మరొక కల్లోలభరితమైన సంవత్సరం ముగిసింది. 2022 ప్రారంభంలో యుద్ధం యూరోపియన్ తీరాలకు చేరుకుంది. కోవిడ్–19 అనంతర సాధారణ స్థితికి ప్రపంచం వస్తున్న తరుణంలోనే ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమించడంతో ప్రపంచ క్రమవ్యవస్థకు కొత్త సవాళ్లను విసిరినట్టయింది. అమెరికా–చైనా మధ్య ఘర్షణ పదునెక్కుతున్న స్థితిలో రష్యా–చైనా మధ్య బంధం మరింతగా బలపడుతోంది. ప్రతి విషయంలోనూ ఆయుధీకరణ కొత్త వ్యవస్థగా ఆవిర్భవిస్తున్నందున ప్రపంచీకరణ వ్యతిరేక క్రమం చుట్టూ చర్చ బలం పుంజుకుంటోంది. ఈ ఉపద్రవం మధ్య అంతర్జాతీయ సంస్థలు నూతన సవాళ్లను ఎదుర్కోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేవు. కాబట్టి, నూతన సంస్థాగత నిర్మాణాల కోసం శోధన ముందుకు వచ్చింది.
జాతీయ వ్యూహాత్మక చింతనకు చెందిన కొన్ని మౌలిక భావనలకు బహిరంగంగా వ్యతిరేకత ఎదురవుతున్నప్పుడు భారతీయ విదేశీ విధానం ఒక సంవత్సర కాలంలో ఈ అన్ని మలుపులకూ స్పందించాల్సి వచ్చింది. 2020లో గల్వాన్ సంక్షోభం భారత ప్రభు త్వాన్ని తన చైనా విధానాన్ని తిరిగి మదింపు చేసుకునేలా ఒత్తిడికి గురిచేసింది. ఆ విధంగానే ఉక్రెయిన్ యుద్ధం భారత్‌ను తన రష్యా విధాన చోదక శక్తుల పట్ల వైఖరిని తిరిగి పరిశీలించుకునేలా చేసింది. అలాగే పాశ్చాత్య ప్రపంచంతో తన వ్యవహార శైలిని కొత్తగా రూపొం దించుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించింది. 2022 ఫిబ్ర వరిలో రష్యన్ దురాక్రమణ ప్రారంభమైనప్పుడు, డిమాండ్ చేస్తున్న పాశ్చాత్య దేశాలు ఒకవైపు, విఘాతం కలిగించే రష్యా మరొకవైపు ఉంటున్న స్థితిలో రెండు శక్తులతోనూ సంబంధాలను భారత్ ఎంత కష్టంగా నిర్వహిస్తుందనే అంశంపై చాలా చర్చ జరిగింది. అయితే అత్యంత సంక్లిష్టమైన ప్రపంచ సమస్యపై భారత్ సమతుల్యత ప్రదర్శించడం నుంచి నూతన సంవత్సరం నాడు ప్రారంభమైంది.
ఇంధన భద్రత కోసం రష్యాతో తన సంబంధ బాంధవ్యాలను భారత్ కొనసాగించడమే కాదు, మాస్కోతో ఇంధన పొత్తులను మరింతగా పెంచుకోగలిగింది. రష్యాను బహిరంగంగా ఖండించక పోవడం ద్వారా పాశ్చాత్య ప్రపంచం పక్షాన భారత్ నిలబడలేదని పాశ్చాత్య దేశాల్లో కొంతమంది విమర్శిస్తున్న సమయంలోనే, సంవత్సరం పొడవునా పాశ్చాత్య దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలపడ్డాయి. భారత్ తన వంతుగా ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టం, ప్రాదేశిక సార్వభౌమాధికారం నేపథ్యంలో రష్యన్ దురాక్రమణపై ఆరోపించడం నుంచి తన వైఖరిని మార్చు కుంది. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇది యుద్ధ సమయం కాదని రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌కు బహిరంగం గానే బోధ చేసేంతవరకు పోయారు. బాలి సదస్సులో జీ20 దేశాల చర్చల సమయంలో సెంటిమెంటును రంగరించి మరీ మోదీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంవత్సరం ముగిసే సమయానికి ఉక్రెయన్ సంక్షోభాన్ని ముగించే విషయంలో భారత్ మరింత క్రియాశీలక పాత్ర చేపట్టనుందని అంచనాలు పెరిగిపోయాయి. చివరకు ప్రధాని మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్‌స్కీ ఫోన్ చేసి మరీ మాట్లాడారు.
రష్యా పట్ల భారత్ వైఖరిని పాశ్చాత్య ప్రపంచం ప్రారంభంలో విమర్శనాత్మకంగా అంచనా వేసింది. కానీ ఉక్రెయిన్ సమస్యపై దౌత్యపరమైన ప్రయత్నాల విషయంలో భారత్ చొరవను చివరకు పాశ్చాత్య దేశాలు హేతుపూర్వకంగా గుర్తించాల్సి వచ్చింది. యూరప్ సమస్యలు ప్రపంచ సమస్యలు అవుతాయి కానీ ప్రపంచ సమస్యలు యూరప్ సమస్యలు కావు అనే ఆలోచనలోని కపటత్వాన్ని భారత్ నొక్కి చెప్పింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇండో–పసిఫిక్ వ్యవహారాలకు సంబంధించి భారత్ కేంద్ర స్థానం విషయంలో యూరప్ దేశాలు నిశ్చితాభిప్రాయానికి వచ్చేశాయి. దీంతో ఈ సంవత్సరం భారత్–యూరోప్ సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. యూరోపియన్ స్థలపరిధుల్లో రష్యాకు ప్రధాన స్థానం ఉన్నప్పటికీ, చైనా నుండీ, దాని దూకుడు ఎత్తుగడలనుంచే తమకు దీర్ఘకాలిక వ్యూహాత్మక సవాళ్లు ఎదురు కానున్నాయని యూరప్ దేశాలకు స్పష్టంగా బోధపడింది.
వారి వ్యూహాత్మక తర్కం కారణంగా అమెరికాతో భారత్ సంబంధాలు కూడా ముందంజ వేశాయి. ఇండో–పసిఫిక్ నేడు అత్యంత కీలకంగా మారింది. పసిఫిక్ ప్రాంతంలో ‘క్వాడ్’, మధ్య ప్రాచ్యంలో ‘ఐ2యు2’ (ఇజ్రాయెల్, ఇండియా, యూఎస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) రెండు కీలక భూభాగాల్లో సంస్థాగత వ్యాఖ్యాత లుగా ఆవిర్భవిస్తున్నాయి. న్యూఢిల్లీ, వాషింగ్టన్ ద్వైపాక్షిక సంబంధా లకు మించి, తమ వ్యవహారాలకు చెందిన ఎజెండానే పునర్నిర్వ చించుకుంటున్నాయి. దాంతోపాటు తమ ఆకాంక్షల ఆకృతులను మరింతగా పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
భారతదేశం నిర్వహంచే అంతర్జాతీయ పాత్రను ప్రపంచం ఇప్పుడు మరింత సీరియస్‌గా తీసుకుంటోంది. ఎందుకంటే సంక్లిష్టమైన గ్లోబల్ సమస్యలను భారత్ ఇప్పుడు మరింతగా పట్టించుకుంటూ, నాయకత్వం వహించగలుగుతోంది. ప్రపంచ సమస్యలకు అది పరిష్కారాలు అందించడానికి సిద్ధపడుతోంది. భావసారూప్యత కలిగిన దేశాలతో భాగస్వామ్యాలను ఏర్పర్చుకుంటోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ తన అధ్యక్ష స్థానాన్ని.. సంస్కరించిన బహుపాక్షికతను, శాంతిపరిరక్షణను, ఉగ్రవాద నిరోధకతను, సముద్ర భద్రతను నొక్కి చెప్పడానికి ఉపయోగించుకుంది. ఈ సమస్యలు భారత్ ప్రయోజనాలకే కాదు, ప్రపంచంలోని విశాల భాగం ప్రయోజనాలకు కూడా చాలా ముఖ్యమైనవి.
భద్రతాసమితిలో భారత్ వ్యవహరిస్తున్న తీరులో ఆచరణా త్మకతకు చెందిన కొత్త అర్థం ప్రస్ఫుటమవుతోంది. ఇంతవరకు వినపడకుండా కనిపించకుండా పోయిన విశాల మెజారిటీ దేశాల గురించి మాట్లాడేలా భారత వాణి ఉంటోంది. ఈ ప్రాధాన్యత ప్రాతిపదికపైనే అది జీ20 కూటమి అధ్యక్షత బాధ్యతను చేపడుతోంది. బహుపాక్షికత అనేది తన విశ్వసనీయతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రపంచం ఎదుర్కొంటున్న కీలకమైన సవాళ్లు కొన్నింటికి పరిష్కారాలను అందించే విషయంలో అందరి కళ్లూ న్యూఢిల్లీ చేపట్టిన జీ20 నాయకత్వంపైనే ఉన్నాయి. ఇది అంతర్జాతీయ పర్యవసానాలను రూపుదిద్దగలిగే ‘నాయకత్వ శక్తి’గా భారత్ తన విశ్వసనీయతను పెంపొందించుకోవలసిన సమయం. ప్రత్యే కించి భారత గాథ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న సమయంలో ఇది ఎంతో అవసరం.
భారత్ అంతర్జాతీయ పాత్రను మెచ్చుకునే పరిణామాలు ఏర్పడు తున్న సమయంలో ప్రముఖ ఆర్థిక శక్తిగా ఆవిర్భవించడం కీలక పాత్ర పోషించనుంది. ప్రపంచం మొత్తంగా బీజింగ్ వ్యవహారాలపై తీవ్ర అసమ్మతి వ్యక్తపరుస్తున్న తరుణంలో చైనా దూకుడును నిలువ రించడంలో దృఢ వైఖరిని ప్రదర్శిస్తున్న భారత్ కొత్త అవకాశాలను సృష్టించుకుంది. 2022లో ఇలాంటి కొన్ని అవకాశాలను అంది పుచ్చుకోవడంలో భారతీయ విదేశీ విధానం విజయవంతమైంది. మరోవైపున చైనా సవాలు సమీప భవిష్యత్తులో భారత ప్రభుత్వ సమర్థతను పరీక్షించడం కొనసాగించనుంది. శీతాకాలం తర్వాత కూడా ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగినట్లయితే భారత్, రష్యా పొత్తు కూడా నిశిత పరిశీలనకు గురవుతుంది. న్యూఢిల్లీ పదేపదే చెబుతున్న ‘బహుళ–అమరిక వాదం’ కూడా 2023లో తీవ్రమైన ఒత్తిడి పరీక్షకు గురికాక తప్పదు. అయితే 2022 గురించి ఏమైనా చెప్పుకోవాలీ అంటే, భారత వాణి విశిష్టతను ప్రపంచం గుర్తించింది. మున్ముందు అది అంతర్జాతీయ వేదికలపై మరింతగా విస్తరిస్తుంది. ఇప్పుడప్పుడే దాని ప్రతిధ్వనులు తగ్గిపోవు. (క్లిక్ చేయండి: అమృతోత్సవ దీక్షకు ఫలితం?!)
- హర్ష్ వి. పంత్
ఉపాధ్యక్షుడు, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, న్యూఢిల్లీ
(‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment