అన్నదాతకు పంట బీమా అందేనా? | Crop insurance to ensure security, stock? | Sakshi
Sakshi News home page

అన్నదాతకు పంట బీమా అందేనా?

Published Fri, Feb 21 2014 2:14 AM | Last Updated on Sat, Aug 11 2018 8:58 PM

అన్నదాతకు పంట బీమా అందేనా? - Sakshi

అన్నదాతకు పంట బీమా అందేనా?

  • వరుస తుపానులతో రైతుకు కష్టం
  •  2.37 లక్షల ఎకరాల్లో రూ.200 కోట్ల నష్టం
  •  లెక్కలు తేల్చి ఉన్నతాధికారులకు అధికారులు
  •  2,777 శాంపిళ్లతో నివేదిక
  •  పంట బీమాపై పెదవి విప్పని అధికారులు
  •  రైతుల్లో అయోమయం
  • గత ఖరీఫ్‌లో వరుస వైపరీత్యాలు పంటను దెబ్బతీశాయి..  హెలెన్, లెహర్ తుపాన్లు రైతును నట్టేట ముంచాయి.. జిల్లా వ్యాప్తంగా 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా 2.37 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిందని, రూ.200 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనాలు కూడా వేశారు.. జిల్లా వ్యాప్తంగా పంటకోత ప్రయోగాల ద్వారా 2,777 ప్రాంతాల్లో వరి దిగుబడుల లెక్కలను తీసుకుని హైదరాబాదులోని బీమా కంపెనీకి నివేదిక అందజేశామని జిల్లా ప్రణాళికా విభాగం అధికారులు చెబుతున్నారు.. అయితే పంట బీమా ఎప్పుడు విడుదలవుతుందనే అంశంపై మాత్రం అధికారులు పెదవి విప్పటం లేదు. వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే ప్రణాళిక శాఖకు తెలుస్తుందని, ప్రణాళిక శాఖ అధికారులను అడిగితే వ్యవసాయశాఖకే తెలియాలని చెప్పి తప్పించుకుంటున్నారు.
     
    మచిలీపట్నం, న్యూస్‌లైన్ : గత రెండేళ్లుగా జిల్లాలో సవరించిన జాతీయ పంట బీమా పథకం అమలవుతోంది. ఈ పథకం అమలులో భాగంగా పంట రైతు ఇంటికి చేరే వరకు ఏవైనా విపత్తులు సంభవించి పంట నష్టపోతే పంట బీమా చెల్లించాల్సి ఉంది. ఈ నిబంధనల మేరకే పంట బీమా ప్రీమియాన్ని రైతుల నుంచి సేకరించారు. నవంబరు 23న హెలెన్, 28న లెహర్ తుపానులు సంభవించాయి. అక్టోబర్ ఆఖరులో కురిసిన వర్షాల నేపథ్యంలో వ్యవసాయాధికారులు జిల్లా వ్యాప్తంగా పంట కోత ప్రయోగాలను నవంబరు మొదటి వారం నుంచే ప్రారంభించారని, ఈ నివేదికలనే బీమా కంపెనీలకు ఇచ్చారనే అనుమానాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

    తుపానులు సంభవించిన అనంతరం రైతులు పంటలు పూర్తిగా కోల్పోయారని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ముందుగానే పంటకోత ప్రయోగాలు చేయటంతో దిగుబడులు అధిక శాతం ఉన్నట్లు నమోదై ఉంటాయని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పమిడిముక్కల, మొవ్వ మండలాల్లో వరి దిగుబడి అధికంగానూ, కైకలూరు, మండవల్లి, బందరు, అవనిగడ్డ తదితర మండలాల్లో నిర్వహించిన పంటకోత ప్రయోగాల్లో తక్కువ దిగుబడులు నమోదైనట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
     
    ప్రీమియం కట్టించుకునేది ఇలా...

    బ్యాంకులో పంట రుణం తీసుకునే సమయంలోనే సంబంధిత రైతు నుంచి పంట బీమా సొమ్మును మినహాయిస్తారు. ఎకరం వరి పంట సాగు చేస్తే రూ.22 వేలు పంట రుణంగా అందజేస్తారు. పంట రుణం ఇచ్చే సమయంలోనే ఐదు శాతం రైతు నుంచి బీమా సొమ్ముగా మినహాయిస్తారు. మరో తొమ్మిది శాతం నగదును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించి మొత్తం 14 శాతం పంట బీమాగా ఇన్సూరెన్స్ కంపెనీకి బ్యాంకులు చెల్లించాల్సి ఉంది. గత ఖరీఫ్‌లో పంటలు కోల్పోయిన నేపథ్యంలో రైతులకు పంట బీమా కచ్చితంగా అంది తీరాలి. 50 శాతం కన్నా అధికంగా పంట నష్టం జరిగితే అంత మొత్తానికి పంట బీమా చెల్లించాల్సి ఉంది.
     
    అయితే పంట కోత ప్రయోగాల ద్వారా వచ్చిన నివేదికలు గత మూడేళ్లుగా వచ్చిన దిగుబడులు, వర్షపాతం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పంట బీమా సొమ్మును విడుదల చేయాల్సి ఉంది. సవరించిన జాతీయ పంట బీమా పథకం జిల్లాలో అమలవుతున్న నేపథ్యంలో పంట కోల్పోయిన వెంటనే రైతులకు పంట బీమా అందించాల్సి ఉంది. గత ఏడాది నవంబరులో సంభవించిన తుపానుల కారణంగా పంటలు రైతులు కోల్పోగా మూడు నెలలుగా గడుస్తున్నా పంట బీమా విడుదల కాకపోవటం, ఎప్పుడు విడుదల అవుతుందో తెలియకపోవటంతో రైతుల్లో అయోమయం నెలకొంది.
     
    కౌలు రైతుల పరిస్థితేంటో...
     
    జిల్లాలో 3.8 లక్షల ఎకరాలు కౌలు రైతుల చేతుల్లోనే ఉన్నాయి. వరిసాగు చేసే కౌలు రైతులు సుమారు 1.30 లక్షల మంది ఉన్నారు. గత ఖరీఫ్‌లో పంట కోల్పోయిన కౌలు రైతులకు పంట బీమా అందుతుందా, లేదా అనే అంశంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో రెండు నెలల్లో రబీ సీజన్ కూడా ముగియనుంది. మళ్లీ ఖరీఫ్ సీజన్ ప్రారంభం నాటికి కౌలు రైతులు గత ఖరీఫ్‌లో సాగు చేసిన భూమినే సాగు చేసే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో గత ఖరీఫ్‌లో పంట కోల్పోయిన కౌలు రైతులకు పంట బీమా అందుతుందా, లేదా అనేది అనుమానమే.
     
    పంట నష్టపరిహారం ఎప్పటికందేనో...
     
    గత ఖరీఫ్‌లో వరుస తుపానులతో రైతులు పంట కోల్పోయారు. దిగుబడులు గణనీయంగా తగ్గాయి. పంట కోల్పోయిన వెంటనే రెండో పంట వేసుకునేందుకు పెట్టుబడిగా రైతులకు పంట నష్టపరిహారం ప్రభుత్వం అందించాలి. 2012లో సంభవించిన నీలం తుపాను నష్టపరిహారమే నేటికీ అందలేదు. 2013 నవంబరులో సంభవించిన తుపానుల కారణంగా పంటలు కోల్పోయిన రైతుల జాబితాలను తయారుచేశారు. 2.37 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా రూ.200 కోట్ల మేరకు పంట నష్టం జరిగిందని నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. త్వరితగతిన నష్టపరిహారం విడుదల చేయాల్సిన ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవటం లేదు. ప్రస్తుతం ఉన్న రాజకీయాల నేపథ్యంలో పంట నష్టపరిహారం విడుదలవుతుందనే ఆశను రైతులు దాదాపు వదులుకున్నారు. పంట బీమా అయినా అందజేస్తే రైతులకు ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement