మా చుట్టూ తెలుగు మెండుగా ఉంది | There is a lot of Telugu around | Sakshi
Sakshi News home page

మా చుట్టూ తెలుగు మెండుగా ఉంది

Published Sun, May 14 2017 11:59 PM | Last Updated on Tue, Sep 5 2017 11:09 AM

మా చుట్టూ తెలుగు మెండుగా ఉంది

మా చుట్టూ తెలుగు మెండుగా ఉంది

హోసూరు(తమిళనాడు) తెలుగు రచయిత అగరం వసంత్‌ తాజాగా పల్లె పాటల కతలు ‘దణి’ తెచ్చిన నేపథ్యంలో ఈ ఐదు ప్రశ్నలు...

1. మీ ప్రాంత పాటల్ని కథలుగా మలచాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది?
అంటే ఇక్కడ ఏమైతోందంటే భాష నశించి పోతోంది. గ్లోబలైజేషన్‌వల్లా, రీడర్‌షిప్‌ తగ్గిపోవడం వల్లా. పైగా తమిళే ఉండాలి అని ప్రభుత్వం రూల్‌ పెడుతోంది. కానీ ఈ ప్రాంతం తెలుగు ప్రాంతం. ఇళ్ల రిజిస్ట్రేషన్‌ తెలుగులో ఉంటుంది. ఊరికొకరైనా చందోబద్ధంగా పద్యాలు చెప్పే వాళ్లుంటారు. మేము కనీసం ఈ పాటలు విన్నాం. మా తర్వాతి వాళ్లకు అసలు లేదు. అందుకే కనీసం రికార్డ్‌ చేద్దామన్న ఆలోచనతో ఈ పనికి పూనుకున్నాను.

2. మీ సేకరణ ఎట్లా సాగింది?
డాక్టర్‌గా ఊళ్లకు వెళ్తుంటాను కదా, ఎవరైనా పాడతారేమోనని కనుక్కునేవాణ్ని. పాడేది ఎక్కువ ఆడవాళ్లు. కానీ వాళ్లకు సిగ్గు. మాకేమొచ్చు అనేది. తెలిసిన ఫార్మర్స్, ఫ్రెండ్స్‌ సహాయం తీసుకున్నాను. ‘ఈ ఊళ్లో ఇంకెవరు పాడుతారు? ఫలానా రోజు వస్తాను’... అట్లా కలెక్ట్‌ చేసినాను. రచయితలు మునిరాజు, సుమ హెల్ప్‌ చేసినారు. నేను పెండ్లాడుండేది కర్ణాటకలో. మా అత్త, మర్దాలు కొన్ని పాడినారు.

3. వీటిని కథలుగా మలవకుండా, యథాతథంగా నోట్స్‌తో ఇచ్చివుంటే బాగుండేది కాదా?
ఒక్కోపాట నాలుగు, ఐదు పేజీలు ఉంటుంది. పెద్ద కథంతా పాడుతారు. పేజీలు పేజీలు పోతుంది. ఈ పాట ప్రధానంగా ఏం చెప్తుందో చెప్పాలనేది నా లక్ష్యం. మీరన్నట్టు యథాతథంగా ఇచ్చేపనీ జరుగుతూవుంది. మా (కృష్ణగిరి జిల్లా తెలుగు) రచయితల సంఘం తరఫున చేస్తున్నాం.

4. కొన్ని మాటలు మినహా మీరు ‘మామూలుగానే’ మాట్లాడుతున్నారు. రాసేదీ మాట్లాడేదీ ఒకటి కాదా?
నేను కొంత చదివివుండొచ్చు, నాలుగైదు ప్రాంతాలకి తిరిగివుండొచ్చు, మాట్లాడేది వేరేది ఉండొచ్చు. కానీ రాసేదానికి కూర్చుంటే ఇదే వస్తుంది. కృత్రిమంగా కలిపింది ఏమీ లేదు.

5. హోసూరు వాళ్లకు తెలుగు మీద ఎందుకింత మమకారం?
అట్లా అంటే ఎట్ల సార్‌? మేము ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడేది తెలుగు, వీధిలో మాట్లాడేది తెలుగు, చూసే సినిమాలు తెలుగు. మా చుట్టూ తెలుగు మెండుగా ఉంది. నేను ఎలిమెంటరీ వరకు తెలుగు చదువుకున్నా. ఇప్పుడంటే తమిళ్‌ డంపు చేస్తున్నారు. పెండ్లాములపల్లె అని ఊరుంటే పెరుమాళ్‌పల్లె అని మారుస్తున్నారు. 2006లో ఒక చట్టం వచ్చి తమిళే చదవాలంటున్నారు. కానీ మా పెద్దాళ్లు మాకు తెలుగు కావాలని నిలబెట్టినారు. దాన్ని కొనసాగించాలనేది మా తపన.

దణి(పల్లె పాటల కతలు); పేజీలు: 208; వెల: 100; ప్రతులకు: రచయిత, కృష్ణగిరి జిల్లా తెలుగు రచయితల సంఘం, 2/1097, బస్తి, ఆవులపల్లి రోడ్డు, హోసూరు–635109. కృష్ణగిరి జిల్లా, తమిళనాడు. ఫోన్‌: 09488330209

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement