దావోస్: ప్రపంచీకరణలో తర్వాతి దశ ఆర్థికంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా ఉండాలని అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. అలాగైతేనే ఆకలితో అల్లాడే ప్రజలను, క్యాంపుల్లో కాందిశీకులను లేకుండా చేయగలమన్నారు. ప్రస్తుతం స్తంభించిపోయిన ఆర్థిక వృద్ధిని మళ్లీ పట్టాల మీదికి ఎక్కించేలా ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సదస్సులో భాగంగా జరిగిన షేపింగ్ గ్లోబలైజేషన్ 4.0లో ఆయన పలు అంశాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.
నాలుగో పారిశ్రామిక విప్లవం ఇలా...
ఆర్థిక వృద్ధి జోరు పెంచే సాంకేతికతను, నవకల్పనలను అందించేలా నాలుగో పారిశ్రామిక విప్లవం ఉండాలని సత్య నాదెళ్ల చెప్పారు. ప్రజల రోజువారీ కార్యక్రమాల్లో కంప్యూటర్ ఒక భాగమైందంటూ... ప్రజలందరికీ విద్య, వైద్య అవసరాలు సక్రమంగా అందే క్రమంలో ఎదురయ్యే సమస్యలను టెక్నాలజీతో పరిష్కరించాలని చెప్పారాయన. కాగా ఈ కొత్త సాంకేతిక యుగంలో వినియోగదారులకు చాలా సేవలు ఉచితంగానో, తక్కువ ధరకో లభిస్తున్నాయని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. కాకుంటే భవిష్యత్తులో ఇది కొనసాగుతుందో లేదో చూడాలన్నారు. భారీ వ్యాపారాల వల్ల, దిగ్గజ సంస్థల కారణంగా వినియోగదారులకు చౌక ధరలకే ఉత్పత్తులు/సేవలు లభిస్తున్నాయని వివరించారు. ఉదాహరణకు గూగుల్ చాలా సేవలను ఉచితంగానే అందిస్తోందని గుర్తుచేశారు.
భారత్‌కు ఆ సత్తా ఉంది....
విమానయాన రంగంలో అంతర్జాతీయ వృద్ధిని మించిన జోరును భారత విమానయాన రంగం కొనసాగించగలదని స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా విమానాల అనుంసధానతకు, ప్రధాన ప్రపంచ కేంద్రంగా అవతరించడానికి భారత్‌కు ఇదే సరైన సమయమన్నారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలుగా వృద్ధి చెందే సత్తా భారత విమానయాన సంస్థలకు ఉందని, అందుకు కూడా ఇదే సరైన తరుణమని వివరించారు.
అపార అవకాశాలు...
నాలుగో పారిశ్రామిక విప్లవంలో భారత్‌కు అపారమైన అవకాశాలున్నాయని డీఐపీపీ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్)కార్యదర్శి రమేశ్ అభిషేక్ చెప్పారు. దీని కోసం భారత్ కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలని, త్వరిత గతిన విధాన నిర్ణయాలు తీసుకోవలసి ఉందని పేర్కొన్నారు. కాగా ఇండస్ట్రీ 4.0ను అందుకునే సత్తా భారత్‌కు ఉందని డెలాయిట్ గ్లోబల్ సీఈఓ పునీత్ రంజన్ పేర్కొన్నారు.
స్వేచ్ఛా వాణిజ్యాన్ని స్వాగతిస్తాం
స్వేచ్ఛా వాణిజ్యాన్ని స్వాగతిస్తామని స్విట్జర్లాండ్ అధ్యక్షుడు యూఈల్ మౌరెర్ చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న సమస్యలపై ప్రపంచ నాయకుల మధ్య బహిరంగ చర్చ జరగాలని పిలుపునిచ్చారు. డబ్ల్యూఈఎఫ్‌ను నిర్వహించడం గర్వంగా భావిస్తున్నామని, ప్రపంచ నేతలంతా కలసి చర్చించుకునేలా తోడ్పడుతున్నామన్నారు. సమస్యల పరిష్కారానికి సంప్రదింపులే ముఖ్యమని, ఎలాంటి చర్చలకైనా వేదికగా నిలవడానికి తమ దేశం సిద్ధమని స్పష్టం చేశారు. కాగా అంతర్జాతీయంగా విద్యా వ్యవస్థ సరిగ్గా లేదని, దీనిని సంస్కరించకపోతే మనం భారీ మానవతా సంక్షోభంలోకి కూరుకుపోతామని కొలంబియా కు చెందిన లాస్ సూపర్ సంస్థ వ్యవస్థాపకులు జువాన్ డేవిడ్ అరిస్టిజబాల్ పేర్కొన్నారు.
మధ్య తరగతి జనాభాయే అధికం
ఉద్యోగాలు పోతాయేమోనన్న భయాన్ని ఉద్యోగుల నుంచి పోగొట్టాలని, ఇందుకు తగిన శిక్షణ ఇవ్వటానికి వీలుగా ప్రభుత్వాలు, కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని విప్రో సీఈఓ అబిదాలి నీముచ్‌వాలా సూచించారు. విస్తరిస్తున్న టెక్నాలజీ... ఉత్పత్తి సంబంధిత సమస్యలను పరిష్కరించే అవకాశముందని నోకియా కార్పొరేషన్ సీఈఓ రాజీవ్ సూరి చెప్పారు. వ్యక్తిగత గోప్యత, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఉత్తమ విధానాలను ప్రభుత్వాలు, కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతం పేదరికంలో ఉన్న జనాభా కంటే మధ్య తరగతి జనాభా అధికంగా ఉందని విసా సీఈఓ ఆల్‌ఫ్రెడ్ ఎఫ్.కెల్లీ వ్యాఖ్యానించారు. ఫలితంగా ఆర్థిక సమ్మిళితానికి గతంలో ఎన్నడూ లేనంతటి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment