జ్యూరిచ్‌లో మోదీకి స్వాగతం పలుకుతున్న అధికారులు
దావోస్: ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు చేరుకున్నారు. అంతర్జాతీయ సమాజం ముందు భారత భవిష్యత్తును, వ్యాపార, పెట్టుబడి అవకాశాలను సదస్సు ప్రారంభోపన్యాసంలో మోదీ వివరించనున్నారు. ఐదురోజులపాటు జరిగే దావోస్ సదస్సులో ప్రధాని ఒకరోజు మాత్రమే పాల్గొననున్నారు. ఈ ఒకరోజు బిజీ షెడ్యూల్‌లోనే అంతర్జాతీయ కంపెనీల సీఈవోలతో సమావేశాలు, వివిధ దేశాధి నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
జ్యూరిచ్ చేరుకున్న మోదీకి భారత దౌత్య కార్యాలయం అధికారులు స్వాగతం పలికారు. అక్కడినుంచి బయలుదేరిన మోదీ దావోస్ చేరుకున్నారు. దావోస్‌లోనూ మోదీకి ఘన స్వాగతం లభించింది. సోమవారం రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) దాదాపు 60 అంతర్జాతీయ ప్రముఖ కంపెనీల సీఈవోలతో విందు సమావేశంలో ప్రధాని పాల్గొంటారు. ఎయిర్‌బస్, హిటాచీ, ఐబీఎం, బీఏఈ సిస్టమ్స్, కార్లిల్ గ్రూప్ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొననున్నారు. ఈ భేటీలో భారత్‌లో వ్యాపార అవకాశాలు, అనుకూల వాతావరణంపై వారికి వివరించనున్నారు.
21 ఏళ్ల తర్వాత తొలి ప్రధాని
మంగళవారం ఉదయం ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేయనున్నారు. అనంతరం ప్రపంచ వ్యాపార, పరిశ్రమ వర్గాలతో మోదీ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తర్వాత స్వీడన్ ప్రధాని స్టెఫాన్ లోఫ్‌వెన్‌తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. 1997లో నాటి ప్రధాని దేవేగౌడ అనంతరం.. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటున్న తొలి భారత ప్రధానిగా ప్రధాని మోదీ నిలిచారు. ప్రపంచంలో కీలక ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్‌లో వివిధ వ్యాపారాలకున్న అవకాశాలను ఈ సదస్సులో మోదీ వివరించనున్నారు.
ప్రధానితోపాటు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సురేశ్ ప్రభు, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు దావోస్ వెళ్లారు. ఆర్థిక సదస్సుకు బయలుదేరేముందు మోదీ మాట్లాడుతూ.. ‘ఇటీవలి కాలంలో ప్రపంచదేశాలతో భారత సంబంధాలు బహుముఖంగా, సమర్థవంతంగా ముందుకు సాగుతున్నాయి. ఆర్థిక, రాజకీయ, భద్రత అంశాలతోపాటు పలు ఇతర రంగాల్లోనూ బలమైన బంధాలను ఏర్పర్చుకుంటున్నాం. దావోస్‌లో అంతర్జా తీయ సమాజంతో భారత భవిష్యత్ కార్యాచరణను పంచుకుంటా’ అని మోదీ చెప్పారు.
దావోస్‌లో యోగా
సదస్సు కోసం దావోస్ చేరుకున్న వివిధ దేశాధినేతలు రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలపై మేథోమధనంతోపాటు యోగా లో శిక్షణ పొందనున్నారు. ఈ శిక్షణ కోసం ఇద్దరు భారతీయ యోగా ఉపాధ్యాయులు మోదీ బృందంలో భాగంగా దావోస్ చేరుకున్నారు. పంతజలి యోగా టీచర్లు.. ఆచార్య భరద్వాజ్, ఆచార్య సుమిత్‌లు ఈ వేదికపై రోజూ యోగా క్లాసులు నిర్వహిస్తా రు. భారత సంప్రదాయాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించేందుకు ఇదో అవకాశ మని బాబా రాందేవ్ ట్విటర్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment