అమంగళం
సాక్షి, కర్నూలు: నేటి యువత నడతపైనే రేపటి సమాజ భవిత ఆధారపడి ఉంది. వీరంతా సన్మార్గంలో పయనించినప్పుడే దేశ పురోగతి సాధ్యమవుతుంది. గ్లోబలైజేషన్ ప్రభావం.. మారుతున్న పరిస్థితులతో చదువుపై ఏకాగ్రత లోపించి ఎంతో మంది పెడదోవ పడుతున్నారు. చైతన్య లోపం.. ఒత్తిడితో జీవితం నరకప్రాయం చేసుకుంటున్నారు. ప్రేమలో పడటం.. వైఫల్యంతో ఆత్మహత్యకు పాల్పడటం ఇందులో భాగమే. ఇలాంటి వారందరికీ దిశానిర్దేశం చేయడంతో పాటు జీవితాన్ని చిక్కదిద్దేందుకు 2013 ఏప్రిల్‌లో యువ క్లినిక్‌లు ఏర్పాటయ్యాయి.
జిల్లాలోని ఆదోని, నంద్యాల ప్రాంతీయ ఆసుపత్రులతో పాటు పలు ప్రాథమిక, క్లస్టర్ ఆరోగ్య కేంద్రాల్లో 46 క్లినిక్‌లను నిర్వహిస్తున్నారు. జిల్లా మొత్తం మీద 20 మంది ఐసీటీసీ కౌన్సిలర్లు ఉండగా.. వీరు లేని చోట పీహెచ్‌సీ. సీహెచ్‌సీల వైద్యాధికారులే కౌన్సెలింగ్ ఇచ్చేలా ఆదేశించారు. ఆయా ఆసుపత్రుల్లోని వైద్యులు, ఐసీటీసీ సిబ్బంది వీటి ద్వారా పదేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు బాలలు, యువతకు కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. తొలుత ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు నిర్వహించాలని భావించినా.. క్షేత్ర స్థాయి ఇక్కట్ల దృష్ట్యా ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు యువ క్లినిక్‌ల నిర్వహణకు సమయం కేటాయించారు.
ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ కేంద్రాలు ప్రస్తుతం బోర్డులకే పరిమితమవడం గమనార్హం. ఇప్పటి వరకు ఎంత మందికి కౌన్సెలింగ్ నిర్వహించారనే సమాచారం కూడా అధికారుల వద్ద లేకపోవడం వీటి నిర్వహణ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. కనీసం రికార్డుల నిర్వహణ కూడా లేకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం. ఇదేమని వైద్య సిబ్బందిని అడిగితే కౌన్సెలింగ్‌కు ఎవరూ రావడం లేదనే సమాధానం వస్తోంది. జవహర్ బాల ఆరోగ్య రక్ష ద్వారా పాఠశాలల్లో పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇబ్బందులుంటే ఈ కేంద్రాల్లో కౌన్సెలింగ్ చేపట్టాలి.
స్థానిక ఆసుపత్రుల్లో తగ్గని వ్యాధులుంటే గుర్తించి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులకు పంపాలి. అయితే క్లినిక్‌లో ఆ స్థాయిలో సేవలందించే పరిస్థితి కరువైంది. కౌన్సెలింగ్ నిర్వహణకు ప్రత్యేక గది కేటాయించాల్సి ఉన్నా ఆ ఏర్పాట్ల ఊసే కరువైంది. చిప్పగిరి ప్రాథమిక ఆసుపత్రిలో కంప్యూటర్ గదిని.. ఆదోని ఏరియా ఆసుపత్రిలో ఐసీటీసీ సెంటర్‌ను క్లినిక్‌గా వినియోగిస్తున్నారు.
మూడు నెలలకోసారి కేంద్రాల నిర్వహణకు రూ.10వేల చొప్పున మంజూరు చేయాల్సి ఉండగా.. మొదట్లో రూ.15వేల చొప్పున ఇచ్చిన నిధులతోనే సరిపెట్టారు. ఈ ఏడాది బడ్జెట్ విడుదల చేసినట్లు చెబుతున్నా.. పంపిణీకి నోచుకోకపోవడంతో కౌన్సెలింగ్ అటకెక్కింది.