
‘‘కొల్లాయిగట్టితేనేమీ మా గాంధీ..’’ అంటూ తెలుగు నాట వీర విహారం చేసిన స్వాతంత్య్ర పోరాట గీతం రాసిన కవి బసవరాజు అప్పారావు. సిని మాలో పాటగా, 1938 మాలపిల్ల సినిమాలో సూరి బాబు పాడిన గీతం. నిజానికి ఈ కొల్లాయి కట్టే ఘట్టం ఎప్పుడు జరిగింది అంటే మనం కొంత ఆలోచిస్తాం కానీ, ఎవరీ వ్యక్తి అంటే, ఒక్క క్షణమైనా తడుముకోకుండా, కొల్లాయి కట్టినది గాంధీజీ అని చెప్పేస్తాం. పైపెచ్చు తెలుగు సాహిత్యంలో, ‘కొల్లాయిగట్టితేనేమి’ ఒక ప్రఖ్యాత తెలుగు నవల కూడా. 1960లలో ఈ నవల రాసింది మహీధర రామమోహనరావు. 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డ్ పొందిన నవల ఇది.
అయితే గాంధీజీ జీవితంలో కూడా ఇది జరిగింది సెప్టెంబర్ 1921లో. తన పత్రిక నవజీవన్‌లో గాంధీ ఇలా చెప్పారు. ‘‘మదరాసు నుంచి మదురైకి రైలుబండిలో వెళ్తుండగా, ఏమీ పట్టనట్టుగా రైలు పెట్టెలో ఉన్న జనాలను చూశాను. అందరూ విదేశీ దుస్తుల్లో ఉన్నారు. వారితో మాట్లాడుతూ, ఖాదీ ధరించవలసిన ఆవశ్యకత గురించి నేను నచ్చచెప్పబోయాను. వారు తలలు అడ్డంగా ఊపి ‘‘మేం చాలా పేదవారం, ఖాదీ ధారణ చేయడానికి, కొనాలంటే ఖాదీ చాలా ఖరీదు’’ వారి మాటల అంతరార్థం నేను గ్రహించాను. నేను పూర్తి దుస్తుల్లో ఉన్నాను, తలపై టోపీతో సహా. వీరు చెప్పింది కొంతవరకూ సత్యమే అయినా, కోట్లాదిమంది ప్రజలు కేవలం ఒక్క లంగోటీతో కాలం గడుపుతూ ఇదే నిజాన్ని చెప్తున్నారనిపిం చింది. వారికి నేనేమని సరైన జవాబివ్వగలను, నా వంటిమీది అదనపు దుస్తులను ప్రతి అంగుళమూ గనుక వదులుకుంటే, అలా చేయడం ద్వారా, ఈ దేశపు కోట్లాది మందికి దగ్గర కాగలిగితే.. మరునాడు ఉదయం మదురై సమావేశం తరువాత, వెంటనే నేను ఆ పని చేశాను’’.
అలా మదురై మహాత్మునికి కొల్లాయి కట్టించిన తల్లి. తన దుస్తుల ధారణ, జాతీయోద్యమంలో భాగం చేయగల మేధావి గాంధీజీ. కొల్లాయి గాంధీజీ బ్రాండ్‌గా ప్రజల మనసుల్లో నిలబడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ అరకొర దుస్తుల ఫకీరు, అతిపెద్ద ఉపఖండ స్వాతంత్య్ర పోరాట నాయకుడని, గాంధీజీ ఆకర్షణ వలయంలో పడిపోయింది. ఈ దుస్తుల పద్ధతి, ఒకసారి అయిదో జార్జ్ చక్రవర్తిని బకింగ్ హామ్ భవంతిలో కలవడానికి వెళ్లాల్సివచ్చినప్పుడు, ఇవే దుస్తులా అని ప్రపంచం, పాలక వర్గాలు విస్మయంలో పడ్డాయి. చక్రవర్తిని కలవడానికి వెళ్ళేటప్పుడు ఇలా చాలీ చాలని దుస్తుల్లోనే వెళ్తారా? అన్నది మీడియా ప్రశ్న. ‘‘మా ఇద్దరికీ సరి పడా దుస్తులు చక్రవర్తి ధరించే ఉన్నారు కదా’’ అన్నది గాంధీజీ ఇచ్చిన చురుకైన జవాబు. విదేశీ వస్త్ర బహిష్కరణ ద్వారా ఆ రోజుల్లో ఆ దుస్తుల అమ్మకాలను సగానికి పడిపోయేలా బ్రిటిష్ వారి పై ఆర్థిక పరమైన దెబ్బ తీశారు గాంధీజీ. ఇలా కొల్లాయి కట్టిన ఘట్టానికి నాంది, సెప్టెంబర్ 1921లో గాంధీజీ బస చేసిన మదురైలోని పడమటి మాసి స్ట్రీట్‌లోని డోర్ నంబర్ 251 ఇల్లు. ఇప్పుడు అదే భవనంలో ఖాదీ ఎంపోరియం నడుస్తున్నది.
కొల్లాయిగట్టితేనేమి, మహీధర వారి నవల 1920 డిసెంబర్–1921 ఏప్రిల్ వరకూ కథా కాలంగా నడుస్తుంది. టెక్నికల్‌గా, ఈ నవలలో కథనడిచే కాలానికి ఇంకా గాంధీజీ (సెప్టెంబర్ 1921 దాకా) కొల్లాయి కట్టడం ప్రారంభించలేదు. అందుకే మహీధర వారు, ఎంత చారిత్రక దృష్టితో చెప్పారు అంటే, ఈ నవల కథాకాలం పూర్తి అయిన కొద్ది నెలలకు కానీ గాంధీజీ కొల్లాయి కట్టడం మొదలు కాలేదు. అంటే గాంధీజీ కొల్లాయి కట్టడానికి ముందర కాలంలో, అసలు కొల్లాయి కట్టు గురించి ఏ పాటలూ లేని కాలంలోకి వెళ్ళి (1920–21) తను 1960లో రాసిన నవలకి ఇలా పేరు పెట్టిన సంగతి వివరించారు. అలా 1921లో తన దుస్తుల ధారణ కూడా స్వాతంత్య్ర పోరాటంలో భాగం చేసిన వ్యూహకర్త గాంధీజీ. ఆ దుస్తుల వ్యూహానికి ఇది 99వ వత్సరం. 70ఏళ్ల రిపబ్లిక్ దినోత్సవ సందర్భంలో, గాంధీజీ కొల్లాయి ధారణ ఈ దేశానికి చేసిన మేలు ఎంతో, స్వదేశీ ఉత్పత్తుల సమాదరణ వల్ల ఎంత అభివృద్ధి సాధించగలమో కూడా ఇంకా మనం గ్రహించవలసి ఉన్నది. (నేడు కృష్ణానదీ నౌకావిహార సాహిత్య సభలో మహీధర ‘కొల్లాయిగట్టితేనేమి’ నవలపై సాయంత్రం 5 గంటలకు రామతీర్థ ప్రసంగం)
వ్యాసకర్త కవి, విమర్శకులు‘ 98492 00385
రామతీర్థ