globalization
-
కొత్త ఏడాదీ కోతలేనా?
ఆర్థిక మాంద్యంతో ఇబ్బందులు తప్పేలా లేవంటూ ఆందోళన.. ఉద్యోగాలు తొలగించేందుకు సిద్ధమవుతున్న కంపెనీలు మరోవైపు వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఏఐ వైపు మొగ్గు.. 2023లో ప్రపంచ వ్యాప్తంగా 2.40 లక్షల మంది తొలగింపు (సాక్షి ప్రత్యేక ప్రతినిధి) కొత్త సంవత్సరంలోనూ ఐటీ రంగానికి గడ్డు పరిస్థితేనా? ఆశించిన మేరకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం లేదా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. పలు అంతర్జాతీయ సంస్థలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 2023లో దాదాపు 2.40 లక్షల మంది లే ఆఫ్‌ల పేరుతో, తొలగింపు పేరుతో ఉద్యోగాలు కోల్పోయారు. ఇక వచ్చే సంవత్సరంలోనూ పరిస్థితి ఆశాజనకంగా ఉండే అవకాశం కనిపించడం లేదని, ఆర్థిక మాంద్యం ప్రభా వం ఈ రంగంపై ఎక్కువగా కనిపిస్తుందని, కోతలు తప్ప వని అంటున్నారు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగం ఎక్కువ ఉద్యోగా లను కల్పిస్తుందా? లేక ఉన్న ఉద్యోగాల తొలగింపునకు కారణం అవుతుందా అన్నది కూడా కొత్త సంవత్సరంలో తేలనుంది. తాజాగా మ్యూజిక్ స్పాటిఫై ఏకంగా 1,500 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఆ స్థానంలో ఏఐని ఉపయోగించనుంది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వ్యయా లను సాధ్యమైనంతగా తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఉన్న ఉద్యో గాల తొలగింపు, కొత్త ఉద్యోగాల కల్ప నకు మొగ్గు చూపకపోవడం లాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో మాదిరిగా క్యాంపస్ రిక్రూట్మెంట్లు కన్పించడం లేదు. గతంలో ప్రతి యేటా 40 నుంచి 80 శాతం వరకు కొత్త ఉద్యోగులను చేర్చుకోవడానికి సంస్థలు ముందుకు వచ్చేవని, కానీ ఇప్పుడు ఇది బాగా తగ్గిపోయినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏఐ నైపుణ్యాన్ని పెంచుకోవాలి.. వివిధ కంపెనీల పరిస్థితిని పరిశీలిస్తే.. ప్రముఖ స్టార్టప్ కంపెనీ, 4.1 బిలియన్ డాలర్ల విలువగల డేటామిర్ సంస్థ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో తన సంస్థలోని 20 శాతం ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. సంఖ్యాపరంగా పెద్దగా కనిపించక పోయినా పలు స్టార్టప్ కంపెనీలు క్యాష్‌ఫ్లో ఇబ్బందులను ఎదు ర్కొంటున్న నేపథ్యంలో.. మానవ వనరుల తగ్గింపునకే మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. క్లార్నా సీఈవో సెబాస్టియన్ సిమి యాకోవిస్కీ.. ‘డజన్ల కొద్దీ ఉద్యోగులను నియమించుకునే కంటే ఒక ఏఐతో పని కానియ్యొచ్చు’ అన్నారంటే దాని ప్రభావం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్లార్నా సంస్థ ‘పర్సనల్ ఫైనాన్స్ అసిస్టెంటెన్స్’ కార్యకలాపాలను అందిస్తోంది. తాజాగా వచ్చిన ‘రాన్‌స్టడ్ రైజ్స్మార్ట్ గ్లోబల్ సెవరెన్స్’ నివేదిక ప్రకారం.. ఈ ఏడాదిలో 96 శాతం సాఫ్ట్వేర్ సంస్థలు ఉద్యోగులను తగ్గించే కార్యక్రమాలు చేట్టాయి. ఏఐతో నిర్వహణప్రమాణాలు పెరిగా యని, కొత్త ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడుతున్నదని నివేదిక వెల్లడించింది. అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏఐ నైపుణ్యాన్ని పెంచుకుంటే వారి ఉద్యోగాలకు ఢోకా ఉండదని తేల్చి చెప్పింది. 2023లో ఉద్యోగాలకు కోత పడగా, అదే సమయంలో ఏఐపై పెట్టుబడులు పెరిగాయని తెలిపింది. ‘ఐటీ కంపెనీలు ప్రధానంగా స్టాక్ మార్కెట్లపై, రుణాలపై ఆధారపడి ఉంటాయి. తెచ్చుకున్న రుణాలపై వడ్డీరేట్లు పెరిగితే భారం పెరుగుతుంది. అలాగే స్టాక్ మార్కెట్లో ఆ సంస్థ స్టాక్ పడిపోయినా ఆర్థిక ఇబ్బందులు వచ్చి పడతాయి. తద్వారా లే ఆఫ్‌లు అనివార్యం అవుతున్నాయి..’ అని రోమి గ్రూప్ ఎల్ఎల్సీ మేనేజింగ్ డైరెక్టర్ నిక్ గౌస్లింగ్ చెబుతున్నారు. భారతీయ కంపెనీలకు పురోగమనావకాశాలు ప్రస్తుతం ఐటీ రంగంలో ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదు. వారు పెట్టుబడులు పెట్టే ముందు ప్రధానంగా టెక్నాలజీ కొనడమో, అప్‌గ్రేడ్ చేయడమో చేస్తుంటారు. యూఎస్, ఐరోపాతో పాటు ఇతర దేశాల్లో మార్కెట్‌ను పరిశీలిస్తే సిలికాన్ వ్యాలీ బ్యాంక్, క్రెడిట్ సుయిజ్ బ్యాంక్ వంటివి క్షీణతకు గురయ్యాయి. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక స్టార్టప్ కంపెనీలపై ఇన్వెస్ట్ చేసింది. ఐతే పెట్టుబడు లకు తగ్గట్టుగా ఈ కంపెనీల నుంచి రిటర్న్‌లు రాకపోవడంతో సంస్థ పడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సెకండ్, థర్డ్ స్టేజ్ పెట్టుబడులు ఆగిపోయి స్టార్టప్‌లపై తీవ్ర ప్రభావం పడింది. తదుపరి కార్యాచరణలు, ముందుకెళ్లడాలు నిలిచిపోయాయి. ఫండింగ్ నెమ్మదించి ఆయా స్టార్టప్‌లలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. ఔట్‌సోర్సింగ్‌లో సపోర్టింగ్ ఉన్న యూఎస్‌లోని గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థలపై కూడా ప్రభావం పడింది. ఇక ఏఐ, చాట్ జీపీటీ వల్ల కూడా ఖర్చు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే భారతీయ కంపెనీలు రాబోయే మూడు, నాలుగు నెలల్లో పరిస్థితులు మారి పురోగమనం వైపు అడుగులు వేసే అవకాశాలున్నాయి. ఇక గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్ (జీసీసీ) ద్వారా టార్గెటెడ్ టెక్నాలజీ వైపు మొగ్గు పెరుగుతోంది. వీటి విషయానికొస్తే మన దేశంలోని నగరాలు మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఈ సెంటర్లకు హబ్‌గా మారనుంది. – వెంకారెడ్డి, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ హెచ్ఆర్ లీడర్, కోఫోర్జ్ ఏడాది చివర్లో స్లో డౌన్ సహజం ఏడాది చివర్లో ఐటీ రంగం కొంత స్లోడౌన్ కావడం సహజమే. వచ్చే ఏడాది కూడా ఐటీ పరిశ్రమ ఔట్ సోర్సింగ్‌పైనే అధికంగా ఆధారపడాల్సి ఉంటుంది. ఐటీ రంగంలో ఉద్యోగాలు లేకపోవడం అనే కంటే.. మారుతున్న అత్యాధునిక సాంకేతికతలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకుని సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేకపోవడమనేదే సమస్య. జనరేటివ్ ఏఐ, ఆటోమేషన్, క్లౌడ్ల ద్వారా వర్క్‌ఫోర్స్ తమ నైపుణ్యాలను మార్చు కునేలా చేయగలగడం ఐటీ సంస్థలకు పెద్దసవాల్. వీటి ద్వారా సంస్థలకు ప్రాజెక్ట్‌లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో డేటా సెంటర్స్‌పై, ఏఐ వంటి సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్‌పై, ఐటీ సర్వీసెస్‌పై పెట్టుబడులు పెరుగుతాయి. 2024లో ఐటీ మార్కెట్ వృద్ధి ప్రపంచ వ్యాప్తంగా 8 శాతం, భారత్‌లో 10 శాతం ఉంటుందని ప్రతిష్టాత్మక గార్ట్నర్ సంస్థ తన నివేదికలో అంచనా వేసింది. – రమణ భూపతి, క్వాలిటీ థాట్‌గ్రూప్ చైర్మన్, ఎడ్టెక్ కంపెనీ -
జీవ ఇంధనాల కూటమి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ దిశగా భారత్ కీలకమైన ముందడుగు వేసింది. ‘ప్రపంచ జీవ ఇంధనాల కూటమి’ని ప్రకటించింది. భూతాపానికి, తద్వారా పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల వాడకం తగ్గించుకోవాలని, ఇందుకోసం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి వాడుకోవాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. జీ20 శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జీవ ఇంధనాల కూటమిపై ప్రకటన చేశారు. ఈ కూటమిలో చేరాలని, పుడమిని కాపాడుకొనేందుకు చేతులు కలపాలని జీ20 సభ్యదేశాలకు పిలుపునిచ్చారు. ‘వన్ ఎర్త్’ అంశంపై జరిగిన చర్చలో మోదీ మాట్లాడారు. ‘జీ20 శాటిలైట్ మిషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ అబ్జర్వేషన్’ను కూడా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ‘గ్రీన్ క్రెడిట్ అంకురార్పణ’పై కార్యాచరణ ప్రారంభించాలని జీ20 దేశాలను కోరారు. ఇంధన బ్లెండింగ్ రంగంలో ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని, పరస్పరం సహకరించుకోవాలని, ఈ విషయంలో ఎంతమాత్రం జాప్యం తగదనిమోదీ స్పష్టం చేశారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి వాడుకోవడం చాలా ఉత్తమమని అభిప్రాయపడ్డారు. లేకపోతే ప్రత్యామ్నాయంగా మరో రకమైన బ్లెండింగ్ మిక్స్‌ను అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు. స్థిరమైన ఇంధన సరఫరా కావాలని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ సైతం ముఖ్యమేనని తేలి్చచెప్పారు. ప్రపంచ జీవ ఇంధనాల కూటమిలో భారత్, అర్జెంటీనా, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇటలీ, మారిషస్, సౌతాఫ్రికా, యూఏఈ, అమెరికా సభ్యదేశాలుగా ఉన్నాయి. కెనడా, సింగపూర్ పరిశీలక దేశాలుగా ఉన్నాయి. క్లీన్ ఎనర్జీ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని, అత్యధిక ప్రాధా న్యం ఇస్తున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఈ మేరకు వైట్‌హౌస్ ఒక ప్రకటన చేసింది. సమీకృత ఇంధన పరివర్తన వాతావరణ మార్పులు అనే పెనుసవాళ్లు ఎదురవుతున్న నేటి తరుణంలో ‘ఇంధన పరివర్తన’ చాలా అవసరమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. సమీకృత ఇంధన పరివర్తన కోసం కోట్లాది డాలర్లు వ్యయం చేయాల్సి ఉంటుందని, అభివృద్ది చెందిన దేశాలు దీనిపై మరింత చొరవ తీసుకోవాలని సూచించారు. క్లైమేట్ ఫైనాన్స్ కోసం ఏటా 100 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు అభివృద్ధి చెందిన దేశాలు 2009లో అంగీకరించడం హర్షణీయమని పేర్కొన్నారు. అయితే, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో అభివృద్ధి చెందిన దేశాలు విఫలమవుతున్నాయని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏమిటీ కూటమి? ప్రపంచంలో ప్రజలందరికీ శుద్ధమైన సౌర శక్తి చౌకగా అందాలని భారత్ ఆకాంక్షించింది. ఇందుకోసం 2015లో పారిస్‌లో జరిగిన సదస్సులో ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్(ఐఎస్ఏ)ను తెరపైకి తీసుకొచి్చంది. అదే తరహాలో ఇప్పుడు ప్రపంచ జీవ ఇంధన కూటమిని ప్రకటించింది. -
ఓ పల్లెలోని చిన్న కుటుంబం..ప్రపంచీకరణ వైపు ఎలా అడుగులు వేసిందంటే..
ప్రపంచీకరణ లేదా గ్లోబలైజషన్ అనే పదాలను గూర్చి తరచుగా వింటున్నాం. సామాన్యుల పరంగా దీన్ని నిర్వచిస్తే..ప్రపంచవ్యాప్తంగా ఆలోచనలు, జ్ఞానం, సమాచారం, ఉత్పత్తులు, సేవల విస్తరణ. బిజినెస్ పరంగా, ఆర్థికపరంగా వాటి అర్థం మారుతుందేమో గానీ అంతిమంగా మాత్రం మొత్తం ప్రపంచాన్ని ఒకచోటే చేర్చే సాధారణ పదంగా చెప్పవచ్చు. ఓ పల్లెలో చిన్న కుటుంబం పెద్దదిగా విస్తరించి ఎలా ప్రపంచీకరణవైపు అడుగులు వేస్తోందో చూస్తే.. కచ్చితంగా ప్రతి కుటుంబంలో ఇలానే జరగుతోంది కదా అనిపిస్తుంది. మనం గమనించకుండా మాటిమాటికి ప్రంపచీకరణ(గ్లోబలైజషన్ ) అని జపించామా! అని ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఓ రచయిత ఆ అంశంపై పుస్తకం రాసేంతవరకు కూడా..అందుకు తన కుటుబ గాథే ఓ చిన్న ఉదహారణ అని ఆ సమయంలో గ్రహించలేకపోయాడు. నిశితంగా గమనిస్తే..ఆ రచయిత కుటుంబంలానే ప్రతి కుటుంబం ప్రపంచీకరణ వైపు అడుగులు వేస్తుందని అవగతమవుతోంది. ఆ రచయిత ఎవరూ? ఆ పుస్తకంలోని కథా కమామీషు ఏమిటంటే.. స్వామినాథన్ శంకర్ అంక్లేసరియా అయ్యర్ అనే వ్యక్తి 1992లో 'ప్రపంచీకరణ వైపు' (Towards Globalisation) అనే పుస్తకాన్ని రాశారు. ఆయనో ఓ జర్నలిస్ట్, కాలమిస్ట్ కూడా. ఐతే ఆయనకు ఆ పుస్తకం రాసేంత వరకు తెలియలేదు, అందుకు తన కుటుంబ నేపథ్యమే ఓ ఉదహారణ అని. ఈ మేరకు రచయిత స్వామినాథన్ ఆ పుస్తకంలో తన కుటుంబం ప్రపంచీకరణ వైపు ఎలా అడుగులు వేసిందో చెబుతూ..నా కుమార్తె తెలివైన విద్యార్థి. ఆమె లండన్ స్కూల ఆఫ్ ఎకనామిక్స్‌లో స్కాలర్షిప్ గెలుచుకుంది. లండన్‌లో ఆమెకు స్పెయిన్‌కు చెందిన జూలియా అను యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరు చైనాలో బీజింగ్‌లో ఉద్యోగాలు చేయాలని నిర్ణయించుకున్నారు. వివాహాం చేసుకోవడానికి ఢిల్లీకి వచ్చారు. వివాహ అతిధుల్లో ఉత్తర అమెరికా, యూరప్, చైనాకు చెందిన 70 మంది స్నేహితులు ఉన్నారు. ఈ వివాహంలో మొత్తం ప్రపంచమే కవర్ అయ్యిందనుకుంటే రచయిత పెద్ద కొడుకు శేఖర్ ఇంకాస్త ముందడుగు వేసి ఊహించని షాక్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు రచయిత స్వామినాథన్. ఇక అతను కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ సాధించాడు. ఆ తర్వాత కొలంబోలో ఒక పాఠశాలలో ఒక ఏడాదిపాటు బోధించి తదనంతరం ఉన్నత చదువుల కోసం కెనడాలోని టొరంటో వెళ్లాడు. అతను అక్కడ ఫ్రాంజిస్కా అనే జర్మన్ అమ్మాయి పరిచయమయ్యింది. ఇద్దరూ యూఎస్ఏలోని వాషింగ్టన్ డీసీలోని అంతర్జాతీయ ద్రవ్యనిధిలో ఉద్యోగాలు పొందారు. అదీగాక ఐఎంఎఫ్‌లో ఉద్యోగాల రీత్యా విభిన్న దేశాలకు ప్రయాణించారు. ఇక 2003 చివరిలో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇక చిన్న కొడుకు రుస్తమ్ వయసు కేవలం 15 ఏళ్లు అని, బహుశా ఆస్ట్రేలియాలో చదువుకుని, నైజీరియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని పెరులో స్థిరపడతాడేమో అని చమత్కరించాడు. వాస్తవానికి రచయిత స్వామినాథన్ పూర్వికులు ఇల్లు తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని ఒక చిన్న కుగ్రామం కర్గుడి. కనీసం మరుగుదొడ్లు, తాగునీరు, పక్కా రోడ్డు వంటి సౌకర్యాలు లేని ప్రదేశంలో ఉంది. అయ్యర్ల కుటుంబం నుంచే 50 మంది.. తంజావూర్లో తనకు రైలు దిగి, ఎద్దుల బండి ఎక్కి 45 నిమిషాలు ప్రయాణిస్తే పూర్వీకులు ఇల్లు చేరుకోవచ్చు. రచయిత తండ్రి ఆరుగురు సంతానంలో ఒకడు. వీరందరికి చాలామంది పిల్లలు ఉన్నారు. రెండు తరాల తర్వాత కర్గుడిలోని ఆ కుటుంబం కాస్త పెద్దదై క్రమంగా 200 మందికి పైగా చేరుకుంది. ప్రస్తుతం వీరిలో ముగ్గురు మాత్రమే గ్రామంలో నివశిస్తున్నారు. మిగిలిన వారు భారతదేశంతో సహా ప్రపంచమంతటా వేర్వేరు చోట్ల సెటిల్ అయ్యారు. తమ కుటుంబమే ఇప్పటికి సుమారు 50 మంది అమెరికన్ పౌరులను తయారు చేసినట్లు రచయిత చెప్పుకొచ్చాడు. దీన్ని గమనిస్తే..గ్లోబలైజేషన్ అంటే పాశ్చాత్యీకరణ అని వాదించే వాదనలు ఒక్కసారిగా కొట్టిపారేయొచ్చు. కఠినమైన తమిళ బ్రాహ్మణ అయ్యర్ల నేపథ్యం కుటుంబం ఒక్కసారిగా ఎంతలా హైప్ తీసుకుని విస్తరించిన తీరు చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది అయ్యర్ ఆధిపత్యం కాదు. దీని అర్థం ఒక వ్యక్తి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసి ఎలా దురాబారాలను అధిగమించి వెళ్తాడో..ఆ క్రమంలో ఎలా ప్రపంచంలోని ప్రదేశాలను చుట్టివచ్చి..ఎలా పరివర్తనం చెందుతాడనేది తెలుపుతోంది. వాస్తవానికి రచయిత స్వామినాథన్ కర్గుడి గ్రామంలో ఉంటే తన ఇంటిలో నేలపై చేతితో భోజనం చేస్తాడు. అదే..చైనాలో నూడుల్స్, స్పెయిన్‌లో స్టీక్, జపాన్‌లో టెరియాకి, మొరాకోలో కౌస్-కస్ తినగలడు. రచయిత స్వామినాథన్ తాను కార్గుడి గ్రామస్థుడిని, తమిళుడిని, ఢిల్లీ-వాలాను, భారతీయుడిని, వాషింగ్టన్ రెడ్స్కిన్స్ అభిమానిని, ప్రపంచ పౌరుడిని అని గర్వంగా చెబుతున్నాడు. తన పుట్టిన తంజావురూలోని బృహదీశ్వరాలయాన్ని చూడగానే తన హృదయం ఉప్పొంగుతుందని, ఇది నా మాతృభూమి అనే గర్వంగా చెప్పుకుంటానని భావోద్వేగంగా అన్నాడు. అలాగే భారత్‌లోని వివిధ ప్రదేశాలలో తాను నివశించిన వాటిని చూసినా అది నాదే అన్నభావం కలుగుతుంది. అంతేగాదు విదేశాల్లో తాను గడిపిన ఆయా ప్రదేశాల్లోని ప్రాంతాలను చూసినా అవి నాలో ఒక భాగమని ఫీలవుతానని రచయిత స్వామినాథన్ చెబుతున్నారు. ప్రపంచమంతా ఒక్కటే.. ఇక్కడ రచయిత నాన్న తరం మొదటగా గ్రామాన్ని విడిచిపెట్టి ప్రాంతీయ సంకెళ్లను తెంచుకోవడంతో..స్వామినాథన్ నాన్న లాహోర్‌లో చార్టర్ అకౌంటెంట్ అయ్యాడు. మామయ్య కరాచీలో హోటల్ మేనేజర్ అయ్యాడు. రంగూన్లో అతని అత్త సెటిల్ అయ్యింది. రచయిత తరం వచ్చేటప్పటికీ మతం సంకెళ్లను వదులుకుంది. రచయిత అన్నయ్య సిక్కును, తమ్ముడు క్రిస్టియన్ని, రచయిత స్వామినాథన్ అయ్యంగర్ పార్శిని పెళ్లి చేసుకుంటే..తరువాతి తరం ప్రపంచవ్యాప్తంగా పెళ్లి చేసుకుంటూ ఒక అడుగు ముందుకు వేసింది. ఇది కేవలం ఒక్క అయ్యర్ కుటుంబంలోనో ప్రపంచీకరణ జరిగి వస్తువులు, మూలధనం తరలింపు జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి కుటుంబంలో ఒకరో ఇద్దరో అటు వైపు అడుగులు వేస్తూ.. అయ్యర్ కుటుంబం కోవలోకే చేరుతున్నారు. ఈ ప్రపంచీకరణ ఒకరకంగా విభిన్న భాష, సంస్కృతులు సంప్రదాయాల మేళవింపుతో ఒక్కటై ప్రంపంచమంతా ఒక్కటి అనే స్ఫురణను తీసుకొస్తుంది. దీని వల్ల ఒక ప్రాంతీయ భాష, సంప్రదాయాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ..మత విద్వేషాలకు చెక్ పెట్టి మనం అంతా ఒక్కటే అనే ఎలుగెత్తి చాటుతోందని స్వామినాథన్ తన పుస్తకంలో వివరించారు. (చదవండి: On This Day April 15th: ఏప్రిల్ 15 ముఖ్య సంఘటనలు, విశేషాలు ఇవే!) -
ప్రపంచీకరణలో మరింత పారదర్శకత అవసరం
వాషింగ్టన్: గ్లోబలైజేషన్ ప్రయోజనాలను తక్కువ చేసి చూపాలని భారత్ కోరుకోవడం లేదని కేంద్ర లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అయితే దానిని మరింత పారదర్శకంగా మార్చాలని కోరుతోందని పేర్కొన్నారు. ప్రముఖ అమెరికన్ పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ఈ మేరకు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) మరింత ప్రగతిశీలంగా ఉండాలని, ఇతర దేశాల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని భారత్ కోరుతోందన్నారు. ‘‘వినడానికి మాత్రమే కాకుండా చెప్పడానికి భిన్నమైన దేశాలకు డబ్ల్యూటీఓ మరింత వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉందని’’ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పరస్పర ప్రయోజనాలు లక్ష్యంగా.. భారత్ చాలా కాలంలో తన తయారీ రంగం వృద్ధి చెందేలా ప్రయత్నాలు చేస్తోందన్నారు. తను ఉత్పత్తి చేయగల వినియోగ వస్తువులను కూడా దిగుమతి చేసుకోవడం లేదని తెలిపారు. అయితే ధర వ్యత్యాసాలు, పోటీతత్వం వంటి అంశాలు అంతర్జాతీయంగా కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయన్నారు. ఇలాంటి సమస్యల విషయంలో ఆయా దేశాల మధ్య పరస్పర ప్రయోజనకర అవగాహనలు అవసరమని అన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానం ఇక అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్ తగిన ప్రాంతమని ఆమె ఉద్ఘాటించారు. నైపుణ్యం, డిజిటలైజేషన్‌పై భారత్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు సీతారామన్ స్పష్టం చేశారు. క్రిప్టో ‘జీ 20’ ఉమ్మడి ఫ్రేమ్‌వర్క్! క్రిప్టో రిస్క్‌లను ఎదుర్కోవడానికి ఉమ్మడి ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడమే ఇండియా జీ20 ప్రెసిడెన్సీ లక్ష్యమని కూడా ఆర్థికమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో క్రిప్టోకరెన్సీలతో సంబంధం ఉన్న నష్టాలను ఎదుర్కోవడానికి అన్ని దేశాలకు ఉమ్మడి ఫ్రేమ్‌వర్క్ అవసరమన్నారు. భారత్ పారదర్శక ఎకానమీ భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆమె అమెరికన్ వ్యాపారవేత్తలను అభ్యర్థించారు. తద్వారా పారదర్శక ఎకానమీ నుంచి లభించే ప్రయోజనాలు పొందాలని అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహించిన ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో సూచించారు. ప్రస్తుత భారత్ ప్రభుత్వం దేశ వృద్ధికి సంబంధించి అంతర్జాతీయ పరిశ్రమ భాగస్వామ్యం కోసం తగిన వ్యూహ రచన చేస్తున్నట్లు వివరించారు. మహమ్మరి వంటి సవాళ్ల సమయంలోనూ దేశాభివృద్ధే లక్ష్యంగా సంస్కరణల బాటన నడిచిందన్నారు. -
India Foreign Policy: 2023లో మన విదేశాంగం ఎటు?
మరొక కల్లోలభరితమైన సంవత్సరం ముగిసింది. 2022 ప్రారంభంలో యుద్ధం యూరోపియన్ తీరాలకు చేరుకుంది. కోవిడ్–19 అనంతర సాధారణ స్థితికి ప్రపంచం వస్తున్న తరుణంలోనే ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించడంతో ప్రపంచ క్రమవ్యవస్థకు కొత్త సవాళ్లను విసిరినట్టయింది. అమెరికా–చైనా మధ్య ఘర్షణ పదునెక్కుతున్న స్థితిలో రష్యా–చైనా మధ్య బంధం మరింతగా బలపడుతోంది. ప్రతి విషయంలోనూ ఆయుధీకరణ కొత్త వ్యవస్థగా ఆవిర్భవిస్తున్నందున ప్రపంచీకరణ వ్యతిరేక క్రమం చుట్టూ చర్చ బలం పుంజుకుంటోంది. ఈ ఉపద్రవం మధ్య అంతర్జాతీయ సంస్థలు నూతన సవాళ్లను ఎదుర్కోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేవు. కాబట్టి, నూతన సంస్థాగత నిర్మాణాల కోసం శోధన ముందుకు వచ్చింది. జాతీయ వ్యూహాత్మక చింతనకు చెందిన కొన్ని మౌలిక భావనలకు బహిరంగంగా వ్యతిరేకత ఎదురవుతున్నప్పుడు భారతీయ విదేశీ విధానం ఒక సంవత్సర కాలంలో ఈ అన్ని మలుపులకూ స్పందించాల్సి వచ్చింది. 2020లో గల్వాన్ సంక్షోభం భారత ప్రభు త్వాన్ని తన చైనా విధానాన్ని తిరిగి మదింపు చేసుకునేలా ఒత్తిడికి గురిచేసింది. ఆ విధంగానే ఉక్రెయిన్ యుద్ధం భారత్‌ను తన రష్యా విధాన చోదక శక్తుల పట్ల వైఖరిని తిరిగి పరిశీలించుకునేలా చేసింది. అలాగే పాశ్చాత్య ప్రపంచంతో తన వ్యవహార శైలిని కొత్తగా రూపొం దించుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించింది. 2022 ఫిబ్ర వరిలో రష్యన్ దురాక్రమణ ప్రారంభమైనప్పుడు, డిమాండ్ చేస్తున్న పాశ్చాత్య దేశాలు ఒకవైపు, విఘాతం కలిగించే రష్యా మరొకవైపు ఉంటున్న స్థితిలో రెండు శక్తులతోనూ సంబంధాలను భారత్ ఎంత కష్టంగా నిర్వహిస్తుందనే అంశంపై చాలా చర్చ జరిగింది. అయితే అత్యంత సంక్లిష్టమైన ప్రపంచ సమస్యపై భారత్ సమతుల్యత ప్రదర్శించడం నుంచి నూతన సంవత్సరం నాడు ప్రారంభమైంది. ఇంధన భద్రత కోసం రష్యాతో తన సంబంధ బాంధవ్యాలను భారత్ కొనసాగించడమే కాదు, మాస్కోతో ఇంధన పొత్తులను మరింతగా పెంచుకోగలిగింది. రష్యాను బహిరంగంగా ఖండించక పోవడం ద్వారా పాశ్చాత్య ప్రపంచం పక్షాన భారత్ నిలబడలేదని పాశ్చాత్య దేశాల్లో కొంతమంది విమర్శిస్తున్న సమయంలోనే, సంవత్సరం పొడవునా పాశ్చాత్య దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలపడ్డాయి. భారత్ తన వంతుగా ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టం, ప్రాదేశిక సార్వభౌమాధికారం నేపథ్యంలో రష్యన్ దురాక్రమణపై ఆరోపించడం నుంచి తన వైఖరిని మార్చు కుంది. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇది యుద్ధ సమయం కాదని రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌కు బహిరంగం గానే బోధ చేసేంతవరకు పోయారు. బాలి సదస్సులో జీ20 దేశాల చర్చల సమయంలో సెంటిమెంటును రంగరించి మరీ మోదీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంవత్సరం ముగిసే సమయానికి ఉక్రెయన్ సంక్షోభాన్ని ముగించే విషయంలో భారత్ మరింత క్రియాశీలక పాత్ర చేపట్టనుందని అంచనాలు పెరిగిపోయాయి. చివరకు ప్రధాని మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్స్కీ ఫోన్ చేసి మరీ మాట్లాడారు. రష్యా పట్ల భారత్ వైఖరిని పాశ్చాత్య ప్రపంచం ప్రారంభంలో విమర్శనాత్మకంగా అంచనా వేసింది. కానీ ఉక్రెయిన్ సమస్యపై దౌత్యపరమైన ప్రయత్నాల విషయంలో భారత్ చొరవను చివరకు పాశ్చాత్య దేశాలు హేతుపూర్వకంగా గుర్తించాల్సి వచ్చింది. యూరప్ సమస్యలు ప్రపంచ సమస్యలు అవుతాయి కానీ ప్రపంచ సమస్యలు యూరప్ సమస్యలు కావు అనే ఆలోచనలోని కపటత్వాన్ని భారత్ నొక్కి చెప్పింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇండో–పసిఫిక్ వ్యవహారాలకు సంబంధించి భారత్ కేంద్ర స్థానం విషయంలో యూరప్ దేశాలు నిశ్చితాభిప్రాయానికి వచ్చేశాయి. దీంతో ఈ సంవత్సరం భారత్–యూరోప్ సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. యూరోపియన్ స్థలపరిధుల్లో రష్యాకు ప్రధాన స్థానం ఉన్నప్పటికీ, చైనా నుండీ, దాని దూకుడు ఎత్తుగడలనుంచే తమకు దీర్ఘకాలిక వ్యూహాత్మక సవాళ్లు ఎదురు కానున్నాయని యూరప్ దేశాలకు స్పష్టంగా బోధపడింది. వారి వ్యూహాత్మక తర్కం కారణంగా అమెరికాతో భారత్ సంబంధాలు కూడా ముందంజ వేశాయి. ఇండో–పసిఫిక్ నేడు అత్యంత కీలకంగా మారింది. పసిఫిక్ ప్రాంతంలో ‘క్వాడ్’, మధ్య ప్రాచ్యంలో ‘ఐ2యు2’ (ఇజ్రాయెల్, ఇండియా, యూఎస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) రెండు కీలక భూభాగాల్లో సంస్థాగత వ్యాఖ్యాత లుగా ఆవిర్భవిస్తున్నాయి. న్యూఢిల్లీ, వాషింగ్టన్ ద్వైపాక్షిక సంబంధా లకు మించి, తమ వ్యవహారాలకు చెందిన ఎజెండానే పునర్నిర్వ చించుకుంటున్నాయి. దాంతోపాటు తమ ఆకాంక్షల ఆకృతులను మరింతగా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. భారతదేశం నిర్వహంచే అంతర్జాతీయ పాత్రను ప్రపంచం ఇప్పుడు మరింత సీరియస్‌గా తీసుకుంటోంది. ఎందుకంటే సంక్లిష్టమైన గ్లోబల్ సమస్యలను భారత్ ఇప్పుడు మరింతగా పట్టించుకుంటూ, నాయకత్వం వహించగలుగుతోంది. ప్రపంచ సమస్యలకు అది పరిష్కారాలు అందించడానికి సిద్ధపడుతోంది. భావసారూప్యత కలిగిన దేశాలతో భాగస్వామ్యాలను ఏర్పర్చుకుంటోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ తన అధ్యక్ష స్థానాన్ని.. సంస్కరించిన బహుపాక్షికతను, శాంతిపరిరక్షణను, ఉగ్రవాద నిరోధకతను, సముద్ర భద్రతను నొక్కి చెప్పడానికి ఉపయోగించుకుంది. ఈ సమస్యలు భారత్ ప్రయోజనాలకే కాదు, ప్రపంచంలోని విశాల భాగం ప్రయోజనాలకు కూడా చాలా ముఖ్యమైనవి. భద్రతాసమితిలో భారత్ వ్యవహరిస్తున్న తీరులో ఆచరణా త్మకతకు చెందిన కొత్త అర్థం ప్రస్ఫుటమవుతోంది. ఇంతవరకు వినపడకుండా కనిపించకుండా పోయిన విశాల మెజారిటీ దేశాల గురించి మాట్లాడేలా భారత వాణి ఉంటోంది. ఈ ప్రాధాన్యత ప్రాతిపదికపైనే అది జీ20 కూటమి అధ్యక్షత బాధ్యతను చేపడుతోంది. బహుపాక్షికత అనేది తన విశ్వసనీయతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రపంచం ఎదుర్కొంటున్న కీలకమైన సవాళ్లు కొన్నింటికి పరిష్కారాలను అందించే విషయంలో అందరి కళ్లూ న్యూఢిల్లీ చేపట్టిన జీ20 నాయకత్వంపైనే ఉన్నాయి. ఇది అంతర్జాతీయ పర్యవసానాలను రూపుదిద్దగలిగే ‘నాయకత్వ శక్తి’గా భారత్ తన విశ్వసనీయతను పెంపొందించుకోవలసిన సమయం. ప్రత్యే కించి భారత గాథ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న సమయంలో ఇది ఎంతో అవసరం. భారత్ అంతర్జాతీయ పాత్రను మెచ్చుకునే పరిణామాలు ఏర్పడు తున్న సమయంలో ప్రముఖ ఆర్థిక శక్తిగా ఆవిర్భవించడం కీలక పాత్ర పోషించనుంది. ప్రపంచం మొత్తంగా బీజింగ్ వ్యవహారాలపై తీవ్ర అసమ్మతి వ్యక్తపరుస్తున్న తరుణంలో చైనా దూకుడును నిలువ రించడంలో దృఢ వైఖరిని ప్రదర్శిస్తున్న భారత్ కొత్త అవకాశాలను సృష్టించుకుంది. 2022లో ఇలాంటి కొన్ని అవకాశాలను అంది పుచ్చుకోవడంలో భారతీయ విదేశీ విధానం విజయవంతమైంది. మరోవైపున చైనా సవాలు సమీప భవిష్యత్తులో భారత ప్రభుత్వ సమర్థతను పరీక్షించడం కొనసాగించనుంది. శీతాకాలం తర్వాత కూడా ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగినట్లయితే భారత్, రష్యా పొత్తు కూడా నిశిత పరిశీలనకు గురవుతుంది. న్యూఢిల్లీ పదేపదే చెబుతున్న ‘బహుళ–అమరిక వాదం’ కూడా 2023లో తీవ్రమైన ఒత్తిడి పరీక్షకు గురికాక తప్పదు. అయితే 2022 గురించి ఏమైనా చెప్పుకోవాలీ అంటే, భారత వాణి విశిష్టతను ప్రపంచం గుర్తించింది. మున్ముందు అది అంతర్జాతీయ వేదికలపై మరింతగా విస్తరిస్తుంది. ఇప్పుడప్పుడే దాని ప్రతిధ్వనులు తగ్గిపోవు. (క్లిక్ చేయండి: అమృతోత్సవ దీక్షకు ఫలితం?!) - హర్ష్ వి. పంత్ ఉపాధ్యక్షుడు, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, న్యూఢిల్లీ (‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
స్వేచ్ఛా వాణిజ్యానికి చెల్లుచీటీ
ఇంతకాలం స్వేచ్ఛా వాణిజ్యం, గ్లోబలైజేషన్ అంటూ ఊదరగొట్టడమే గాక ప్రపంచ దేశాలన్నింటినీ అందుకు నయానో భయానో ఒప్పించిన సంపన్న పారిశ్రామిక దేశాలు ఇప్పుడు రూటు మారుస్తున్నాయి. ‘మిత్ర’ దేశాలతో మాత్రమే వ్యాపార బంధాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ విషయంలో అమెరికా ముందుంది. దీన్ని ఫ్రెండ్ షోరింగ్, రీ షోరింగ్ (వ్యాపారాల తరలింపు), నియర్ షోరింగ్ (పొరుగు దేశాల్లోనే పరిశ్రమలు నెలకొల్పడం) వంటి పేర్లతో పిలుస్తున్నారు. ‘‘అన్ని వస్తువులనూ అమెరికానే తయారు చేయడం అసాధ్యం గనుక కాబట్టి నిరంతర సరఫరా కోసం నమ్మకమైన మిత్రదేశాలతో కలిసి అడుగులు వేయాల్సిన టైమొచ్చింది’’ అని అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల స్పష్టం చేశారు. అంతర్జాతీయ విపణిలో ఈ సరికొత్త మార్పు విపరిణామాలకే దారి తీస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ హయాంలో అమెరికా, చైనా మధ్య తీవ్రమైన వాణిజ్య యుద్ధానికి తెర లేచింది. ఇరు దేశాలూ పరస్పరం ఆంక్షలు విధించుకుంటూ వచ్చాయి. ప్రపంచ వాణిజ్య సంస్థలన్నింటికీ వస్తూత్పత్తి కేంద్రమైన చైనాతో విభేదాలతో అమెరికా, మిత్ర దేశాలకు సరుకుల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీన్నుంచి కోలుకోకముందే వచ్చి పడ్డ కరోనా అంతర్జాతీయ వాణిజ్యాన్ని రెండేళ్లపాటు అతలాకుతలం చేసింది. ఆ వెంటనే రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ..అలా మొదలైంది ఇటీవలి పరిణామాల నేపథ్యంలో చైనా, రష్యా వంటి ప్రత్యర్థి దేశాలపై ఇక ఏ విషయానికీ ఆధార పడకూడదని అమెరికా, మిత్ర దేశాలు నిశ్చయానికి వచ్చాయి. దాంతో వాటిమధ్య ఫ్రెండ్ షోరింగ్ విస్తరిస్తూ వస్తోంది. నిర్నిరోధంగా సరుకుల ఉత్పత్తి, సరఫరా కోసం కలిసి పని చేయాలని అమెరికా, జపాన్, భారత్, యూరప్‌తో కలిసి 17 దేశాలు నిశ్చయించుకున్నాయి. పారదర్శకత, వైవిధ్యం, భద్రత, స్థిరత్వం అన్న నాలుగు సూత్రాల ఆధారంగా పని చేయాలని ఒప్పందం చేసుకున్నాయి. చైనాను దూరం పెట్టేందుకు ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ పేరిట మిత్ర దేశాలతోకలిసి అమెరికా మరిన్ని వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. సెమీ కండక్టర్ల తయారీకి ఐరోపాలో ఏకంగా 4,300 కోట్ల పౌండ్ల పెట్టుబడులకూ సిద్ధపడింది. జీ7 దేశాలు కూడా వ్యూహాత్మక, అత్యవసర పరిశ్రమల తరలింపు కోసం ఏకంగా 60 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. ఇవన్నీ 150 దేశాల్లో పట్టు సాధించే లక్ష్యంతో చైనా తెర తీసిన బెల్ట్ అండ్ రోడ్ విధానానికి విరుగుడు యత్నాలే. - దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి అభివృద్ధికి విఘాతమే: రాజన్ ధనిక దేశాల ఫ్రెండ్లీ షోరింగ్ ధోరణి పేద, వర్ధమాన దేశాలకు గొడ్డలిపెట్టుగా మారగలదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ హెచ్చరిస్తున్నారు. ‘‘స్వేచ్ఛా వాణిజ్యం వల్ల భారీగా వచ్చిపడ్డ పెట్టుబడులతో ఈ దేశాలు బాగా లాభపడ్డాయి. సంపన్న దేశాల తిరోగమన విధానంతో ఇది తలకిందులవుతుంది’’ అన్నది ఆయన అభిప్రాయం. మనకు లాభమే! ఫ్రెండ్లీ షోరింగ్ విధానంతో ఇండొనేసియా, మలేసియా, వియత్నాం, భారత్, బల్గేరియా, రొమేనియా వంటి దేశాలు లాభపడతాయని అంచనా. భారత్‌లో 300 కోట్ల డాలర్లతో ఇజ్రాయెల్ మైక్రో చిప్ ప్లాంట్ పెట్టనుంది. ఆస్ట్రేలియా కూడా ఖనిజాల సరఫరా ఒప్పందం చేసుకుంది. విధానాలను మరింత సరళతరం చేస్తే ఇలాంటి పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడతాయన్నది ఆర్థికవేత్తల అంచనా. 75 ఏళ్ల గ్లోబలైజేషన్ రెండో ప్రపంచ యుద్ధానంతర పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్యానికి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛా వాణిజ్యానికి పునాదులు వేస్తూ భారత్ సహా 23 దేశాలు 1947 అక్టోబర్‌లో గాట్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 1995 నాటికి 125 దేశాలు ఇందులో చేరాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు ద్వారా దీనికి సంస్థాగత రూపం ఏర్పడింది. చౌకగా శ్రమ శక్తి, ముడి సరుకులు లభించే ప్రాంతాలు, వస్తూత్పత్తి సామర్థ్యమున్న దేశాలకు బడా పరిశ్రమలు తరలి వెళ్లేందుకు ఇది ఉపయోగపడింది. ఇదీ చదవండి: క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్లో... గేమ్ చేంజర్ -
సీబీఎస్ఈ సిలబస్‌లో భారీ మార్పులు
న్యూఢిల్లీ: 2022–23 విద్యా సంవత్సరానికి 11, 12వ తరగతుల సిలబస్‌లో సీబీఎస్ఈ పలు మార్పులు ప్రకటించింది. చరిత్ర, రాజనీతి శాస్త్రాల్లోని అలీనోద్యమం, ప్రచ్ఛన్నయుద్ధ కాలం, ఆసియా–ఆఫ్రికా దేశాల్లో ముస్లిం సామ్రాజ్యాల అవతరణ, మొగలుల పాలన, పారిశ్రామిక విప్లవం పాఠ్యాంశాలను తొలగించింది. 10వ తరగతిలో ఫుడ్ సెక్యూరిటీ చాప్టర్లోని ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ అగ్రికల్చర్‌ను తీసేసింది. ఉర్దూ కవి ఫయీజ్ అహ్మద్ ఫయిజ్ అనువాద కవితలను, డెమోక్రసీ అండ్ డైవర్సిటీ చాప్టర్లను తీసేసింది. సిలబస్‌లో హేతుబద్ధత కోసమే ఈ మార్పులు చేసినట్టు చెప్పింది. గత విద్యా సంవత్సరంలో రెండు దఫాలుగా నిర్వహించిన ఫైనల్ పరీక్షను ఈసారి ఒకే దఫా నిర్వహించాలని నిర్ణయించింది. 2020లోనూ 11వ తరగతి రాజనీతి శాస్త్రంలో పలు చాప్టర్లు తొలగించిన సీబీఎస్ఈ, నిరసనలతో మరుసటి ఏడాది నుంచి వాటిని పునరుద్ధరించింది. -
నూతన అంతర్జాతీయ వ్యవస్థ కావాలి!
న్యూఢిల్లీ: కోవిడ్–19 అనంతర ప్రపంచంలో నూతన అంతర్జాతీయ వ్యవస్థ రూపొందాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ సంస్థల పరిమితులను కరోనా సంక్షోభం ఎత్తి చూపిందన్నారు. అలీనోద్యమ (నామ్) దేశాల నేతలతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. నిష్పక్షపాతం, సమానత్వం, మానవత్వం ప్రాతిపదికగా నూతన అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పడాల్సి ఉందని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ప్రతిబింబించే అంతర్జాతీయ వ్యవస్థలు నేటి అవసరం. కేవలం ఆర్థిక అభివృద్ధినే కాకుండా, మానవాళి సంక్షేమాన్ని కాంక్షించే వ్యవస్థలు అవసరం. ఇలాంటి విషయాల్లో భారత్ ఎప్పుడూ ముందుంది’అన్నారు. అలీనోద్యమం దశాబ్దాల పాటు నైతిక భావనలకు గొంతుకగా నిలిచిందన్నారు. మానవాళి అత్యంత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రపంచవ్యాప్తంగా ఒక సంఘీభావ ప్రకటన అవసరమని, ఆ దిశగా సమ్మిళిత దృక్పథంతో నామ్ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కరోనాపై యుద్ధాన్ని భారత్ ప్రజాస్వామ్యయుతంగా, క్రమశిక్షణ, నిర్ణయాత్మకతలతో నిజమైన ప్రజాయుద్ధంగా మలిచిందన్నారు. -
ఆర్సీఈపీ నుంచి నిష్క్రమణ సరైందే!
ప్రపంచీకరణ పెనుతుఫానుకు ఎదురొడ్డటానికి ఒక దృఢమైన నాయకుడు ధైర్య సాహసాలను ప్రదర్శించడం నిజంగానే ప్రశంసనీయం. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో చేరకపోతే దేశం ఎంత గొప్ప అవకాశాన్ని కోల్పోతుందో అంటూ ఆర్థిక వేత్తలు భయాలను ప్రేరేపిస్తున్న సమయంలో ఆ ఒప్పందంలో సమతుల్యతా లేమి గురించి ప్రధాని నొక్కి చెప్పడం పూర్తిగా సహేతుకమైనదే. గతంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా దేశీయ వాణిజ్య లోటు 107.28 బిలియన్ డాలర్లకు పెరిగిపోయింది. అందుకే ఆర్సీఈపీలో చేరడాన్ని తిరస్కరిస్తూ ప్రధాని ముందుచూపుతో తీసుకున్న సాహసోపేత నిర్ణయం సరైందేనని చెప్పాలి. ఈ దశలో ఆర్సీఈపీ ఒప్పందంలోకి ప్రవేశించడమంటే ఇప్పటికే ఉన్న మన వాణిజ్య లోటు మరింత పెరుగుతుందని, వ్యవసాయరంగాన్ని దారుణంగా దెబ్బతీస్తుందనే ఎరుకను కూడా ప్రధాని ప్రకటన స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. ప్రపంచ జీడీపీలో 40 శాతం కలిగి ఉన్న 12 దేశాల మధ్య కుదిరిన ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్య (టీపీపీ) ఒప్పందాన్నుంచి వైదొలగాలని డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకోవడం విమర్శలకు దారితీసింది. దాన్ని భయానకమైన ఒప్పందంగా వర్ణించిన ట్రంప్.. వ్యవసాయ, వస్తూత్పత్తి రంగాలలో 18,000 రకాల సుంకాలను తొలగించాల్సి వస్తుందని, కచ్చితంగా అమెరికా ఉద్యోగాలను ఇది కొల్లగొడుతుందని వ్యాఖ్యానించారు. అలాగే ప్రపంచ జనాభాలో 45 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తూ, ప్రపంచ స్థూలదేశీయోత్పత్తిలో 25 శాతం వాటాను కలిగి ఉన్న ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్సీఈపీ) అనే మరొక భారీ వాణిజ్య ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ‘‘భారతీయులందరి ప్రయోజనాలకు అనుగుణంగా ఆర్సీఈపీ ఒప్పందాన్ని అంచనా వేసినప్పుడు నాకు సానుకూల సమాధానం దొరకలేదు. అందుచేతనే గాంధీ సిద్ధాంతాలు కానీ, నా అంతశ్చేతన కానీ ఆర్సీఈపీలో చేరడానికి నన్ను అనుమతించలేదు’’. ఈ వ్యాఖ్యలు నిజంగానే చాలా గొప్పవి. ట్రంప్‌కు మల్లే.. మోదీ మనస్సులో కూడా ఈ ఒప్పందంలో భాగంగా వస్తూత్పత్తి, వ్యవసాయరంగంతోపాటు 92 శాతం వాణిజ్య సరుకులపై సుంకాలను తొలిగిస్తే దేశంలో భారీ ఎత్తున ఉద్యోగాలు కోల్పోతారని, ప్రజాజీవితం ధ్వంసమవుతుందనే ఆలోచన ప్రబలి ఉంటుంది. ఆర్థికవేత్తల్లో చాలామంది ప్రపంచీకరణ వైపు పరుగులెత్తుతున్న సమయంలో ఆ తుపానుకు ఎదురొడ్డటానికి ఒక శక్తిమంతుడైన నాయకుడు రాజకీయపరంగా ధైర్యసాహసాలను ప్రదర్శించడం నిజంగానే ప్రశంసనీయం. పైగా, ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో చేరకపోతే దేశం ఎంత గొప్ప అవకాశాన్ని కోల్పోతుందోనంటూ ఆర్థికవేత్తలు భయాన్ని ప్రేరేపిస్తున్న సమయంలో ఆ ఒప్పందంలోని ధర్మబద్ధత, సమతుల్యత గురించి ప్రధాని ప్రశ్నిం చడం సహేతుకమేనని చెప్పాలి. గతంలోనూ ఈ ఆర్‌సీఈపీలోని 12 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్న భారత్ వాటి మార్కెట్లలో సులభంగా ప్రవేశించవచ్చనే భ్రమలకు గురైంది కానీ వాస్తవానికి ఆ ఒప్పందాల ద్వారా దేశీయ వాణిజ్య లోటు 107.28 బిలియన్ డాలర్లకు అమాంతంగా పెరిగిపోయింది. ఈ దశలో ఆర్సీఈపీ ఒప్పందంలోకి ప్రవేశించడమంటే మన వాణిజ్య లోటు మరింత పెరుగుతుందని, వ్యవసాయరంగాన్ని దారుణంగా దెబ్బతీస్తుందనే ఎరుకను కూడా ప్రధాని ప్రకటన స్పష్టం చేసింది. అదే సమయంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుందన్న అంచనాతో ఇతరదేశాలతో ద్వైపాక్షిక మదుపు ఒప్పందాలపై సంతకాలు చేయడంపై భారత్ ప్రదర్శించిన అత్యుత్సాహం అస్పష్టంగా, అనిశ్చితంగా ఉండటమే కాకుండా సరైన ముందస్తు ప్రణాళిక లేమిని సూచి స్తుంది. తర్వాత ఈ ఒప్పందాల అమలు క్రమంలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వాలు పెరుగుతూ పోవడంతో 58 ద్వైపాక్షిక మదుపు ఒప్పందాలను భారత్ రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలియని భయాలను మరీ ఎక్కువగా చూపిం చడం అర్థం చేసుకోదగినదే. తూర్పు ఆసియా ఆర్థిక వ్యవస్థలకు చెందిన ముఖ్యమైన మార్కెట్లలోకి చొచ్చుకుపోవడమనే అన్వేషణలో భాగంగా ఆసియా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నప్పటికీ అవేమంతగా పని చేయలేదు. స్పష్టంగా చెప్పాలంటే 2010లో 10 ఆసియన్ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల కారణంగా భారతీయ వాణిజ్య లోటు 250 శాతానికి భారీగా పెరిగిపోయింది. భారత్–ఆసియన్ దేశాల మధ్య ఒప్పందంపై తగినంత అంచనా, సరైన తనిఖీ లేకుండా అవకాశాలు కోల్పోతామని భయం ప్రాతిపదికన సంతకాలు చేశామన్నది స్పష్టంగా బోధపడింది. అందుచేత ఇప్పుడు భారత ప్రధాని ఇండో–ఆసియన్ వాణిజ్య ఒప్పందాన్ని తిరిగి సమీక్షించాలని పిలుపునివ్వడం అర్థం చేసుకోదగినదే. నిజానికి ఇండో–ఆసియన్ వాణిజ్య ఒప్పందాలను మాత్రమే కాకుండా, ఇంతవరకు భారత్ కుదుర్చుకున్న అన్ని రకాల ద్వైపాక్షిక, బహుళ వాణిజ్య ఒప్పందాలను పూర్తిగా సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం ఉనికిలోకి వచ్చినప్పుడు, చాలా ఉల్లాసపూరితమైన వ్యాఖ్యలు పుట్టుకొచ్చాయి. ఒకదేశం, ఒకే ఓటు ప్రాతిపదికన బహళ వాణిజ్య వ్యవస్థకు అవకాశం కల్పిస్తే ద్వైపాక్షిక ఒప్పందాలకు ప్రతిబంధకం ఏర్పడుతుందని అప్పట్లో మనకు చెప్పేవారు. కానీ కాలం గడిచే కొద్దీ ఇది తప్పు అని రుజువైంది. సూత్రబద్ధంగా ప్రపంచవాణిజ్య సంస్థ ఒప్పందాల్లో భాగంగా 300 పైచిలుకు ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను భారత్ కుదుర్చుకోగలిగింది. ఈ ఒప్పందాలన్నీ బలమైన మేధో సంపద హక్కులు, మార్కెట్లకు పూర్తిగా తలుపులు తెరవడాన్ని సుసాధ్యం చేశాయి. అనేక దేశాలు ఇప్పటికే (దిగుమతులపై జీరో టారిఫ్, పన్నేతర ప్రతిబంధకాలను తొలగించడం ప్రాతిపదికన) ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. అయితే మెజారిటీ సభ్య దేశాలు ఇప్పటికే విడివిడి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కలిగివున్నందున ప్రాంతీయ ఒప్పందాల నుంచి ప్రోత్సాహక వృద్ధిని ఎలా ఆశిస్తామన్నదాన్ని అంచనా వేయటంలో నేను విపలమయ్యానని అంగీకరించాలి. అయితే ఇప్పుడు ఏర్పడుతున్న కొత్త వాణిజ్య కూటమిలో చైనా వంటి దిగ్గజ ఆర్థిక వ్యవస్థలు (ఇప్పటికే భారత్‌కు చైనాతో 53 బిలియన్ డాలర్ల మేరకు వాణిజ్య లోటు ఉంది), ఆస్ట్లేలియా, న్యూజిలాండ్ వంటి సంపన్న దేశాలు చేరి ఉన్నాయి. పైగా ఇవన్నీ భారత పాల పరి శ్రమ, వ్యవసాయరంగంపై కన్నేశాయి. తమ సొంత పాల పరిశ్రమ ఉత్పత్తులను భారత్‌లో గుమ్మరించడానికి ఇవి కాచుకుని ఉన్నాయి. ఇది ఏమేరకు మనకు ప్రయోజనకరమో ఊహించుకోవలసిందే మరి. ఆర్సీఈపీ వాణజ్య భాగస్వాములతో వ్యహరించేటప్పుడు భారత్ తీసుకున్న ఈ అదనపు జాగ్రత్తలు సమర్థనీయమేనని చెప్పాలి. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఆర్సీఈపీ చర్చల్లోకి తిరిగి ప్రవేశించాలంటే మూడు షరతులు తప్పకుండా పాటించాలని చెప్పారు. అవేమింటే, ప్రాంతీయ చట్టాలను తప్పకుండా పాటిం చడం, 2014 నుంచి 2019కి వర్తించేలా ప్రాథమిక సుంకాల వ్యవధిని మెరుగుపర్చడం, ఆటో–ట్రిగ్గర్ మెకానిజం అంటే దిగుమతుల వెల్లువనుంచి దేశీయ పరిశ్రమను కాపాడటానికి తక్షణ స్పందనా యంత్రాగాన్ని నెలకొల్పడం. ఈ అంశంపై వాణిజ్య మంత్రిత్వ శాఖ మాత్రమే పనిచేయడం కాకుండా ఇతర మంత్రిత్వ శాఖలను కూడా ముగ్గులోకి దింపాలి. దిగుమతులు వెల్లువెత్తిన ప్రతిసారీ తక్షణ చర్యలు చేపట్టడం, ప్రాథమిక పన్నును మార్చడం వంటి చర్యలను భారత్ చేపట్టడంపై కొన్ని నెలల క్రితం చైనా తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు వార్తలు. ఆర్సీఈపీతో చర్చలు ముగిసి ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ముందు భారత్ సమర్థతపై చైనా సందేహాలను లేవనెత్తింది కూడా. ఆర్సీఈపీ చర్చలు మొదలెట్టి ఏడేళ్లు అయినప్పటికీ ఈ కీలక సమస్యలను పరిష్కరించడంలో విఫలయ్యారు. ప్రపంచ వాణిజ్య సంస్థ చర్చల ప్రారంభ దినాల్లో కూడా, సంపన్న వాణిజ్య మండలి అయిన ఓఈసీడీ (ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ) ప్రతిపాదించిన వ్యవసాయ సబ్సిడీల భారీ కుదింపు వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కడికో వెళతాయని ప్రచారం చేశారు. కానీ అది చాలా పెద్ద తప్పిదమైంది. ఈ వ్యవసాయ సబ్సిడీలను ప్రపంచ వాణిజ్య సంస్థ విధానాల ప్రకారం ఆకుపచ్చ, కాషాయం, నీలం అనే మూడు రంగుల బాక్సులలో వ్యవసాయ సబ్సిడీలను ఉంచడం వంటి చమత్కార ప్రదర్సనలకు పాల్ప డటం తప్పితే వ్యవసాయ సబ్సిడీలు భారత్ వంటి దేశాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. అమెరికా ఇస్తున్న సబ్సిడీల కంటే 28 సభ్యదేశాల యూరోపియన్ యూనియన్ మూడు రెట్లు ఎక్కువగా 65 బిలియన్ డాలర్ల మేరకు వ్యవసాయ సబ్సిడీలను అందిస్తోంది. ఈ రెండు దిగ్గజ కూటములతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై త్వరి తంగా సంతకాలు పెట్టేముందు భారతీయ వ్యవసాయంపై వాటి సబ్సిడీలు కలిగించే నష్టం గురించి జాగ్రత్తగా అంచనా వేయాల్సి ఉంది. దేశంలో 60 కోట్లమంది ప్రజలు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా వ్యవసాయం చేస్తున్నప్పుడు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కలిగించే మార్కెట్ అవకాశాలను చూసి ఉప్పొంగిపోయే ముందు వ్యవసాయదారుల జీవితంపై విదేశీ సబ్సిడీలు కలిగించే పెనుభారం గురించి అంచనా వేసి తీరాలి. లేక సేవారంగంలోని కొన్ని దిగ్గజ సంస్థలకు ప్రయోజనం కలిగించడానికి మన వ్యవసాయాన్ని బలిపెట్టకూడదు. అందుకే భవిష్యత్తులో జరిగే వాణిజ్య ఒప్పందాల కోసం కూడా మహ్మాత్ముడి సిద్ధాంతాలనే భూమికగా తీసుకోవడం అవశ్యం. వ్యాసకర్త: దేవీందర్ శర్మ, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
అందరికీ ఆర్థిక వృద్ధి ఫలాలు
దావోస్: ప్రపంచీకరణలో తర్వాతి దశ ఆర్థికంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా ఉండాలని అంతర్జాతీయ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. అలాగైతేనే ఆకలితో అల్లాడే ప్రజలను, క్యాంపుల్లో కాందిశీకులను లేకుండా చేయగలమన్నారు. ప్రస్తుతం స్తంభించిపోయిన ఆర్థిక వృద్ధిని మళ్లీ పట్టాల మీదికి ఎక్కించేలా ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సదస్సులో భాగంగా జరిగిన షేపింగ్ గ్లోబలైజేషన్ 4.0లో ఆయన పలు అంశాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. నాలుగో పారిశ్రామిక విప్లవం ఇలా... ఆర్థిక వృద్ధి జోరు పెంచే సాంకేతికతను, నవకల్పనలను అందించేలా నాలుగో పారిశ్రామిక విప్లవం ఉండాలని సత్య నాదెళ్ల చెప్పారు. ప్రజల రోజువారీ కార్యక్రమాల్లో కంప్యూటర్ ఒక భాగమైందంటూ... ప్రజలందరికీ విద్య, వైద్య అవసరాలు సక్రమంగా అందే క్రమంలో ఎదురయ్యే సమస్యలను టెక్నాలజీతో పరిష్కరించాలని చెప్పారాయన. కాగా ఈ కొత్త సాంకేతిక యుగంలో వినియోగదారులకు చాలా సేవలు ఉచితంగానో, తక్కువ ధరకో లభిస్తున్నాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. కాకుంటే భవిష్యత్తులో ఇది కొనసాగుతుందో లేదో చూడాలన్నారు. భారీ వ్యాపారాల వల్ల, దిగ్గజ సంస్థల కారణంగా వినియోగదారులకు చౌక ధరలకే ఉత్పత్తులు/సేవలు లభిస్తున్నాయని వివరించారు. ఉదాహరణకు గూగుల్ చాలా సేవలను ఉచితంగానే అందిస్తోందని గుర్తుచేశారు. భారత్‌కు ఆ సత్తా ఉంది.... విమానయాన రంగంలో అంతర్జాతీయ వృద్ధిని మించిన జోరును భారత విమానయాన రంగం కొనసాగించగలదని స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా విమానాల అనుంసధానతకు, ప్రధాన ప్రపంచ కేంద్రంగా అవతరించడానికి భారత్‌కు ఇదే సరైన సమయమన్నారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలుగా వృద్ధి చెందే సత్తా భారత విమానయాన సంస్థలకు ఉందని, అందుకు కూడా ఇదే సరైన తరుణమని వివరించారు. అపార అవకాశాలు... నాలుగో పారిశ్రామిక విప్లవంలో భారత్‌కు అపారమైన అవకాశాలున్నాయని డీఐపీపీ (డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్)కార్యదర్శి రమేశ్ అభిషేక్ చెప్పారు. దీని కోసం భారత్ కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలని, త్వరిత గతిన విధాన నిర్ణయాలు తీసుకోవలసి ఉందని పేర్కొన్నారు. కాగా ఇండస్ట్రీ 4.0ను అందుకునే సత్తా భారత్‌కు ఉందని డెలాయిట్ గ్లోబల్ సీఈఓ పునీత్ రంజన్ పేర్కొన్నారు. స్వేచ్ఛా వాణిజ్యాన్ని స్వాగతిస్తాం స్వేచ్ఛా వాణిజ్యాన్ని స్వాగతిస్తామని స్విట్జర్లాండ్ అధ్యక్షుడు యూఈల్ మౌరెర్ చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న సమస్యలపై ప్రపంచ నాయకుల మధ్య బహిరంగ చర్చ జరగాలని పిలుపునిచ్చారు. డబ్ల్యూఈఎఫ్ను నిర్వహించడం గర్వంగా భావిస్తున్నామని, ప్రపంచ నేతలంతా కలసి చర్చించుకునేలా తోడ్పడుతున్నామన్నారు. సమస్యల పరిష్కారానికి సంప్రదింపులే ముఖ్యమని, ఎలాంటి చర్చలకైనా వేదికగా నిలవడానికి తమ దేశం సిద్ధమని స్పష్టం చేశారు. కాగా అంతర్జాతీయంగా విద్యా వ్యవస్థ సరిగ్గా లేదని, దీనిని సంస్కరించకపోతే మనం భారీ మానవతా సంక్షోభంలోకి కూరుకుపోతామని కొలంబియా కు చెందిన లాస్ సూపర్ సంస్థ వ్యవస్థాపకులు జువాన్ డేవిడ్ అరిస్టిజబాల్ పేర్కొన్నారు. మధ్య తరగతి జనాభాయే అధికం ఉద్యోగాలు పోతాయేమోనన్న భయాన్ని ఉద్యోగుల నుంచి పోగొట్టాలని, ఇందుకు తగిన శిక్షణ ఇవ్వటానికి వీలుగా ప్రభుత్వాలు, కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని విప్రో సీఈఓ అబిదాలి నీముచ్వాలా సూచించారు. విస్తరిస్తున్న టెక్నాలజీ... ఉత్పత్తి సంబంధిత సమస్యలను పరిష్కరించే అవకాశముందని నోకియా కార్పొరేషన్ సీఈఓ రాజీవ్ సూరి చెప్పారు. వ్యక్తిగత గోప్యత, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఉత్తమ విధానాలను ప్రభుత్వాలు, కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతం పేదరికంలో ఉన్న జనాభా కంటే మధ్య తరగతి జనాభా అధికంగా ఉందని విసా సీఈఓ ఆల్ఫ్రెడ్ ఎఫ్.కెల్లీ వ్యాఖ్యానించారు. ఫలితంగా ఆర్థిక సమ్మిళితానికి గతంలో ఎన్నడూ లేనంతటి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. -
