మద్దతు కరువు | support drought | Sakshi
Sakshi News home page

మద్దతు కరువు

Published Sat, Apr 22 2017 12:13 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

మద్దతు కరువు - Sakshi

మద్దతు కరువు

గిట్టుబాటు ధర లేక రబీ వరి రైతు గగ్గోలు
– గ్రేడ్‌–ఏ ధాన్యానికి మద్దతు ధర రూ.1,510
– ప్రస్తుతం మార్కెట్‌లో రైతుకు లభిస్తున్న ధర రూ.1,266 మాత్రమే
– క్వింటాపై రూ.244 వరకు నష్టం
– కొనుగోలు కేంద్రాల ఏర్పాటును పట్టించుకోని ప్రభుత్వం
– గిట్టుబాటు ధర లేక రైతుల గగ్గోలు
 
కర్నూలు(అగ్రికల్చర్‌): వరి రైతుకు మద్దతు కరువయింది. ఇప్పటికే ఎండుమిర్చి, కంది, పసుపు, ఉల్లి ధరలు పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా వరి రైతులు తాము పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర లబించక నష్టాలను మూట కట్టుకుంటున్నారు. కనీస మద్దతు ధర కంటే ధరలు పడిపోయినపుడు రైతులు నష్టపోకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో కొనుగోలు చేయాల్సి ఉంది. రబీలో పండిన వరి ధాన్యానికి ధరలు పడిపోయినప్పటికీ అధికార యంత్రాంగం కనీస చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో రైతులు మద్దతు ధర కంటే తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకొని నష్టపోతున్నారు. ఖరీఫ్‌లో 95 శాతం వరకు కర్నూలు సోన తదితర సన్నరకాలు సాగు చేస్తారు.
 
రబీలో మాత్రం లావు రకాలు అంటే ఆర్‌ఎన్‌ఆర్, హంస వంటి రకాలు సాగవుతాయి. బండి ఆత్మకూరు, వెలుగోడు, ఆళ్లగడ్డ, నంద్యాల, శిరువెళ్ల, రుద్రవరం, పాములపాడు, నందికొట్కూరు, పగిడ్యాల తదితర మండలాల్లో రబీలో వరి సాగు చేస్తారు. ప్రతి ఏటా పంట కొతకు రాకముందే వరి ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ సారి మాత్రం రబీలో సాగు చేసిన వరి ధాన్యం మార్కెట్‌లోకి వచ్చినప్పటికీ, ధరలు పూర్తిగా పడిపోయిన్పటికీ పట్టించుకోకపోవడం గమనార్హం. దీన్ని అవకాశంగా తీసుకొని దళారీలు గ్రామాల్లోకి ప్రవేశించి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
 
మద్దతు ధర రూ.1,510.. మార్కెట్‌లో లభిస్తున్న ధర రూ.1,266 మాత్రమే
గ్రేడ్‌–ఏ ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.1510, సాధారణ రకానికి రూ.1470 మద్దతు ధర ఉంది. రబీలో çపండిన ధాన్యం గ్రేడ్‌–ఏ కిందకు వస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో 75 కిలోల బస్తా ధర కేవలం రూ.950 ఉంది. ఈ ప్రకారం క్వింటాకు లభిస్తున్న ధర రూ.1266 మాత్రమే. మద్దతు ధరతో పోలిస్తే రైతులు క్వింటాపై రూ.244 నష్టపోతున్నారు. మద్దతు కంటే ధరలు తగ్గినప్పుడు రైతులు నష్టపోకుండా పౌరసరఫరాల సంస్థను రంగంలోకి దింపి కొనుగోలు చేయించాలి. కానీ జిల్లాలో ఆ దిశగా కనీస చర్యలు కూడా లేకపోవడం గమనార్హం. జిల్లాలో రబీ సీజన్‌ వరి సాధారణ సాగు 19,296 హెక్టార్లు ఉండగా.. సాగు దాదాపు 10వేల హెక్టార్లలో సాగయింది. 90శాతం వరకు రబీలో లావు రకాలే సాగు చేస్తారు. గతంలో రబీలో పండిన వరిని లెవీ కింద సేకరించి ప్రజాపంపిణీకి వినియోగించేవారు.
 
మూడేళ్లుగా లెవీ సేకరణకు ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇప్పుడు లెవీ సేకరణతో పాటు కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎకరాకు పెట్టుబడి సగటున రూ.30వేలు పెడుతున్నారు. దిగుబడి ఎకరాకు సగటున 25 క్వింటాళ్లు వస్తోంది. ప్రస్తుతం లభిస్తున్న ధరల ప్రకారం ఎకరాకు రైతుకు రూ.31,600 మాత్రమే వస్తోంది. అంటే పెట్టుబడి మాత్రమే దక్కుతుంది. మద్దతు ధర లభిస్తే పెట్టుబడి దక్కి కొంతవరకు నికరాదాయం ఉంటుంది. వరికి మద్దతు ధరలు లేనప్పుడు పౌరసరఫరాల సంస్థ గ్రామైక్య సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు మార్కెటింగ్‌ శాఖ కల్పించాలి. కానీ ఎవ్వరు రబీ వరి రైతులను పట్టించుకోకపోవడం గమనార్హం.
 
రబీలో 6.25 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి
రబీలో వరి ధాన్యం దాదాపు 6.25 లక్షల క్వింటాళ్ల వరకు వచ్చింది. జిల్లాలో 25వేల ఎకరాల్లో(10వేల హెక్టార్లు) వరి సాగయింది. ఎకరాకు 25 క్వింటాళ్ల ప్రకారం రబీలో వరి ధాన్యం 6.25 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దాదాపు నెల రోజుల క్రితమే ధాన్యం మార్కెట్‌లోకి వచ్చింది. మద్దతు కంటే ధరలు పడిపోయి రైతులు తక్కువ ధరలకే కష్టార్జితాన్ని అమ్ముకొని నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే 20 శాతం మంది రైతులు పంటను అమ్మకొని నష్టపోయారు. ఇప్పటికైన జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకొని రైతులు నష్టపోకుండా కనీస మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది.
 
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
రబీలో 20 ఎకరాల్లో వరి సాగు చేసిన. ధాన్యం మార్కెట్‌లోకి వచ్చింది. దళారీలు తక్కువ ధరలతో కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత ధరలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వేలాది రూపాయల పెట్టుబడితో ఆరుగాలం శ్రమించిన రైతులకు ఇప్పుడున్న ధరల్లో పెట్టుబడి దక్కడం కూడా కష్టమే. ప్రభుత్వం స్పందించి అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
– హుసేన్‌బాషా, బండిఆత్మకూరు
 
క్వింటాకు రూ.230 నష్టం
రబీలో లావు రకాల వరి 4 ఎకరాల్లో సాగు చేసిన. పెట్టుబడి ఎకరాకు రూ.30 వేలు అయింది. దిగుబడి ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు వచ్చింది. ధర లేకపోవడంతో నష్టపోవాల్సి వచ్చింది. మద్దతు ధర రూ.1510 ఉంటే దళారీలు రూ.1280 ప్రకారం కొనుగోలు చేసినారు. మద్దతు ధరలో క్వింటాపై రూ.230 నష్టం వచ్చింది. మద్దతు ధరతో అమ్ముకుందామని కొన్నాళ్లు వేచి చూసిన. ఆ దిశగా చర్యలు లేకపోవడంతో తక్కువ ధరకే అమ్ముకున్నా.
– చంద్రయ్య, నారాయణపురం, బండిఆత్మకూరు మండలం
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement