ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల భారీ వరదలు వచ్చి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించడం సాధారణ దృశ్యం అయ్యింది. ఇందుకు నానాటికీ పెరిగి పోతున్న కాలుష్యమే అసలు కారణం. ఈ కాలుష్యానికి అభివృద్ధి పేరుతో మానవుడు సాగిస్తున్న ప్రకృతి విధ్వంసమే హేతువని సైన్స్ చెబుతోంది. భూ స్వరూపాలను ఇష్టమొచ్చినట్లు మార్చడం, పేరాశతో సహజవనరులను విచక్షణారహితంగా వినియోగించడం, ప్రకృతి నియమాలకు ఎదురీదాలని ప్రయత్నించడం నేటి కరువులకూ, వరదలకూ అసలైన కారణాలని అధ్యయనాలు చెబుతున్నాయి. సహజ ప్రకృతి నియమాలకు అనుగుణంగా మనిషి జీవించడం ఒక్కటే ప్రకృతి విపత్తుల నుంచి బయటపడడానికి ఉన్న ఏకైక పరిష్కారం.
వాతావరణ మార్పులు, పెరుగుతున్న విపరీ తమైన వాతావరణ సంఘటన వల్ల గత 50 ఏళ్లుగా ప్రకృతి వైపరీత్యాలు పెరుగు తున్నాయి. ఇవి పేద దేశాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ), యూఎన్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ సంస్థలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వరదలు వస్తున్న వార్తలు ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒకే రోజు పడే వర్షం ఎక్కువగా ఉండడం వాతావరణంలో వచ్చిన మార్పుల పరిణామం. అందులో అనుమానం లేదు.
వాతావరణంలో విపరీత మార్పులకు మానవ కార్యకలాపాల నుంచి ఉద్భవించిన కాలుష్య ఉద్గారాలు కారణం. కర్బన ఉద్గారాల వల్ల భూమి ఉష్ణోగ్రత పెరిగి, సముద్ర జలాలు, గాలి, మంచు వంటి వాటిమీద దుష్ప్రభావం పడుతోంది. వరదలు నివారించాలంటే కాలుష్యం తగ్గించడమే ఉత్తమమైన మార్గం. అంటే, మానవులు ఏర్పరచుకున్న ‘శక్తి’ వనరులలో తీవ్ర మైన, సత్వర మార్పులు చేస్తేనే కాలుష్యం తొందరగా తగ్గుతుంది. ఈ విధంగా చూస్తే వరదలకు ‘స్థానిక’ కారణాలు ఉన్నట్టు అనిపించదు. ఎందుకంటే, కాలుష్యం ఒక భౌగోళిక పరి ణామం కాబట్టి.
చైనాలో వరదల బీభత్సం ఈ మధ్య ఎక్కువ అయ్యింది. ఈ ఏడాదే దాదాపు 3 కోట్ల మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. బీజింగ్‌లో 2012లో సంభవించిన వరదల్లో 79 మంది ప్రాణాలు కోల్పోయిన తరువాత తీవ్రమైన వర్షాల నుంచి రక్షించడానికి చైనా ఇటీవలి సంవత్సరాల్లో బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టింది. అధ్యక్షుడు జిన్‌పింగ్ ‘స్పాంజ్‌ల వంటి నగరాలను‘ నిర్మించాలని పిలుపునిచ్చారు. మిద్దె తోటలు, నీరు ఇంకే ఫుట్‌పాత్‌లు, భూగర్భ నిల్వ ట్యాంకులు, ఇతర స్పాంజ్ లాంటి వ్యవస్థలను ఉపయోగించి భారీ వర్షపాతాన్ని ఇంకే విధంగా చేసి, తరువాత నెమ్మదిగా నదులు లేదా జలాశయాల్లోకి విడుదల చేయడం. చైనాలో వరదల నివారణకు ‘స్పాంజి’ నగరాల కార్యక్రమం చేపట్టినా ఫలితం కానరాలేదు. ప్రకృతి సహజంగా చేసే ‘స్పాంజి’ పని... మానవ నిర్మిత వ్యవస్థల ద్వారా సాధ్యం కాదు అని రుజువు అయ్యింది.
భారత దేశంలో అనేక రాష్ట్రాలలో ఈ మధ్య కాలంలో ప్రతి ఏటా వరదలు వస్తున్నాయి. కోస్తా నగరాలైన ముంబాయి, చెన్నైల్లో వస్తున్న వరదలు అక్కడి భౌగోళిక పరిస్థితుల్లో తీవ్ర మార్పుల వల్ల సంభవిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. బెంగళూరు, హైదరా బాద్ నగరాలలో చెరువులు, వరద నీటి కాలువలు, నదులు కబ్జా కావడం వల్ల వరదలు వస్తున్నాయి.
2023 జూలైలో లోక్‌సభలో కేంద్ర మంత్రి ఒక ప్రశ్నకు సమాధా నంగా ఇచ్చిన సమాచారం గమనించదగింది. ‘కేంద్ర జల కమిషన్’ ప్రకారం గత మూడేళ్లుగా (2020, 2021, 2022) దేశంలో 465 తీవ్ర మైన, అతి తీవ్రమైన వరదలు సంభవించాయి. ఈ సంవత్సరం కూడా వరదలు పెరిగాయి. 23 రాష్ట్రాలలో అత్యధికంగా బిహార్ (99), ఉత్తర ప్రదేశ్ (75), అసోం (60)లలో తీవ్రమైన, అతి తీవ్రమైన వరదలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో 18, తెలంగాణ లో 14 వచ్చాయి. ఈ ఏడు హిమాచలప్రదేశ్, హరియాణాల్లో తీవ్రమైన వరదలు వచ్చాయి.
అయితే, సాధారణ వర్షాలకే వరదలు రావడానికి స్థానిక పరిస్థి తులే కారణం. అధిక వర్షాల సంగతి చెప్పనవసరం లేదు. వరదల తీవ్రత, నష్టం పెరగడానికి స్థానిక వనరుల విధ్వంసం ప్రధాన కారణం. నీటి వనరులైన నదులు, వాగులు, తటాకాల ‘సరిహద్దు లను’ మనం చెరిపేస్తే, వాటి సామర్థ్యం మనం రకరకాలుగా తగ్గిస్తే, నీరు ఒలుకుతుంది. చెరువులు, కుంటలు, వాగుల ఆక్రమణల వల్ల వాటి సామర్థ్యం తగ్గిస్తున్నాం. మన నెత్తి మీద పడి, మన కాళ్ళ కింద ప్రవహించే నీటిని ఒడిసిపట్టుకునే సహజ వ్యవస్థను ‘అభివృద్ధి’ పేరిట నాశనం చేసి, నీళ్ళ కొరకు పెద్ద ఆనకట్టలు కట్టి నీటి సరఫరా ‘సుస్థిరం’ చేసుకుంటున్నాం అనే భ్రమలో మనం ఇప్పటికీ ఉన్నాము.
ఇక్కడ పడ్డ నీటిని వదిలిపెట్టి, ఎక్కడో వాటిని ఆపి, ఆ నీటిని పైపుల ద్వార సరఫరా చేస్తూ, విద్యుత్ వినియోగిస్తూ, అది ఆధునికతగా భావిస్తూ తరిస్తున్నాము. కాగా, ఈ అసహజ నీటి వ్యవస్థ కారణంగా ప్రకృతి దెబ్బతిని కుదేలు అయితే ఆ నష్టం భరి స్తున్నది ఎవరు? చిన్న ప్రవాహాలను నిర్లక్ష్యం చేసి, నదులుగా మారిన తరువాత అడ్డు కట్టలు కట్టి మనం ఉపయోగించే నీటికి ‘విలువ’ పెరుగుతుంది. ఎందుకంటే పెట్టుబడికి, నిర్వహణకు ఖర్చు అయ్యింది కనుక. ఈ ‘విలువ’ పెంచిన నీరు రకరకాల కారణాల వల్ల కొందరికే అందుతుంది. సామాజిక అసమానతలకు కారణం అవుతుంది.
కొండల వెంబడి నీరు జాలువారడానికి అనువుగా ప్రకృతి ఏర్పరుచుకున్న దారులను మనం రోడ్ల కొరకు నాశనం చేస్తే, కొండ చరియలు పడడం చూస్తున్నాము. కొండలు, గుట్టల మీద సహజ కవ చంగా ఉండే చెట్లు, అడవి, గడ్డి తదితర పచ్చదనాన్ని మనం హరిస్తే మట్టి కొట్టుకుని పోయి, నీటి వేగానికి, ప్రవాహానికి ‘సహజ’ అడ్డంకులు ఉండవు. వరద నీరు తగ్గినప్పుడు ప్రభావిత ప్రాంత భూములలో సాధారణంగా పూడిక బురదతో నిండి ఉంటాయి. ఈ రకమైన అవ శేషాలు పోషకాలతో నిండి ఉండి ఆ ప్రాంతంలోని రైతులకు వ్యవ సాయానికి ప్రయోజనం చేకూర్చేది.
ఇప్పుడు ఆ పరిస్థితి అంతటా లేదు. కొన్ని చోట్ల వరద... ఉన్న సారవంతమైన భూమిని కోసేస్తే, ఇంకొక చోట ఇసుకను నింపుతున్నది. పట్టణాల నుంచి వచ్చిన వరద అనేక రకాల కలుషితాలను వదిలిపెడుతున్నది. కొండ ప్రాంతం నుంచి మైదానాలకు వచ్చే వరద బండ రాళ్ళు, చెట్టు కొమ్మలు, ఈ మధ్య కార్లు, మోటార్ సైకిళ్ళు, ఇండ్లు, ఇండ్ల గోడలు, సిమెంటు కట్టడాల అవశేషాలను కూడా తీసుకువస్తున్నది. వరద నీటిలో తమ ‘పాపాలను’ (వ్యర్ధాలు, కాలుష్య జలాలు) పడేసే పరిశ్రమలు కూడా ఉన్నాయి.
పశువులు సాధారణంగా నీళ్ళలో ఈదగలవు. కాని, వేగంగా ప్రవహించే వరదలో చాల మటుకు అవి చనిపోతుంటాయి. అసలు పాడి పశువుల సంఖ్య తగ్గిపోతున్న క్రమంలో పశువుల మరణాల గురించి ఆలోచించేందుకు ఆధునిక సమాజం సిద్ధంగా లేదు. వరదలు చేసే ఆస్తి నష్టం వల్ల పేదలు ఇంకా పేదరికంలోకి నెట్టబడుతున్నారు. రోడ్లు, బ్రిడ్జిలు, పైపులైన్లు, విద్యుత్ స్తంభాలు తదితర ప్రజా ఆస్తులకు హాని కలిగి ప్రభుత్వ నిధుల మీద భారం పెరుగుతున్నది.
వరదల నివారణకు భూమి వినియోగం మీద అధ్యయనం చాలా అవసరం. ప్రకృతిలో, భూమితో ముడిపడి ఉన్న నీటి సహజ చక్రా లను అర్థం చేసుకోవాలి. నదులు పుట్టే ప్రదేశంలో అర్థరహిత కాంక్రీ టికరణ చేటు చేస్తున్నది. గోదావరి నది పుట్టే నాసిక్ నగరంలో ఇట్లా చేసి నాలుక కరుచుకున్నారు. హైదరాబాద్‌కు నీటిని అందించే మూసీ నది పరివాహక ప్రాంతం, ముఖ్యంగా అనంతగిరి కొండలలో ఉన్న అడవి నాశనం వల్ల, కింది ప్రాంతాలలో వరద ముప్పు పెరుగు తున్నది. చెరువులు వరద నివారణకు ఉపయోగపడతాయి.
కాని, వాటిని దుర్వినియోగపరుస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో కొల్లేరు సరస్సు విధ్వంసం వల్ల చుట్టూ పరిసర ప్రాంతాలలో వరద ముప్పు పెరుగు తున్నది. తూర్పు కనుమల ద్వార ప్రవహించే అనేక నదులు బంగా ళాఖాతంలో కలుస్తాయి. కానీ, వాటి పరివాహక ప్రాంతంలో మైనింగ్ వల్ల, అడవుల నరికివేత వల్ల వరద ముప్పు పెరిగింది. శారద నది, రుషికుల్య తదితర నదులు మైదాన ప్రాంతాలలో, కోస్తాలో ప్రమా దకరంగా మారడానికి మానవ ప్రకృతి విధ్వంసకర కార్యకలాపాలే. ఇప్పటికైనా ప్రభుత్వాలు చేసిన, చేస్తున్న, చేయబోతున్న కార్య క్రమాలు, నిర్మాణాలను సమీక్ష చేసి, వరద నివారణకు, వరద ముప్పు తగ్గించటానికి సుస్థిర ప్రణాళికలు చేపట్టాలి. ఆలస్యం మరింత వినాశనానికి కారణమవుతుందనే సంగతి మరువరాదు.
వ్యాసకర్త: దొంతి నరసింహారెడ్డి,
విధాన విశ్లేషకులు
90102 05742
Comments
Please login to add a commentAdd a comment