
దావోస్: చైనా అలీబాబా గ్రూపు చైర్మన్ జాక్‌మా దావోస్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచీకరణ ఆగకూడదని, వాణిజ్యం ఆగిపోతే యుద్ధానికి దారితీస్తుందన్నారు. సమస్యలకు ముగింపు పలకాలంటే ప్రపంచీకరణను అక్కున చేర్చుకోవాలని సూచించారు. ఇది మన బాధ్యతని, ఎదిగేందుకు అవకాశమని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు సందర్భంగా జరిగిన ప్రత్యేక సెషన్‌లో ఆయన ప్రసంగించారు. ‘‘రానున్న 30 సంవత్సరాల్లో ప్రపంచం అనూహ్యంగా మారిపోతుందని ఆందోళన చెందుతున్నారా? ఏదైనా యుద్ధం జరిగితే అది వ్యాధులు, పర్యావరణ కాలుష్యం, పేదరికానికి వ్యతిరేకంగానే ఉండాలి. మనపై మనం యుద్ధం చేసుకోరాదు. ప్రపంచీకరణను ఎవరూ ఆపలేరు. ఒకవేళ వాణిజ్యం ఆగిపోతే ప్రపంచం కూడా ఆగిపోయినట్టే. వాణిజ్యం అన్నది యుద్ధాన్ని అంతం చేసేది. అంతేకానీ యుద్ధానికి దారితీయదు’’ అని జాక్‌మా తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. టెక్నాలజీ కారణంగా ప్రస్తుతం ప్రపంచం మార్పు దశలో ఉందని, ఆసక్తికరమైన ఉపాధి అవకాశాలకు ఇది సాయపడుతుందని చెప్పారు. అలాగే, సామాజిక సమస్యలకూ కారణం కావచ్చన్నారు.
నూతన అవకాశాల వైపు చూస్తున్నాం: కొచర్
వృద్ధికి అవకాశం ఉన్న కొత్త విభాగాల వైపు చూస్తున్నామంటూ ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ చందాకొచర్ అన్నారు. నోట్ల రద్దు తర్వాత నూతన అవకాశాలకు మార్గం ఏర్పడిందన్నారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు వచ్చిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి మరిన్ని చిన్న, మధ్య స్థాయి సంస్థలు వచ్చి చేరుతున్నాయి. దీంతో వృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి (ఎంఎస్‌ఎంఈ) సంస్థలకు రుణ వితరణను పెంచేందుకు ప్రభుత్వం కూడా తగిన ప్రేరణనిచ్చింది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment