లండన్: శిలాజ ఇంధనాల వాడకం, కాలుష్యం, వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతల పెరుగుదల, ప్రకృతి విపత్తులు.. వీటి గురించి తరచుగా వింటూనే ఉన్నాం. అయినప్పటికీ ప్రపంచ దేశాలు నష్టనివారణ చర్యలు చేపట్టిన దాఖలాలు మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ప్రమాదకరమైన గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారం గరిష్ట స్థాయికి చేరినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా వెలువడుతున్న గ్రీన్‌హౌజ్ వాయువులు 54 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌తో సమానమని తెలియజేసింది.
ప్రపంచవ్యాప్తంగా 50 మంది అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు భూ ఉష్ణోగ్రతలపై విస్తృత అధ్యయనం నిర్వహించి, ఉమ్మడిగా నివేదిక విడుదల చేశారు. మానవ చర్యలు, గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారం భూతాపం, వాతావరణ మార్పులకు కారణమవుతున్నట్టు పేర్కొన్నారు. జీవజాలానికి ఇన్నాళ్లూ ఆవాసయోగ్యంగా ఉంటూ వస్తున్న భూగోళం క్రమంగా అగ్నిగుండంగా మారిపోతోందని హెచ్చరించారు. సైంటిస్టులు తమ నివేదికలో ఇంకా ఏం చెప్పారంటే..
► 1800వ సంవత్సరంతో పోలిస్తే భూఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పుడు 1.14 డిగ్రీలు పెరిగాయి.
► ఉష్ణోగ్రత ప్రతి పదేళ్లకు రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీల చొప్పున పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భూతాపం మానవాళిని కబళించడం ఖాయం.
► గతంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి.
► ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని యథాతథంగా కొనసాగిస్తే భూ ఉపరితల ఉష్ణోగ్రత సమీప భవిష్యత్తులోనే 2 డిగ్రీలు పెరిగిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం.
► పారిశ్రామిక విప్లవం ముందునాటి సగటు కంటే ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీలకు మించి పెరగనివ్వరాదన్న పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని సాధించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలి. మునుపెన్నడూ లేనిస్థాయిలో తక్షణమే పటిష్టమైన చర్యలు చేపట్టాలి.
► భూతాపం ముప్పు నుంచి మానవళి బయటపడాలంటే 2035 నాటికి ప్రపంచదేశాలు తమ గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలను 60 శాతానికి తగ్గించుకోవాలని సైంటిస్టు పియర్స్ ఫాస్టర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment