సాక్షి, అమరావతి: మార్కెట్‌లో కనీస మద్దతు ధర దక్కని రబీ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. శనగల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆర్బీకేల ద్వారా రైతుల రిజిస్ట్రేషన్‌కు శ్రీకారం చుట్టారు. త్వరలో పెసలు, మినుముల కొనుగోలుకు సన్నాహాలు చేస్తున్నారు.
మద్దతు ధరకు సేకరణ...
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది క్వింటాల్‌కు శనగలకు రూ.5440, పెసలకు రూ.8558, మినుముకు రూ.6950, వేరుశనగకు రూ.5850 చొప్పున కనీస మద్దతు ధరలను నిర్ణయించింది. రబీ–2023 –24 సీజన్‌లో 7 లక్షల ఎకరాల్లో శనగ, 7.50 లక్షల ఎకరాల్లో మినుము, 1.92 లక్షల ఎకరాల్లో పెసలు, 1.61 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగయ్యాయి. శనగ 4.50 లక్షల టన్నులు, మినుము 3.89 లక్షల టన్నులు, వేరుశనగ 1.86 లక్షల టన్నులు, పెసలు 84 వేలటన్నుల దిగుబడులొస్తాయని అంచనా.
ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్‌కు పెసలకు రూ.9 వేల నుంచి 9300, మినుముకు రూ.9 వేల నుంచి 9500 ఉండగా, శనగలు మాత్రం రూ.5300 నుంచి రూ.5600 మధ్య ఉంది. కనీస మద్దతు ధరకు 1.14,163 టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన అనుమతి మేరకు ఆర్బీకేల ద్వారా శనగలు కొనుగోలుకు మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేసింది.
గురువారం నుంచి రైతుల రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుడుతున్నారు. 26వతేదీ నుంచి కొనుగోలు చేపట్టనున్నారు. అదే రీతిలో మిగిలిన పంట ఉత్పత్తుల కొనుగోలుకు కూడా అనుమతి కోరుతూ మార్క్‌ఫెడ్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. కేంద్రం నుంచి అనుమతి రాగానే మినుము, పెసలు, వేరుశనగ కొనుగోళ్లకు శ్రీకారం చుట్టనున్నారు.
సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యం
పంట నమోదు (ఈ–క్రాప్) ఆధారంగానే ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ప్రతి రైతు రబీలో సాగుచేసిన పంట వివరాలను సమీప ఆర్బీకేలో నమోదు చేసుకోవాలి. కొనుగోలు సందర్భంగా సన్న, చిన్నకారు రైతులకే తొలుత ప్రాధాన్యతనిస్తారు. పంట కోతల తేదీ ఆధారంగా కొనుగోలు తేదీని నిర్ధారిస్తారు.
పంట సేకరణ తేదీ, కొనుగోలు కేంద్రం సమాచారాన్ని ఎస్‌ఎంఎస్ ద్వారా పంపిస్తారు దళారుల బెడద లేకుండా బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. కొనుగోలు వేళ రైతులకు ఈ–రసీదు ఇస్తారు. సేకరించిన ఉత్పత్తులను సులభంగా ట్రాక్ చేయడానికి వీలుగా సంచులకు క్యూఆర్ కోడ్/ఆర్‌ఎఫ్ ఐడీట్యాగ్ వేస్తున్నారు. చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఈ–సైన్ అమలు చేస్తున్నారు. నాణ్యత ప్రమాణాలకనుగుణంగా కొనుగోళ్లు జరిగేలా థర్డ్ పార్టీ ఆడిట్ చేస్తున్నారు.
పారదర్శకంగా కొనుగోళ్లు...
కనీస మద్దతు ధరకు రైతుల నుంచి శనగల సేకరణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. చిన్న, సన్న కారు రైతులకు తొలుత ప్రాధాన్యతనిస్తాం. ప్రభుత్వం అనుమతి రాగానే మినుము, పెసలు, వేరుశనగ కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం. – డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్
Comments
Please login to add a commentAdd a comment