world Economic Summit
-
ఛలో దావోస్.. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అండ్ కో
భారత దేశానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ నేతృత్వంలో భారీ బృందం స్విట్జర్లాండ్ బయల్దేరింది. దావోస్ నగరంలో 2022 మే 23 నుంచి 25 వరకు జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో ఈ బృందం పాల్గొననుంది. వచ్చే ఏడాది భారత్ అధ్యక్షత జరగున్న జీ 20 దేశాల సదస్సును దృష్టిలో ఉంచుకుని దేశానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ఈ టీమ్ పని చేయనుంది. దావోస్‌కి వెళ్లిన భారత బృందంలో కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, మన్సుఖ్లాల్ మండావియా, హర్దీప్సింగ్ పూరీలతో పాటు మధ్యప్రదేశ్, తమిళనాడు, మహరాష్ట్ర, కర్నాటక, ఆంధప్రదేశ్, తెలంగాణలకు చెందిన ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొననున్నారు. ఈ సదస్సు కోసం ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్ దావోస్‌కు చేరుకున్నారు. కాగా తెలంగాణ తరఫున మంత్రి కేటీఆర్ ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ సదస్సులో మంత్రులు, ముఖ్యమంత్రులు సీనియర్ అధికారులతో పాటు ఇండస్ట్రీస్ తరఫున హరి ఎస్ భారతీయ, అమిత్ కళ్యాణి, రాజన్ భారతీ మిట్టల్, రోనీ స్క్రూవాలా, సలిల్ ఎస్ పరేఖ్లు సైతం ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో భాగం కానున్నారు. పెట్టుబడులకు భారత్‌లో ఉన్న సానుకూల అంశాలు, ఎకో సిస్టమ్, ఇక్కడి పాలసీలను వివరించనున్నారు. చదవండి: దావోస్ చేరుకున్న సీఎం జగన్ -
రేపు దావోస్‌కు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వరల్డ్ ఎకనామిక్ ఫోరం 50వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ సోమవారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. ఫోరం నుంచి కేటీఆర్ ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. 2018లో తొలిసారిగా ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. 2019లో నిర్వహించిన సదస్సుకు ఫోరం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందినా హాజరు కాలేకపోయారు. ఈ ఏడాది 50వ వార్షిక సదస్సు కావడంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఈ సదస్సు జరగనుంది. సదస్సులో భాగంగా నిర్వహించే పలు చర్చల్లో కేటీఆర్ పాల్గొని మాట్లాడనున్నారు. తెలంగాణ ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న తీరును వివరించి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలియజేయనున్నారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో కేటీఆర్ పత్యేక సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించనున్నారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, డిజిటల్ మీడియా విభాగం డైరెక్టర్ దిలీప్ కొణతం.. కేటీఆర్‌తో పాటు దావోస్‌కు వెళ్తున్నారు. సదస్సు ముగిసిన అనంతరం 24న కేటీఆర్ హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. కాగా, కేటీఆర్ ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు చూస్తున్నారు. ఆయన దావోస్‌కు బయలుదేరి వెళ్లితే సీఎం కేసీఆర్ ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించనున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఆర్థిక వృద్ధి.. అంతకు మించి!
దావోస్: అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, భారత్ మాత్రం ఈ ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతం వృద్ధి సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసినట్లు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. ఇది భారత్ సత్తాకు నిదర్శనమంటూ... తాము అంతకు మించిన ఆర్థిక వృద్ధిని సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో(డబ్ల్యూఈఎఫ్) మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పట్టణీకరణే కీలకం... భవిష్యత్తులో ఆర్థిక వృద్ధికి పట్టణీకరణ జోరే కీలకమని కాంత్ వివరించారు. వంద స్మార్ట్ సిటీల అభివృద్ధి జరుగుతోందని, ఇది పట్టణీకరణ జోరును మరింతగా పెంచగలదని పేర్కొన్నారు. ‘‘ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పన వేగవంతమైంది. సంస్కరణలు కొనసాగుతున్నాయి. దీంతో వృద్ధి మరింత జోరందుకుంటుంది. మరోవైపు ద్రవ్యోల్బ ణం, ద్రవ్యలోటు వంటి ఆర్థిక అంశాలు నియంత్రణలోనే ఉన్నాయి’’ అని ఆయన వివరించారు. వినియోగదారుడికే అగ్ర పీఠం... టెక్నాలజీ కారణంగా సరైన ఉత్పత్తులను, సేవలను వినియోగదారులకు అందించగలమని బజాజ్ ఫిన్సర్వ్ చీఫ్ సంజీవ్ బజాజ్ తెలిపారు. వినియోగదారుడికే అగ్రపీఠం అనే విధానాన్ని తాము అనుసరిస్తామని చెప్పారు. టెక్నాలజీని సరిగ్గా వినియోగించుకోవడం వల్లే వినియోగదారులకు తక్షణం రుణాలందించగలుగుతున్నామని తెలిపారు. చేయాల్సింది ఎంతో ఉంది... భారత్, చైనాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రభావం చూపడం మొదలైందని జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ చెప్పారు. అంతర్జాతీయ సంస్థలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. అమెరికా వంటి దేశాలు తమ స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ బాగా పాడైందని, దీనిని బాగుకోసం చాలా చేయాల్సింది ఉందన్నారు. అమెరికా, చైనా, భారత్‌లు ముందుండాలి: జపాన్ ప్రధాని షింజో అబె ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై మళ్లీ విశ్వాసం పెరిగేలా చూడాలని ప్రపంచ దేశాల నాయకులను జపాన్ ప్రధాన మంత్రి షింజో అబె కోరారు. ప్రపంచ వాణిజ్య సంస్థకు (డబ్ల్యూటీఓ) కొత్త జవసత్వాలు కల్పించడానికి అమెరికా, చైనా, భారత్ కృషి చేయాలని కోరారాయన. పెరిగిపోతున్న వృద్ధ జనాభా సమస్యను ఉమెనామిక్స్ (మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించడం) ద్వారా అధిగమించామని, ఓటమినే ఓడించామని పేర్కొన్నారు. తమ దేశంలో 65 ఏళ్ల వ్యక్తులు కూడా పనిచేయడానికి ముందుకు వస్తారని, వంద మంది కాలేజీ పట్టభద్రులు ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉంటే, 98 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. మిత్రులతో వ్యాపారం వద్దు: జాక్ మా వ్యాపార వీరులు పోటీ గురించి, ఒత్తిడి గురించి అస్సలు ఆలోచించరని చైనా ఆన్లైన్ దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా వ్యాఖ్యానించారు. పిల్లలు సృజనాత్మకంగా, వినూత్నంగా ఆలోచించేలా చూడాలని, యంత్రాల మాదిరిగా వాళ్లు తయారు కాకూడదని పేర్కొన్నారు. భవిష్యత్తులో యంత్రాలకు చిప్‌లుంటాయని, కానీ మానవులకు హృదయం ఉంటుందని, ఈ దిశలో విద్యావిధానాలు ఉండాలని సూచించారు. పర్యావరణ హితంగా టెక్నాలజీ ఉండాలన్నారు. వ్యాపారం కంటే స్నేహం విలువైనదని, మీ మిత్రులను ఎప్పుడూ వ్యాపారంలో కలుపుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు. -
అందరికీ ఆర్థిక వృద్ధి ఫలాలు
దావోస్: ప్రపంచీకరణలో తర్వాతి దశ ఆర్థికంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా ఉండాలని అంతర్జాతీయ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. అలాగైతేనే ఆకలితో అల్లాడే ప్రజలను, క్యాంపుల్లో కాందిశీకులను లేకుండా చేయగలమన్నారు. ప్రస్తుతం స్తంభించిపోయిన ఆర్థిక వృద్ధిని మళ్లీ పట్టాల మీదికి ఎక్కించేలా ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సదస్సులో భాగంగా జరిగిన షేపింగ్ గ్లోబలైజేషన్ 4.0లో ఆయన పలు అంశాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. నాలుగో పారిశ్రామిక విప్లవం ఇలా... ఆర్థిక వృద్ధి జోరు పెంచే సాంకేతికతను, నవకల్పనలను అందించేలా నాలుగో పారిశ్రామిక విప్లవం ఉండాలని సత్య నాదెళ్ల చెప్పారు. ప్రజల రోజువారీ కార్యక్రమాల్లో కంప్యూటర్ ఒక భాగమైందంటూ... ప్రజలందరికీ విద్య, వైద్య అవసరాలు సక్రమంగా అందే క్రమంలో ఎదురయ్యే సమస్యలను టెక్నాలజీతో పరిష్కరించాలని చెప్పారాయన. కాగా ఈ కొత్త సాంకేతిక యుగంలో వినియోగదారులకు చాలా సేవలు ఉచితంగానో, తక్కువ ధరకో లభిస్తున్నాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. కాకుంటే భవిష్యత్తులో ఇది కొనసాగుతుందో లేదో చూడాలన్నారు. భారీ వ్యాపారాల వల్ల, దిగ్గజ సంస్థల కారణంగా వినియోగదారులకు చౌక ధరలకే ఉత్పత్తులు/సేవలు లభిస్తున్నాయని వివరించారు. ఉదాహరణకు గూగుల్ చాలా సేవలను ఉచితంగానే అందిస్తోందని గుర్తుచేశారు. భారత్‌కు ఆ సత్తా ఉంది.... విమానయాన రంగంలో అంతర్జాతీయ వృద్ధిని మించిన జోరును భారత విమానయాన రంగం కొనసాగించగలదని స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా విమానాల అనుంసధానతకు, ప్రధాన ప్రపంచ కేంద్రంగా అవతరించడానికి భారత్‌కు ఇదే సరైన సమయమన్నారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలుగా వృద్ధి చెందే సత్తా భారత విమానయాన సంస్థలకు ఉందని, అందుకు కూడా ఇదే సరైన తరుణమని వివరించారు. అపార అవకాశాలు... నాలుగో పారిశ్రామిక విప్లవంలో భారత్‌కు అపారమైన అవకాశాలున్నాయని డీఐపీపీ (డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్)కార్యదర్శి రమేశ్ అభిషేక్ చెప్పారు. దీని కోసం భారత్ కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలని, త్వరిత గతిన విధాన నిర్ణయాలు తీసుకోవలసి ఉందని పేర్కొన్నారు. కాగా ఇండస్ట్రీ 4.0ను అందుకునే సత్తా భారత్‌కు ఉందని డెలాయిట్ గ్లోబల్ సీఈఓ పునీత్ రంజన్ పేర్కొన్నారు. స్వేచ్ఛా వాణిజ్యాన్ని స్వాగతిస్తాం స్వేచ్ఛా వాణిజ్యాన్ని స్వాగతిస్తామని స్విట్జర్లాండ్ అధ్యక్షుడు యూఈల్ మౌరెర్ చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న సమస్యలపై ప్రపంచ నాయకుల మధ్య బహిరంగ చర్చ జరగాలని పిలుపునిచ్చారు. డబ్ల్యూఈఎఫ్ను నిర్వహించడం గర్వంగా భావిస్తున్నామని, ప్రపంచ నేతలంతా కలసి చర్చించుకునేలా తోడ్పడుతున్నామన్నారు. సమస్యల పరిష్కారానికి సంప్రదింపులే ముఖ్యమని, ఎలాంటి చర్చలకైనా వేదికగా నిలవడానికి తమ దేశం సిద్ధమని స్పష్టం చేశారు. కాగా అంతర్జాతీయంగా విద్యా వ్యవస్థ సరిగ్గా లేదని, దీనిని సంస్కరించకపోతే మనం భారీ మానవతా సంక్షోభంలోకి కూరుకుపోతామని కొలంబియా కు చెందిన లాస్ సూపర్ సంస్థ వ్యవస్థాపకులు జువాన్ డేవిడ్ అరిస్టిజబాల్ పేర్కొన్నారు. మధ్య తరగతి జనాభాయే అధికం ఉద్యోగాలు పోతాయేమోనన్న భయాన్ని ఉద్యోగుల నుంచి పోగొట్టాలని, ఇందుకు తగిన శిక్షణ ఇవ్వటానికి వీలుగా ప్రభుత్వాలు, కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని విప్రో సీఈఓ అబిదాలి నీముచ్వాలా సూచించారు. విస్తరిస్తున్న టెక్నాలజీ... ఉత్పత్తి సంబంధిత సమస్యలను పరిష్కరించే అవకాశముందని నోకియా కార్పొరేషన్ సీఈఓ రాజీవ్ సూరి చెప్పారు. వ్యక్తిగత గోప్యత, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఉత్తమ విధానాలను ప్రభుత్వాలు, కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతం పేదరికంలో ఉన్న జనాభా కంటే మధ్య తరగతి జనాభా అధికంగా ఉందని విసా సీఈఓ ఆల్ఫ్రెడ్ ఎఫ్.కెల్లీ వ్యాఖ్యానించారు. ఫలితంగా ఆర్థిక సమ్మిళితానికి గతంలో ఎన్నడూ లేనంతటి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. -
ఉత్తమ్‌గారూ నేను ‘పప్పూ’ను కాదు..!
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు తనకు ఆహ్వానం అందలేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఘాటుగా జబాబు ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు రావాలంటూ తనకు పంపిన ఆహ్వానానికి సంబంధించిన ఈ-ఇన్విటేషన్, ఈమెయిల్ కాపీలను ఆయన వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఆహ్వానం మేరకే వెళ్లినట్లు మంత్రి కేటీఆర్ పేర్కొనడం పచ్చి బూటకమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ‘మేధో దివాళాకోరుతనానికి ప్రతీక అయిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి నాకు ఆహ్వానం అందలేదని ఆరోపిస్తున్నారు. ఆయన కోసం ఈ ఆహ్వానం కాపీలను వెల్లడిస్తున్నాను’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ఉత్తమ్‌గారూ.. నేను ‘పప్పూ’ను కాదు.. ఇప్పటికైనా మిమ్మల్ని మీరు హుందాగా కరెక్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నా’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. సదస్సుకు వెళ్లే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగానే కేటీఆర్ సైతం రిజిస్ట్రేషన్ చేసుకొని దావోస్ వెళ్లారని, కానీ ఈ విషయంలో తనకు ఆహ్వానం అందిందని ఆయన బూటకపు ప్రచారం చేసుకుంటున్నారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి గతంలో విమర్శించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనాలని కేటీఆర్‌కు ఆహ్వనం రాలేదని, అలాగే రాష్ట్రానికి రూ. వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన చెబుతున్న మాటలు కూడా పూర్తిగా అబద్ధమని ఉత్తమ్ ఆరోపించారు. Our intellectually bankrupt Telangana congress president alleges that I hadn’t received an invite from @wef For his sake, attached are the copies of e-invitation & email from WEF P.s: Uttam Kumar Garu, I am no Pappu. Hope you have the decency to correct yourself pic.twitter.com/nBl4eMlgpR — KTR (@KTRTRS) 30 January 2018 -
టాప్‌లో ‘భారత్ అంటే బిజినెస్’
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్న ‘భారత్ అంటే బిజినెస్’ హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ఎక్కువ సార్లు ప్రస్తావనకు వచ్చిన విషయంగా నిలిచింది. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రముఖంగా వినిపించిన అంశాలపై అమెరికాకు చెందిన టాక్‌వాకర్ అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ‘భారత్ అంటే బిజినెస్’ హ్యాష్‌ట్యాగ్ అత్యధికంగా 39,252 సార్లు ప్రస్తావనకు రాగా, తరువాతి స్థానాల్లో వరసగా మహిళలు(35,837), అమెరికా ఫస్ట్(31,449), సంపద(22,896), కృత్రిమ మేధ(19,018), ప్రపంచీకరణ(16,513), వాతావరణ మార్పులు(15,477)అనే హ్యాష్‌ట్యాగ్‌లున్నాయి. వ్యక్తుల పరంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (2.73 లక్షల సార్లు) అగ్ర భాగంలో నిలిచారు. ఆ తరువాత ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్, బ్రిటన్ ప్రధాని థెరిసా, జర్మన్ చాన్స్‌లర్ మెర్కెల్ ఉన్నారు. ఈసారి దావోస్ పేరు సామాజిక మాధ్యమాల్లో 20.20 లక్షల సార్లు ప్రస్తావనకు వచ్చినట్లు టాక్‌వాకర్ వెల్లడించింది. కాగా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా రికార్డు స్థాయిలో నెటిజెన్లు 10 లక్షల ట్వీట్లు చేసినట్లు సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పనిచేస్తున్న సోషల్ మీడియా సంస్థ ఒకటి వెల్లడించింది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిపబ్లిక్ డే హ్యాష్‌ట్యాగే ఎక్కువగా ప్రచారమైనట్లు పేర్కొంది. -
140 ఏళ్లు బతికేస్తాం..!
దావోస్: ఆరోగ్యరంగంలో చోటుచేసుకుంటున్న అత్యాధునిక సాంకేతిక మార్పుల కారణంగా మనిషి ఆయుర్దాయం 140 ఏళ్లకు పెరిగే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడ్డారు. మరి కొన్ని దశాబ్దాల్లోనే ఇది సాకారం కానుందన్నారు. కృత్రిమ మేథ సహకారంతో చికిత్సా విధానాల్లో విప్లవాత్మక మార్పులు జరగనున్నాయన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు నేపథ్యంలో ‘ఆరోగ్యరంగాన్ని మారుస్తున్న నాలుగోతరం పారిశ్రామిక విప్లవం’ పేరుతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కార్యక్రమంలో పాల్గొన్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. ‘ఆరోగ్యరంగంలో కృత్రిమ మేథను వినియోగించడం వల్ల వైద్య నిపుణులు త్వరితగతిన, అత్యుత్తమ ఫలితాలను పొందవచ్చు’ అని తెలిపారు. కొత్త టెక్నాలజీ వల్ల ఆస్పత్రి నిర్వహణ రూపురేఖలే మారిపోతాయనీ, సిబ్బంది సంఖ్యతో పాటు ఆస్పత్రి ఖర్చులు భారీగా తగ్గిపోతాయని వెల్లడించారు. మెడిసిన్, సాంకేతికతల కలయికతో ప్రపంచం మరింత ఆరోగ్యకరంగా మారుతుందని పేర్కొన్నారు. ‘రాబోయే కొన్ని దశాబ్దాల్లో మనుషుల సగటు ఆయుఃప్రమాణం 140 ఏళ్లకు చేరుకుంటుంది. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం పౌరుల బాధ్యతగా మారడంతో ఆస్పత్రులు కేవలం నామమాత్రంగా మారుతాయి. ప్రమాదానికి గురయ్యే రోగిని ఆస్పత్రికి తరలించేలోపే అంబులెన్సులోని వైద్య సిబ్బంది రోగి ఆరోగ్యచరిత్రను 5జీ టెక్నాలజీ సాయంతో వేగంగా సేకరించి చికిత్సను ప్రారంభిస్తారు’ అని కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నిపుణులు తెలిపారు. శరీరంలో కార్టిసాల్, గ్లూకోజ్ స్థాయిల్లో ఏమాత్రం తేడా వచ్చినా హెచ్చరించే పరికరాలను రూపొందిస్తున్నట్లు నోకియా సంస్థ అధ్యక్షుడు రాజీవ్ సూరీ వెల్లడించారు. సాంకేతికత సాయంతో నాణ్యమైన మందుల్ని వేగంగా రోగులకు అందించగలమనీ, వ్యాధుల్ని కూడా చాలాముందుగానే పసిగట్టగలమని పేర్కొన్నారు. -
దావోస్‌లో ప్రధాని మోదీ
-
దావోస్‌లో ప్రధాని మోదీ
దావోస్: ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు చేరుకున్నారు. అంతర్జాతీయ సమాజం ముందు భారత భవిష్యత్తును, వ్యాపార, పెట్టుబడి అవకాశాలను సదస్సు ప్రారంభోపన్యాసంలో మోదీ వివరించనున్నారు. ఐదురోజులపాటు జరిగే దావోస్ సదస్సులో ప్రధాని ఒకరోజు మాత్రమే పాల్గొననున్నారు. ఈ ఒకరోజు బిజీ షెడ్యూల్లోనే అంతర్జాతీయ కంపెనీల సీఈవోలతో సమావేశాలు, వివిధ దేశాధి నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. జ్యూరిచ్ చేరుకున్న మోదీకి భారత దౌత్య కార్యాలయం అధికారులు స్వాగతం పలికారు. అక్కడినుంచి బయలుదేరిన మోదీ దావోస్ చేరుకున్నారు. దావోస్‌లోనూ మోదీకి ఘన స్వాగతం లభించింది. సోమవారం రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) దాదాపు 60 అంతర్జాతీయ ప్రముఖ కంపెనీల సీఈవోలతో విందు సమావేశంలో ప్రధాని పాల్గొంటారు. ఎయిర్‌బస్, హిటాచీ, ఐబీఎం, బీఏఈ సిస్టమ్స్, కార్లిల్ గ్రూప్ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొననున్నారు. ఈ భేటీలో భారత్‌లో వ్యాపార అవకాశాలు, అనుకూల వాతావరణంపై వారికి వివరించనున్నారు. 21 ఏళ్ల తర్వాత తొలి ప్రధాని మంగళవారం ఉదయం ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేయనున్నారు. అనంతరం ప్రపంచ వ్యాపార, పరిశ్రమ వర్గాలతో మోదీ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తర్వాత స్వీడన్ ప్రధాని స్టెఫాన్ లోఫ్వెన్తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. 1997లో నాటి ప్రధాని దేవేగౌడ అనంతరం.. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటున్న తొలి భారత ప్రధానిగా ప్రధాని మోదీ నిలిచారు. ప్రపంచంలో కీలక ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్‌లో వివిధ వ్యాపారాలకున్న అవకాశాలను ఈ సదస్సులో మోదీ వివరించనున్నారు. ప్రధానితోపాటు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సురేశ్ ప్రభు, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు దావోస్ వెళ్లారు. ఆర్థిక సదస్సుకు బయలుదేరేముందు మోదీ మాట్లాడుతూ.. ‘ఇటీవలి కాలంలో ప్రపంచదేశాలతో భారత సంబంధాలు బహుముఖంగా, సమర్థవంతంగా ముందుకు సాగుతున్నాయి. ఆర్థిక, రాజకీయ, భద్రత అంశాలతోపాటు పలు ఇతర రంగాల్లోనూ బలమైన బంధాలను ఏర్పర్చుకుంటున్నాం. దావోస్‌లో అంతర్జా తీయ సమాజంతో భారత భవిష్యత్ కార్యాచరణను పంచుకుంటా’ అని మోదీ చెప్పారు. దావోస్‌లో యోగా సదస్సు కోసం దావోస్ చేరుకున్న వివిధ దేశాధినేతలు రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలపై మేథోమధనంతోపాటు యోగా లో శిక్షణ పొందనున్నారు. ఈ శిక్షణ కోసం ఇద్దరు భారతీయ యోగా ఉపాధ్యాయులు మోదీ బృందంలో భాగంగా దావోస్ చేరుకున్నారు. పంతజలి యోగా టీచర్లు.. ఆచార్య భరద్వాజ్, ఆచార్య సుమిత్‌లు ఈ వేదికపై రోజూ యోగా క్లాసులు నిర్వహిస్తా రు. భారత సంప్రదాయాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించేందుకు ఇదో అవకాశ మని బాబా రాందేవ్ ట్విటర్లో పేర్కొన్నారు. -
ఢిల్లీ బయల్దేరి వెళ్లిన చంద్రబాబు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. వరల్డ్ ఎకనమిక్ సమ్మిట్‌లో ఆయన పాల్గొంటారు. ఉదయం 9.55 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బయలుదేరిన బాబు 12 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. 12.30 గంటల నుంచి ఒంటిగంట వరకూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) డైరెక్టర్ జనరల్ ఇంద్రజిత్ బెనర్జీతో సమావేశం అవుతారు. అనంతరం వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహిస్తున్న ఇండియన్ ఎకనమిక్ ఫోరం సమావేశంలో 'యునైటింగ్ ది స్టేట్స్ ఆఫ్ ఇండియా' అనే అంశంపై ప్రసంగిస్తారు. అనంతరం బాబు కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అవుతారు. అనంతరం హైదరాబాద్ తిరిగి వస్తారు.