మూత్రం నుంచి విద్యుత్‌ | Palakkad IIT researchers turn urine into energy and bio-fertilizer | Sakshi
Sakshi News home page

మూత్రం నుంచి విద్యుత్‌

Published Fri, Feb 16 2024 5:24 AM | Last Updated on Fri, Feb 16 2024 11:18 AM

Palakkad IIT researchers turn urine into energy and bio-fertilizer - Sakshi

పాలక్కడ్‌: కాలుష్యకారక శిలాజ ఇంథనాలకు బదులు పునరుత్పాదక ఇంథనంపై ప్రపంచం దృష్టిపెట్టాలన్న ఆకాంక్షల నడుమ ఐఐటీ పాలక్కడ్‌ పరశోధకులు పునరుత్పాదక ఇంథనాన్ని మూత్రం నుంచి ఉత్పత్తిచేసి ఔరా అనిపించారు. సంబంధిత పరిశోధనా పత్రాన్ని ప్రముఖ ఆన్‌లైన్‌ జర్నల్‌ ‘సపరేషన్‌ అండ్‌ ప్యూరిఫికేషన్‌ టెక్నాలజీ’లో ప్రచురించారు. ఈ పునరుత్పాదక విద్యుత్‌ తయారీ కోసం వారు కొత్తగా ఎలక్ట్రో కెమికల్‌ రిసోర్స్‌ రికవరీ రియాక్టర్‌(ఈఆర్‌ఆర్‌ఆర్‌)ను తయారుచేశారు.

ఇందులో మూత్రాన్ని నింపి ఎలక్ట్రోరసాయనిక చర్యల ద్వారా విద్యుత్‌ను, సహజ ఎరువును ఉత్పత్తిచేస్తారు. ఈ విద్యుత్‌తో స్మార్ట్‌ఫోన్లును చార్జ్‌చేయొచ్చు. విద్యుత్‌ దీపాలను వెలిగించవచ్చు. రీసెర్చ్‌ స్కాలర్‌ వి.సంగీత, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ శ్రీజిత్‌ పీఎం, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌లో రీసెర్చ్‌ అసోసియేట్‌ రీను అన్నా కోషీల బృందం ఈ పరిశోధన చేపట్టింది. ఈఆర్‌ఆర్‌ఆర్‌ ద్వారా నైట్రోజన్, ఫాస్పరస్, మెగ్నీషియంలు ఎక్కువగా ఉండే సహజ ఎరువునూ పొందొచ్చని ఐఐటీ పాలక్కడ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

అమ్మోనియా సంగ్రహణి, క్లోరినేషన్‌ గది, ఎలక్ట్రికల్‌ గొట్టాల సమన్వయంతో ఈ రియాక్టర్‌ పనిచేస్తుంది. ఇందులో మెగ్నీషియంను ఆనోడ్‌గా, గాలి కార్భన్‌ను కాథోడ్‌గా వాడతారు. థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ ప్రాంగణాల్లో మూత్ర విసర్జన ఎక్కువ. ఇలాంటి చోట్ల ఈ రియాక్టర్ల ద్వారా ఎక్కువ స్థాయిలో విద్యుత్‌ను ఉత్పత్తిచేసి అక్కడి విద్యుత్‌దీపాలను వెలిగించవచ్చు. ప్రస్తుతం ఈ సాంకేతికత ప్రయోగ దశలోనే ఉందని ఐఐటీ పాలక్కడ్‌ స్పష్టంచేసింది. ఈ టెక్నాలజీపై పేటెంట్‌ కోసం బృందం ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. ప్రాజెక్టుకు కేంద్రమే నిధులిచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement