పెనుతుఫానులో  ప్రభువిచ్చిన తర్ఫీదు! | Training in the Lord | Sakshi
Sakshi News home page

పెనుతుఫానులో  ప్రభువిచ్చిన తర్ఫీదు!

Published Sun, Feb 24 2019 1:43 AM | Last Updated on Sun, Feb 24 2019 1:43 AM

Training in the Lord - Sakshi

యేసుప్రభువుతో ఆయన శిష్యులు ఒకసారి గలిలయ సముద్రంలో ఒక చిన్నదోనెలో ప్రయాణం చేస్తున్నారు.  వాళ్లంతా  ప్రభువు శిష్యులుగా మారిన తొలిరోజులవి. అప్పుడొక పెద్దతుఫాను చెలరేగి దోనె నీళ్లతో నిండి, అది మునిగే పరిస్థితి ఏర్పడింది. యేసు మంచి నిద్రలో ఉన్నాడు. అది చూసి శిష్యులు, ప్రభువా మీకు మా గురించి చింత లేదా? మేము నశించిపోతున్నామంటూ గగ్గోలు పెట్టారు. వెంటనే ఆయన లేచి గాలిని, సముద్రాన్ని కూడా గద్దించి పరిస్థితిని అదుపుజేశాడు (మార్కు 4:35–41). దేవుని నమ్మడం అనే ఆత్మీయాంశం చాలా లోతైనది, విశ్వాసికి ఆచరణలో మాత్రమే నేర్పించగలిగిన అంశమది. ప్రభువు వారికిస్తున్న శిక్షణలో భాగమా అన్నట్టుగా, వారి విశ్వాసానికి అదే గలిలయ సముద్ర ప్రయాణంలో ఈ విషమపరీక్ష ఏర్పడింది. మేమంటే మీకు చింత లేదా? అని శిష్యులు ప్రశ్నిస్తే, జవాబుగా అవిశ్వాసులారా!! అని ప్రభువు వారిని గద్దించవచ్చు. కానీ ఆయన వారిని కాక, సముద్రాన్ని, గాలిని గద్దించాడు. నిజానికి అద్దరికి వెళ్లేందుకు ఆ రాత్రి ప్రయాణానికి ప్రభువే వారిని బయలుదేర దీశాడు. ఎందుకంటే ప్రయాణం మధ్యలో దోనె తుఫానులో చిక్కుకున్నా సరే, అది సురక్షితంగా అద్దరికి చేరుతుందని ప్రభువుకు తెలుసు. పైగా అవతలి దరిలోని గెరాసేనీయుల దేశంలో తాను చెయ్యబోయే దైవకార్యాల తాలూకు స్పష్టమైన అవగాహన, ఆ కార్యాలు జరుగుతాయన్న విశ్వాసం ఆయనకుంది. తుఫానులు చెలరేగని జీవితాలంటూ ఉంటాయా? కానీ ఎంత పెద్దదైనా సరే ప్రతి తుఫానూ జీవితాన్ని ముంచేది కాదని కూడా తెలుసుకోవాలి. అప్పటికి శిష్యుల చేతుల్లో బైబిళ్లు లేవు కానీ, ఉండి వుంటే, నిన్ను కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు, దేవుడు మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు అన్న వాగ్దానాలను బైబిల్లో మీరు చదువలేదా? అని యేసుప్రభువు వారిని తప్పక మందలించి ఉండేవాడు.

జీవితంలో తుఫానులెదురైనపుడే దేవుడెంత గొప్పవాడో, లోకం ఎంత నికృష్టమైనదో విశ్వాసికి స్పష్టమవుతుంది. ‘తప్పులు చేశావు, అందుకే నీ జీవితంలో ఈ తుఫాను’, నీ తలబిరుసుతనానికి దేవుని తీర్పు ఇది’ లాంటి  ఇరుగుపొరుగువారు, సన్నిహితులు, బంధువుల సూటిపోటి మాటలు, వెక్కిరింతలు తుఫాను అలలకన్నా ఉవ్వెత్తున లేస్తాయి. కావాలంటే యోబు గ్రంథాన్ని ఒకసారి చదవండి. ఇతరుల ఈ అయాచిత సలహాలు, వ్యాఖ్యలు తుఫానుకన్నా ఎక్కువ నొప్పిని, నష్టాన్ని విశ్వాసికి కలుగజేస్తాయి. కాకుల్లాంటి ఈ లోకులను పక్కనపెడితే, దేవుడసలు నన్ను ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తే నా జీవితంలో ఈ తుఫానేందుకు? లాంటి ప్రశ్నల తుఫానులు మన అంతరంగంలోనే చెలరేగితే మాత్రం అది మరీ ప్రమాదం. కళ్లెదుట తాటిచెట్టంత ఎత్తున లేచే అలలు, మన జీవితం అనే చిన్న దోనెను  అతలాకుతలం చేస్తుంటే, దేవుడు మనల్ని విడువక కాపాడుతాడని నమ్మడానికి అంతకన్నా ఎత్తైన అలలున్న విశ్వాస స్థాయి కావాలి. ఆ స్థాయి విశ్వాసమే దేవునికి మహిమను, మన జీవితంలోకి సాఫల్యాన్ని తెస్తుంది. అందుకు ప్రాథమికంగా కృతజ్ఞత కలిగిన హృదయాన్ని విశ్వాసులు కలిగి వుండాలి. ఆ కృతజ్ఞతాభారితమైన హదయం నుండే వినయం, ప్రార్థన, విశ్వాసం, న్యాయం, ధైర్యం, త్యాగం, ప్రేమ, సంతృప్తి, సంతోషం, సద్భావనల వంటి అన్ని క్రైస్తవ సద్గుణాలూ లోకానికి వెల్లడవుతాయి. మరి మన శక్తికి మించిన విషమ పరిస్థితులనుండి దేవుడు మనల్ని కాపాడినప్పుడే కదా విశ్వాసి హృదయంలో దేవునిపట్ల కృతజ్ఞతాభావం ఏర్పడేది? సముద్రంలో పెద్దతుఫానులో చిక్కిన వారి చిన్న దోనెను కాపాడి, అద్దరికి సురక్షితంగా చేర్చిన వారి బోధకుడు, రక్షకుడైన యేసుప్రభువు శక్తి, ప్రేమ ఆయన శిష్యరికంలో వారికి ఆరోజు అత్యంత అమూల్యమైన తొలి పాఠమయ్యింది. ఫలితంగా వారి హృదయాలు ఆయనపట్ల కృతజ్ఞతాభావనతో నిండి పోయాయి. మీ జీవితాల్లో గతంలో ఏం జరిగినా, ఇప్పుడు ఏమి సంభవిస్తున్నా, భవిష్యత్తులో మాత్రం దేవుడు మీకివ్వబోయే విజయాలను, ఆశీర్వాదాలను ఆపగలిగే శక్తి ఆ పరిణామాలకు, ప్రతికూలతలకు  లేదన్న ‘స్థిరభావన’ కృతజ్ఞత కలిగిన హృదయంనుండే వెలువడుతుంది. క్రీస్తుప్రేమ నుండి విశ్వాసిని ఎడబాపగల శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదన్నది దేవుని అత్యంత స్పష్టమైన, ప్రేమామయమైన అభయం (రోమా 8;35). అది అర్థమయ్యేందుకు ఇలాంటి తుఫానులు, వాటి మధ్యలో  దేవుని వైపే చూడగల స్థిరమైన విశ్వాసం, ఆ దేవునిపట్ల కృతజ్ఞతాభావం తప్పక కావాలి. ఈ అపొస్తలులంతా సువార్తను భూదిగంతాలకు తీసుకెళ్లి దేవునికోసం హతసాక్షులైనపుడు, భయంకరమైన శ్రమలు అలల్లాగా కాదు ఉప్పెనలా వారిమీద విరుచుకుపడ్డాయి. అయినా బెదరకుండా చిరునవ్వుతో, క్షమాప్రార్థనలతో వారు ఉరికంబాలెక్కారు. యేసుప్రభువిచ్చిన ఈ శిక్షణే దానికి కారణం!
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌ 
Email: prabhukirant@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement