రబీ.. సాఫీగా సాగేనా
Published Mon, Jan 6 2014 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
సాక్షి, ఏలూరు : వరుస తుపానులు, భారీవర్షాల కారణంగా సార్వా పంట తుడిచిపెట్టుకుపోవడంతో తల్లడిల్లిన రైతులు కోటి ఆశలతో రబీ సాగు ప్రారంభించారు. జిల్లాలో మెట్ట, సెమీ డెల్టాలో నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే దాళ్వా సాగు చివరి వరకు సాఫీగా సాగుతుందా అనే అనుమానాలు అన్నదాతలను పట్టి పీడిస్తున్నాయి. గోదావరిలో నీటి లభ్యత రెండు నెలల్లో సగానికి పైగా తగ్గుతుందని అధికారులు అంచనా వేయడంతో పాటు ఆధునికీకరణ పనుల కారణంగా మార్చి 31న కాలువలకు నీటి విడుదలను నిలిపివేస్తామని కలెక్టర్ ప్రకటించడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా సాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమా దం పొంచి ఉండడం వారిని కలవర పరుస్తోంది. దీంతో డెల్టా, మెట్ట ప్రాంతాల్లోని రైతులు వరిని వదిలి అపరాల సాగు వైపు మొగ్గుచూపుతున్నారు.
ముమ్మరంగా దాళ్వా నాట్లు
మెట్ట, సెమీ డెల్టాలో నాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొయ్యలగూడెం, దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, చాగల్లు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు ప్రాంతాల్లోని 1,15,000 ఎకరాల్లో నాట్లు పూర్తైట్టు వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు వీడీవీ కృపాదాస్ ‘సాక్షి’కి తెలిపారు. గోదావరి కెనాల్ కింద 3,67,500 ఎకరాల్లో నాట్లు పడాల్సి ఉండగా ఇప్పటి వరకు డెల్టాలో 52,500 ఎకరాల్లో, మెట్టలో 62,500 ఎకరాల్లో పూర్తయ్యాయి. మొక్కజొన్న 75 వేలు, పెసలు, మినుములు 1,375, వేరుశనగ 6 వేల ఎకరాల్లో వేశారు.
తగ్గనున్న వరి సాగు విస్తీర్ణం
ఈ ఏడాది జిల్లాలో 6,35,107.5 ఎకరాల్లో దాళ్వా సాగు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. 4,86,250 ఎకరాల్లో వరి, 1,11,330 ఎకరాల్లో మొక్కజొన్న, 13,215 ఎకరాల్లో మినుములు, 11,875 ఎకరాల్లో పెసలు, 12437.5 ఎకరాల్లో వేరుశనగ పంటలు వేయించాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే సాగునీటి ఎద్దడి పొంచి ఉండడం, లోసరి మెయిన్ కెనాల్‌తో పాటు ఇతర కాలువల ఆధునికీకరణ పనులతో నీటి విడుదల నిలిపివేయడంతో రైతులు వరి సాగుకు వెనక్కితగ్గారు. దీంతో వరి విస్తీర్ణం తగ్గనుంది.
వంతులవారీ విధానం అమలయ్యే అవకాశం
రబీలో సాగునీటి అవసరాలకు 43.72 టీఎంసీల నీరు అవసరం. ప్రస్తుతం పశ్చిమ డెల్టాకు 7 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఫిబ్రవరి నాటికి ఇన్‌ఫ్లో6 వేల క్యూసెక్కులకు పడిపోయే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే సాగునీటికి ఇక్కట్లు తప్పవు. మరోవైపు మార్చి 31తో కాలువలు మూసేసి తిరిగి జూన్ 15న తెరవాలని సాగునీటి సలహామండలి సమావేశంలో నిర్ణయించారు. కాలువలకు నీరు నిలిపివే సే సమయానికి పంటలు కోతకు వచ్చే అవకాశం లేదు. అంతేకాకుండా తాగునీటికి 4 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 0.20 టీఎంసీలు కావాలి. ఈ పరిస్థితుల్లో 2009లో పాటించిన వంతులవారీ విధానాన్ని మరోసారి అమలులోకి తెచ్చి నీటిని పొదుపుగా వాడుకుంటే తప్ప దాళ్వా గట్టెక్కాలా కనిపించడం లేదు.
Advertisement