
న్యూఢిల్లీ: కోవిడ్–19 అనంతర ప్రపంచంలో నూతన అంతర్జాతీయ వ్యవస్థ రూపొందాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ సంస్థల పరిమితులను కరోనా సంక్షోభం ఎత్తి చూపిందన్నారు. అలీనోద్యమ (నామ్) దేశాల నేతలతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. నిష్పక్షపాతం, సమానత్వం, మానవత్వం ప్రాతిపదికగా నూతన అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పడాల్సి ఉందని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ప్రతిబింబించే అంతర్జాతీయ వ్యవస్థలు నేటి అవసరం.
కేవలం ఆర్థిక అభివృద్ధినే కాకుండా, మానవాళి సంక్షేమాన్ని కాంక్షించే వ్యవస్థలు అవసరం. ఇలాంటి విషయాల్లో భారత్ ఎప్పుడూ ముందుంది’అన్నారు. అలీనోద్యమం దశాబ్దాల పాటు నైతిక భావనలకు గొంతుకగా నిలిచిందన్నారు. మానవాళి అత్యంత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రపంచవ్యాప్తంగా ఒక సంఘీభావ ప్రకటన అవసరమని, ఆ దిశగా సమ్మిళిత దృక్పథంతో నామ్ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కరోనాపై యుద్ధాన్ని భారత్ ప్రజాస్వామ్యయుతంగా, క్రమశిక్షణ, నిర్ణయాత్మకతలతో నిజమైన ప్రజాయుద్ధంగా మలిచిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment