రబీ నష్టం రూ.1,023 కోట్లు
రబీ నష్టం రూ.1,023 కోట్లు
Published Mon, Mar 13 2017 12:36 AM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM
- అక్టోబరు నుంచి చినుకు జాడ కరువు
- దారుణంగా పడిపోయిన దిగుబడులు
- పతనమైన ధరలు
- నట్టేట మునిగిన శనగ రైతులు
కర్నూలు(అగ్రికల్చర్): రబీ సీజన్ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అక్టోబరు నుంచి చినుకు జాడ లేకపోవడంతో భూమిలో తేమ ఆరిపోయింది. శనగతో పాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. ఎన్నడూ లేని విధంగా దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. విత్తన సమయంలో ఉన్న ధర.. పంట చేతికొచ్చే సమయానికి తగ్గిపోయింది. రైతులకు పెట్టిన పెట్టుబడుల్లో 50 శాతం కూడా దక్కలేదు.
వర్షాభావ పరిస్థితుల్లో ఈ ఏడాది ఖరీఫ్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎన్నో ఆశలతో రబీ పంటలు సాగు చేసిన రైతులకు అప్పులే మిగిలాయి.
రబీ సీజన్‌లో ప్రధానంగా శనగ సాగు అయింది. ఈ పంట సాధారణ సాగు విస్తీర్ణం 1,92,744 హెక్టార్లు. అయితే ఈ ఏడాది 1.79,027 హెక్టార్లలో శనగను సాగు చేశారు. హెక్టారుకు సగటున రూ.30 వేల ప్రకారం ఒక్క శనగ పంటపైనే రూ.537 కోట్ల పెట్టుబడి పెట్టారు. బ్యాంకులు సహకరించక పోవడంతో రైతులు బంగారం ఆభరణాలు తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పంట సాగు చేశారు. వర్షాలు లేకపోవడం, భూమిలో తేమ శాతం పడిపోవడం, కనీసం మంచు కూడా కురవకపోవడంతో శనగ పంటకు అపార నష్టం వాటిల్లింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఖరీఫ్, రబీ పంటలు పూర్తిగా దెబ్బతినడంతో జిల్లాలో ఏ రైతును కదిలించినా కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి.
శనగ ధరలు డమాల్..
విత్తనం సమయంలో క్వింటాల్ శనగ ధర రూ.10వేలకు పైగా ఉంది. డిసెంబరు నెలలో శనగ ధర గరిష్టంగా రూ.8840 ఉంది. ఫిబ్రవరి, మార్చి నెలకు వచ్చే సరికి ఈ ధర రూ.5000కు పడిపోయింది. రైతులు కష్టనష్టాల్లో ఉన్నపుడే ధరలు పడిపోయాయి. కర్నూలు, ఓర్వకల్లు, ఆలూరు తదితర ప్రాంతాల్లో శనగ విత్తనాలకు పెట్టిన ఖర్చు కూడ దక్కక రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
పెట్టుబడి మట్టిపాలు..
జిల్లాలో రబీ సాధారణ సాగు 3,54,341 హెక్టార్లు. ఈ ఏడాది 2,92,381 హెక్టార్లలో పంటలు సాగు అయ్యాయి. విత్తనాలు, ఎరువులు, బాడుగలు, పురుగు మందులు, కూలీలు తదితర వాటికి హెక్టారుకు సగటున రూ.35వేలు పెట్టుబడి పెట్టారు. మొత్తంగా ఒక్క రబీ పంటలపై రైతులు రూ.1023 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. పంటలు బాగా పండి ఉంటే.. ఈ పెట్టుబడి అదనంగా రూ. 1023 కోట్లు రావాల్సి ఉంది. అయితే పెట్టుబడిలో 50 శాతం కూడా దక్కలేదంటే రైతుల దుస్థితి ఏ విధంగా ఉంటుందో ఉహించవచ్చు. రబీ వేసిన శనగ, జొన్న, ధనియాలు, కుసుమ, మినుము తదితర పంటలన్ని దెబ్బతిన్నాయి. రబీలో శనగ తర్వాత అత్యధికంగా జొన్న సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల వెంటాడటంతో జొన్నలో కూడా దిగుబడులు పడిపోయాయి. రబీ పంటలు బ్బతినడంతో వీటికీ..పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రబీ పంటలకు బ్యాంకులు.. పంట రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు దూరం అయ్యారు.
Advertisement
Advertisement