
సాక్షి, హైదరాబాద్: వరల్డ్ ఎకనామిక్ ఫోరం 50వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ సోమవారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. ఫోరం నుంచి కేటీఆర్ ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. 2018లో తొలిసారిగా ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. 2019లో నిర్వహించిన సదస్సుకు ఫోరం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందినా హాజరు కాలేకపోయారు. ఈ ఏడాది 50వ వార్షిక సదస్సు కావడంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఈ సదస్సు జరగనుంది. సదస్సులో భాగంగా నిర్వహించే పలు చర్చల్లో కేటీఆర్ పాల్గొని మాట్లాడనున్నారు.
తెలంగాణ ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న తీరును వివరించి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలియజేయనున్నారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో కేటీఆర్ పత్యేక సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించనున్నారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, డిజిటల్ మీడియా విభాగం డైరెక్టర్ దిలీప్ కొణతం.. కేటీఆర్‌తో పాటు దావోస్‌కు వెళ్తున్నారు. సదస్సు ముగిసిన అనంతరం 24న కేటీఆర్ హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. కాగా, కేటీఆర్ ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు చూస్తున్నారు. ఆయన దావోస్‌కు బయలుదేరి వెళ్లితే సీఎం కేసీఆర్ ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించనున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.