వాణిజ్య పోరాటంలో ఎవరూ విజేత కాలేరు: చైనా
దావోస్: ప్రపంచీకరణను చైనా గట్టిగా సమర్థించింది. ప్రపంచీకరణ ఫలాలను చక్కగా ఒడిసి పట్టుకున్న దేశాల్లో చైనా ముందుంటుందన్న విషయం జగమెరిగినదే. దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్ సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడుతూ... ఆర్థికరంగ అనుసంధానత మానవాభివృద్ధికి తోడ్పడిందని, లక్షలాది మంది జీవితాలను మెరుగుపరిచిందన్నారు. ‘‘నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు ప్రపంచీకరణతో వచ్చినవి కావు. నీకు నచ్చినా నచ్చకపోయినా ప్రపంచ ఆర్థిక రంగం అనేది ఓ అతిపెద్ద సాగరం వంటిది.
దాన్నుంచి తప్పించుకోవడం అసాధ్యం. స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడులకు మేము కచ్చితంగా కట్టుబడి ఉంటాం. వాణిజ్యం, పెట్టుబడుల ఉదారవాదాన్ని ప్రోత్సహిస్తాం. వాణిజ్య పోరాటంలో ఎవరూ విజేత కాలేరు’’ అని జిన్‌పింగ్ చైనా వాణిని వినిపించారు. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలను సమీక్షిస్తామని, అమెరికా ప్రయోజనాలకు ఉపయోగపడని వాటిని రద్దు చేస్తామని ఆ దేశ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. జిన్‌పింగ్ పరోక్షంగా ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది.