పాత విత్తనమే ప్రాణం | Life in old seeds | Sakshi
Sakshi News home page

పాత విత్తనమే ప్రాణం

Published Mon, May 19 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM

పాత విత్తనమే  ప్రాణం

పాత విత్తనమే ప్రాణం

మన విత్తనం.. మన సంస్కృతి..
206 వంగడాలను సాగు చేస్తున్న అరకు గిరిజనులు
విశాఖ రైతుబజార్లలో గిరిజన సేంద్రియ ఆహారోత్పత్తులకు గిరాకీ
ప్లాంట్ జీనోమ్ సేవియర్ కమ్యూనిటీ అవార్డుతో గౌరవించిన కేంద్ర


విత్తనం మన సంస్కృతి.. విత్తనం మన ఉనికి! వ్యవసాయక సమాజంలో వేలాది ఏళ్లుగా పొలం నుంచి పొలానికి, రైతు నుంచి రైతుకు, తరం నుంచి తరానికి అందివస్తున్న అమూల్య సంపద విత్తనం. ప్రపంచీకరణ పుణ్యమా అని కంపెనీల విత్తనం విజృంభిస్తున్న తరుణంలోనూ సంప్రదాయ విత్తనాలను ప్రాణానికి ప్రాణంగా కాపాడుకుంటున్నారు విశాఖ మన్యంలోని ఆదివాసీ రైతులు. విత్తన సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకుంటున్నారు. వీరి కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ‘ప్లాంట్ జీనోమ్ సేవియర్ కమ్యూనిటీ అవార్డు’ను ఇచ్చింది. విత్తనం బహుళజాతి కంపెనీల సొత్తుగా మారుతున్న ఈ కాలంలో ఈ గిరిజనం వెలుగుబాట చూపుతుండడం విశేషం.
 
 నాగరికతకు మూలం వ్యవసాయమైతే.. వ్యవసాయానికి జీవం రైతుల సొంత విత్తనం. అడవి బిడ్డలే అనాదిగా విత్తన పరిరక్షకులు. సామాజికంగా ఎంత ‘అభివృద్ధి’ జరిగినా ఇప్పటికీ.. పాత విత్తనమే తమకు, నేలతల్లికీ బలమంటున్నారు అరకు ప్రాంత గిరిజన రైతాంగం. విశాఖపట్నం జిల్లాలోని ఒడిశా సరిహద్దుల్లోని అరకు కొండ ప్రాంతం.. మనోహరమైన ప్రకృతి సౌందర్యానికి ఆలవాలం. డుంబ్రిగుడ, హుక్కుంపేట మండలాల్లోని 5 పంచాయతీలు సంప్రదాయక పంటలకు పెట్టని కోటలు. సుసంపన్నమైన సంప్రదాయక వ్యవసాయ సంస్కృతికి ఈ గిరిజన రైతుల జీవనశైలి అద్దం పడుతుంది. వీరికి వ్యవసాయం అంటే ఎక్కువ రాబడినిచ్చే వ్యాపకం కానే కాదు. వ్యవసాయం అవిచ్ఛిన్నంగా సాగిపోయే ఒక జీవన విధానం. వైవిధ్యభరతమైన సంప్రదాయ వంగడాలను అనాదిగా సేకరిస్తూ, వాటి ప్రయోజనాన్ని గుర్తెరిగి తరతరాలుగా సాగు చేస్తుండడం వీరి సంప్రదాయ విజ్ఞానానికి, విజ్ఞతకు నిదర్శనం.

 206 పాత పంటలు..

వరిలో 13 రకాల వంగడాలున్నా వేటి ప్రయోజనం వాటికి ఉంది! వీటితోపాటు 8 రకాల రాగులు, 7 రకాల సామలు, 5 రకాల జొన్నలు, 5 రకాల కొర్రలు, 8 రకాల చిక్కుళ్లు, 5 రకాల కందులతోపాటు గంటెలు(సజ్జలు), మొక్కజొన్న, వెల్లుల్లి, ఉల్లి, పసుపు, క్యారెట్, గుమ్మడి, ఆనప, ఆగాకర, బీర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పనస, బంగాళదుంప, తెల్లదుంప, ఎర్రదుంప తదితర 206 పాత పంటలను దాదాపు 5 వేల ఎకరాల్లో పండిస్తున్నారు. మలివలస గ్రామంలో 203, దేముడువలసలో 197 రకాల పాత పంటలు సాగులో ఉండడం విశేషం. కొండ వాలు పొలాల్లో అధిక వర్షాలను తట్టుకొని పండేవి కొన్నయితే.. నీటి వసతి ఉన్న మైదాన ప్రాంత పొలంలో పండేవి మరికొన్ని. దిగుబడి ఎంత వస్తున్నదనే దానితో నిమిత్తం లేకుండా.. ఇన్ని పంటలను ప్రతి ఏటా సాగు చేస్తుండడం విశేషం. అయితే, గిరిజన యువతలో పాతపంటలపై చిన్న చూపు గూడుకట్టుకుంటున్న దశలో కోటనందూరు మండలం ఇండుగపల్లి గ్రామానికి చెందిన పచారి దేవుళ్లు 15 ఏళ్ల క్రితం దృష్టిసారించి ఉండకపోతే ఇక్కడి పాత పంటల ప్రాభవం కొంత మసకబారిపోయేది. సంజీవని రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీని నెలకొల్పిన దేవుళ్లు 90 గ్రామాల్లోని 3,215 గిరిజన కుటుంబాలలో చైతన్యం కలిగించేందుకు కృషి చేస్తున్నారు.  

