో పారిస్‌లో జరిగిన సదస్సులో ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్(ఐఎస్ఏ)ను తెరపైకి తీసుకొచి్చంది. అదే తరహాలో ఇప్పుడు ప్రపంచ జీవ ఇంధన కూటమిని ప్రకటించింది. -
డేంజర్లో ఉన్నామా?.. సైంటిస్టుల షాకింగ్ రిపోర్ట్..
లండన్: శిలాజ ఇంధనాల వాడకం, కాలుష్యం, వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతల పెరుగుదల, ప్రకృతి విపత్తులు.. వీటి గురించి తరచుగా వింటూనే ఉన్నాం. అయినప్పటికీ ప్రపంచ దేశాలు నష్టనివారణ చర్యలు చేపట్టిన దాఖలాలు మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ప్రమాదకరమైన గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారం గరిష్ట స్థాయికి చేరినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా వెలువడుతున్న గ్రీన్‌హౌజ్ వాయువులు 54 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్తో సమానమని తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా 50 మంది అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు భూ ఉష్ణోగ్రతలపై విస్తృత అధ్యయనం నిర్వహించి, ఉమ్మడిగా నివేదిక విడుదల చేశారు. మానవ చర్యలు, గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారం భూతాపం, వాతావరణ మార్పులకు కారణమవుతున్నట్టు పేర్కొన్నారు. జీవజాలానికి ఇన్నాళ్లూ ఆవాసయోగ్యంగా ఉంటూ వస్తున్న భూగోళం క్రమంగా అగ్నిగుండంగా మారిపోతోందని హెచ్చరించారు. సైంటిస్టులు తమ నివేదికలో ఇంకా ఏం చెప్పారంటే.. ► 1800వ సంవత్సరంతో పోలిస్తే భూఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పుడు 1.14 డిగ్రీలు పెరిగాయి. ► ఉష్ణోగ్రత ప్రతి పదేళ్లకు రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీల చొప్పున పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భూతాపం మానవాళిని కబళించడం ఖాయం. ► గతంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. ► ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని యథాతథంగా కొనసాగిస్తే భూ ఉపరితల ఉష్ణోగ్రత సమీప భవిష్యత్తులోనే 2 డిగ్రీలు పెరిగిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. ► పారిశ్రామిక విప్లవం ముందునాటి సగటు కంటే ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీలకు మించి పెరగనివ్వరాదన్న పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని సాధించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలి. మునుపెన్నడూ లేనిస్థాయిలో తక్షణమే పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ► భూతాపం ముప్పు నుంచి మానవళి బయటపడాలంటే 2035 నాటికి ప్రపంచదేశాలు తమ గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలను 60 శాతానికి తగ్గించుకోవాలని సైంటిస్టు పియర్స్ ఫాస్టర్ చెప్పారు. -
మార్పును ఎదుర్కొనేలా మారాలి!
వాతావరణ మార్పు సమస్య, కనిపిస్తున్న వాస్తవం. ఇదో అతిపెద్ద ప్రపంచ సమస్య అనేదీ అంతే నిజం. కానీ ఏ ఒక్క దేశమో దీన్ని ఎదుర్కోలేదు. అలాగని ఏ దేశమూ దీన్ని విస్మరించలేదు కూడా! ఈ ఏడాది ఈజిప్టులో జరగనున్న కాప్–27, ఇండోనేసియాలో నిర్వహించనున్న జీ–20 సదస్సులో ఇది చర్చకు రానుంది. ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కూరుకునివున్న తరుణంలో ఈ చర్చ ఎటుపోతుందో తెలీదు. అయితే భారత్ మాత్రం తన వాగ్దానం మేరకు 2070 నాటికి కర్బన ఉద్గారాలను సున్నాకు చేర్చాల్సి ఉంది. ఈ దీర్ఘకాలిక లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం శిలాజేతర ఇంధనాల ఉత్పత్తిని పెంచడం, పర్యావరణ అనుకూల హైడ్రోజన్ వినియోగాన్ని ప్రోత్సహించడం, ప్రజారవాణా వ్యవస్థను విస్తృతం చేయడం, మెరుగైన డిజైన్ల ద్వారా ఇళ్లల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం లాంటి స్వల్పకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి, వాతావరణ మార్పుల ప్రభావం. పైగా ఇది ఏ ఒక్క దేశానికో సంబంధించిన సమస్య కాదు. అందరి సహకారం లేకపోతే ఏమాత్రం పరిష్కరించలేని సమస్య కూడా. ప్రపంచస్థాయిలో మూకుమ్మడి ప్రయత్నంతోనే గట్టెక్కగల ఈ సమస్య... ఈ ఏడాది ఈజిప్టులో జరగనున్న ‘కాప్–27’ సమావేశాలతోపాటు, నవంబరులో ఇండోనేసియాలో నిర్వహించనున్న జీ–20 సదస్సు సమావేశాల్లోనూ చర్చకురానుంది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, అభివృద్ధి చెందిన దేశాలు... రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, యూరప్‌లో పెరిగిన గ్యాస్ ధరలు, ద్రవ్యో ల్బణ నియంత్రణ చర్యలు ఆర్థిక మాంద్యానికి దారితీస్తాయేమో అన్న అందోళనల మధ్య నలుగుతున్న తరుణంలో ఈ ముఖ్యమైన అంశం మళ్లీ చర్చకు రావడం! అమెరికా – చైనాల మధ్య రాజకీయాలు నిత్యం రగులుతూండటం కూడా ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఈ పరిస్థి తుల నేపథ్యంలో వాతావరణ మార్పుల సమస్య నుంచి గట్టెక్కేందుకు భారత్ అనుసరించాల్సిన వ్యూహమేమిటి? వైఖరేమిటి? ఇక్కడ రెండు ముఖ్యమైన అంశాలను గుర్తుపెట్టుకోవాలి. మొదటిది: జీ–20, కాప్–27 సదస్సుల్లో వాతావరణానికి సంబంధించి మన వ్యూహ మేమిటో ఎలా వివరిస్తామన్నది. రెండోది: వాతావరణ మార్పుల నిర్వహణ కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ధనిక దేశాలు నిధులివ్వాలన్న అంశంపై మన వైఖరి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని నియంత్రించేందుకు భారత్ లక్ష్యాలేమిటన్నది గత ఏడది గ్లాస్గోలో జరిగిన కాప్–26 సదస్సులో ప్రకటించాం. దీని ప్రకారం 2070 నాటికి కర్బన ఉద్గారాలను శూన్య స్థితికి చేర్చాలి. స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలతో ఎక్కువయ్యే కర్బన ఉద్గారాలను 2005 నాటి స్థాయిలో 45 శాతం వరకూ తగ్గిం చాలి. విద్యుదుత్పత్తి మొత్తంలో 2030 నాటికి శిలాజేతర ఇంధనాల ద్వారా జరిగే ఉత్పత్తి (సౌర, పవన) సగం ఉండాలి. 2030 నాటికి సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా 450 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయాలన్న లక్ష్యం కీలకమైంది. ఈ లక్ష్యాన్ని అందుకునేలా సరఫరా సంబంధిత సమస్యలను అధిగమిం చేందుకు అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంది. అదే సమయంలో విద్యుత్తుతో నడిచే వాహనాల వినియోగం పెంచాలి. రైల్వే లైన్ల విద్యు దీకరణ వేగంగా చేపట్టాలి. ఉక్కు, ఎరువులు, పెట్రో రసాయనాల తయారీలో పర్యావరణ అనుకూల హైడ్రోజన్ వాడకాన్ని పెంచాలి. అంతేకాకుండా... మెరుగైన డిజైన్లు, పదార్థాల వాడకంతో భవనాల ద్వారా అయ్యే విద్యుత్తు ఖర్చును (లైట్లు, ఏసీల వంటివి) కూడా తగ్గించాల్సి ఉంటుంది. వీటన్నింటికీ తోడుగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత విస్తృతం చేయడం ద్వారా మాత్రమే మనం కాప్–26లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చగలం. విజయం సాధించాలంటే చాలా రంగాల్లో కృషి జరగాలి. కేంద్ర ప్రభుత్వంలోని అనేక మంత్రిత్వ శాఖలు పరస్పర అవగాహనతో ముందుకు సాగాలి. ఈ విషయాల్లో కీలకమైన ప్రైవేట్ రంగం అవస రమూ చాలానే ఉంటుంది. 2070 వరకూ తీసుకోబోయే ప్రతి విధా నాన్ని విడమర్చి చెప్పాల్సిన అవసరం లేకపోయినా, రాగల పదేళ్లలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామో చెప్పడం ద్వారా అంతర్జాతీయ వేదికలపై విశ్వాసం పొందవచ్చు. ఈ వివరాలు యూఎన్ఎఫ్సీసీకి మనమిచ్చే ‘నేషనలీ డిటర్మైండ్ కాంట్రిబ్యూషన్స్’ ప్రణాళికలో లేకున్నా ఫర్వాలేదు. కానీ ఈ పదేళ్ల లక్ష్యాలు దీర్ఘకాలిక లక్ష్యాల సాధన దిశలో సక్రమంగానే ప్రయాణిస్తున్నామా, లేదా? అన్నది తెలుసు కునేందుకు ఉపయోగపడతాయి. ఈ లెక్కన రాగల పదేళ్లలో మనం అందుకోవాల్సిన లక్ష్యాలను ఒక్కటొక్కటిగా చూస్తే: 1) 2070 నాటికి కర్బన ఉద్గారాలను శూన్యస్థితికి తీసుకు రావడమంటే, బొగ్గు వినియోగాన్ని పూర్తిగా పరిహరించడమనే అర్థం. కాబట్టి విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంచేందుకు శిలాజేతర ఇంధనా లను మాత్రమే వాడాలి. నిర్మాణంలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రా లను పరిగణనలోకి తీసుకుని బొగ్గు పతాక వినియోగం ఎప్పటికన్న అంశంపై నిర్ణయం జరగాలి. దశలవారీగా సుమారు 50 గిగా వాట్ల మేర బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తిని నిలిపివేయాలి. 2) కర్బన ఉద్గారాలు ఏ రోజుకు పతాక స్థాయికి చేరవచ్చునో కూడా ఒక తేదీ నిర్ణయించుకోవచ్చు. 3) విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంలు) ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందిప్పుడు. సంప్రదా యేతర ఇంధన వనరుల ద్వారా విద్యుదుత్పత్తిని పెంచేందుకు ఇది పెద్ద అవరోధం. డిస్కమ్‌లను ఆదుకునేందుకు నాలుగోసారి ప్రయత్నం జరుగుతోంది. ఇందుకోసం మల్టీ డెవలప్మెంట్ బ్యాంకుల సాయం తీసుకోవచ్చు. దీనివల్ల నియమ నిబంధనల ఏర్పాటు విషయంలో ఆర్థిక సంస్థలకు కొంత స్వాతంత్య్రం ఉంటుంది. ఇది రాష్ట్రాలకు కొంత నమ్మకం కల్పించి పంపిణీ వ్యవస్థలో కొంత భాగాన్ని ప్రైవేట్ పరం చేసేలా ప్రోత్సాహం లభిస్తుంది. 4) సంప్రదాయేతర వనరులు ముడి చమురు మాదిరిగా వాడుకుంటే తరిగిపోయే ఇంధనం కాదు. కాబట్టి మొత్తం విద్యుదు త్పత్తిలో వీటివాటా ఎంత పెరిగితే అంత మేలు. ఇందుకోసం గ్రిడ్ నిర్వహణ, విద్యుత్తు నియంత్రణల్లో ఎన్నో కొత్త ఆవిష్కరణలు జర గాలి. కేంద్రస్థాయి విద్యుత్తు నియంత్రణ సంస్థలు రాష్ట్రస్థాయి సంస్థ లతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. గ్రిడ్ ఫ్లెక్సిబిలిటీ లక్ష్యంగా నియమ నిబంధనల్లో మార్పులకు ప్రాధాన్యం ఇవ్వాలి. 5) పర్యావరణ అనుకూల హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచేందుకు శిలాజ ఇంధనాల స్థానంలో దీన్ని వాడే పరిశ్రమలకు తగిన రాయితీలు కల్పించి సహకారం అందించవచ్చు. 6) 2030 నాటికల్లా కర్బన ఉద్గారాలను శూన్యస్థాయికి చేరుస్తామని భారతీయ రైల్వే ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇందుకోసం దేశంలో రైళ్లన్నీ విద్యుత్తుతోనే నడవాల్సి ఉంటుంది. అది కూడా సంప్రదాయేతర, కర్బన ఉద్గారాలుండని పద్ధతుల్లో ఉత్పత్తి చేసే విద్యుత్తును వాడాల్సి ఉంటుంది. అంటే దశలవారీగా ప్రస్తుత డీజిల్ ఇంజిన్లను తొలగిం చడం లేదా విద్యుత్తుతో పనిచేసేలా చేయడం అవసరం. 7) ద్విచక్ర వాహనాలు, కార్లు, త్రిచక్ర వాహనాల్లో విద్యుత్తుతో పనిచేసేవాటి భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు వేటికి అవే ప్రత్యేకంగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా బ్యాటరీ ఛార్జింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. స్టేషన్ల ఏర్పాటును వేగ వంతం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను ప్రకటించవచ్చు. కార్బన్ న్యూట్రల్ ఆర్థిక వ్యవస్థకు మళ్లేందుకు కావాల్సిన నిధులను సమీకరించడం ఎలా అన్నది ఇప్పటికీ తెగని వివాదం. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ధనిక దేశాలు సాయం చేస్తాయని యూఎన్ఎఫ్సీసీ చర్చల్లో ఒక అవగాహనైతే కుదిరింది. 2015 నాటి ప్యారిస్ ఒప్పందంలో 2020 నాటికి ఏటా వంద బిలియన్ డాలర్లు ధనిక దేశాలు చెల్లించాలన్న తీర్మానమూ ఉంది. అయితే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల నుంచి రావాల్సిన ఈ మొత్తం ఇప్పటివరకూ అంద లేదు. 2025 నాటికైనా అందేలా చూడాలని గత ఏడాది కాప్ సమా వేశంలో విజ్ఞప్తి చేశారు. కాప్–26లో నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోవాలంటే ధన సహాయం అన్నది కీలకం. కానీ అభివృద్ధి చెందిన జీ–7 దేశాలు ఇప్పటివరకూ నిధుల ఊసెత్తడం లేదు. ఇండో నేసియాలో జరిగే జీ–20 సమావేశాల్లోనైనా దీనిపై ఒక గట్టి నిర్ణయం జరగడం అవసరం. వచ్చే ఏడాది జీ–20 నిర్వహణ బాధ్యతలు భారత్ చేతిలో ఉంటాయి. ఆ తరువాత బ్రెజిల్, దక్షిణాఫ్రికాల వంతు. అభివృద్ధి చెందుతున్న ఈ దేశాల నేతృత్వంలోనైనా ధనిక దేశాలు వాతావరణ మార్పుల సమస్యను అధిగమించేందుకు అవసరమైన నిధులు అందజేస్తాయని ఆశించాలి. నిధుల ఫలితం ఎలా ఉన్నా మన రోడ్‌మ్యాప్ మనం సిద్ధం చేసుకోవాలి. – మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, ఉత్కర్ష్ పటేల్ వ్యాసకర్తలు వరుసగా ప్లానింగ్ కమిషన్ మాజీ డిప్యూటీ చైర్మన్; ‘సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్’ అసోసియేట్ ఫెలో (‘ద మింట్’ సౌజన్యంతో) -
వెయ్యికోట్లతో బయో ఎనర్జీ మిషన్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ బయో ఎనర్జీ మిషన్ లాంచ్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సుమారు వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో ఈ పథకాన్ని చేపట్టనుంది. శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించడం కోసం ఇథనాల్, బయో ఇంధనాలు, బయోగ్యాస్ వాడకం విస్తరించేందుకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ .10,000 కోట్ల వ్యయం తో సమీకృత జీవశక్తి యాత్రను ప్రారంభించడానికి యోచిస్తోంది. న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ మిషన్ చేపట్టినట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీనికోసం 2017-18 నుంచి 2021-22 వరకు రూ 10,000 కోట్లను కేటాయించారు. గ్రీన్ హౌస్ వాయువులను, కర్బన్ ఉద్గారాలను తగ్గించడమే తమ మిషన్ ఉద్దేశమని ఆయన చెప్పారు. సీఓపీ 21 (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 వార్షిక సమావేశం) వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ముసాయిదా సదస్సులోని (యూఎన్ఎఫ్సీసీ )అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. బొగ్గు, పెట్రోలు, డీజిల్, సహజవాయువు, వంటగ్యాస్ బయోమాస్ గుళికలు, బయో ఇథనాల్, బయో డీజిల్, బయో మీథేన్ లాంటి శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ఒక ప్రగతిశీల సమ్మిశ్రణంకోసం కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ శిలాజ ఇంధనాల ప్రతిక్షేపణ ద్వారా లక్ష్యం సాధించాలని కోరుకుంటున్నామన్నారు. కపూర్తలాలోని నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ బయోఎనర్జీ ని తమ మిషన్ కోసం వరల్డ్ క్లాస్ సంస్థగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. దీంతోపాటుగా ఎంఎన్ఆర్ ఈ మాజీ సలహాదారు ఎకె ధుస్సా ఆధ్వర్యంలో ఒక టెక్నికల్ కమిటీకి నియమించేందుకు కేంద్రం నిర్ణయించినట్టు తెలిపారు. ఈ కమిటీ నేతృత్వంలో మిషన్ కు సంబంధించిన విధి విధానాలు రూపుదిద్దుకుంటాయని అధికారి పేర్కొన్నారు.