ప్రపంచీకరణను అడ్డుకోలేరు
దావోస్: చైనా అలీబాబా గ్రూపు చైర్మన్ జాక్‌మా దావోస్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచీకరణ ఆగకూడదని, వాణిజ్యం ఆగిపోతే యుద్ధానికి దారితీస్తుందన్నారు. సమస్యలకు ముగింపు పలకాలంటే ప్రపంచీకరణను అక్కున చేర్చుకోవాలని సూచించారు. ఇది మన బాధ్యతని, ఎదిగేందుకు అవకాశమని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు సందర్భంగా జరిగిన ప్రత్యేక సెషన్లో ఆయన ప్రసంగించారు. ‘‘రానున్న 30 సంవత్సరాల్లో ప్రపంచం అనూహ్యంగా మారిపోతుందని ఆందోళన చెందుతున్నారా? ఏదైనా యుద్ధం జరిగితే అది వ్యాధులు, పర్యావరణ కాలుష్యం, పేదరికానికి వ్యతిరేకంగానే ఉండాలి. మనపై మనం యుద్ధం చేసుకోరాదు. ప్రపంచీకరణను ఎవరూ ఆపలేరు. ఒకవేళ వాణిజ్యం ఆగిపోతే ప్రపంచం కూడా ఆగిపోయినట్టే. వాణిజ్యం అన్నది యుద్ధాన్ని అంతం చేసేది. అంతేకానీ యుద్ధానికి దారితీయదు’’ అని జాక్‌మా తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. టెక్నాలజీ కారణంగా ప్రస్తుతం ప్రపంచం మార్పు దశలో ఉందని, ఆసక్తికరమైన ఉపాధి అవకాశాలకు ఇది సాయపడుతుందని చెప్పారు. అలాగే, సామాజిక సమస్యలకూ కారణం కావచ్చన్నారు. నూతన అవకాశాల వైపు చూస్తున్నాం: కొచర్ వృద్ధికి అవకాశం ఉన్న కొత్త విభాగాల వైపు చూస్తున్నామంటూ ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ చందాకొచర్ అన్నారు. నోట్ల రద్దు తర్వాత నూతన అవకాశాలకు మార్గం ఏర్పడిందన్నారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు వచ్చిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి మరిన్ని చిన్న, మధ్య స్థాయి సంస్థలు వచ్చి చేరుతున్నాయి. దీంతో వృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి (ఎంఎస్ఎంఈ) సంస్థలకు రుణ వితరణను పెంచేందుకు ప్రభుత్వం కూడా తగిన ప్రేరణనిచ్చింది’’ అన్నారు. -
'ట్రేడ్ ఆగితే, యుద్ధం ప్రారంభమే'
దావోస్ : ప్రపంచీకరణను ఎవరూ ఆపలేరని, ఒకవేళ ట్రేడ్ ఆగితే, యుద్ధం ప్రారంభమవుతుందని చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ చైర్మన్ జాక్‌మా హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించేందుకు ప్రపంచీకరణను కొనసాగించాల్సివసరం ఉంటుందని, ఇది మన బాధ్యత అని జాక్ మా తెలిపారు. దీన్ని మెరుగుపరిచే అవకాశం కూడా మనదేనన్నారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే 30 ఏళ్లలో ప్రపంచంలో పెద్ద మొత్తంలో మార్పులు సంభవిస్తాయని ఆందోళన చెందుతుంటే, వ్యాధులు, వాతావరణ కాలుష్యం, పేదరికంపై యుద్ధం చేయాల్సి ఉందన్నారు. ఎవరూ కూడా ప్రపంచీకరణను ఆపలేరని కూడా ఉద్ఘాటించారు. వాణిజ్య లావాదేవీలు, బాంబులాంటివన్నారు. ''ఎవరూ ప్రపంచీకరణను ఆపలేరు. ఒకవేళ ట్రేడ్ ఆపితే, ప్రపంచమే ఆగిపోతుంది. ట్రేడ్ కేవలం యుద్ధం బారి నుంచి బయటపడేయగలదు. కానీ యుద్ధాన్ని సృష్టించదు'' అని పేర్కొన్నారు. టెక్నాలజీతో ప్రస్తుతం ప్రపంచం పరివర్తన దశలో ఉందని, ఇది ప్రజలకు ఆసక్తికరమైన కెరీర్లను సృష్టించడానికి సాయపడుతుందని తెలిపారు. కానీ కొన్ని సామాజిక సమస్యలు ఉంటాయన్నారు. ప్రపంచ వాణిజ్యం చాలా సాధారణంగా, ఆధునీకరంగా ఉండాలన్నారు. పలు అంశాలపై మాట్లాడిన జాక్ మా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ(ఏఐ), మానవ వనరులకు పెద్ద ముప్పుగా మారుతోందని, భవిష్యత్తులో చాలా మందిని ఇది రీప్లేస్ చేస్తుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఉద్యోగాలను ఏఐ, రోబోట్స్ హరించుకుపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఏఐ, మానవ వనరులకు మద్దతు ఇచ్చేలా ఉండాలని, టెక్నాలజీ ఎల్లప్పుడూ ప్రజలకు ఏదో ఒకటి చేసేలా ఉండాలని కానీ, డిసేబుల్ చేసేలా ఉండకూడదన్నారు. ఈ శతాబ్దంలో గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, అలీబాబాలు చాలా అదృష్టకర కంపెనీలని అన్నారు. -
వెలుగుతున్న తెలుగు
సెల్ఫ్ చెక్ తెలుగు వాళ్లే తెలుగు భాషను మాట్లాడడం లేదని బాధపడుతుంటాం. కాని తెలుగు భాష తేజస్సుతో వెలుగుతూనే ఉంది. ప్రపంచీకరణ ప్రవాహంలో కొట్టుకుపోకుండా తెలుగు పదాల్లో దాగిన పొందికే దానిని నిలబెడుతోంది. 1. మనదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల జాబితాలో తెలుగుది మూడవస్థానం. ఎ. అవును బి. కాదు 2. ఏడు కోట్ల మందికి పైగా తెలుగు మాట్లాడుతున్నారు. ఎ. అవును బి. కాదు 3. మొదటి రెండు స్థానాల్లో హిందీ, బెంగాలీ ఉన్నాయని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 4. ప్రపంచ భాషల జాబితాలో మనది 15వ స్థానం. ఎ. అవును బి. కాదు 5. కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేసియా, బహ్రెయిన్, సౌత్ ఆఫ్రికా, అమెరికా, ఇంగ్లండ్, ఫిజి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి కొన్ని దేశాలకు రెండు– మూడు తరాల క్రితం వలస వెళ్లిన కుటుంబాలు ఇప్పటికీ తెలుగులోనే మాట్లాడుతున్నాయి. ఎ. అవును బి. కాదు 6. శాతవాహనకాలంలో రాజులు అధికారులు ప్రాకృత భాషను మాట్లాడుతున్నప్పటికీ సామాన్యులు తెలుగునే మాట్లాడేవాళ్లు. ఎ. అవును బి. కాదు 7. రేనాటి చోళులు పూర్తిగా తెలుగులో వేసిన శాసనం కడపజిల్లా ఎర్రగుడిపాడులో దొరికింది. ఎ. అవును బి. కాదు 8. ప్రాచీన భాష హోదా కోసం చేసిన ప్రయత్నం 2008 అక్టోబర్ 31వ తేదీన ఫలించిందని మీకు గుర్తుంది. ఎ. అవును బి. కాదు సమాధానాల్లో ‘ఎ’లు ఎక్కువ వస్తే మీకు మన భాష మీద గౌరవం, మూలాలను తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువే అనాలి. ‘బి’ లు ఎక్కువైతే... ఒకసారి తెలుగుభాష మీద ధ్యాస పెట్టండి ప్లీజ్. -
మా చుట్టూ తెలుగు మెండుగా ఉంది
హోసూరు(తమిళనాడు) తెలుగు రచయిత అగరం వసంత్ తాజాగా పల్లె పాటల కతలు ‘దణి’ తెచ్చిన నేపథ్యంలో ఈ ఐదు ప్రశ్నలు... 1. మీ ప్రాంత పాటల్ని కథలుగా మలచాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే ఇక్కడ ఏమైతోందంటే భాష నశించి పోతోంది. గ్లోబలైజేషన్‌వల్లా, రీడర్షిప్ తగ్గిపోవడం వల్లా. పైగా తమిళే ఉండాలి అని ప్రభుత్వం రూల్ పెడుతోంది. కానీ ఈ ప్రాంతం తెలుగు ప్రాంతం. ఇళ్ల రిజిస్ట్రేషన్ తెలుగులో ఉంటుంది. ఊరికొకరైనా చందోబద్ధంగా పద్యాలు చెప్పే వాళ్లుంటారు. మేము కనీసం ఈ పాటలు విన్నాం. మా తర్వాతి వాళ్లకు అసలు లేదు. అందుకే కనీసం రికార్డ్ చేద్దామన్న ఆలోచనతో ఈ పనికి పూనుకున్నాను. 2. మీ సేకరణ ఎట్లా సాగింది? డాక్టర్‌గా ఊళ్లకు వెళ్తుంటాను కదా, ఎవరైనా పాడతారేమోనని కనుక్కునేవాణ్ని. పాడేది ఎక్కువ ఆడవాళ్లు. కానీ వాళ్లకు సిగ్గు. మాకేమొచ్చు అనేది. తెలిసిన ఫార్మర్స్, ఫ్రెండ్స్ సహాయం తీసుకున్నాను. ‘ఈ ఊళ్లో ఇంకెవరు పాడుతారు? ఫలానా రోజు వస్తాను’... అట్లా కలెక్ట్ చేసినాను. రచయితలు మునిరాజు, సుమ హెల్ప్ చేసినారు. నేను పెండ్లాడుండేది కర్ణాటకలో. మా అత్త, మర్దాలు కొన్ని పాడినారు. 3. వీటిని కథలుగా మలవకుండా, యథాతథంగా నోట్స్‌తో ఇచ్చివుంటే బాగుండేది కాదా? ఒక్కోపాట నాలుగు, ఐదు పేజీలు ఉంటుంది. పెద్ద కథంతా పాడుతారు. పేజీలు పేజీలు పోతుంది. ఈ పాట ప్రధానంగా ఏం చెప్తుందో చెప్పాలనేది నా లక్ష్యం. మీరన్నట్టు యథాతథంగా ఇచ్చేపనీ జరుగుతూవుంది. మా (కృష్ణగిరి జిల్లా తెలుగు) రచయితల సంఘం తరఫున చేస్తున్నాం. 4. కొన్ని మాటలు మినహా మీరు ‘మామూలుగానే’ మాట్లాడుతున్నారు. రాసేదీ మాట్లాడేదీ ఒకటి కాదా? నేను కొంత చదివివుండొచ్చు, నాలుగైదు ప్రాంతాలకి తిరిగివుండొచ్చు, మాట్లాడేది వేరేది ఉండొచ్చు. కానీ రాసేదానికి కూర్చుంటే ఇదే వస్తుంది. కృత్రిమంగా కలిపింది ఏమీ లేదు. 5. హోసూరు వాళ్లకు తెలుగు మీద ఎందుకింత మమకారం? అట్లా అంటే ఎట్ల సార్? మేము ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడేది తెలుగు, వీధిలో మాట్లాడేది తెలుగు, చూసే సినిమాలు తెలుగు. మా చుట్టూ తెలుగు మెండుగా ఉంది. నేను ఎలిమెంటరీ వరకు తెలుగు చదువుకున్నా. ఇప్పుడంటే తమిళ్ డంపు చేస్తున్నారు. పెండ్లాములపల్లె అని ఊరుంటే పెరుమాళ్‌పల్లె అని మారుస్తున్నారు. 2006లో ఒక చట్టం వచ్చి తమిళే చదవాలంటున్నారు. కానీ మా పెద్దాళ్లు మాకు తెలుగు కావాలని నిలబెట్టినారు. దాన్ని కొనసాగించాలనేది మా తపన. దణి(పల్లె పాటల కతలు); పేజీలు: 208; వెల: 100; ప్రతులకు: రచయిత, కృష్ణగిరి జిల్లా తెలుగు రచయితల సంఘం, 2/1097, బస్తి, ఆవులపల్లి రోడ్డు, హోసూరు–635109. కృష్ణగిరి జిల్లా, తమిళనాడు. ఫోన్: 09488330209 -
వాణిజ్య పోరాటంలో ఎవరూ విజేత కాలేరు: చైనా
దావోస్: ప్రపంచీకరణను చైనా గట్టిగా సమర్థించింది. ప్రపంచీకరణ ఫలాలను చక్కగా ఒడిసి పట్టుకున్న దేశాల్లో చైనా ముందుంటుందన్న విషయం జగమెరిగినదే. దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్ సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడుతూ... ఆర్థికరంగ అనుసంధానత మానవాభివృద్ధికి తోడ్పడిందని, లక్షలాది మంది జీవితాలను మెరుగుపరిచిందన్నారు. ‘‘నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు ప్రపంచీకరణతో వచ్చినవి కావు. నీకు నచ్చినా నచ్చకపోయినా ప్రపంచ ఆర్థిక రంగం అనేది ఓ అతిపెద్ద సాగరం వంటిది. దాన్నుంచి తప్పించుకోవడం అసాధ్యం. స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడులకు మేము కచ్చితంగా కట్టుబడి ఉంటాం. వాణిజ్యం, పెట్టుబడుల ఉదారవాదాన్ని ప్రోత్సహిస్తాం. వాణిజ్య పోరాటంలో ఎవరూ విజేత కాలేరు’’ అని జిన్‌పింగ్ చైనా వాణిని వినిపించారు. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలను సమీక్షిస్తామని, అమెరికా ప్రయోజనాలకు ఉపయోగపడని వాటిని రద్దు చేస్తామని ఆ దేశ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. జిన్‌పింగ్ పరోక్షంగా ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. -
సర్పయాగం
హ్యూమర్ ప్లస్ ‘‘తుపానొస్తే పెద్ద ఓడలు నిలదొక్కుకుంటుయి. చిన్న పడవలు మునిగిపోతాయి’’ అన్నాడు విష్ణుశర్మ. ‘‘అర్థమయ్యేలా చెప్పండి గురువుగారు’’ అన్నారు శిష్యులు. ‘‘గురువుకి కూడా అర్థంకాని విషయాన్ని శిష్యులకి బోధించడమే ప్రపంచీకరణ. ద్రాక్షపళ్లని తైలవర్ణచిత్రంలో గీస్తే, చూడడానికే తప్ప తినడానికి పనికిరావు. కలలెప్పుడూ కడుపు నింపవు. వాస్తవ మెన్నటికీ కలగా మారదు. కథ చదివిన ప్రతివాడికీ నీతి అర్థం కాదు. నీతి తెలిసినవాడికి కథలు చెప్పనక్కర్లేదు’’ అంటూ గురువు కథ ప్రారంభించాడు.‘‘అనగనగా ఒక రాజ్యంలో పాముల బెడద తీవ్రంగా ఉండేది. పాముల పని పట్టాలని రాజు నిశ్చయించుకున్నాడు. నిపుణులను సంప్రదించాడు. సర్పయాగం చేస్తే యజ్ఞగుండంలోంచి వెలువడే శక్తికి సుడిగాలి వచ్చి పాములన్ని వచ్చి పడిపోతాయని చెప్పారు. హఠాత్తుగా యజ్ఞం ప్రారంభమైంది. గాలి విసురుని పాములు తట్టుకున్నాయి. చుట్టులు చుట్టుకున్నాయి. ఒకదాన్నొకటి పెనవేసుకున్నాయి. పుట్టలమీద మట్టి కాస్త జారిందంతే. కానీ ఈ తాకిడికి చీమలు చెల్లాచెదురయ్యాయి. కొన్ని చచ్చిపోయాయి. మరి కొన్నింటికి నడుములు విరిగిపోయాయి. జీవనం అస్తవ్యస్తమైంది. చీమలన్నీ సమావేశం పెట్టుకున్నాయి. ‘‘యజ్ఞం ప్రారంభమైనప్పటి నుంచి కూలీకి ఎవరూ పిలవడం లేదు. తిండికి కష్టంగా ఉంది. రెక్కలున్నాయి కానీ ఆడడానికి శక్తి లేదు’’ అని చెప్పిందో కూలీ చీమ. ‘‘దాచుకున్న గింజల్ని, తిరిగి తెచ్చుకుందామంటే అడుగడుగునా అడ్డంకులే. పాములకి చర్మం చిట్లితే కుబుసం విడిచి పారిపోతాయి. కానీ చీమలకి చర్మమే ప్రాణం. వరుసల్లో వెళ్లడం చీమలకి కొత్త కాదు. కానీ గమ్యమే తెలియని ప్రయాణంలో ఎంత దూరమని వెళ్లగలం’’ అందో మధ్యతరగతి చీమ. ‘‘తప్పదు, భావి తరాల కోసం మనం త్యాగం చేయాలి’’ అందో మేధావి చీమ. ‘‘త్యాగాలెప్పుడూ చీమలే చేయాలా? అసలు మన బతుకే ఒక త్యాగం కాదా? ప్రతి జంతువు మనల్ని కాళ్ల కింద తొక్కుతూనే ఉంది కదా. సృష్టి పుట్టినప్పటి నుంచి ఇదెప్పుడైనా ఆగిందా?’’ ఓ బుద్ధి చీమ ప్రశ్నించింది. ఇవే విషయాల్ని రాజుకి చెప్పాలని ఒక ప్రతినిధి వెళ్లాడు. ‘‘మీరు పాముల్ని ఆడించాలనుకుని, చీమల్ని ఓడిస్తున్నారు రాజా’’ అని చెప్పాడు ప్రతినిధి. ‘‘చీమల పుట్టల్ని పాముల్నుంచి కాపాడ్డానికే ఈ యాగం’’ అన్నాడు రాజు. ‘‘తెలియనిదాన్ని తెలిసిందనుకోవడం, తెలిసినదాన్ని తెలియనట్టు నటించడమే పరిపాలన రాజా.’’ ‘‘పదాలను తారుమారు చేసి మాట్లాడినంత మాత్రాన పరిపాలన తీరు మారుకాదు.’’‘‘వెనకటికి ఒకాయన పులి మీద స్వారీ చేస్తూ పులివేటకి వెళ్లాడట.’ రాజు అర్థం కానట్టు చూశాడు. ‘‘యంత్రాంగం నిండా కొండ చిలువల్ని పెట్టుకుని, మీరు పాముల్ని వేటాడుతున్నారు. అవి రెండూ ఒకే జాతని మీకు తెలియదా? కొండచిలువలు నిజాయితీగా పాముల్ని వేటాడుతాయా? జాతి ధర్మం పాటించవా?.’’రాజు తీక్షణంగా చూశాడు. చీమల ప్రతినిధిని ఆ తరువాత ఎవరూ చూడలేదు. ‘‘ఈ కథకి ముగింపు ఏమిటి గురువుగారూ?’’ అడిగారు శిష్యులు. ‘‘ఉచ్చు విప్పడం తెలియకుండా ఉచ్చు బిగిస్తే ఆ కథని ముగించడం అంత సులభం కాదు. ఒక్కసారి అదే పాముగా మారి మనల్ని కాటేయవచ్చు.’’ ‘‘అంటే?’’ ‘‘ప్రశ్నించినవాణ్ణి అంతకు మించి ప్రశ్నిస్తారు. మౌనంగా ఉండడమే దేశభక్తి’’ అన్నాడు గురువు. - జి.ఆర్.మహర్షి -
ఉన్నత విద్యలో సమున్నత మార్పులు
ప్రస్తుత గ్లోబలైజేషన్, డిజిటలైజేషన్ నేపథ్యంలో ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని కమిటీ పేర్కొంది. జాతీయ స్థాయిలో ఎడ్యుకేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. ఇది ప్రతి ఐదేళ్లకోసారి కరిక్యులం, బోధన, ఇతర అంశాలపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు సలహాలు, సూచనలు అందించాలి. ఉన్నత విద్య నియంత్రణ సంస్థల్లో ఇండస్ట్రీ నిపుణులు, పూర్వ విద్యార్థులు, ఇతర విద్యావేత్తలు ఇలా అన్ని వర్గాలకు చెందినవారు ఉండేలా చర్యలు తీసుకోవాలి. యూనివర్సిటీల స్థాయిలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ స్టడీస్‌ను సమీకృతం చేసే విధానాలు రూపొందించాలి. విద్యా రంగంలో అకడమిక్, నిర్వహణ విభాగాల కోసం జాతీయ స్థాయిలో ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్‌ను రూపొందించాలి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో సమస్యల పరిష్కారం కోసం ఎడ్యుకేషన్ ట్రిబ్యునల్స్ ఉండాలి. వర్సిటీ పరిధిలో అనుబంధ కళాశాలలు వందకు మించకూడదు. ఉన్నత విద్యా సంస్థల్లో ఉమ్మడి నియంత్రణ విధానాలు జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా సంస్థలు వేర్వేరు విధానాలతో నిర్వహణ సాగిస్తున్నాయి. వీటన్నిటినీ ఒకే విధానంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని కమిటీ పేర్కొంది. నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను సమర్థంగా పర్యవేక్షించేందుకు స్వతంత్ర వ్యవస్థను రూపొందించాలి. జాతీయ స్థాయిలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల సమాచార సేకరణ, సమీకృతం చేయడం కోసం సెంట్రల్ ఎడ్యుకేషనల్ స్టాటిస్టికల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలి. రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్లు తప్పనిసరిగా వర్సిటీలు, కళాశాలల నాణ్యత ప్రమాణాలను పరిశీలించాలి. ప్రతి విద్యా సంస్థ తప్పనిసరిగా ఎన్బీఏ లేదా న్యాక్ గుర్తింపు పొందాలి. న్యాక్, ఎన్‌బీఏలను పునర్వ్యవస్థీకరించాలి. గ్లోబల్ ర్యాంకులు పొందేలా వర్సిటీల్లో నాణ్యత ప్రమాణాలు ఉండేలా న్యాక్, ఎన్బీఏలు చర్యలు తీసుకోవాలి. మూక్స్కు ప్రాధాన్యం.. ప్రత్యేక వ్యవస్థ అంతర్జాతీయంగా తాజా పరిణామాలపై అవగాహన, అంతర్జాతీయంగా సబ్జెక్ట్ నైపుణ్యాల వృద్ధి. ఈ క్రమంలో ప్రాచుర్యంలోకి వస్తున్న విధానం మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ (మూక్స్). వీటిని విస్తరించేందుకు కమిటీ పలు సూచనలు చేసింది. మూక్స్ నిర్వహణ, అభివృద్ధి, సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలి. మూక్స్, ఓడీఎల్ కోర్సుల్లో నిరంతరం మార్పులు చేర్పులు చేస్తుండాలి. స్కిల్ డవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ సహకారంతో ఒకేషనల్ కోర్సులు అందించాలి. విదేశీ వర్సిటీలకు ఆహ్వానం.. పరస్పర ఒప్పందం అంతర్జాతీయ నైపుణ్యాలు పొందడానికి విద్యా వ్యవస్థను గ్లోబలైజ్ చేయాలని కమిటీ పేర్కొంది. అందులో ప్రధానంగా విదేశీ వర్సిటీలను ఆహ్వానించడం, లేదా వాటితో భారత్‌లోని యూనివర్సిటీలు ఒప్పందం చేసుకోవడం వంటివి కీలకం. ప్రపంచంలోని టాప్-200 జాబితాలో ఉన్న వర్సిటీలు భారత్‌లోని వర్సిటీలతో ఒప్పందం ద్వారా ఇక్కడ అడుగుపెట్టేందుకు చర్యలు తీసుకోవాలి. ఆ ఇన్స్టిట్యూట్లు ఇచ్చే సర్టిఫికెట్లకు గుర్తింపు కల్పించాలి. భారత్‌లోని ఇన్స్టిట్యూట్లు కూడా ఇతర దేశాల్లో క్యాంపస్‌లు నెలకొల్పేందుకు అనుమతివ్వాలి. అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే విధంగా కరిక్యులం రూపొందించాలి. విదేశీ ఫ్యాకల్టీ ఆకర్షితులయ్యేందుకు కృషి చేయాలి. టీచింగ్ పోస్టుల్లో బెస్ట్ టాలెంట్‌ను ఆకర్షించేందుకు చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. రీసెర్చ్‌వైపు ఆకర్షితులయ్యేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఎంఫిల్, పీహెచ్డీ అభ్యర్థులను అకడమిక్ అసిస్టెంట్స్, అకడమిక్ అసోసియేట్స్‌గా పరిగణించాలి. కొత్తగా నియమితులైన ఫ్యాకల్టీకి విధుల్లో చేరే ముందుగా మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో జాతీయ, రాష్ట్రాల స్థాయిలో ట్రైనింగ్ అకాడమీల నేతృత్వంలో ఇండక్షన్ ప్రోగ్రామ్‌లు నిర్వహించాలి. తర్వాత పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్ అందించాలి. ఇండక్షన్ ప్రోగ్రామ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు వాళ్లు ఫ్యాకల్టీగా నియమితులైన యూనివర్సిటీలో నాలుగు నుంచి ఆరు వారాల వ్యవధిలో ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించాలి. ఆయా ఇన్స్టిట్యూట్లలో ఫ్యాకల్టీ నైపుణ్యాలను, అకడమిక్ పెర్ఫార్మెన్స్ను పరీక్షించేలా తప్పనిసరిగా మూల్యాంకన వ్యవస్థ ఉండాలి. సీనియర్ ఫ్యాకల్టీ సభ్యుల పదోన్నతుల క్రమంలో వారిలో లీడర్షిప్ నైపుణ్యాలు పెంపొందించేలా ఉన్నత విద్యా సంస్థలు లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు నెలకొల్పి వీటిపై షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్‌లు నిర్వహించాలి. ఆర్ అండ్ డీ కి అనువైన వాతావరణం మన దేశంలోని యువత రీసెర్చ్ దిశగా విదేశాలకు వెళుతున్న క్రమంలో ఇక్కడే ఆ అవకాశం కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. పబ్లిక్, ప్రైవేట్ విభాగంలో రానున్న పదేళ్లలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించే విధంగా కనీసం 100 కొత్త రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. ఇన్నోవేషన్, క్రియేటివిటీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెంపొందించేందుకు రానున్న ఐదేళ్ల కాలంలో ఉన్నత విద్యా సంస్థల్లో అదనంగా వంద ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్, స్టడీస్‌కు ప్రాధాన్యమిస్తూ మానవ వనరులను అభివృద్ధి చేసేలా అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవాలి. -
గతించిన గతంపై నిరర్థక పోరు
గ్లోబలైజేషన్ తెచ్చిన మార్పులు నెహ్రూ, ఇందిరలకు కాలదోషం పట్టించేశాయి. అయినా ఆర్ఎస్ఎస్, బీజేపీలు వారి వెంట ఎందుకుపడ్డట్టు? ఆర్ఎస్ఎస్ హిందుత్వీకరించిన కరడుగట్టిన జాతీయవాద భావజాలాన్ని వ్యాపింపజేస్తోందే గానీ, దానికి తమవారుగా కొలువుదీరిన ఆధునిక జాతీయవాద వేలుపులెవరూ లేరు. జాతీయోద్యమానికి దూరంగా ఉండిపోయిన దానికి జాతీయ హీరోలు అవసరమయ్యారు. కాంగ్రెస్ నుంచి మాలవీయ, పటేల్‌వంటి వారిని తెచ్చుకున్నారు. భగత్‌సింగ్ నుంచి నేతాజీ వరకు జాతీయ విప్లవకారులందరినీ దొంగిలించారు. మీరే గనుక మీ ఉద్యోగపు దరఖాస్తుల్లో స్టాంపుల సేకరణను హాబీగా పేర్కొ న్న బాపతైతే, నాలాగే మీలో చాలా మందికి కూడా మీ మొదటి ఉద్యోగంలోని కీలక విధుల్లో స్టాంపులను నాకడమూ ఒక ముఖ్యమైన పని అయి ఉంటుంది. నా వరకు నాకైతే అది రచయితలకు పారితోషికంగా చెల్లించాల్సిన రూ.75 చెక్కులను, వారి వ్యాసాల క్లిప్పింగులను కవర్లలో పెట్టి వాటి మీద స్టాంపులు అంటించాల్సిన పని. టైపురైటర్లు, సైక్లోస్టైల్, గ్రామ ఫోన్లు, నలుపు, తెలుపు దూరదర్శన్, టెలిగ్రాఫ్, మనీ ఆర్డర్లు, స్టీమ్ఇం జన్, దూరప్రాంతాలకు లైట్నింగ్ కాల్స్, పీపీ (ఫలానా మనిషికి) కాల్స్ లాగే స్టాంపులు కూడా మన జీవితాల్లో ముఖ్యమైన పాత్రను పోషిం చాయి. అంతేకాదు, మీరు చాలా చాలా పాత తరం మనిషని కూడా అర్థం. ప్రత్యేకించి నేడు ప్రతి ఏడేళ్లకూ తరాల అంతరం ఏర్పడుతున్న దని నా విశ్వాసం. ఒకప్పుడు ముఖ్యమైనవిగా నేను ఇక్కడ పేర్కొన్న వన్నీ, పోస్టల్ స్టాంపులుసహా ప్రజాజీవితానికి దూరమైపోయాయి. మీరీ రోజన ఎవరైనా యువకుడి తొలి ఉద్యోగ విధుల్లో కవర్ల మీద స్టాంపులు అంటించడం కూడా ఒకటని చెబితే... ‘‘నాకడమా, ఈ నాకడం ఏమిటి? స్టాంపులా, ఈ స్టాంపులేమిటి?’’ అని అడిగే అవకాశాలే ఎక్కువ. పాత శవపేటికకు కొత్త మేకు కనీసం రెండు తరాల భారత నవ యువ ఓటర్లకు పోస్టల్ స్టాంపుల వాడ కంలో దాదాపుగా అనుభవం ఉండి ఉండదు (తరం మార్పునకు కొలబద్ధను ఏడేళ్లుగా తీసుకుంటే). ఇక ఫిలటెలీ (స్టాంపుల సేకరణ) అనే మాటైతే దాదాపు అందరినీ గందరగోళపరుస్తుంది... ఒకవేళ వారేమైనా అమెరికన్ కళాశాలల ప్రవేశార్హతకు ప్రామాణిక పరీక్షైన ‘సాట్’కు సంసిద్ధమౌ తున్న వారైతే తప్ప. ఈమెయిల్, కొరియర్ల శకంలో నత్తనడక మెయిల్ చాలా వరకు ‘‘సర్కారు’’ వారి కోసమే. దేశంలో 30 ఏళ్లలోపు వయస్కులు చాలా మందే ఉంటారు. వారిలో అతి కొద్దిమంది మాత్రమే స్టాంపులు కొనడానికి పోస్టాఫీసుకు వెళ్లి ఉంటారని లేదా ఎవైరె నా ఎన్నారై అంకుల్ రాసిన ఉత్తరం మీది స్టాంపులను వదులుచేసి, తీసుకోవాలని ఉత్కంఠతో ఊపిరి బిగబట్టి చూసి ఉండరని పందెం కాస్తాను. వారంతా ఈ వారం పేపర్ల మొదటి పేజీల్లో ఇద్దరు అపరిచిత వ్యక్తుల చిత్రాలున్న స్టాంపులను ఆసక్తిగా చూసి ఉంటారు. ఇందిరాగాంధీ ఇప్పటికీ బాగా సుపరిచితురాలే. నెహ్రూ మాత్రం మరు పున పడిపోతున్న జ్ఞాపకం. ఆర్థిక విధానాల నుంచి విదేశాంగ విధానం వరకు నెహ్రూ భావాలపై నాకుండే విభేదాలు నాకున్నాయి. నెహ్రూకు సంబంధించి మణిశంకర్ అయ్యర్ పేర్కొన్న ‘‘కరడుగట్టిన’’ లౌకికవాదం నిజానికి అజ్ఞేయ వాదానికి (దేవుని ఉనికి నిజమో కాదో ఇదమిత్థంగా చెప్పలేమనే తాత్విక ధోరణి) మరో పేరు మాత్రమే. నెహ్రూ పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌కున్న తృణీకార భావం అందరికీ తెలిసిందే. అయినాగానీ, ఇప్పుడాయన భావజాలపరమైన వారసత్వాన్ని రూపుమాపుతున్నట్టుగా నటించడం కాలాన్ని వృథా చేసు కోవడమే అవుతుంది. ఇప్పటికే అది చచ్చిపోయింది, నిశ్శబ్దంగా సమాధి చేసేశారు కూడా. ఎన్నడో చనిపోయిన నెహ్రూవియనిజం శవపేటికపై మరో మేకును దిగ్గొట్టాలని ఆర్ఎస్ఎస్/బీజేపీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా పాత పోస్టల్ స్టాంపుల సిరీస్‌ను నిలిపివే యడ ం రాజకీయ పెట్టుబడిని వృథా చేసుకోవడమే. వారిని ఇది భావజాలపరమైన పోటీ విషయంలో మూర్ఖపు పట్టుదల, భ్రమాత్మక మనస్కతలతో ‘‘విజేతదే సర్వస్వమూ’’ అనే తీరున ప్రవర్తిస్తున్న ట్టుగా చూపుతుంది. అది మధ్యయుగాల నాటి దుర్మార్గవైఖరి. పాత, కనుమరుగైపోతున్న నెహ్రూవాదులను మేల్కొల్పి, ఆయన భావాలను తిరిగి చర్చకు తేవడానికి మాత్రమే తోడ్పడుతుంది. అంతేకాదు ఫిలటెలీ అనేపాత హాబీపట్ల కొంత ఆసక్తిని రేకెత్తించడం సైతం చేయవచ్చు. లండన్ స్ట్రాండ్ కూడలిలోని ప్రముఖ దర్శనీయ స్థలంగా ఉండిన స్టాన్లీ గిబ్సన్ స్టాంపుల దుకాణాన్ని మూసేయడంతో చాలా ఏళ్లక్రితమే ఆ హాబీ చచ్చిపోయిందనే మాటా నిజమేననుకోండి. పోస్టల్ స్టాంపులు నెహ్రూపట్ల, ఆయన కూతురు పట్ల ఆరాధనాభావాన్ని పెంపొందింపజేస్తున్నాయని ఆర్ఎస్ఎస్ విశ్వసిం చడమే గొప్ప ప్రజ్ఞ. కనుమరుగైన భావజాలంపై యుద్ధం పోస్టల్ స్టాంపులలాగే, నెహ్రూ-ఇందిర భావజాలాలు కూడా వాడుక నుంచి కనుమరుగయ్యాయి. 51 ఏళ్ల క్రితమే నెహ్రూ చనిపోయాడు. ఆయన తర్వాత వచ్చిన ప్రతి ప్రభుత్వమూ, ప్రత్యేకించి 16 ఏళ్లకు పైబడిన ఆయన కుమార్తె ఇందిర ప్రభుత్వం ఆయన వారసత్వాన్ని రూపుమాపడానికి కృషిచేశాయి. ఇందిర తాంత్రికులను ఆశ్రయించడం, ప్రత్యేక పూజలను, హోమాలను నిర్వ హించడం ప్రారంభించారు, మన స్వేచ్ఛలను హరించారు, అలీన విధానాన్ని పునర్లిఖించి, సోవియెట్ యూనియన్‌కు దాసోహానికి కుదించారు. 1971లో ఆమె బంగ్లాదేశ్‌ను విముక్తి చేశారు. కానీ అందుకు మూల్యంగా సోవియెట్ యూనియన్‌తో రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. పందొమ్మిది వందల డెబ్భై, ఎనభై దశాబ్దాలలో ఇందిర తీసుకున్న వైఖరులకు, ప్రత్యేకించి అఫ్ఘానిస్థాన్‌పై సోవియెట్ దురాక్రమణపట్ల ఆమె వైఖరికి నెహ్రూ... ల్యూటెన్ రోడ్ల పేర్లను మార్చినందుకంటే ఎక్కువగా సిగ్గుపడి ఉండేవాడు. పైగా ఇందిర ఆర్థిక విధానాలు, నెహ్రూ మిశ్రమ ఆర్థికవ్యవస్థ భావనలకంటే ఎక్కువ వామపక్ష పంథాకు చెందినవి. ఆమె పరిశ్రమలను, కంపెనీలను, బ్యాంకింగ్ నుంచి ఇన్సూరెన్స్ వరకు, బొగ్గు నుంచి పెట్రోలియం, టెక్ట్స్‌టైల్స్ వరకు అన్నిటినీ వినాశకరంగా జాతీయం చేసింది. నెహ్రూ తన వరకు తాను ప్రభుత్వరంగ సంస్థలనే మహా అనర్థాలను నిర్మించినా, ప్రైవేటు పర్యాటక సంస్థలను వర్థిల్లనిచ్చాడు. ఇందిర వాటిని సైతం వదలలేదు. నెహ్రూ-ఇందిరాగాంధీల తదుపరి వారసునిగా వచ్చిన రాజీవ్‌గాంధీ కూడా ఇదే క్రమాన్ని కొనసాగించాడు. ఆయన షాబానో కేసులో జోక్యం చేసు కోవడం, బాబ్రీ మసీదు/రామజన్మభూమి తాళాలను తెరిపించడం, ఆ తద పరి శిలాన్యాస్, మండల్ కమిషన్ సిఫారసులపై ఊకదంపుడుతో నిర్ణయ రాహిత్యంగా గడపడమూ.. ఏవీ నెహ్రూకు సంతోషాన్ని కలిగించి ఉండేవి కావు. ఇందిర లేదా నెహ్రూల పట్ల పీవీ నరసింహారావు నామమాత్రపు గౌరవాన్నయినా చూపలేదు. లెసైన్స్-కోటా రాజ్‌ను ఆయన తుత్తు నియలు చేశారు, బాబ్రీ మసీదును కూలగొట్టనిచ్చారు, ఇజ్రాయెల్‌తో భారత్ సంబంధాలను పై మెట్టుకు తీసుకుపోయారు. ఆ తదుపరి, సోనియాగాంధీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఇందిర పేదరికవాదాన్ని పునరుజ్జీ వింపజేసిందే గానీ, నెహ్రూ తరహా పెద్ద డ్యామ్‌లు, భారీ పారిశ్రామిక ఎస్టే ట్లు, మెగా విద్యుత్ ప్రాజెక్టులు, గనుల ప్రాజెక్టులతో కూడిన బ్రహ్మాండమైన అభివృద్ధివాదాన్ని అనుమానాస్పదంగా చూసేది. నదుల అనుసంధానం వంటివాటి పట్ల సైతం అదే వైఖరిని అవలంబించింది. జాతీయ హీరోల అన్వేషణలో... సాంకేతికాభివృద్ధి పోస్టల్ స్టాంపు విషయంలో చేసినట్టే... గ్లోబలైజేషన్ తెచ్చిన మార్పు నెహ్రూని, అంతకన్నా ఎక్కువగా ఇందిరను కాలదోషం పట్టించేసింది. అయినా ఆర్ఎస్ఎస్/బీజేపీలు ఇప్పుడు వారి వెంట ఎందుకు పడ్డట్టు? ఆర్ఎస్ఎస్ హిందుత్వీకరించిన కరడుగట్టిన జాతీయవాద భావజా లాన్ని వ్యాపింపజేస్తోందేగానీ, దానికి గొప్ప ఆధునిక భారత జాతీయవాదులుగా కొలువుదీరిన తమ వారైన వేలుపులెవరూ లేరు. అదే అది ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. ఆర్ఎస్ఎస్ భారత జాతీయోద్యమానికి దూరంగా ఉండిపోయిందనేది వివరంగానే స్పష్టమౌతోంది. కొన్ని విధాలుగా చూస్తే, ముస్లింలీగ్, ఆ తర్వాతి కాలంలో కమ్యూనిస్టులు కూడా దానిలాగే జాతీయోద్యమానికి దూరంగా ఉన్నారు. అందుకే ఆర్ఎస్ఎస్/బీజేపీ జాతీయ హీరోల కోసం మరెక్కడో వెతుక్సోవాల్సివస్తోంది. కాంగ్రెస్ నుంచి అరువు తెచ్చుకోగలిగిన మదన్ మోహన్ మాలవీయ, సర్దార్ పటేల్ వంటి వారిని తెచ్చుకున్నారు. ఇక భగత్‌సింగ్ నుంచి నేతాజీ వరకు మొత్తంగా జాతీయ విప్లవకారులందరినీ దొంగిలించేశారు. వారిలో కొందరు వామ పక్ష తీవ్రవాదులైనా ఫర్వాలేదనుకున్నారు. వారెవరి కోవకూ చెందని తమవాడిగా చెప్పుకోదగినది సావార్కర్ ఒక్కడే. కశ్మీర్, 1962 చైనా యుద్ధ వైఫల్యాలతో నెహ్రూని తోసిపుచ్చడం సులువే. పాకిస్తాన్‌ను యుద్ధంలో ఓడించి, అణ్వస్త్ర పరీక్ష జరిపి ఆర్ఎస్ఎస్ చెప్పే బలమైన భారతదేశమనే భావజాలాన్ని ఢీకొన్న ఇందిరే కొరకరాని కొయ్య. 2014 ఎన్నికల విజయం భావజాలపరంగా కూడా పరిపూర్తి కావా లంటే ఆమె వారసత్వాన్ని కూడా ధ్వంసం చేయాలి. ఇప్పటికింకా ఆమె పట్ల ప్రజల్లో ఉన్న ప్రశంసాభావం పూర్తిగా చెరిగిపోలేదు. ఢిల్లీలోని 1, సఫ్దర్‌జంగ్ మార్గ్‌లోని ఒకప్పటి ఇందిర నివాసాన్ని ఆమె స్మారక చిహ్నంగా మార్చారు. ఆ దారి గుండా మీరు వెళ్లేట్టయితే, ప్రత్యేకించి వారాంతాల్లో మన గ్రామాల నుంచి బస్సుల్లో అక్కడికి గుంపులు గుంపులుగా వచ్చే వారిని చూడొచ్చు. ఇందిర విధించిన అత్యవసర పరిస్థితిని ఆమెను నాశనం చేయడానికి ఇప్పుడు వాడుకుంటున్నారు. అందుకే ఇందిర, నెహ్రూల స్టాంపులను ఉపసంహరించి, ఆమెకు బద్ధ శత్రువులైన లోహియా, జయప్రకాష్ నారాయణ్‌ల స్టాంపులను విడుదల చేస్తున్నారు. వారిద్దరూ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించిన వారనేదిగానీ, వారి నిజమైన వారసులు వచ్చే నెలలో బిహార్‌లో జరిగే ఎన్ని కల్లో బీజేపీని ఢీకొంటున్నారనేది గానీ అనవసరం. భారత జాతీయవాదాన్ని అతి మొరటుగా పునర్ నిర్వచించడానికి ఆర్ఎస్ఎస్ ఐదు దశాబ్దాల వెనక్కు వెళ్లి... శత్రువుకు శత్రువు ఆదర్శ మిత్రుడు అనే నీతిని పాటిస్తోంది. ఇక స్టాంపులంటారా, అవి ఈ పోరుకి సంబంధించిన బాధితులు మాత్రమే. తాజా కలం: భావజాలపరమైన ఈ పవిత్రయుద్ధం కేవలం ఆర్ఎస్ఎస్/ బీజేపీలకే పరిమితం కాలేదు. 2005 ఫిబ్రవరి 26న పార్లమెంటు ప్రాంగ ణంలో సావార్కర్ విగ్రహావిష్కరణ జరగాల్సి ఉండగా... ఆ ఉదయాన్నే జైరాం రమేష్ ఆగ్రహ స్వరాన్ని వినాల్సివచ్చింది. వాజ్‌పేయీ ప్రభుత్వం ఒక మతోన్మాదిని, ద్రోహిని గొప్ప జాతీయ నాయకుల సరసన నిలపడం ద్వారా భారతదేశం పట్లనే అపరాధానికి పాల్పడుతోందని ఆయన అన్నారు. మా పత్రిక ఈ అంశంపై యుద్ధానికి దిగడం లేదేమని ప్రశ్నించాడు. twitter@shekargupta - శేఖర్ గుప్తా -
ప్రపంచీకరణతో మాతృభాషలకు ముప్పు
మండలి బుద్ధప్రసాద్ నిరాశజనకంగా ప్రాచీన హోదా ఫలితాలు పిలుపులకే పరిమితమవుతున్న పోరాటాలు చిత్తశుద్ధి లేకపోతే అమ్మభాష కనుమరుగు బెంగళూరు (బనశంకరి) : ప్రపంచీకరణతో మా తృభాషలకు పెనుముప్పు పొంచిఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఐక్యరా జ్య సమితి సైతం హెచ్చరించినట్లు ఆయన గుర్తు చేశారు. బెంగళూరు యూనివర్సిటీ స్వర్ణోత్సవాల సందర్భంగా ‘దక్షిణాది రాష్ట్రాల భా షా సాహిత్యం - తులనాత్మక పరి శీలన’ అనే అంశంపై స్థానిక జ్ఞాన జ్యోతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించి మాట్లాడారు. తెలుగు, కన్నడం, తమిళం, మళయాలం భాషలు చాలా ప్రాచీణమైనవని తెలిపారు. తెలుగు, కన్నడ భాషలకు అవినాభావ సంబంధముందని అన్నారు. ప్రస్తుత సమాజంలో నాలుగు భాష మనుగడ గురించి ఆలోంచాల్సిన అవసరముందని అన్నారు. ఆంగ్లంతో పాటు మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మాతృభాషలకు ముప్పు వాటిల్లుతున్న తరుణంలో అందరూ సమైక్యంగా ఎదుర్కొవాలని పిలుపునిస్తున్నారని, అయితే ఆచరణలో విఫలమవుతున్నారని విమర్శించారు. చిత్తశుద్ధితో ఏకతాటిపై పోరాటం సాగిస్తే తప్పా మాతృభాషను కాపాడుకోలేమని అన్నారు. పోరాటాలతోనే కన్నడ, తెలుగు భాషలకు స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక హోదా లభించాయని గుర్తు చేశారు. అయితే హోదా ఫలితాలు ఆశాజనకంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు ద్రావిడ యూనివర్సిటీని స్థాపించి దాని పటిష్టతకు కృషి చేయడం జరిగిందని తెలిపారు. ఈ వర్సిటీని సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. దక్షిణాది నాలుగు భాషలను గూగుల్ సాయంతో ఇంటర్నెట్లో ప్రవేశపెట్టే ఆలోచన చేయాలన్నారు. ఆచార్య సిద్దలింగయ్య మాట్లాడుతూ.... నాలుగు బాషలపై తులనాత్మక అధ్యయనం చేయడం హర్షణీయమని అన్నారు. తెలుగు, కన్నడను ఏకలిపిగా చేయాలని ఈ సందర్బంగా ఆంధ్ర, తెలంగాణా, కర్ణాటక ప్రభుత్వాలకు సాహితీవేత్తలు మనవి చేయాలని కోరారు. అనంతరం సామాజిక విశ్లేషకుడు తెలకపల్లి రవి మాట్లాడుతూ కర్ణాటక అంటే గుర్తుకు వచ్చేది వీరశైవం, పంప మహాకవి అని అన్నారు. కల్బుర్గి లాంటి సాహితీవేత్తను హత్యచేయడం విషాదకరమన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు సుదీర్ఘచరిత్ర ఉందని వీటిని కాపాడుకోవాలసిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. అనంతరం ‘దక్షిణాది రాష్ట్రాల భాషాసాహిత్యం - తులనాత్మక పరిశీలన’ సావనీర్‌ను ఆవిష్కరించారు. సాహితీ వేత్త తంగిరాలసుబ్బారావును మండలిబుద్దప్రసాద్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బెంగళూరు యూనివర్శిటీ వైస్‌చాన్సలర్ బి.తిమ్మేగౌడ, సెమినార్ డెరైక్టర్ ఆచార్య కె.ఆశాజ్యోతి, కాత్యాయని విదుమహి, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎలా కొలవాలి?
2011 జులైలో ఐక్యరాజ్యసమితి ఒక చారిత్రాత్మక తీర్మానం చేసింది. అదేమిటంటే.. సభ్యదేశాలు తమ పౌరుల సంతోషాన్ని కొలిచే ప్రక్రియ చేపట్టి అందుకు అనుగుణంగా తమ ప్రభుత్వాల విధానాలను రూపొందించుకోవాలని. అదే సందర్భంలో ‘హ్యాపీనెస్ అండ్ వెల్ బీయింగ్’ అనే అంశంపై 2012లో భూటాన్ ప్రధాన మంత్రి అధ్యక్షతన ఐక్యరాజ్యసమితి ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అప్పుడే ‘వరల్డ్ హ్యాపీనెస్’ అనే దానిపై తొలిసారిగా నివేదిక వెలువడింది. తర్వాత కొద్దినెలలకు ఓఈసీడీ (గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఆర్థిక, సాంఘిక, పర్యావరణ సవాళ్లను సమష్టిగా ఎదుర్కొనేందుకు ఏర్పడిన ఒక సంస్థ. ఇందులో 34 దేశాలకు సభ్యత్వం ఉంది) అనే ఫోరం సంతృప్తికరమైన జీవనాన్ని కొలవడానికి అంతర్జాతీయ ప్రమాణాలతో కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. నిత్య సంతోషం సాధ్యమా? ఫలానా వ్యక్తి సంతోషంగా ఉన్నాడనేందుకు కొలమానమేమిటి? సంతోషమనేది రెండు విధాలు. ఒకటి భావోద్వేగానికి సంబంధించినదయితే, జీవితం మొత్తానికి లేదా జీవితాంతం సంతోషంగా ఉండడమనేది రెండోది. మీరు సంతోషంగా ఉన్నారా అనేదానికి సంబంధించి వేసే వివిధ ప్రశ్నలకు ఒకవేళ వ్యక్తుల సమాధానం రొటీన్‌గా ఉంటే హ్యాపీనెస్.. అంటే ఏమిటో పూర్తిగా అవగతం అవ్వదు. అలాగే దుర్భర దారిద్య్రంలో ఉన్నవాడు భావావేశంతో (ఆశ నెరవేరినప్పుడు కలిగే ఆనందం) ఇచ్చే సమాధానం అంతవరకే పరిమితం. మరి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే స్థితిని పొందడానికి ఏం చేయాలి? ప్రకృతి కూడా సంతోషంగా లేదు! సంతోషానికి అనేక నిర్వచనాలు ఉండవచ్చు. కానీ మన ఆలోచనలు, చేసే పనుల (మంచీ చెడు)ను బట్టి సంతోషమో, దుఃఖమో కలుగుతాయన్నది కూడా కరెక్టే. కానీ ఈభూగోళంపై ఏ ప్రాణి సంతోషంగా లేదనీ, మనిషి సరేసరి.. పశుపక్ష్యాదులు, చివరికి ప్రకృతి కూడా సంతోషంగా లేద న్నది వాస్తవం. నిజానికి ఇది మనిషి తనకుతాను వేసుకుంటున్న శిక్ష. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మారిన జీవన విధానం, మానవ సంబంధాల పట్ల నిర్లిప్తత తదితర లోపాలే శాపాలుగా మారడంతో సంతోషానికి కొలమానాలు వెతకాల్సిన దుస్థితి ఏర్పడింది. అందుకే ప్రకృతిని సంతోషంగా ఉంచితే మనిషీ సంతోషంగా ఉంటాడు. - ఎం.జి.నజీర్ -
అమంగళం
సాక్షి, కర్నూలు: నేటి యువత నడతపైనే రేపటి సమాజ భవిత ఆధారపడి ఉంది. వీరంతా సన్మార్గంలో పయనించినప్పుడే దేశ పురోగతి సాధ్యమవుతుంది. గ్లోబలైజేషన్ ప్రభావం.. మారుతున్న పరిస్థితులతో చదువుపై ఏకాగ్రత లోపించి ఎంతో మంది పెడదోవ పడుతున్నారు. చైతన్య లోపం.. ఒత్తిడితో జీవితం నరకప్రాయం చేసుకుంటున్నారు. ప్రేమలో పడటం.. వైఫల్యంతో ఆత్మహత్యకు పాల్పడటం ఇందులో భాగమే. ఇలాంటి వారందరికీ దిశానిర్దేశం చేయడంతో పాటు జీవితాన్ని చిక్కదిద్దేందుకు 2013 ఏప్రిల్‌లో యువ క్లినిక్‌లు ఏర్పాటయ్యాయి. జిల్లాలోని ఆదోని, నంద్యాల ప్రాంతీయ ఆసుపత్రులతో పాటు పలు ప్రాథమిక, క్లస్టర్ ఆరోగ్య కేంద్రాల్లో 46 క్లినిక్‌లను నిర్వహిస్తున్నారు. జిల్లా మొత్తం మీద 20 మంది ఐసీటీసీ కౌన్సిలర్లు ఉండగా.. వీరు లేని చోట పీహెచ్సీ. సీహెచ్‌సీల వైద్యాధికారులే కౌన్సెలింగ్ ఇచ్చేలా ఆదేశించారు. ఆయా ఆసుపత్రుల్లోని వైద్యులు, ఐసీటీసీ సిబ్బంది వీటి ద్వారా పదేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు బాలలు, యువతకు కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. తొలుత ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు నిర్వహించాలని భావించినా.. క్షేత్ర స్థాయి ఇక్కట్ల దృష్ట్యా ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు యువ క్లినిక్‌ల నిర్వహణకు సమయం కేటాయించారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ కేంద్రాలు ప్రస్తుతం బోర్డులకే పరిమితమవడం గమనార్హం. ఇప్పటి వరకు ఎంత మందికి కౌన్సెలింగ్ నిర్వహించారనే సమాచారం కూడా అధికారుల వద్ద లేకపోవడం వీటి నిర్వహణ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. కనీసం రికార్డుల నిర్వహణ కూడా లేకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం. ఇదేమని వైద్య సిబ్బందిని అడిగితే కౌన్సెలింగ్‌కు ఎవరూ రావడం లేదనే సమాధానం వస్తోంది. జవహర్ బాల ఆరోగ్య రక్ష ద్వారా పాఠశాలల్లో పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇబ్బందులుంటే ఈ కేంద్రాల్లో కౌన్సెలింగ్ చేపట్టాలి. స్థానిక ఆసుపత్రుల్లో తగ్గని వ్యాధులుంటే గుర్తించి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులకు పంపాలి. అయితే క్లినిక్‌లో ఆ స్థాయిలో సేవలందించే పరిస్థితి కరువైంది. కౌన్సెలింగ్ నిర్వహణకు ప్రత్యేక గది కేటాయించాల్సి ఉన్నా ఆ ఏర్పాట్ల ఊసే కరువైంది. చిప్పగిరి ప్రాథమిక ఆసుపత్రిలో కంప్యూటర్ గదిని.. ఆదోని ఏరియా ఆసుపత్రిలో ఐసీటీసీ సెంటర్‌ను క్లినిక్‌గా వినియోగిస్తున్నారు. మూడు నెలలకోసారి కేంద్రాల నిర్వహణకు రూ.10వేల చొప్పున మంజూరు చేయాల్సి ఉండగా.. మొదట్లో రూ.15వేల చొప్పున ఇచ్చిన నిధులతోనే సరిపెట్టారు. ఈ ఏడాది బడ్జెట్ విడుదల చేసినట్లు చెబుతున్నా.. పంపిణీకి నోచుకోకపోవడంతో కౌన్సెలింగ్ అటకెక్కింది. -
గ్లోబల్ నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలి!!
గెస్ట్ కాలమ్ ప్రపంచీకరణతో.. దేశాల మధ్య వ్యాపార, వాణిజ్యపరమైన సరిహద్దులు తొలిగిపోతున్నాయి. ఒక దేశంలోని కంపెనీలు.. తమ కార్యకలాపాలను ఇతర దేశాలకు విస్తరించడం.. స్వయంగా సంస్థలు నెలకొల్పడం సర్వసాధారణంగా మారింది. ఈ పరిస్థితుల్లో కంపెనీల అవసరాలకు తగ్గట్టు విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకత కూడా పెరుగుతోంది. ఇందుకు ఇన్స్టిట్యూట్ల మధ్య ఎక్సే ఛంజ్ ప్రోగ్రామ్‌లు, సహకారం దోహదం చేస్తాయి అంటున్నారు.. వాషింగ్టన్ యూనివర్సిటీ- సెయింట్‌లూయిస్, ఛాన్సలర్ మార్క్ ఎస్.రింగ్టన్. జేఎన్‌యూ, టిస్, ఐఐటీ-ముంబైలతో కలిసి పలు ప్రోగ్రామ్స్ అందిస్తున్న వాషింగ్టన్ యూనివర్సిటీ... తాజాగా ఐఐటీ-ముంబైతో కలిసి సంయుక్తంగా ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో.. మార్క్ ఎస్.రింగ్టన్తో ప్రత్యేక ఇంటర్వ్యూ.. అంతర్జాతీయ పరిస్థితులపై అవగాహన అవసరం ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. అవుట్సోర్సింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అవుట్సోర్సింగ్ చేసే సంస్థలు తమ స్వదేశీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే కార్యకలాపాలు జరుపుతాయి. కాబట్టి భవిష్యత్తులో రాణించాలనుకునే విద్యార్థులు గ్లోబల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. ముఖ్యంగా విదేశీ విద్య, ఉద్యోగాల ఔత్సాహికులకు ఇవి చాలా అవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే.. దేశమేదైనా అంతర్జాతీయ స్థాయిలో పరిశ్రమల అవసరాలు, సామాజిక పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకోవడం ఇప్పుడు కెరీర్ పరంగావిద్యార్థులకు తప్పనిసరిగా మారింది. భారతదేశంలో ఎంతో అనుకూలం భారత్‌లోని ఐఐటీలు, ఐఐఎంల వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లలో విద్యను అభ్యసించినవారు అమెరికాలో కీలక పదవులు పొందుతున్నారు. ముఖ్యంగా బోధన రంగంలో ప్రొఫెసర్లుగా, శాస్త్రవేత్తలుగా అంతర్జాతీయంగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన సమస్య ఏమిటంటే.. విద్యార్థులకు అంతర్జాతీయ అవసరాలు, అవకాశాలపై తగినంత అవగాహన లేకపోవడం. ఈ సమస్యలకు పరిష్కారమే గ్లోబల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్. అందుకే వాషింగ్టన్ యూనివర్సిటీ - సెయింట్‌లూయిస్ తరఫున భారత్‌లోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్, ఐఐటీ-ముంబైలతో కలిసి జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు అందిస్తున్నాం. జేఎన్‌యూ, టిస్లతో ఎప్పటి నుంచో ఎక్స్ఛేంజ్ ఒప్పందం అమలవుతోంది. తాజాగా ఐఐటీ-ముంబైతో కలిసి సంయుక్తంగా ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాం. 18 నెలల వ్యవధి ఉండేలా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఈ కోర్సును రూపొందించాం. ఇందులో చేరిన అభ్యర్థులు మా క్యాంపస్‌లో రెండు వారాల ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. దీనివల్ల అమెరికాలోని మేనేజ్మెంట్ రంగ అవసరాలపైన అవగాహన లభిస్తుంది. ప్రయోజనాలెన్నో అకడమిక్, ఇండస్ట్రీ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లతో విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. రెండు సంస్థల మధ్య ఉన్న ఒప్పందాల కారణంగా.. ఇరు దేశాల్లోని పరిస్థితులకు అనుగుణమైన నైపుణ్యాలు పొందే విధంగా శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైంది.. భవిష్యత్తులో విదేశీ కొలువు కోరుకునే వారికి ఈ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌ను ఎంట్రీ పాయింట్స్‌గా పేర్కొనొచ్చు. అంతేకాకుండా ఇతర దేశాల కోణంలో అధ్యయనం, పరిశోధన తదితర అవకాశాలు లభిస్తాయి. భారత్, అమెరికా.. అకడమిక్ వ్యత్యాసాలు అకడమిక్ పరంగా రెండు దేశాల మధ్య ప్రధాన వ్యత్యాసం.. ప్రాక్టికల్ లెర్నింగ్, ఫ్లెక్సిబుల్ అప్రోచ్. భారత్‌లో ఇది కొంత తక్కువగా ఉంది. కానీ.. వ్యక్తిగతంగా చక్కటి నైపుణ్యాలు కలిగిన విద్యార్థులు ఎందరో ఉన్నారు. వారికి ప్రాక్టికల్ నైపుణ్యాలు అందించేలా బోధనలో మార్పులు తీసుకొస్తే మరింతగా రాణిస్తారు. మా యూనివర్సిటీలోనే వందల సంఖ్యలో భారతీయ విద్యార్థులు, ప్రొఫెసర్లు ఉన్నారు. అకడమిక్‌గానూ మంచి ప్రతిభ చూపుతున్నారు. విభిన్న దేశాలు, సంస్కృతుల నుంచి వచ్చిన సహచరులతో కలిసిపోయే విషయంలోనే కొంత ఇబ్బందిపడుతున్నారు. ఈ సమస్యను విద్యార్థులే స్వయంగా అధిగమించాలి. కేవలం అమెరికా అనే కాకుండా.. ఏ దే శాన్ని ఎంచుకున్నా.. అక్కడి సామాజిక, సాంస్కృతిక అంశాలపై ముందుగానే ఒక అవగాహన ఏర్పరచుకుంటే.. అక్కడకు వెళ్లాక ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగొచ్చు. నిబంధనలు కొంత కఠినమే కానీ.. అమెరికాను గమ్యంగా ఎంచుకున్న విదేశీ విద్యార్థులు.. నిబంధనల పరంగా ఇబ్బంది పడుతున్నారనే అభిప్రాయాలు వాస్తవమే. అయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల విద్యార్థులకు అమెరికా టాప్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది. ఈ క్రమంలో.. కొన్ని పరిమితులు విధించడం, ఆ మేరకు నిబంధనలు రూపొందించడం సహజమే. ఇటీవల కాలంలో అమెరికాలోని ఎన్నో యూనివర్సిటీలు ‘స్టూడెంట్-ఫ్రెండ్లీ’ విధానంలో నిబంధనలను సడలిస్తున్నాయి. విద్యార్థులకు ఎదురవుతున్న సమస్య అంతా వీసా సమయంలోనే! వాషింగ్టన్ అకార్డ్‌తో లాభాలు వాషింగ్టన్ అకార్డ్ అనేది.. ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి ఆయా దేశాల అకడమిక్ నియంత్రణ సంస్థల మధ్య జరిగే ఒప్పందం. ఒక దేశంలోని ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ల కోసం ఈ ఒప్పందంపై సంతకం చేస్తే.. ఇప్పటికే ఈ జాబితాలో ఉన్న అన్ని దేశాల్లోనూ సదరు ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లకు గుర్తింపు లభిస్తుంది. ఇటీవలే భారత్ కూడా ఈ జాబితాలో చేరింది. దీనివల్ల భారత్‌లోని ఎన్బీఏ అక్రెడిటేడ్ ఇంజనీరింగ్ కోర్సులకు వాషింగ్టన్ అకార్డ్‌లో సంతకాలు చేసిన 17 దేశాల్లో గుర్తింపు దక్కుతుంది. దీనివల్ల విద్యార్థులు అంతర్జాతీయ అవకాశాలు పొందొచ్చు. పరిశోధనలు పెరగాలంటే భారత్‌లో పరిశోధన కార్యకలాపాలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. ఇది ఆహ్వానించదగిన పరిణామం. అయితే వీటిని మరింత విస్తృతం చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఇందుకోసం ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీలు జాయింట్ ప్రోగ్రామ్స్, ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ కు ప్రాధాన్యమివ్వాలి. ముఖ్యంగా అమెరికా, భారత్‌లు కలిసి సంయుక్తంగా పరిశోధనలు చేస్తే భవిష్యత్తులో అత్యున్నత ఆవిష్కరణలకు మార్గం ఏర్పడుతుంది. ప్రస్తుతం వాషింగ్టన్ యూనివర్సిటీ.. ఐఐటీ-ముంబైలు సంయుక్తంగా సోలార్ ఎనర్జీ రీసెర్చ్ చేపడుతున్నాయి. వీటికి అమెరికా, భారత్ ప్రభుత్వాల ఇంధన శాఖల సహకారం కూడా ఉంది. ఇలాంటి అవకాశాలను మరింత పెంచాలి. అమెరికాలో చదవాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు నా సలహా.. వర్క్ హార్డ్, బీ ప్రాక్టికల్.. నెవర్ డిజప్పాయింట్! అమెరికాలో ఉన్నత విద్య అధిక శాతం ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యమిస్తుంది. కాబట్టి విద్యార్థులు కష్టించే తత్వం, ప్రాక్టికల్ దృక్పథం అలవర్చుకోవాలి. కొత్త వాతావరణంలో త్వరగా ఇమిడిపోయే విధంగా మానసిక సంసిద్ధత ఉండాలి. అమెరికాను గమ్యంగా ఎంచుకోవడం వెనుక ఉన్న లక్ష్యాన్ని నిరంతరం గుర్తు చేసుకోవాలి. -
పాత విత్తనమే ప్రాణం
మన విత్తనం.. మన సంస్కృతి.. 206 వంగడాలను సాగు చేస్తున్న అరకు గిరిజనులు విశాఖ రైతుబజార్లలో గిరిజన సేంద్రియ ఆహారోత్పత్తులకు గిరాకీ ప్లాంట్ జీనోమ్ సేవియర్ కమ్యూనిటీ అవార్డుతో గౌరవించిన కేంద్ర విత్తనం మన సంస్కృతి.. విత్తనం మన ఉనికి! వ్యవసాయక సమాజంలో వేలాది ఏళ్లుగా పొలం నుంచి పొలానికి, రైతు నుంచి రైతుకు, తరం నుంచి తరానికి అందివస్తున్న అమూల్య సంపద విత్తనం. ప్రపంచీకరణ పుణ్యమా అని కంపెనీల విత్తనం విజృంభిస్తున్న తరుణంలోనూ సంప్రదాయ విత్తనాలను ప్రాణానికి ప్రాణంగా కాపాడుకుంటున్నారు విశాఖ మన్యంలోని ఆదివాసీ రైతులు. విత్తన సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకుంటున్నారు. వీరి కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ‘ప్లాంట్ జీనోమ్ సేవియర్ కమ్యూనిటీ అవార్డు’ను ఇచ్చింది. విత్తనం బహుళజాతి కంపెనీల సొత్తుగా మారుతున్న ఈ కాలంలో ఈ గిరిజనం వెలుగుబాట చూపుతుండడం విశేషం. నాగరికతకు మూలం వ్యవసాయమైతే.. వ్యవసాయానికి జీవం రైతుల సొంత విత్తనం. అడవి బిడ్డలే అనాదిగా విత్తన పరిరక్షకులు. సామాజికంగా ఎంత ‘అభివృద్ధి’ జరిగినా ఇప్పటికీ.. పాత విత్తనమే తమకు, నేలతల్లికీ బలమంటున్నారు అరకు ప్రాంత గిరిజన రైతాంగం. విశాఖపట్నం జిల్లాలోని ఒడిశా సరిహద్దుల్లోని అరకు కొండ ప్రాంతం.. మనోహరమైన ప్రకృతి సౌందర్యానికి ఆలవాలం. డుంబ్రిగుడ, హుక్కుంపేట మండలాల్లోని 5 పంచాయతీలు సంప్రదాయక పంటలకు పెట్టని కోటలు. సుసంపన్నమైన సంప్రదాయక వ్యవసాయ సంస్కృతికి ఈ గిరిజన రైతుల జీవనశైలి అద్దం పడుతుంది. వీరికి వ్యవసాయం అంటే ఎక్కువ రాబడినిచ్చే వ్యాపకం కానే కాదు. వ్యవసాయం అవిచ్ఛిన్నంగా సాగిపోయే ఒక జీవన విధానం. వైవిధ్యభరతమైన సంప్రదాయ వంగడాలను అనాదిగా సేకరిస్తూ, వాటి ప్రయోజనాన్ని గుర్తెరిగి తరతరాలుగా సాగు చేస్తుండడం వీరి సంప్రదాయ విజ్ఞానానికి, విజ్ఞతకు నిదర్శనం. 206 పాత పంటలు.. వరిలో 13 రకాల వంగడాలున్నా వేటి ప్రయోజనం వాటికి ఉంది! వీటితోపాటు 8 రకాల రాగులు, 7 రకాల సామలు, 5 రకాల జొన్నలు, 5 రకాల కొర్రలు, 8 రకాల చిక్కుళ్లు, 5 రకాల కందులతోపాటు గంటెలు(సజ్జలు), మొక్కజొన్న, వెల్లుల్లి, ఉల్లి, పసుపు, క్యారెట్, గుమ్మడి, ఆనప, ఆగాకర, బీర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పనస, బంగాళదుంప, తెల్లదుంప, ఎర్రదుంప తదితర 206 పాత పంటలను దాదాపు 5 వేల ఎకరాల్లో పండిస్తున్నారు. మలివలస గ్రామంలో 203, దేముడువలసలో 197 రకాల పాత పంటలు సాగులో ఉండడం విశేషం. కొండ వాలు పొలాల్లో అధిక వర్షాలను తట్టుకొని పండేవి కొన్నయితే.. నీటి వసతి ఉన్న మైదాన ప్రాంత పొలంలో పండేవి మరికొన్ని. దిగుబడి ఎంత వస్తున్నదనే దానితో నిమిత్తం లేకుండా.. ఇన్ని పంటలను ప్రతి ఏటా సాగు చేస్తుండడం విశేషం. అయితే, గిరిజన యువతలో పాతపంటలపై చిన్న చూపు గూడుకట్టుకుంటున్న దశలో కోటనందూరు మండలం ఇండుగపల్లి గ్రామానికి చెందిన పచారి దేవుళ్లు 15 ఏళ్ల క్రితం దృష్టిసారించి ఉండకపోతే ఇక్కడి పాత పంటల ప్రాభవం కొంత మసకబారిపోయేది. సంజీవని రూరల్ డెవలప్మెంట్ సొసైటీని నెలకొల్పిన దేవుళ్లు 90 గ్రామాల్లోని 3,215 గిరిజన కుటుంబాలలో చైతన్యం కలిగించేందుకు కృషి చేస్తున్నారు. పాత విత్తనాల జాతరతో కొత్త ఉత్సాహం! గత పదేళ్లుగా ఏటా పాత విత్తనాల జాతర నిర్వహించడం.. పంటలను స్థానిక సంతల్లో అయినకాడికి అమ్ముకుంటున్న గిరిజన రైతులను విశాఖ రైతుబజార్లకు అనుసంధానం చేయడంతో గిరిజన రైతుల్లో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంది. 420 మంది గిరిజన రైతులు 150 కిలోమీటర్ల దూరంలోని రైతుబజార్లకు తీసుకొచ్చి తాము పండించిన అమృతాహారాన్ని విక్రయిస్తున్నారు. గిరిజన గ్రామాల్లో 38 వరకు ధాన్యం బ్యాంకులు ఏర్పాటయ్యాయి. తమ అవసరాలకు మించి పండించిన ధాన్యాలను వీటిల్లో దాచుకోవచ్చు లేదా అమ్మవచ్చు. ఇవి గిరిజనులను కష్టకాలంలో ఆదుకుంటున్నాయి. పంటలు పండకపోయినా, పెళ్లిళ్లు వంటి అవసరాలు వచ్చినా ఈ బ్యాంకుల నుంచి ధాన్యం తీసుకోవచ్చు. హెదరాబాద్లోని జాతీయ పంటల జన్యువనరుల పరిరక్షణ సంస్థకు చెందిన ముఖ్య శాస్త్రవేత్త డా. బలిజేపల్లి శరత్‌బాబు ఈ ప్రాంత పాత పంటల జీవవైవిధ్య వైభవాన్ని నమోదు చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. ఆ తర్వాత గిరిజన రైతులకు ప్రతిష్టాత్మకమైన ప్లాంట్ జీనోమ్ సేవియర్ కమ్యూనిటీ అవార్డు (2011-12) దక్కింది. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా గత ఏడాది మే 22న రూ. పది లక్షల నగదు, ప్రశంసాపత్రాన్ని వీళ్లు న్యూఢిల్లీలో అందుకున్నారు. మన రాష్ర్టవాసులకు ఈ అరుదైన గౌరవం దక్కడం ఇదే ప్రథమం.గిరిజనులు పాత పంటల్లోని ఔషధగుణాలను గుర్తెరిగి వినియోగిస్తుండడం విశేషం. బాలింతకు పెద్దసామల గంజి తాపుతారు. బోడ్దాన్ అనే రకం బియ్యం వండి పెడతారు. నూతన వధూవరులకు పసుపు సన్నాల బియ్యం వండిపెడతారు. వర్షాకాలం జబ్బుపడిన వారికి బలవర్ధకమైన ఊదల గంజి ఇస్తారు. పోదు, గదబ, పూర్జ, కొండదొర జాతుల ఆదివాసులు చౌకదుకాణాల్లో ఇచ్చే బియ్యం తినరు. ఇప్పటికీ పూర్తిగా తమ సంప్రదాయ ఆహారాన్నే తింటారు! అరకు గిరిజన రైతులు విత్తన సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకుంటున్నారు. - సైమన్ గునపర్తి, న్యూస్‌లైన్, విశాఖపట్నం సిటీ (ద్వారకానగర్) (మే 22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా..) పిల్లలను సాకినంత ఆనందం.. ప్రకృతిసిద్ధంగా పండించటమే మా సంప్రదాయం. సంజీవిని సంస్థ అండతో పప్పుదినుసులు, పసుపు, అల్లం, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు పండిస్తున్నాం. ఎలా నాటాలో వాటికి కావాల్సిన సేంద్రియ ఎరువులు సొంతంగా ఎలా తయారు చేసుకోవాలో నేర్పించారు. వ్యవసాయం చేయడం అంటే పిల్లలను సాకినంత ఆనందంగా ఉంటుంది. -పండన్న, అరకు కూరగాయల రైతుల సంఘం సభ్యుడు, కిలోగుడ, విశాఖ జిల్లా అంతరిస్తున్న వంగడాలపై దృష్టి మన విత్తనాల కన్నా బయటి విత్తనాలే మంచివనే దురభిప్రాయం గతంలో కొందరు గిరిజనుల్లో ఉండేది. సేంద్రియ వ్యవసాయం పట్ల, పాత విత్త నాలను నిలబెట్టుకోవడం పట్ల ఆసక్తిని పెంచడానికి మొదట్లో మా సంస్థ చాలా కష్టపడవలసి వచ్చింది. ఏటా జరుపుతున్న పాత విత్తనాల పండగ ద్వారా అవగాహన పెరిగింది. అంతరించిపోతున్న అనేక వంగడాలను గుర్తించి, వాటిని సాగులోకి తెస్తున్నాం. ఉదాహరణకు.. సంకణాలు అనే అరుదైన నూనె గింజలను ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తోడ్పాటుతో రైతుల చేత సాగు చేయిస్తున్నాం. కనుమరుగైన పెసర, కొన్ని వరి వంగడాలను కూడా ఈ ఏడాది సేకరించి రైతులతో సాగు చేయిస్తున్నాం. - పి. దేవుళ్లు(98492 05469), కార్యదర్శి, సంజీవిని, కిలోగుడ, విశాఖ జిల్లా -
గ్లోబలైజేషన్‌తో సాఫ్ట్‌వేర్‌కు పెరిగిన ప్రాధాన్యం
మేడ్చల్ రూరల్, న్యూస్‌లైన్: గ్లోబలైజేషన్‌తో సాఫ్ట్వేర్ రంగానికి ప్రాధాన్యత పెరిగిందని రెడ్హట్ సాఫ్ట్వేర్ సంస్థ ట్రైనింగ్ సర్వీసెస్ భారతదేశ హెడ్ సుధీర్ భాస్కరన్ పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కండ్లకోయ సమీపంలో ఉన్న సీఎంఆర్ కళాశాల క్యాంపస్‌లో రెడ్హట్ అకడమీని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. సాఫ్ట్వేర్ రంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా విద్యార్థులు ప్రావీణ్యత సాధించాలన్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు, వేతనాలు కూడా అధికంగా ఉంటాయన్నారు. రాష్ట్రంలో తమ రెడ్ హట్ సంస్థ అకడమీని సీఎంఆర్ కళాశాలలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తమ సంస్థ ద్వారా ఆర్హెచ్సీఎస్ఏ, ఆర్హెచ్సీఈ, ఆర్హెచ్సీఐడీ కోర్సులను అందిస్తామన్నారు. ఈ మేరకు కళాశాల యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకొని విద్యార్థులకు ట్రైనింగ్ మెటీరియల్‌ను అందించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ గోపాల్‌రెడ్డి, సెక్రెటరీ వసంత లత, డెరైక్టర్ రాజిరెడ్డి, డీన్ పూర్ణచందర్రావు, హెచ్ఓడీ సృజన్రాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.