 పాత విత్తనాల జాతరతో కొత్త ఉత్సాహం!

 గత పదేళ్లుగా ఏటా పాత విత్తనాల జాతర నిర్వహించడం.. పంటలను స్థానిక సంతల్లో అయినకాడికి అమ్ముకుంటున్న గిరిజన రైతులను విశాఖ రైతుబజార్లకు అనుసంధానం చేయడంతో గిరిజన రైతుల్లో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంది. 420 మంది గిరిజన రైతులు 150 కిలోమీటర్ల దూరంలోని రైతుబజార్లకు తీసుకొచ్చి తాము పండించిన అమృతాహారాన్ని విక్రయిస్తున్నారు. గిరిజన గ్రామాల్లో 38 వరకు ధాన్యం బ్యాంకులు ఏర్పాటయ్యాయి. తమ అవసరాలకు మించి పండించిన ధాన్యాలను వీటిల్లో దాచుకోవచ్చు లేదా అమ్మవచ్చు. ఇవి గిరిజనులను కష్టకాలంలో ఆదుకుంటున్నాయి. పంటలు పండకపోయినా, పెళ్లిళ్లు వంటి అవసరాలు వచ్చినా ఈ బ్యాంకుల నుంచి ధాన్యం తీసుకోవచ్చు.

 హెదరాబాద్‌లోని జాతీయ పంటల జన్యువనరుల పరిరక్షణ సంస్థకు చెందిన ముఖ్య శాస్త్రవేత్త డా. బలిజేపల్లి శరత్‌బాబు ఈ ప్రాంత పాత పంటల జీవవైవిధ్య వైభవాన్ని నమోదు చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. ఆ తర్వాత గిరిజన రైతులకు ప్రతిష్టాత్మకమైన ప్లాంట్ జీనోమ్ సేవియర్ కమ్యూనిటీ అవార్డు (2011-12) దక్కింది. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా గత ఏడాది మే 22న రూ. పది లక్షల నగదు, ప్రశంసాపత్రాన్ని వీళ్లు న్యూఢిల్లీలో అందుకున్నారు.  మన రాష్ర్టవాసులకు ఈ అరుదైన గౌరవం దక్కడం ఇదే ప్రథమం.గిరిజనులు పాత పంటల్లోని ఔషధగుణాలను గుర్తెరిగి వినియోగిస్తుండడం విశేషం. బాలింతకు పెద్దసామల గంజి తాపుతారు. బోడ్‌దాన్ అనే రకం బియ్యం వండి పెడతారు. నూతన వధూవరులకు పసుపు సన్నాల బియ్యం వండిపెడతారు. వర్షాకాలం జబ్బుపడిన వారికి బలవర్ధకమైన ఊదల గంజి ఇస్తారు. పోదు, గదబ, పూర్జ, కొండదొర జాతుల ఆదివాసులు చౌకదుకాణాల్లో ఇచ్చే బియ్యం తినరు. ఇప్పటికీ పూర్తిగా తమ సంప్రదాయ ఆహారాన్నే తింటారు! అరకు గిరిజన రైతులు విత్తన సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకుంటున్నారు.

 - సైమన్ గునపర్తి, న్యూస్‌లైన్, విశాఖపట్నం సిటీ (ద్వారకానగర్)
 (మే 22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా..)


 పిల్లలను సాకినంత ఆనందం..

 ప్రకృతిసిద్ధంగా పండించటమే మా సంప్రదాయం. సంజీవిని సంస్థ అండతో పప్పుదినుసులు, పసుపు, అల్లం, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు పండిస్తున్నాం. ఎలా నాటాలో వాటికి కావాల్సిన సేంద్రియ ఎరువులు సొంతంగా ఎలా తయారు చేసుకోవాలో నేర్పించారు. వ్యవసాయం చేయడం అంటే పిల్లలను సాకినంత ఆనందంగా ఉంటుంది.

 -పండన్న, అరకు కూరగాయల రైతుల సంఘం సభ్యుడు, కిలోగుడ, విశాఖ జిల్లా
 
అంతరిస్తున్న వంగడాలపై దృష్టి

మన విత్తనాల కన్నా బయటి విత్తనాలే మంచివనే దురభిప్రాయం గతంలో కొందరు గిరిజనుల్లో  ఉండేది.  సేంద్రియ వ్యవసాయం పట్ల, పాత విత్త నాలను నిలబెట్టుకోవడం పట్ల ఆసక్తిని పెంచడానికి మొదట్లో మా సంస్థ చాలా కష్టపడవలసి వచ్చింది. ఏటా జరుపుతున్న పాత విత్తనాల పండగ ద్వారా అవగాహన పెరిగింది.  అంతరించిపోతున్న అనేక వంగడాలను గుర్తించి, వాటిని సాగులోకి తెస్తున్నాం. ఉదాహరణకు.. సంకణాలు అనే అరుదైన నూనె గింజలను ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తోడ్పాటుతో రైతుల చేత సాగు చేయిస్తున్నాం. కనుమరుగైన పెసర, కొన్ని వరి వంగడాలను కూడా ఈ ఏడాది సేకరించి రైతులతో సాగు చేయిస్తున్నాం.
 
- పి. దేవుళ్లు(98492 05469), కార్యదర్శి, సంజీవిని, కిలోగుడ, విశాఖ జిల్లా  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement