![Make globalization more transparent says Finance Minister Nirmala Sitharaman - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/12/YELLEN.jpg.webp?itok=aQ0J7AnI)
యూఎస్ ఆర్థిక మంత్రి జానెట్ ఎలెన్‌తో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
వాషింగ్టన్: గ్లోబలైజేషన్ ప్రయోజనాలను తక్కువ చేసి చూపాలని భారత్ కోరుకోవడం లేదని కేంద్ర లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అయితే దానిని మరింత పారదర్శకంగా మార్చాలని కోరుతోందని పేర్కొన్నారు. ప్రముఖ అమెరికన్ పీటర్సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ఈ మేరకు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) మరింత ప్రగతిశీలంగా ఉండాలని, ఇతర దేశాల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని భారత్ కోరుతోందన్నారు. ‘‘వినడానికి మాత్రమే కాకుండా చెప్పడానికి భిన్నమైన దేశాలకు డబ్ల్యూటీఓ మరింత వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉందని’’ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
పరస్పర ప్రయోజనాలు లక్ష్యంగా..
భారత్ చాలా కాలంలో తన తయారీ రంగం వృద్ధి చెందేలా ప్రయత్నాలు చేస్తోందన్నారు. తను ఉత్పత్తి చేయగల వినియోగ వస్తువులను కూడా దిగుమతి చేసుకోవడం లేదని తెలిపారు. అయితే ధర వ్యత్యాసాలు, పోటీతత్వం వంటి అంశాలు అంతర్జాతీయంగా కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయన్నారు. ఇలాంటి సమస్యల విషయంలో ఆయా దేశాల మధ్య పరస్పర ప్రయోజనకర అవగాహనలు అవసరమని అన్నారు.
పెట్టుబడులకు గమ్యస్థానం
ఇక అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్ తగిన ప్రాంతమని ఆమె ఉద్ఘాటించారు. నైపుణ్యం, డిజిటలైజేషన్‌పై భారత్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు సీతారామన్ స్పష్టం చేశారు.
క్రిప్టో ‘జీ 20’ ఉమ్మడి ఫ్రేమ్‌వర్క్!
క్రిప్టో రిస్క్‌లను ఎదుర్కోవడానికి ఉమ్మడి ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడమే ఇండియా జీ20 ప్రెసిడెన్సీ లక్ష్యమని కూడా ఆర్థికమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో క్రిప్టోకరెన్సీలతో సంబంధం ఉన్న నష్టాలను ఎదుర్కోవడానికి అన్ని దేశాలకు ఉమ్మడి ఫ్రేమ్‌వర్క్ అవసరమన్నారు.
భారత్ పారదర్శక ఎకానమీ
భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆమె అమెరికన్ వ్యాపారవేత్తలను అభ్యర్థించారు. తద్వారా పారదర్శక ఎకానమీ నుంచి లభించే ప్రయోజనాలు పొందాలని అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహించిన ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో సూచించారు. ప్రస్తుత భారత్ ప్రభుత్వం దేశ వృద్ధికి సంబంధించి అంతర్జాతీయ పరిశ్రమ భాగస్వామ్యం కోసం తగిన వ్యూహ రచన చేస్తున్నట్లు వివరించారు. మహమ్మరి వంటి సవాళ్ల సమయంలోనూ దేశాభివృద్ధే లక్ష్యంగా సంస్కరణల బాటన నడిచిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment