
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వానలకంటే పిడుగులే దడ పుట్టించనున్నాయి. ఉరుములు, మెరుపులు హడావుడి చేయనున్నాయి. వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై ఏమాత్రం లేకపోగా.. అది తీరాన్ని దాటాక ఇప్పుడు పిడుగులు రంగప్రవేశం చేయనున్నాయి. ఈనెల 19 రాత్రి ఒడిశాలో వాయుగుండం తీరాన్ని దాటిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అది నెమ్మదిగా భూ ఉపరితలంపై ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వైపు పయనిస్తోంది. ప్రస్తుతం అది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు వాయవ్యంగా 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఇది ఆదివారం నాటికి అల్పపీడనంగా బలహీనపడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి తెలిపింది. మరోవైపు వాయుగుండం రాష్ట్రం నుంచి పూర్తిగా దూరమైన నేపథ్యంలో కొత్తగా ఒడిశా నుంచి కర్ణాటక వరకు తెలంగాణ, దక్షిణ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు కొన్నిచోట్ల పిడుగులు పడతాయని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
రాయలసీమలో ఒకట్రెండు చోట్ల చిరుజల్లులకు ఆస్కారం ఉందని, సోమవారం నుంచి వర్షాలు ఊపందుకునే అవకాశం ఉందని వివరించింది. గడచిన 24 గంటల్లో వరరామచంద్రపురం, నర్సీపట్నంలలో 6, శృంగవరపుకోట, కూనవరంలలో 4, పోలవరం, పాడేరుల్లో 2 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment