జీవ ఇంధనాల కూటమి | G20 summit: G20 leaders launch Global Biofuel Alliance | Sakshi
Sakshi News home page

జీవ ఇంధనాల కూటమి

Published Sun, Sep 10 2023 6:15 AM | Last Updated on Sun, Sep 10 2023 6:15 AM

G20 summit: G20 leaders launch Global Biofuel Alliance - Sakshi

న్యూఢిల్లీ:  ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ దిశగా భారత్‌ కీలకమైన ముందడుగు వేసింది. ‘ప్రపంచ జీవ ఇంధనాల కూటమి’ని ప్రకటించింది. భూతాపానికి, తద్వారా పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల వాడకం తగ్గించుకోవాలని, ఇందుకోసం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ కలిపి వాడుకోవాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. జీ20 శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జీవ ఇంధనాల కూటమిపై ప్రకటన చేశారు.

ఈ కూటమిలో చేరాలని, పుడమిని కాపాడుకొనేందుకు చేతులు కలపాలని జీ20 సభ్యదేశాలకు పిలుపునిచ్చారు. ‘వన్‌ ఎర్త్‌’ అంశంపై జరిగిన చర్చలో మోదీ మాట్లాడారు. ‘జీ20 శాటిలైట్‌ మిషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ క్లైమేట్‌ అబ్జర్వేషన్‌’ను కూడా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ‘గ్రీన్‌ క్రెడిట్‌ అంకురార్పణ’పై కార్యాచరణ ప్రారంభించాలని జీ20 దేశాలను కోరారు. ఇంధన బ్లెండింగ్‌ రంగంలో ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని, పరస్పరం సహకరించుకోవాలని, ఈ విషయంలో ఎంతమాత్రం జాప్యం తగదనిమోదీ స్పష్టం చేశారు.

పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ కలిపి వాడుకోవడం చాలా ఉత్తమమని అభిప్రాయపడ్డారు. లేకపోతే ప్రత్యామ్నాయంగా మరో రకమైన బ్లెండింగ్‌ మిక్స్‌ను అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు. స్థిరమైన ఇంధన సరఫరా కావాలని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ సైతం ముఖ్యమేనని తేలి్చచెప్పారు. ప్రపంచ జీవ ఇంధనాల కూటమిలో భారత్, అర్జెంటీనా, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇటలీ, మారిషస్, సౌతాఫ్రికా, యూఏఈ, అమెరికా సభ్యదేశాలుగా ఉన్నాయి. కెనడా, సింగపూర్‌ పరిశీలక దేశాలుగా ఉన్నాయి. క్లీన్‌ ఎనర్జీ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని, అత్యధిక ప్రాధా న్యం ఇస్తున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. ఈ మేరకు వైట్‌హౌస్‌ ఒక ప్రకటన చేసింది.  

సమీకృత ఇంధన పరివర్తన  
వాతావరణ మార్పులు అనే పెనుసవాళ్లు ఎదురవుతున్న నేటి తరుణంలో ‘ఇంధన పరివర్తన’ చాలా అవసరమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. సమీకృత ఇంధన పరివర్తన కోసం కోట్లాది డాలర్లు వ్యయం చేయాల్సి ఉంటుందని, అభివృద్ది చెందిన దేశాలు దీనిపై మరింత చొరవ తీసుకోవాలని సూచించారు. క్లైమేట్‌ ఫైనాన్స్‌ కోసం ఏటా 100 బిలియన్‌ డాలర్లు ఇచ్చేందుకు అభివృద్ధి చెందిన దేశాలు 2009లో అంగీకరించడం హర్షణీయమని పేర్కొన్నారు. అయితే, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో అభివృద్ధి చెందిన దేశాలు విఫలమవుతున్నాయని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు.    

ఏమిటీ కూటమి?  
ప్రపంచంలో ప్రజలందరికీ శుద్ధమైన సౌర శక్తి చౌకగా అందాలని భారత్‌ ఆకాంక్షించింది. ఇందుకోసం 2015లో పారిస్‌లో జరిగిన సదస్సులో ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయెన్స్‌(ఐఎస్‌ఏ)ను తెరపైకి తీసుకొచి్చంది. అదే తరహాలో ఇప్పుడు ప్రపంచ జీవ ఇంధన కూటమిని ప్రకటించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement