భారత స్వాతంత్య్రోద్యమంలో తెలుగు పత్రికలు గణనీయమైన పాత్ర పోషించాయి. ‘వందేమాతరం’ ఉద్యమం నుండి ‘క్విట్ ఇండియా’ ఉద్యమం దాకా సుమారుగా నాలుగు దశాబ్దాల పాటు స్వాతంత్య్ర ఉద్యమ బాటలో నడిచాయి. మొదట్లో మత పరమైన పత్రికలు తెలుగునేలపై ఆవిర్భవించాయి. వీరేశలింగం పంతులు 1874లో ‘వివేక వర్ధిని’ పత్రికను వెలువరించడంతో తెలుగు సమాజంలో నూతన శకం ఆరంభమైంది. 20వ శతాబ్దం ప్రారంభం నాటికి తెలుగు పత్రికా రంగం వికాస దశను అందుకుంది. ఈ దశలో అవి ప్రజల్లో ఒక వంక ఆంధ్రాభిమానాన్నీ, మరో వంక జాతీయ భావాన్నీ పెంపొందించాయి.
కొండా వెంకటప్పయ్య వంటి దేశభక్తుల కృషి ఫలితంగా ‘కృష్ణా జిల్లా సంఘం’ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో నెలకొన్న ‘కృష్ణా పత్రిక’ (1902) తెలుగు పత్రికా రంగంలో ఒక మైలు రాయిలా నిలిచింది. ముట్నూరి కృష్ణారావు దీని ప్రధాన సంపాదక బాధ్యతలను చేపట్టి జాతీయోద్యమానికి సంబంధించిన వ్యాసాల ద్వారా ఆంధ్రుల్ని ఉత్తేజితుల్ని చేశారు.
తెలుగు ప్రాంతంలో కాశీనాథుని నాగేశ్వరరావు స్థాపించిన ‘ఆంధ్ర పత్రిక’ కూడా (1908) జాతీయ ఉద్యమంలో భాగస్వామి అయింది. బోడి నారాయణరావు, పింగళి లక్ష్మీనారాయణలతో కలిసి గాడిచర్ల హరిసర్వోత్తమరావు 1908లో బెజవాడ నుండి ‘స్వరాజ్య’ వార పత్రికను ప్రారంభించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రచనలు చేశారని ఈయనకు మూడు సంవ త్సరాలు కఠిన కారాగార శిక్ష విధించారు. ఒక రచనతో జైలు పాలైన మొదటి దక్షిణాది వ్యక్తి గాడిచర్ల.
1923లో ‘ఆంధ్ర పత్రిక’, ‘కృష్ణా పత్రిక’, ‘కాంగ్రెస్’ వంటి పత్రికలు నిషేధానికి గురైనాయి. 1925లో ‘మాతృసేవ’, ‘పశ్చిమాంధ్ర’, ‘శారద’, ‘స్వధర్మ’, ‘స్వతంత్ర’ పత్రికలకూ అదే గతి పట్టింది. కమ్యూనిస్టు పార్టీని నిషేధించక ముందు గద్దె లింగయ్య కృష్ణా జిల్లా నుండి ‘ప్రభా’ పత్రిక తొలి సంచికను 1935లో విడుదల చేశారు. అయితే అది బ్రిటిష్ వారు విధించిన రూ. 8,000 జరిమానా చెల్లించలేక మూతపడింది. సోషలిస్ట్ పార్టీ తరఫున ‘నవశక్తి’ పత్రిక అన్నపూర్ణయ్య సంపాదకత్వంలో వెలువడింది. ఆ తర్వాత దీనిని పుచ్చలపల్లి సుందరయ్య, చంద్రశేఖరరావు, మరికొంతమంది కలిసి నడిపారు. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు ‘నవశక్తి’ పత్రికను కూడా బ్రిటిష్ వారి కఠిన నిర్ణయాల వలన ఆపివేయ వలసిన పరిస్థితి ఏర్పడింది.
‘గోల్కొండ పత్రిక’ ద్వారా సురవరం ప్రతాపరెడ్డి జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు. నరసింహారావు ‘రయ్యత్’ దినపత్రిక ద్వారా ఉద్యమంలోకి వచ్చారు. గద్దె లింగయ్య ‘ప్రభా’ పత్రిక, మద్దూరి అన్నపూర్ణయ్య సంపాదకత్వంలో ‘నవశక్తి’, కాళీపట్నం కొండయ్య ‘వీరభారత్’ పోషించిన పాత్ర అమోఘం. కాండ్రేగుల రామచంద్రారావు, చుండ్రుపట్ల హనుమంతరావు తమదైన శైలిలో పత్రికల ద్వారా ప్రజలను ఉత్తేజ పరుస్తూ ఉద్యమాన్ని నడిపారు. ప్రకాశం పంతులు ‘స్వరాజ్య’ ఆంగ్ల దినపత్రిక ప్రజలను ఉద్యమం వైపు నడిపింది.
అంతేకాదు పప్పూరు రామాచార్యులు 1922లో మిత్రుల సహాయంతో ‘పినాకిని’ పత్రికను అనంతపురంలో ప్రారంభించారు. దీనితో పాటే ‘శ్రీసాధన’ పత్రికను కూడా నడిపారు. ఆంధ్ర పత్రిక, కృష్ణా పత్రిక, శ్రీసాధన పత్రికలతో తాము బలవంతులమయ్యామని స్వయంగా వావిలాల గోపాలకృష్ణయ్య అన్నారు. సర్కారులో కొండా వెంకటప్పయ్య, రాయలసీమలో పప్పూరు రామాచార్యులు, తెలంగాణలో మాడపాటి హనుమంతరావు ముఖ్యు లుగా ఉన్నారని కూడా వావిలాల చెప్పారు. ఇక ముట్నూరి కృష్ణారావు, కాశీనాథుని నాగేశ్వరరావు, కందుకూరి వీరేశ లింగం – ఈ ముగ్గురిని కలిపితే సురవరం ప్రతాపరెడ్డి అవుతారని అనుకునే వాళ్లు. ఆంధ్ర, కృష్ణా పత్రికలను కలిపితే ‘గోల్కొండ పత్రిక’ అవుతుందని కూడా!
‘జన్మభూమి’ పత్రిక కోసం రాసిన వ్యాసం కారణంగా నార్ల వెంకటేశ్వరరావును పోలీసులు చితక బాదారు. గాడిచర్ల హరి సర్వోత్తమరావు, ఖాసా సుబ్బా రావు, కోటంరాజు రామారావు, పప్పూరు రామాచార్యులు కఠినమైన జైలు శిక్షలు అనుభవించారు. అనిబీసెంట్ అరెస్టును ‘దేశమాత’ పత్రికలో ఖండించారని చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుకు వెయ్యి రూపాయల అపరాధ రుసుము విధించారు. ఆ యా పత్రికలు దేశకాల పరిస్థితులకు అనుగుణంగా తెలుగువారి మనోభావాల్ని మలచడంలో చరిత్రాత్మక పాత్రను పోషించాయి. అనేకమంది పత్రికా సంపాదకులు తమ శక్తికి మించి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు.
వి.వి. రమణ
వ్యాసకర్త ఉపాధ్యాయుడు
జాతీయోద్యమ కెరటాలు నాటి తెలుగు పత్రికలు
Published Sun, Aug 27 2023 12:59 AM | Last Updated on Sun, Aug 27 2023 4:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment