ఇప్పుడు ఢిల్లీ వంతు.. కూలిన హోర్డింగ్!
దేశ రాజధానిలో వాతావరణం సోమవారం ఉన్నట్టుండి మారిపోయింది. విపరీతమైన గాలి దుమ్ము లేచింది. బలమైన ఈదురుగాలులు వీచాయి. దాంతో ఒక హోర్డింగ్ కుప్పకూలి.. ఓ వ్యక్తి మరణించగా ఇద్దరు గాయపడ్డారు. అయితే ఆదివారం 41 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రత మాత్రం ఒక్కసారిగా 8 డిగ్రీలు తగ్గి 33 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మధ్యదరా సముద్రంలో మొదలైన వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ కారణంగానే ఇలా జరిగిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
దాని కారణంగా పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో వర్షం లేదా మంచు పడతాయని, దాంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడ్డాయని వివరించారు. మంగళవారం కూడా ఢిల్లీతో పాటు రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఇలాంటి వాతావరణమే ఉంటుందని, అక్కడక్కడ వర్షాలు కూడా పడతాయని ప్రైవేటు వాతావరణ నిపుణుడు మహేష్ పలావత్ చెప్పారు. అయితే బుధవారం నుంచి మాత్రం మళ్లీ పరిస్థితి మారి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, పొడిగాలులు వీస్తాయని తెలిపారు.