గతించిన గతంపై నిరర్థక పోరు | National revolutionaries to make war of globalization | Sakshi
Sakshi News home page

గతించిన గతంపై నిరర్థక పోరు

Published Sat, Sep 19 2015 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 9:35 AM

గతించిన గతంపై నిరర్థక పోరు

గతించిన గతంపై నిరర్థక పోరు

గ్లోబలైజేషన్ తెచ్చిన మార్పులు నెహ్రూ, ఇందిరలకు కాలదోషం పట్టించేశాయి. అయినా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు వారి వెంట ఎందుకుపడ్డట్టు? ఆర్‌ఎస్‌ఎస్ హిందుత్వీకరించిన కరడుగట్టిన జాతీయవాద భావజాలాన్ని వ్యాపింపజేస్తోందే గానీ, దానికి తమవారుగా కొలువుదీరిన ఆధునిక జాతీయవాద వేలుపులెవరూ లేరు. జాతీయోద్యమానికి దూరంగా ఉండిపోయిన దానికి జాతీయ హీరోలు అవసరమయ్యారు. కాంగ్రెస్ నుంచి మాలవీయ, పటేల్‌వంటి వారిని తెచ్చుకున్నారు. భగత్‌సింగ్ నుంచి నేతాజీ వరకు జాతీయ విప్లవకారులందరినీ దొంగిలించారు.  
 
 మీరే గనుక మీ ఉద్యోగపు దరఖాస్తుల్లో స్టాంపుల సేకరణను హాబీగా పేర్కొ న్న బాపతైతే, నాలాగే మీలో చాలా మందికి కూడా మీ మొదటి ఉద్యోగంలోని కీలక విధుల్లో స్టాంపులను నాకడమూ ఒక ముఖ్యమైన పని అయి ఉంటుంది. నా వరకు నాకైతే అది రచయితలకు పారితోషికంగా చెల్లించాల్సిన రూ.75 చెక్కులను, వారి వ్యాసాల క్లిప్పింగులను కవర్లలో పెట్టి వాటి మీద స్టాంపులు అంటించాల్సిన పని. టైపురైటర్లు, సైక్లోస్టైల్, గ్రామ ఫోన్లు, నలుపు, తెలుపు దూరదర్శన్, టెలిగ్రాఫ్, మనీ ఆర్డర్లు, స్టీమ్‌ఇం జన్, దూరప్రాంతాలకు లైట్నింగ్ కాల్స్, పీపీ (ఫలానా మనిషికి) కాల్స్ లాగే స్టాంపులు కూడా మన జీవితాల్లో ముఖ్యమైన పాత్రను పోషిం చాయి. అంతేకాదు, మీరు చాలా చాలా పాత తరం మనిషని కూడా అర్థం. ప్రత్యేకించి నేడు ప్రతి ఏడేళ్లకూ తరాల అంతరం ఏర్పడుతున్న దని నా విశ్వాసం. ఒకప్పుడు ముఖ్యమైనవిగా నేను ఇక్కడ పేర్కొన్న వన్నీ, పోస్టల్ స్టాంపులుసహా ప్రజాజీవితానికి దూరమైపోయాయి. మీరీ రోజన ఎవరైనా యువకుడి తొలి ఉద్యోగ విధుల్లో కవర్ల మీద స్టాంపులు అంటించడం కూడా ఒకటని చెబితే... ‘‘నాకడమా, ఈ నాకడం ఏమిటి? స్టాంపులా, ఈ స్టాంపులేమిటి?’’ అని అడిగే అవకాశాలే ఎక్కువ.
 
 పాత శవపేటికకు కొత్త మేకు
 కనీసం రెండు తరాల భారత నవ యువ ఓటర్లకు పోస్టల్ స్టాంపుల వాడ కంలో దాదాపుగా అనుభవం ఉండి ఉండదు (తరం మార్పునకు కొలబద్ధను ఏడేళ్లుగా తీసుకుంటే). ఇక ఫిలటెలీ (స్టాంపుల సేకరణ) అనే మాటైతే దాదాపు అందరినీ గందరగోళపరుస్తుంది... ఒకవేళ వారేమైనా అమెరికన్ కళాశాలల ప్రవేశార్హతకు ప్రామాణిక పరీక్షైన ‘సాట్’కు సంసిద్ధమౌ తున్న వారైతే తప్ప. ఈమెయిల్, కొరియర్‌ల శకంలో నత్తనడక మెయిల్ చాలా వరకు ‘‘సర్కారు’’ వారి కోసమే. దేశంలో 30 ఏళ్లలోపు వయస్కులు చాలా మందే ఉంటారు. వారిలో అతి కొద్దిమంది మాత్రమే స్టాంపులు కొనడానికి పోస్టాఫీసుకు వెళ్లి ఉంటారని లేదా ఎవైరె నా ఎన్నారై అంకుల్ రాసిన ఉత్తరం మీది స్టాంపులను వదులుచేసి, తీసుకోవాలని ఉత్కంఠతో ఊపిరి బిగబట్టి చూసి ఉండరని పందెం కాస్తాను. వారంతా ఈ వారం పేపర్ల మొదటి పేజీల్లో ఇద్దరు అపరిచిత వ్యక్తుల చిత్రాలున్న స్టాంపులను ఆసక్తిగా చూసి ఉంటారు.
 
 ఇందిరాగాంధీ ఇప్పటికీ బాగా సుపరిచితురాలే. నెహ్రూ మాత్రం మరు పున పడిపోతున్న జ్ఞాపకం. ఆర్థిక విధానాల నుంచి విదేశాంగ విధానం వరకు నెహ్రూ భావాలపై నాకుండే విభేదాలు నాకున్నాయి. నెహ్రూకు సంబంధించి మణిశంకర్ అయ్యర్ పేర్కొన్న ‘‘కరడుగట్టిన’’ లౌకికవాదం నిజానికి అజ్ఞేయ వాదానికి (దేవుని ఉనికి నిజమో కాదో ఇదమిత్థంగా చెప్పలేమనే తాత్విక ధోరణి) మరో పేరు మాత్రమే. నెహ్రూ పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌కున్న తృణీకార భావం అందరికీ తెలిసిందే. అయినాగానీ, ఇప్పుడాయన భావజాలపరమైన వారసత్వాన్ని రూపుమాపుతున్నట్టుగా నటించడం కాలాన్ని వృథా చేసు కోవడమే అవుతుంది. ఇప్పటికే అది చచ్చిపోయింది, నిశ్శబ్దంగా సమాధి చేసేశారు కూడా.
 
 ఎన్నడో చనిపోయిన నెహ్రూవియనిజం శవపేటికపై మరో మేకును దిగ్గొట్టాలని ఆర్‌ఎస్‌ఎస్/బీజేపీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా పాత పోస్టల్ స్టాంపుల సిరీస్‌ను నిలిపివే యడ ం రాజకీయ పెట్టుబడిని వృథా చేసుకోవడమే. వారిని ఇది భావజాలపరమైన పోటీ విషయంలో మూర్ఖపు పట్టుదల, భ్రమాత్మక మనస్కతలతో ‘‘విజేతదే సర్వస్వమూ’’ అనే తీరున ప్రవర్తిస్తున్న ట్టుగా చూపుతుంది. అది మధ్యయుగాల నాటి దుర్మార్గవైఖరి. పాత, కనుమరుగైపోతున్న నెహ్రూవాదులను మేల్కొల్పి, ఆయన భావాలను తిరిగి చర్చకు తేవడానికి మాత్రమే తోడ్పడుతుంది. అంతేకాదు ఫిలటెలీ అనేపాత హాబీపట్ల కొంత ఆసక్తిని రేకెత్తించడం సైతం చేయవచ్చు. లండన్ స్ట్రాండ్ కూడలిలోని ప్రముఖ దర్శనీయ స్థలంగా ఉండిన స్టాన్లీ గిబ్సన్ స్టాంపుల దుకాణాన్ని మూసేయడంతో చాలా ఏళ్లక్రితమే ఆ హాబీ చచ్చిపోయిందనే మాటా నిజమేననుకోండి. పోస్టల్ స్టాంపులు నెహ్రూపట్ల, ఆయన కూతురు పట్ల ఆరాధనాభావాన్ని పెంపొందింపజేస్తున్నాయని ఆర్‌ఎస్‌ఎస్ విశ్వసిం చడమే గొప్ప ప్రజ్ఞ.
 
 కనుమరుగైన భావజాలంపై యుద్ధం
 పోస్టల్ స్టాంపులలాగే, నెహ్రూ-ఇందిర భావజాలాలు కూడా వాడుక నుంచి కనుమరుగయ్యాయి. 51 ఏళ్ల క్రితమే నెహ్రూ చనిపోయాడు. ఆయన తర్వాత వచ్చిన ప్రతి ప్రభుత్వమూ, ప్రత్యేకించి 16 ఏళ్లకు పైబడిన ఆయన కుమార్తె ఇందిర ప్రభుత్వం ఆయన వారసత్వాన్ని రూపుమాపడానికి కృషిచేశాయి. ఇందిర తాంత్రికులను ఆశ్రయించడం, ప్రత్యేక పూజలను, హోమాలను నిర్వ హించడం ప్రారంభించారు, మన స్వేచ్ఛలను హరించారు, అలీన విధానాన్ని పునర్లిఖించి, సోవియెట్ యూనియన్‌కు దాసోహానికి కుదించారు. 1971లో ఆమె బంగ్లాదేశ్‌ను విముక్తి చేశారు. కానీ అందుకు మూల్యంగా సోవియెట్ యూనియన్‌తో రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
 
 పందొమ్మిది వందల డెబ్భై, ఎనభై దశాబ్దాలలో ఇందిర తీసుకున్న వైఖరులకు, ప్రత్యేకించి అఫ్ఘానిస్థాన్‌పై సోవియెట్ దురాక్రమణపట్ల ఆమె వైఖరికి నెహ్రూ... ల్యూటెన్ రోడ్ల పేర్లను మార్చినందుకంటే ఎక్కువగా సిగ్గుపడి ఉండేవాడు. పైగా ఇందిర ఆర్థిక విధానాలు, నెహ్రూ మిశ్రమ ఆర్థికవ్యవస్థ భావనలకంటే ఎక్కువ వామపక్ష పంథాకు చెందినవి. ఆమె పరిశ్రమలను, కంపెనీలను, బ్యాంకింగ్ నుంచి ఇన్సూరెన్స్ వరకు, బొగ్గు నుంచి పెట్రోలియం, టెక్ట్స్‌టైల్స్ వరకు అన్నిటినీ వినాశకరంగా జాతీయం చేసింది. నెహ్రూ తన వరకు తాను ప్రభుత్వరంగ సంస్థలనే మహా అనర్థాలను నిర్మించినా, ప్రైవేటు పర్యాటక సంస్థలను వర్థిల్లనిచ్చాడు. ఇందిర వాటిని సైతం వదలలేదు.
 
 నెహ్రూ-ఇందిరాగాంధీల తదుపరి వారసునిగా వచ్చిన రాజీవ్‌గాంధీ కూడా ఇదే క్రమాన్ని కొనసాగించాడు. ఆయన షాబానో కేసులో జోక్యం చేసు కోవడం, బాబ్రీ మసీదు/రామజన్మభూమి తాళాలను తెరిపించడం, ఆ తద పరి శిలాన్యాస్, మండల్ కమిషన్ సిఫారసులపై ఊకదంపుడుతో నిర్ణయ రాహిత్యంగా గడపడమూ.. ఏవీ నెహ్రూకు సంతోషాన్ని కలిగించి ఉండేవి కావు. ఇందిర లేదా నెహ్రూల పట్ల పీవీ నరసింహారావు నామమాత్రపు గౌరవాన్నయినా చూపలేదు. లెసైన్స్-కోటా రాజ్‌ను ఆయన తుత్తు నియలు చేశారు, బాబ్రీ మసీదును కూలగొట్టనిచ్చారు, ఇజ్రాయెల్‌తో భారత్ సంబంధాలను పై మెట్టుకు తీసుకుపోయారు. ఆ తదుపరి, సోనియాగాంధీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఇందిర పేదరికవాదాన్ని పునరుజ్జీ వింపజేసిందే గానీ, నెహ్రూ తరహా పెద్ద డ్యామ్‌లు, భారీ పారిశ్రామిక ఎస్టే ట్‌లు, మెగా విద్యుత్ ప్రాజెక్టులు, గనుల ప్రాజెక్టులతో కూడిన బ్రహ్మాండమైన అభివృద్ధివాదాన్ని అనుమానాస్పదంగా చూసేది. నదుల అనుసంధానం వంటివాటి పట్ల సైతం అదే వైఖరిని అవలంబించింది.  
 
 జాతీయ హీరోల అన్వేషణలో...
 సాంకేతికాభివృద్ధి పోస్టల్ స్టాంపు విషయంలో చేసినట్టే... గ్లోబలైజేషన్ తెచ్చిన మార్పు నెహ్రూని, అంతకన్నా ఎక్కువగా ఇందిరను కాలదోషం పట్టించేసింది. అయినా ఆర్‌ఎస్‌ఎస్/బీజేపీలు ఇప్పుడు వారి వెంట ఎందుకు పడ్డట్టు? ఆర్‌ఎస్‌ఎస్ హిందుత్వీకరించిన కరడుగట్టిన జాతీయవాద భావజా లాన్ని వ్యాపింపజేస్తోందేగానీ, దానికి గొప్ప ఆధునిక భారత జాతీయవాదులుగా కొలువుదీరిన తమ వారైన వేలుపులెవరూ లేరు. అదే అది ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. ఆర్‌ఎస్‌ఎస్ భారత జాతీయోద్యమానికి దూరంగా ఉండిపోయిందనేది వివరంగానే స్పష్టమౌతోంది. కొన్ని విధాలుగా చూస్తే, ముస్లింలీగ్, ఆ తర్వాతి కాలంలో కమ్యూనిస్టులు కూడా దానిలాగే జాతీయోద్యమానికి దూరంగా ఉన్నారు. అందుకే ఆర్‌ఎస్‌ఎస్/బీజేపీ జాతీయ హీరోల కోసం మరెక్కడో వెతుక్సోవాల్సివస్తోంది. కాంగ్రెస్ నుంచి అరువు తెచ్చుకోగలిగిన మదన్ మోహన్ మాలవీయ, సర్దార్ పటేల్ వంటి వారిని తెచ్చుకున్నారు. ఇక భగత్‌సింగ్ నుంచి నేతాజీ వరకు మొత్తంగా జాతీయ విప్లవకారులందరినీ దొంగిలించేశారు. వారిలో కొందరు వామ పక్ష తీవ్రవాదులైనా ఫర్వాలేదనుకున్నారు. వారెవరి కోవకూ చెందని తమవాడిగా చెప్పుకోదగినది సావార్కర్ ఒక్కడే.
 
 కశ్మీర్, 1962 చైనా యుద్ధ వైఫల్యాలతో నెహ్రూని తోసిపుచ్చడం సులువే. పాకిస్తాన్‌ను యుద్ధంలో ఓడించి, అణ్వస్త్ర పరీక్ష జరిపి ఆర్‌ఎస్‌ఎస్ చెప్పే బలమైన భారతదేశమనే భావజాలాన్ని ఢీకొన్న ఇందిరే కొరకరాని కొయ్య. 2014 ఎన్నికల విజయం భావజాలపరంగా కూడా పరిపూర్తి కావా లంటే ఆమె వారసత్వాన్ని కూడా ధ్వంసం చేయాలి. ఇప్పటికింకా ఆమె పట్ల ప్రజల్లో ఉన్న ప్రశంసాభావం పూర్తిగా చెరిగిపోలేదు. ఢిల్లీలోని 1, సఫ్దర్‌జంగ్ మార్గ్‌లోని ఒకప్పటి ఇందిర నివాసాన్ని ఆమె స్మారక చిహ్నంగా మార్చారు. ఆ దారి గుండా మీరు వెళ్లేట్టయితే, ప్రత్యేకించి వారాంతాల్లో మన గ్రామాల నుంచి బస్సుల్లో అక్కడికి గుంపులు గుంపులుగా వచ్చే వారిని చూడొచ్చు. ఇందిర విధించిన అత్యవసర పరిస్థితిని ఆమెను నాశనం చేయడానికి ఇప్పుడు వాడుకుంటున్నారు.
 
 అందుకే ఇందిర, నెహ్రూల స్టాంపులను ఉపసంహరించి, ఆమెకు బద్ధ శత్రువులైన లోహియా, జయప్రకాష్ నారాయణ్‌ల స్టాంపులను విడుదల చేస్తున్నారు. వారిద్దరూ ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించిన వారనేదిగానీ, వారి నిజమైన వారసులు వచ్చే నెలలో బిహార్‌లో జరిగే ఎన్ని కల్లో బీజేపీని ఢీకొంటున్నారనేది గానీ అనవసరం. భారత జాతీయవాదాన్ని అతి మొరటుగా పునర్ నిర్వచించడానికి ఆర్‌ఎస్‌ఎస్ ఐదు దశాబ్దాల వెనక్కు వెళ్లి... శత్రువుకు శత్రువు ఆదర్శ మిత్రుడు అనే నీతిని పాటిస్తోంది. ఇక స్టాంపులంటారా, అవి ఈ పోరుకి సంబంధించిన బాధితులు మాత్రమే.
 
తాజా కలం: భావజాలపరమైన ఈ పవిత్రయుద్ధం కేవలం ఆర్‌ఎస్‌ఎస్/ బీజేపీలకే పరిమితం కాలేదు. 2005 ఫిబ్రవరి 26న పార్లమెంటు ప్రాంగ ణంలో సావార్కర్ విగ్రహావిష్కరణ జరగాల్సి ఉండగా... ఆ ఉదయాన్నే జైరాం రమేష్ ఆగ్రహ స్వరాన్ని వినాల్సివచ్చింది. వాజ్‌పేయీ ప్రభుత్వం ఒక మతోన్మాదిని, ద్రోహిని గొప్ప జాతీయ నాయకుల సరసన నిలపడం ద్వారా భారతదేశం పట్లనే అపరాధానికి పాల్పడుతోందని ఆయన అన్నారు. మా పత్రిక ఈ అంశంపై యుద్ధానికి దిగడం లేదేమని ప్రశ్నించాడు.
 twitter@shekargupta
 - శేఖర్ గుప్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement