వాతావరణ మార్పు సమస్య, కనిపిస్తున్న వాస్తవం. ఇదో అతిపెద్ద ప్రపంచ సమస్య అనేదీ అంతే నిజం. కానీ ఏ ఒక్క దేశమో దీన్ని ఎదుర్కోలేదు. అలాగని ఏ దేశమూ దీన్ని విస్మరించలేదు కూడా! ఈ ఏడాది ఈజిప్టులో జరగనున్న కాప్–27, ఇండోనేసియాలో నిర్వహించనున్న జీ–20 సదస్సులో ఇది చర్చకు రానుంది. ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కూరుకునివున్న తరుణంలో ఈ చర్చ ఎటుపోతుందో తెలీదు. అయితే భారత్ మాత్రం తన వాగ్దానం మేరకు 2070 నాటికి కర్బన ఉద్గారాలను సున్నాకు చేర్చాల్సి ఉంది. ఈ దీర్ఘకాలిక లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం శిలాజేతర ఇంధనాల ఉత్పత్తిని పెంచడం, పర్యావరణ అనుకూల హైడ్రోజన్ వినియోగాన్ని ప్రోత్సహించడం, ప్రజారవాణా వ్యవస్థను విస్తృతం చేయడం, మెరుగైన డిజైన్ల ద్వారా ఇళ్లల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం లాంటి స్వల్పకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.
మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి, వాతావరణ మార్పుల ప్రభావం. పైగా ఇది ఏ ఒక్క దేశానికో సంబంధించిన సమస్య కాదు. అందరి సహకారం లేకపోతే ఏమాత్రం పరిష్కరించలేని సమస్య కూడా. ప్రపంచస్థాయిలో మూకుమ్మడి ప్రయత్నంతోనే గట్టెక్కగల ఈ సమస్య... ఈ ఏడాది ఈజిప్టులో జరగనున్న ‘కాప్–27’ సమావేశాలతోపాటు, నవంబరులో ఇండోనేసియాలో నిర్వహించనున్న జీ–20 సదస్సు సమావేశాల్లోనూ చర్చకురానుంది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, అభివృద్ధి చెందిన దేశాలు... రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, యూరప్‌లో పెరిగిన గ్యాస్ ధరలు, ద్రవ్యో ల్బణ నియంత్రణ చర్యలు ఆర్థిక మాంద్యానికి దారితీస్తాయేమో అన్న అందోళనల మధ్య నలుగుతున్న తరుణంలో ఈ ముఖ్యమైన అంశం మళ్లీ చర్చకు రావడం! అమెరికా – చైనాల మధ్య రాజకీయాలు నిత్యం రగులుతూండటం కూడా ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఈ పరిస్థి తుల నేపథ్యంలో వాతావరణ మార్పుల సమస్య నుంచి గట్టెక్కేందుకు భారత్ అనుసరించాల్సిన వ్యూహమేమిటి? వైఖరేమిటి? ఇక్కడ రెండు ముఖ్యమైన అంశాలను గుర్తుపెట్టుకోవాలి. మొదటిది: జీ–20, కాప్–27 సదస్సుల్లో వాతావరణానికి సంబంధించి మన వ్యూహ మేమిటో ఎలా వివరిస్తామన్నది. రెండోది: వాతావరణ మార్పుల నిర్వహణ కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ధనిక దేశాలు నిధులివ్వాలన్న అంశంపై మన వైఖరి.
వాతావరణ మార్పుల ప్రభావాన్ని నియంత్రించేందుకు భారత్ లక్ష్యాలేమిటన్నది గత ఏడది గ్లాస్గోలో జరిగిన కాప్–26 సదస్సులో ప్రకటించాం. దీని ప్రకారం 2070 నాటికి కర్బన ఉద్గారాలను శూన్య స్థితికి చేర్చాలి. స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలతో ఎక్కువయ్యే కర్బన ఉద్గారాలను 2005 నాటి స్థాయిలో 45 శాతం వరకూ తగ్గిం చాలి. విద్యుదుత్పత్తి మొత్తంలో 2030 నాటికి శిలాజేతర ఇంధనాల ద్వారా జరిగే ఉత్పత్తి (సౌర, పవన) సగం ఉండాలి.
2030 నాటికి సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా 450 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయాలన్న లక్ష్యం కీలకమైంది. ఈ లక్ష్యాన్ని అందుకునేలా సరఫరా సంబంధిత సమస్యలను అధిగమిం చేందుకు అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంది. అదే సమయంలో విద్యుత్తుతో నడిచే వాహనాల వినియోగం పెంచాలి. రైల్వే లైన్ల విద్యు దీకరణ వేగంగా చేపట్టాలి. ఉక్కు, ఎరువులు, పెట్రో రసాయనాల తయారీలో పర్యావరణ అనుకూల హైడ్రోజన్ వాడకాన్ని పెంచాలి. అంతేకాకుండా... మెరుగైన డిజైన్లు, పదార్థాల వాడకంతో భవనాల ద్వారా అయ్యే విద్యుత్తు ఖర్చును (లైట్లు, ఏసీల వంటివి) కూడా తగ్గించాల్సి ఉంటుంది. వీటన్నింటికీ తోడుగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత విస్తృతం చేయడం ద్వారా మాత్రమే మనం కాప్–26లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చగలం.
విజయం సాధించాలంటే చాలా రంగాల్లో కృషి జరగాలి. కేంద్ర ప్రభుత్వంలోని అనేక మంత్రిత్వ శాఖలు పరస్పర అవగాహనతో ముందుకు సాగాలి. ఈ విషయాల్లో కీలకమైన ప్రైవేట్ రంగం అవస రమూ చాలానే ఉంటుంది. 2070 వరకూ తీసుకోబోయే ప్రతి విధా నాన్ని విడమర్చి చెప్పాల్సిన అవసరం లేకపోయినా, రాగల పదేళ్లలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామో చెప్పడం ద్వారా అంతర్జాతీయ వేదికలపై విశ్వాసం పొందవచ్చు. ఈ వివరాలు యూఎన్‌ఎఫ్‌సీసీకి మనమిచ్చే ‘నేషనలీ డిటర్మైండ్ కాంట్రిబ్యూషన్స్’ ప్రణాళికలో లేకున్నా ఫర్వాలేదు. కానీ ఈ పదేళ్ల లక్ష్యాలు దీర్ఘకాలిక లక్ష్యాల సాధన దిశలో సక్రమంగానే ప్రయాణిస్తున్నామా, లేదా? అన్నది తెలుసు కునేందుకు ఉపయోగపడతాయి. ఈ లెక్కన రాగల పదేళ్లలో మనం అందుకోవాల్సిన లక్ష్యాలను ఒక్కటొక్కటిగా చూస్తే:
1) 2070 నాటికి కర్బన ఉద్గారాలను శూన్యస్థితికి తీసుకు రావడమంటే, బొగ్గు వినియోగాన్ని పూర్తిగా పరిహరించడమనే అర్థం. కాబట్టి విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంచేందుకు శిలాజేతర ఇంధనా లను మాత్రమే వాడాలి. నిర్మాణంలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రా లను పరిగణనలోకి తీసుకుని బొగ్గు పతాక వినియోగం ఎప్పటికన్న అంశంపై నిర్ణయం జరగాలి. దశలవారీగా సుమారు 50 గిగా వాట్ల మేర బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తిని నిలిపివేయాలి.
2) కర్బన ఉద్గారాలు ఏ రోజుకు పతాక స్థాయికి చేరవచ్చునో కూడా ఒక తేదీ నిర్ణయించుకోవచ్చు.
3) విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంలు) ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందిప్పుడు. సంప్రదా యేతర ఇంధన వనరుల ద్వారా విద్యుదుత్పత్తిని పెంచేందుకు ఇది పెద్ద అవరోధం. డిస్కమ్‌లను ఆదుకునేందుకు నాలుగోసారి ప్రయత్నం జరుగుతోంది. ఇందుకోసం మల్టీ డెవలప్‌మెంట్ బ్యాంకుల సాయం తీసుకోవచ్చు. దీనివల్ల నియమ నిబంధనల ఏర్పాటు విషయంలో ఆర్థిక సంస్థలకు కొంత స్వాతంత్య్రం ఉంటుంది. ఇది రాష్ట్రాలకు కొంత నమ్మకం కల్పించి పంపిణీ వ్యవస్థలో కొంత భాగాన్ని ప్రైవేట్ పరం చేసేలా ప్రోత్సాహం లభిస్తుంది.
4) సంప్రదాయేతర వనరులు ముడి చమురు మాదిరిగా వాడుకుంటే తరిగిపోయే ఇంధనం కాదు. కాబట్టి మొత్తం విద్యుదు త్పత్తిలో వీటివాటా ఎంత పెరిగితే అంత మేలు. ఇందుకోసం గ్రిడ్ నిర్వహణ, విద్యుత్తు నియంత్రణల్లో ఎన్నో కొత్త ఆవిష్కరణలు జర గాలి. కేంద్రస్థాయి విద్యుత్తు నియంత్రణ సంస్థలు రాష్ట్రస్థాయి సంస్థ లతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. గ్రిడ్ ఫ్లెక్సిబిలిటీ లక్ష్యంగా నియమ నిబంధనల్లో మార్పులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
5) పర్యావరణ అనుకూల హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచేందుకు శిలాజ ఇంధనాల స్థానంలో దీన్ని వాడే పరిశ్రమలకు తగిన రాయితీలు కల్పించి సహకారం అందించవచ్చు.
6) 2030 నాటికల్లా కర్బన ఉద్గారాలను శూన్యస్థాయికి చేరుస్తామని భారతీయ రైల్వే ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇందుకోసం దేశంలో రైళ్లన్నీ విద్యుత్తుతోనే నడవాల్సి ఉంటుంది. అది కూడా సంప్రదాయేతర, కర్బన ఉద్గారాలుండని పద్ధతుల్లో ఉత్పత్తి చేసే విద్యుత్తును వాడాల్సి ఉంటుంది. అంటే దశలవారీగా ప్రస్తుత డీజిల్ ఇంజిన్లను తొలగిం చడం లేదా విద్యుత్తుతో పనిచేసేలా చేయడం అవసరం.
7) ద్విచక్ర వాహనాలు, కార్లు, త్రిచక్ర వాహనాల్లో విద్యుత్తుతో పనిచేసేవాటి భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు వేటికి అవే ప్రత్యేకంగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా బ్యాటరీ ఛార్జింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. స్టేషన్ల ఏర్పాటును వేగ వంతం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను ప్రకటించవచ్చు.
కార్బన్ న్యూట్రల్ ఆర్థిక వ్యవస్థకు మళ్లేందుకు కావాల్సిన నిధులను సమీకరించడం ఎలా అన్నది ఇప్పటికీ తెగని వివాదం. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ధనిక దేశాలు సాయం చేస్తాయని యూఎన్‌ఎఫ్‌సీసీ చర్చల్లో ఒక అవగాహనైతే కుదిరింది. 2015 నాటి ప్యారిస్ ఒప్పందంలో 2020 నాటికి ఏటా వంద బిలియన్ డాలర్లు ధనిక దేశాలు చెల్లించాలన్న తీర్మానమూ ఉంది. అయితే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల నుంచి రావాల్సిన ఈ మొత్తం ఇప్పటివరకూ అంద లేదు. 2025 నాటికైనా అందేలా చూడాలని గత ఏడాది కాప్ సమా వేశంలో విజ్ఞప్తి చేశారు. కాప్–26లో నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోవాలంటే ధన సహాయం అన్నది కీలకం. కానీ అభివృద్ధి చెందిన జీ–7 దేశాలు ఇప్పటివరకూ నిధుల ఊసెత్తడం లేదు. ఇండో నేసియాలో జరిగే జీ–20 సమావేశాల్లోనైనా దీనిపై ఒక గట్టి నిర్ణయం జరగడం అవసరం. వచ్చే ఏడాది జీ–20 నిర్వహణ బాధ్యతలు భారత్ చేతిలో ఉంటాయి. ఆ తరువాత బ్రెజిల్, దక్షిణాఫ్రికాల వంతు. అభివృద్ధి చెందుతున్న ఈ దేశాల నేతృత్వంలోనైనా ధనిక దేశాలు వాతావరణ మార్పుల సమస్యను అధిగమించేందుకు అవసరమైన నిధులు అందజేస్తాయని ఆశించాలి. నిధుల ఫలితం ఎలా ఉన్నా మన రోడ్‌మ్యాప్ మనం సిద్ధం చేసుకోవాలి.
– మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, ఉత్కర్ష్ పటేల్
వ్యాసకర్తలు వరుసగా ప్లానింగ్ కమిషన్ మాజీ డిప్యూటీ చైర్మన్; ‘సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్’ అసోసియేట్ ఫెలో
(‘ద మింట్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment