thunder storms
-
ముంబై అతలాకుతలం
ముంబై: అకాల వర్షాలు, దుమ్మూ ధూళితో కూడిన బలమైన ఈదురుగాలులతో ముంబై సోమవారం అతలాకుతలమైంది. నగరంలో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. ముంబైవ్యాప్తంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు గంటల పాటు నరకం చవిచూశారు. దుమ్ముతో కూడిన గాలి దుమారం ధాటికి చాలామంది వాహనాలను వదిలి తలదాచుకోవడానికి చెల్లాచెదురయ్యారు. ఎక్కడ చూసినా వరద నీరు రోడ్లను ముంచెత్తడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘట్కోపర్ ప్రాంతంలోని చెద్దానగర్ జంక్షన్ వద్ద 100 అడుగుల భారీ అక్రమంగా హోర్డింగ్ ఈదురుగాలుల ధాటికి సాయంత్రం కుప్పకూలింది. అది పక్కనే ఉన్న పెట్రోల్ బంకుపై పడటంతో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. హోర్డింగ్ కింద 100 మందికి పైగా చిక్కుకున్నట్టు అధికారులు చెబుతున్నారు! గాయపడ్డ 65 మందిని ఆసుపత్రికి తరలించారు. ఇంకా హోర్డింగ్ కిందే చిక్కుకున వారిని కాపాడేందుకు ప్రయతి్నస్తున్నట్టు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భూషణ్ గగ్రానీ చెప్పారు. జాతీయ విపత్తు స్పందన బృందంతో పాటు అధికార యంత్రాంగం హుటాహుటిన రంగంలోకి దిగింది. భారీ హైడ్రా క్రేన్లు తదితరాలతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఘటన జరిగినప్పుడు పెట్రోల్ బంక్‌లో కనీసం 30కి పైగా ఆటోలు, బస్సులు, లగ్జరీ కార్లున్నట్టు ఒక కానిస్టేబుల్ తెలిపారు. వాటిలో పలు వాహనాలు హోర్డింగ్ కిందే చిక్కుకుపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రమాదస్థలిని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. రైళ్లు, విమానాలకు అంతరాయం గాలివాన ధాటికి ముంబైలో పలు ఇతర చోట్ల కూడా బిల్ బోర్డులు, హోర్డింగులు కూలిపడ్డాయి. వడాల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ కూలి ముగ్గురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకొరిగిన ఉదంతాల్లో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కనీసం మరో నలుగురు మరణించినట్టు సమాచారం. ప్రతికూల వాతావరణం వల్ల సోమవారం గంటపాటు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. గాలి దుమారం ధాటికి ఏమీ కనిపించని పరిస్థితి నెలకొనడంతో పలు విమానాలను దారి మళ్లించారు. మెట్రో, లోకల్ రైళ్ల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నగరంలో సోమవారం అర్ధరాత్రి దాకా ఈదరగాలులు, ఉరుములు, మెరుపులతో వాన కొనసాగింది. థానె, పాల్ఘర్ తదితర ప్రాంతాల్లోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. -
తెలంగాణలోని పలు జిల్లాల్లో వాన.. రాబోయే 24 గంటల్లో..
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. మంగళవారం ఉదయం.. పెద్దపల్లి, జోగులాంబ గద్వాల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో వాన పడింది. అలాగే వరంగల్లోనూ భారీ వర్షం కురిసినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఈ ఉదయం వాతావరణంలో ఒక్కసారిగా మార్పు కనిపించింది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, నల్లగొండ, కామారెడ్డి జిల్లాలోనూ మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. పలుచోట్ల ఈదురు గాలులు వీయడంతో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ వైర్లు తెగిపడడంతో.. కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మళ్లీ పలు జిల్లాలకు వర్ష సూచన చేస్తోంది వాతావరణ శాఖ. రాబోయే 24 గంటల్లో.. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరించింది. జూన్ 3వ తేదీ వరకు వర్షాలు కొనసాగవచ్చని తెలిపింది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది కూడా. ఇక.. వర్షాలతో పలుచోట్ల మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసింది. దీంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. కొనుగోళ్లలో అధికారుల అలసత్వంతో వల్ల తాము నష్టపోతున్నామంటూ వాపోతున్నారు. ఇదీ చదవండి: ఆగిన సీతమ్మ సాగర్ పనులు! -
Hyderabad Rains: ఎడతెరిపి లేకుండా వాన.. ఇబ్బందులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ఈదురు గాలులు, ఉరుములు..పిడుగులతో తెల్లవారుజాము దాటాక కూడా పలు చోట్ల వర్షం పడుతూనే ఉంది. చాలావరకు ఏరియాల్లో లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్లపై కూడా నీరు నిలిచిపోయింది. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈదురు గాలుల ప్రభావంతో నగరంలోని పలు ఏరియాల్లో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. దిల్సుఖ్నగర్, మోహదీపట్నం, యూసఫ్‌గూడ, కూకట్పల్లి, రాజేంద్రనగర్, గచ్చిబౌలి.. ఇలా చాలా ఏరియాల్లో వర్షం పడింది. మరోవైపు ఇంకో రెండు, మూడు రోజులు ఇలాంటి వానలే పడొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం.. ఓ మోస్తరు నుంచి భారీగానే పడొచ్చని హెచ్చరిస్తోంది. -
ఏపీలో దంచికొడ్తున్న వానలు
-
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ తేదీల్లో మస్త్ వానలు!
సాక్షి, హైదరాబాద్: గత రెండు రోజల వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్లతో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. దీంతో, వర్షాలు తగ్గుముఖం పట్టేలోపే.. హైదరాబాద్ వాతవరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావం కారణంగా రేపు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే, ద్రోణి ప్రభావంతో ఈనెల 25, 26, 27 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాలో భారీ కురవనున్నట్టు తెలిపారు. మరోవైపు, ద్రోణి కారణంగా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగి.. సాయంత్రం సమయంలో వడగండ్ల కురిసే అవకాశం ఉందని స్పష్టంచేశారు. అలాగే, గంటకు 30-40 కి.మీ వేగంతో గాలి వీచే అవకాశముందన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే కురిసిన అకాల వర్షాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలతో మరింత నష్టం కలిగే అవకాశం లేకపోలేదు. -
TS: మరో రెండు రోజులు భారీ వానలు.. ఈ జిల్లాలకు అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అకాల వర్షం రైతన్నలకు తీరని నష్టం కలిగించింది. అల్పపీడన ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురిసింది. అయితే, మరో రెండు రోజులు కూడా తెలంగాణ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగాం, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతాయని వెల్లడించింది. అలాగే, సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇక, ఆదివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురంలో 156 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. అలాగే కరీంనగర్, పెద్దపల్లి, మెదక్, సిద్ధిపేట, హన్మకొండ, వరంగల్, కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. -
అన్నదమ్ములపై పిడుగుపాటు
సాక్షి, కామారెడ్డి : జిల్లాలో పిడుగుపాటుకు ఓ బాలుడు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎల్లారెడ్డి ఇంతలో చెట్టుపై పిడుగు పడటంతో వినయ్ (14) మృతి చెందాడు. సుమన్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వినయ్ మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భూ తగదాలు, ఒకరు మృతి సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం మాన్సాన్పల్లిలో అన్నదమ్ముల మధ్య భూ తగాదాల నేపథ్యంలో కత్తిపోట్లతో ఒకరు మృతి చెందారు. పత్తి చేను వద్ద జరిగిన ఘర్షణలో రాములు అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు మోహరించారు. వీడిన మహిళ హత్య మిస్టరీ నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలంలో మహిళ హత్య మిస్టరీ వీడింది. జగిత్యాల మండలం ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు గ్రామానికి చెందిన రజితను గంగాధర్ అనే వ్యక్తి పరిచయం పెంచుకొని ఆమెను హత్య చేసి నగలు చోరీ చేశాడు. కాగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు ఇబ్రహీంపట్నం సీఐ శ్రీనివాస్ వెల్లడించారు. -
‘ఈ జిల్లాల్లోనే పిడుగులు పడే అవకాశం ఉధృతం’
సాక్షి, విజయవాడ: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం అధికంగా ఉందని శుక్రవారం రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చిరించారు. ఉపరితల ద్రోణి కారణంగా నేటి నంచి కురిసే వర్షాలకు శ్రీకాకుళం: సీతంపేట, కొత్తూరు, పాలకొండ, బుర్జ, రేగిడి ఆమదాలవలస, సరుబుజ్జిలి, లక్ష్మీనర్సుపేట, హీరామండలం, వంగర, వీరఘట్టం విజయనగరం జిల్లా: కురుపాం, గరుగుబిల్లి, బలిజిపేట, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, పాచిపెంట, వేపాడ, సీతానగరాలు. విశాఖ జిల్లా: హుకుంపేట,అనంతగిరి, అరకులోయ మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని చెప్పారు. కావునా పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపురులు చెట్లకింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూండా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని కమీషనర్ సూచించారు. (తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి) -
వెదర్: మరో రెండురోజులు ఇంతే..
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో వర్షం, పిడుగుపాట్లు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. రాజస్థాన్, యూపీని మెరుపులతో కూడిన భారీ వర్షాలు ముంచెత్తి వందమంది మరణించిన నేపథ్యంలో ఐఎండీ మరో రెండు రోజుల పాటు వాతావరణం ఇదే తరహాలో ఉంటుందని పేర్కొంది. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాలతో పాటు ఈశాన్యరాష్ట్రాలు, పశ్చిమబెంగాల్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఛత్తీస్ఘర్, ఢిల్లీ, పంజాబ్, బీహార్, జార్ఖండ్, సిక్కిం, ఒడిషా, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తమిళనాడు, కేరళలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఇక పశ్చిమ బెంగాల్, ఒడిషా, బిహార్, ఉత్తర్ ప్రదేశ్‌లో రానున్న రోజుల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు ముంచెత్తుతాయని హోంమంత్రిత్వ శాఖ శుక్రవారం తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
పిడుగులు పడతాయ్ జాగ్రత్త!
-
పిడుగులు పడతాయ్ జాగ్రత్త!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వానలకంటే పిడుగులే దడ పుట్టించనున్నాయి. ఉరుములు, మెరుపులు హడావుడి చేయనున్నాయి. వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై ఏమాత్రం లేకపోగా.. అది తీరాన్ని దాటాక ఇప్పుడు పిడుగులు రంగప్రవేశం చేయనున్నాయి. ఈనెల 19 రాత్రి ఒడిశాలో వాయుగుండం తీరాన్ని దాటిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అది నెమ్మదిగా భూ ఉపరితలంపై ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వైపు పయనిస్తోంది. ప్రస్తుతం అది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు వాయవ్యంగా 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఆదివారం నాటికి అల్పపీడనంగా బలహీనపడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి తెలిపింది. మరోవైపు వాయుగుండం రాష్ట్రం నుంచి పూర్తిగా దూరమైన నేపథ్యంలో కొత్తగా ఒడిశా నుంచి కర్ణాటక వరకు తెలంగాణ, దక్షిణ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు కొన్నిచోట్ల పిడుగులు పడతాయని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమలో ఒకట్రెండు చోట్ల చిరుజల్లులకు ఆస్కారం ఉందని, సోమవారం నుంచి వర్షాలు ఊపందుకునే అవకాశం ఉందని వివరించింది. గడచిన 24 గంటల్లో వరరామచంద్రపురం, నర్సీపట్నంలలో 6, శృంగవరపుకోట, కూనవరంలలో 4, పోలవరం, పాడేరుల్లో 2 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. -
ఇప్పుడు ఢిల్లీ వంతు.. కూలిన హోర్డింగ్!
దేశ రాజధానిలో వాతావరణం సోమవారం ఉన్నట్టుండి మారిపోయింది. విపరీతమైన గాలి దుమ్ము లేచింది. బలమైన ఈదురుగాలులు వీచాయి. దాంతో ఒక హోర్డింగ్ కుప్పకూలి.. ఓ వ్యక్తి మరణించగా ఇద్దరు గాయపడ్డారు. అయితే ఆదివారం 41 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రత మాత్రం ఒక్కసారిగా 8 డిగ్రీలు తగ్గి 33 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మధ్యదరా సముద్రంలో మొదలైన వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ కారణంగానే ఇలా జరిగిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దాని కారణంగా పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో వర్షం లేదా మంచు పడతాయని, దాంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడ్డాయని వివరించారు. మంగళవారం కూడా ఢిల్లీతో పాటు రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఇలాంటి వాతావరణమే ఉంటుందని, అక్కడక్కడ వర్షాలు కూడా పడతాయని ప్రైవేటు వాతావరణ నిపుణుడు మహేష్ పలావత్ చెప్పారు. అయితే బుధవారం నుంచి మాత్రం మళ్లీ పరిస్థితి మారి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, పొడిగాలులు వీస్తాయని తెలిపారు.