పరిహారం దక్కేనా... పంట బీమా అందేనా?
=వరుస విపత్తులతో గణనీయంగా తగ్గిన దిగుబడులు
=తీరగ్రామాల్లో పూర్తికాని వరి కోతలు
=నివేదికలకు మరింత జాప్యం
వరుస విపత్తులతో నష్టపోయిన ఖరీఫ్ రైతులకు ప్రభుత్వ పరిహారం దక్కేనా.. పంట బీమా చేతికందేనా.. అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. గతేడాది పరిహారం పంపిణీనే ఇప్పటికీ పూర్తికాని పరిస్థితుల్లో ప్రస్తుత నష్టానికి పరిహారం ఎప్పటికి అందుతుందోనని ఆవేదన చెందుతున్నారు. పరిహారం త్వరగా అందితే అప్పుల నుంచి కొంతమేరకైనా బయటపడే అవకాశముంటుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : వరుస తుపానుల ప్రభావంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటలు కోల్పోయిన రైతులు ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకం జిల్లాలో అమలవుతున్న నేపథ్యంలో పంట బీమా కూడా అందాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా తుపానుల ప్రభావంతో 2.25 లక్షల ఎకరాల్లో వరి, 15 వేల ఎకరాల్లో వివిధ రకాల వాణిజ్య పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. లక్షా 89 వేల మంది రైతులు పంటలు కోల్పోయినట్లు నిర్ధారించారు.
పంట నష్టపరిహారం కోసం ఈ నివేదికలను ప్రభుత్వానికి పంపాల్సి ఉంది. పంట బీమా రైతులకు అందాలంటే పంటకోత ప్రయోగాల ద్వారా వచ్చిన నివేదికలను బీమా కంపెనీలకు పంపాలి. వీటిని ప్రణాళిక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు హైదరాబాదులో ఉన్న బీమా కంపెనీ ప్రధాన కార్యాలయానికి పంపుతున్నారు. తీర ప్రాంతంలోని అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మచిలీపట్నం, కృత్తివెన్ను మండలాల్లో వరి కోతలు మరో 20 రోజుల వరకు కొనసాగుతాయి. ఈ మండలాల నుంచి నివేదికలు బీమా కంపెనీకి పంపటంలో జాప్యం జరుగుతోందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
తగ్గిన దిగుబడులు...
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు చేపట్టారు. వాతావరణం అనుకూలంగా ఉన్న సమయంలో వ్యవసాయాధికారులు ఎకరానికి 28 నుంచి 29 బస్తాల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. వరుస తుపానుల రాకతో 24, 25 బస్తాల దిగుబడి వస్తుందని అంచనాలను సవరించారు. వాస్తవానికి తుపానుల అనంతరం ఎకరానికి 15, 16 బస్తాలకు మించి దిగుబడి రావటం లేదు. గూడూరు, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో 15, 16 బస్తాల దిగుబడి మాత్రమే వస్తోంది. ఈ వివరాలను వ్యవసాయ, పౌరసరఫరాలు, ప్రణాళిక శాఖల అధికారులు సేకరించి బీమా కంపెనీకి పూర్తిస్థాయి నివేదికలు అందజేస్తే రైతులకు పంట బీమా వచ్చే అవకాశం ఉంది.
నివేదికలు పూర్తయిన తరువాత జేసీ, కలెక్టర్ లాంటి ఉన్నతస్థాయి అధికారులు బీమా కంపెనీలకు ఇక్కడ జరిగిన నివేదికలను ఒకటికి పదిసార్లు వివరిస్తేనే రైతులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యి పంట నష్టం వివరాలను బీమా కంపెనీలు అంచనా వేయాలంటే కనీసంగా మూడు నెలలైనా సమయం పడుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. డిసెంబరు పూర్తి కావస్తోంది.
జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ నివేదికలను బీమా కంపెనీ ప్రతినిధులు పరిశీలించి ఏ గ్రామంలో ఎంత పంట నష్టం జరిగింది, ఏ రైతుకు ఎంత బీమా అందించాలి తదితర అంశాలపై తుది నివేదిక తయారు చేయడానికి మరో నెల సమయం పడుతుందనేది వ్యవసాయాధికారుల వాదన. పంట బీమా చేతికందాలంటే ఏప్రిల్, మే నెలల వరకు ఆగాల్సిందేనని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. 2012లో సంభవించిన నీలం తుపాను పంట నష్టపరిహారం పంపిణీ ఇంకా పూర్తికాలేదు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం సొమ్ము మంజూరు కావాల్సి ఉంది. గత ఏడాది సంభవించిన పంట నష్టం రైతులకు అందజేయడానికి ఇంతకాలం పట్టింది.
ఈ ఏడాది సంభవించిన పంట నష్టానికి సంబంధించి అధికారులు ప్రభుత్వానికి ఎప్పటికి నివేదికలు పంపుతారో.. అక్కడినుంచి నిధులు ఎప్పటికి విడుదలవుతాయో.. అవి తమ ఖాతాల్లోకి ఆన్‌లైన్ ద్వారా చేరాలంటే మరెంత సమయం పడుతుందోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోల్పోయి నష్టాల్లో ఉన్న సమయంలో పంట నష్టపరిహారంతో పాటు పంట బీమా వచ్చేలా అధికారులు కృషిచేస్తే అప్పుల నుంచి బయటపడతామని రైతులు చెబుతున్నారు.