Hordings
-
ఏపీలో చంద్రన్న రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్లేనా?
నేను ఫలానా వాళ్లను కొట్టబోతున్నాను.. లేదా చంపబోతున్నాను అని ఎవరైనా పెద్ద హోర్డింగ్ పెడితే ఏమవుతుంది. వెంటనే పోలీసులు చర్య తీసుకుని అలాంటి హోర్డింగ్ ను తొలగించడమే కాకుండా, అలా చేసినవారిని అదుపులోకి తీసుకుంటారు. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో అయినా జరిగే ప్రక్రియ. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎవరు ఏమైనా చేసుకోవచ్చు. బహిరంగంగా హోర్డింగ్ లు పెట్టి రెడ్ బుక్ సిద్ధం అంటూ తమ నేత బొమ్మ వేసుకుని మరీ ప్రచారం చేసుకోవచ్చు. అయినా పోలీసులు స్పందించరు. రాష్ట్ర ప్రభుత్వం ఆనందంగా చూస్తుంటుంది. కేంద్ర ప్రభుత్వం పట్టి, పట్టనట్లు వ్యవహరిస్తుంది. వారికి ఇష్టమైన మీడియా ఆహో, ఓహో అని భజన చేస్తాయి. ఇదో చిత్రమైన పరిస్థితి అని చెప్పాలి.⇒ ఏపీలో తెలుగుదేశం ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతోనే ఇలాంటి దారుణమైన పోకడలు సాగుతున్నాయి. దీనిని అదుపు చేసే పరిస్థితి ఇప్పట్లో ఉండదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయాలలో వైరుధ్యాలు, వైషమ్యాలు ఉండవచ్చు. కోప, తాపాలు ఉండవచ్చు. లేదా ఎదుటివారు ఎదైనా తప్పు చేశారనుకుంటే చట్టపరంగా కేసులు పెట్టవచ్చు. ఇవేవి కాకుండా మీ అంతు చూస్తామంటూ బహిరంగంగా బోర్డులు పెడుతున్నారు. అదేదో గొప్ప పనిగా వారు చెప్పుకుంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరైన చర్యేనా అనే ప్రశ్న వస్తే, మైట్ ఈజ్ రైట్ అన్నట్లుగా, రౌడీలు, గూండాలు చెలరేగిపోయినా పట్టని కాలంలో మాత్రమే ఇలాంటివాటిని సమర్థించగలం.⇒ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటివి జరగకూడదు. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నలభైఆరేళ్లుగా రాజకీయాలలో అత్యంత క్రియాశీలకంగా ఉన్నారు. దేశంలోనే ఆయన అంత అదృష్టవంతుడైన నేత లేరంటే అతిశయోక్తి కాదు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగాను, అంతకన్నా ఎక్కువకాలం ప్రతిపక్ష నేతగాను వ్యవహరించారు. ఆయనకు నిబంధనలు, చట్టం, రాజ్యాంగం గురించి తెలియవని అనుకుంటే పొరపాటు. అయినా ఆయన ఏలుబడిలో ఇలాంటి దుశ్చర్యలు ఎలా కొనసాగుతున్నాయంటే ఏమి చెబుదాం. ఆయనలో ఇంకా కక్షపూరిత రాజకీయాలు పోలేదన్న అభిప్రాయానికి తావిస్తున్నారు.⇒ గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే వెంటనే తీవ్రంగా స్పందించి, రాజారెడ్డి రాజ్యాంగం అని, ఇంకొకటని అరిచి ఘీ పెట్టిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు తాము అధికారంలోకి రాగానే కొత్త రాజ్యాంగం సృష్టించుకున్నారని అనుకోవాలా? చంద్రన్న రాజ్యాంగం అమలులోకి వచ్చినట్లా? దీని ప్రకారం ఎవరినైనా తాము కొట్టవచ్చని, తిట్టవచ్చని, చంపవచ్చని, ఎవరూ మాట్లాడడానికి వీలు లేదని కొత్త నిబంధనలు తయారు చేశారా! పైగా వాటిని బహిరంగంగా హోర్డింగ్ ల ద్వారా ప్రజలందరికి తెలియచేసే కొత్త సంస్కృతికి తెరదీశారా? ఇదేనా చట్టబద్దమైన, రాజ్యాంగ పాలన అంటే!⇒ ప్రతిపక్షంలో ఉండగా, ఎవరు సలహా ఇచ్చారో కానీ లోకేష్ తన యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ అంటూ పట్టుకు తిరిగారు. తమ పట్ల అనుచితంగా వ్యవహరించారన్న భావన కలిగితేనో, అధికారుల శైలి తమకు నచ్చకపోతేనో, లేక తాము చేసే అల్లర్లకు అడ్డుపడితేనో, కేసులు పెడితేనో, వారి పేర్లను రెడ్ బుక్ లో రాసుకుంటున్నామని, అధికారంలోకి రాగానే వారి సంగతి చూస్తామని బెదిరిస్తుండేవారు. తొలుత ఎవరూ దీనిని సీరియస్ గా తీసుకోలేదు.⇒ కొందరు సరదాగా తీసుకుంటే, పోలీసు అధికారులు సైతం పెద్దగా స్పందించలేదు. అయితే చంద్రబాబు, లోకేష్ లపై ఆయా స్కాములకు సంబంధించి కేసులు పెట్టిన సందర్భంలో అప్పటి సీఐడీ అధికారులు ఈ రెడ్ బుక్ వ్యవహారంపై కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని కోర్టు ఇంకా తేల్చలేదు. ఈలోగానే వైఎస్సార్సీపీ అధికారం కోల్పోయి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో రెడ్ బుక్ కేసు ఏమవుతుందో కానీ, అధికారులు ఎవరూ దానిని పర్స్యూ చేసేపరిస్థితి ఉండదు. రెడ్ బుక్ అంటూ తిరిగిన వ్యక్తి లోకేష్ మంత్రి అయ్యారు. ఆ రెడ్ బుక్ ను విశాఖ సభలో ఆయన తన తండ్రి చంద్రబాబుకు అందచేశారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.⇒ ఆ రెడ్ బుక్ లో పలువురు అధికారుల పేర్లు, వైఎస్సార్సీపీ నేతల పేర్లు.. లేదా ఇంకొందరు తమను వ్యతిరేకించేవారి పేర్లు రాసుకుని ఉండవచ్చు. ఆయా సభలలో కొందరి పేర్లను లోకేష్ ప్రకటిస్తూ వచ్చారు కూడా. చిత్తూరులో ఒక ఎస్పీ పేరును ఇలానే అప్పట్లో ప్రకటించారు. అలా అధికారులను బెదిరించవచ్చా! నిజంగానే అధికారంలోకి వచ్చారు కనుక వారిపై చర్య తీసుకుంటామని బహిరంగంగా బోర్డులు పెట్టవచ్చా! గతంలో ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి ఘట్టాలు చోటు చేసుకున్నాయా! అసలే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హింసాకాండతో రాష్ట్రం అట్టుడుకుతుంటే, అది చాలదన్నట్లు రెడ్ బుక్ సిద్దం అంటూ ప్రజలను భయభ్రాంతులను చేసే ప్రకటనలు ఏమిటో తెలియదు.⇒ టీడీపీ నేత బుద్దా వెంకన్న వంటివారు వారిని అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని రాజకీయ ప్రకటనలు చేస్తుంటే అదేదో మామూలేనని అనుకుంటాం. నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు, మరొక టీడీపీ నేత కూర్చుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ, చావలేదు.. అని అంటుంటే వీరి మనసులో ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయా? అన్న విషయం బహిర్గతం అయిపోతుంది. దానికి తగినట్లుగానే రెడ్ బుక్ హోర్డింగ్ లు పెడుతున్నారన్న అనుమానం ప్రజలలో ప్రబలుతుంది.⇒ పూర్వకాలంలో తమ అధికారానికి అడ్డు పడుతారనుకునే వారిని రాజులు, నియంతలు చంపించేసేవారట. ఉత్తర కొరియా వంటి దేశాలలో ఇప్పటికీ అలాంటి రాక్షస సంస్కృతి ఉంది. చైనాలో ఎవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరెత్తే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అది కమ్యూనిజం ముసుగులో ఉన్న నియంత రాజ్యం కనుక. చైనాలో సాంస్కృతిక విప్లవం పేరుతో ఎన్ని ఘోరాలు జరిగాయో చరిత్ర చెబుతుంది. రష్యాలో పుతిన్ కు ఎదురుతిరిగినవారిని బతకనివ్వడం లేదని వార్తలు వచ్చాయి. కానీ ప్రజాస్వామ్యదేశంగా ఉన్న భారత్ లో అలాంటివి సాధ్యమేనా? అందులోను ఒక రాష్ట్రంలో ఇలా జరుగుతుందా? అది ఎల్లకాలం అయ్యే పనేనా? అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఉండేది ఐదేళ్ల కాలపరిమితే అన్న సంగతి మర్చిపోయి ఇష్టారాజ్యంగా చెలరేగిపోతే తర్వాత ప్రజలు వాటిని గుర్తుంచుకోరా?⇒ గొప్ప నేతగా పేరుపొందిన ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి పెట్టి ప్రత్యర్ధి రాజకీయ పార్టీల నేతలను జైళ్లపాలు చేసిన తర్వాత కొంతకాలం అధికారంలో ఉండగలిగారు కానీ, ఆ తర్వాత ఎన్నికలలో ఘోర పరాజయం చెందారు. కొన్ని రాష్ట్రాలలో ఇలాంటి అనుభవాలు ఎదురుకాకపోలేదు. అయినా రాజకీయ నేతలు గుణపాఠాలు నేర్చుకోరు. పోలీసులు తమ చేతిలో ఉంటారు కనుక ఏమైనా చేయవచ్చని, ఇతర వ్యవస్థలను ప్రభావితం చేయవచ్చన్న విశ్వాసంతో అరాచకాలకు పాల్పడుంటారు. కానీ ఆ తర్వాత వారు కూడా ఏదో నాడు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కోవలసి వస్తుందని మర్చిపోతారు.⇒ ఎంత పిల్లి అయినా గదిలో పెట్టి కొడితే తిరగబడుతుందని సామెత. ఒకపక్క రాష్ట్రంలో రౌడీయిజాన్ని సహించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటిస్తున్న సమయంలోనే ఈ రెడ్ బుక్ ప్రకటనలు ఇంత బహిరంగంగా హోర్డింగ్ ల రూపంలో జనంలోకి వస్తే, గూండాలను, మాఫియాలను ఎంకరేజ్ చేసినట్లా? కాదా? అన్నది వారే ఆలోచించుకోవాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ముంబై అతలాకుతలం
ముంబై: అకాల వర్షాలు, దుమ్మూ ధూళితో కూడిన బలమైన ఈదురుగాలులతో ముంబై సోమవారం అతలాకుతలమైంది. నగరంలో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. ముంబైవ్యాప్తంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు గంటల పాటు నరకం చవిచూశారు. దుమ్ముతో కూడిన గాలి దుమారం ధాటికి చాలామంది వాహనాలను వదిలి తలదాచుకోవడానికి చెల్లాచెదురయ్యారు. ఎక్కడ చూసినా వరద నీరు రోడ్లను ముంచెత్తడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘట్కోపర్ ప్రాంతంలోని చెద్దానగర్ జంక్షన్ వద్ద 100 అడుగుల భారీ అక్రమంగా హోర్డింగ్ ఈదురుగాలుల ధాటికి సాయంత్రం కుప్పకూలింది. అది పక్కనే ఉన్న పెట్రోల్ బంకుపై పడటంతో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. హోర్డింగ్ కింద 100 మందికి పైగా చిక్కుకున్నట్టు అధికారులు చెబుతున్నారు! గాయపడ్డ 65 మందిని ఆసుపత్రికి తరలించారు. ఇంకా హోర్డింగ్ కిందే చిక్కుకున వారిని కాపాడేందుకు ప్రయతి్నస్తున్నట్టు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భూషణ్ గగ్రానీ చెప్పారు. జాతీయ విపత్తు స్పందన బృందంతో పాటు అధికార యంత్రాంగం హుటాహుటిన రంగంలోకి దిగింది. భారీ హైడ్రా క్రేన్లు తదితరాలతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఘటన జరిగినప్పుడు పెట్రోల్ బంక్‌లో కనీసం 30కి పైగా ఆటోలు, బస్సులు, లగ్జరీ కార్లున్నట్టు ఒక కానిస్టేబుల్ తెలిపారు. వాటిలో పలు వాహనాలు హోర్డింగ్ కిందే చిక్కుకుపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రమాదస్థలిని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. రైళ్లు, విమానాలకు అంతరాయం గాలివాన ధాటికి ముంబైలో పలు ఇతర చోట్ల కూడా బిల్ బోర్డులు, హోర్డింగులు కూలిపడ్డాయి. వడాల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ కూలి ముగ్గురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకొరిగిన ఉదంతాల్లో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కనీసం మరో నలుగురు మరణించినట్టు సమాచారం. ప్రతికూల వాతావరణం వల్ల సోమవారం గంటపాటు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. గాలి దుమారం ధాటికి ఏమీ కనిపించని పరిస్థితి నెలకొనడంతో పలు విమానాలను దారి మళ్లించారు. మెట్రో, లోకల్ రైళ్ల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నగరంలో సోమవారం అర్ధరాత్రి దాకా ఈదరగాలులు, ఉరుములు, మెరుపులతో వాన కొనసాగింది. థానె, పాల్ఘర్ తదితర ప్రాంతాల్లోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. -
'30వ తేదీన ఏముంది?' అందరికీ గుర్తుండేలా ‘స్వీప్’ హోర్డింగ్‌లు!
సాక్షి, ఆదిలాబాద్: ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసే దిశగా ప్రజలను సన్నద్ధం చేసేందు కోసం స్వీప్ ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన వినూత్న ప్రచారం అందరిని ఆలోచింపజేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగే తేదీని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో 30వ తేదీన ఏముంది.. అనే శీర్షికన స్థానిక కలెక్టర్‌చౌక్, ఎన్టీఆర్‌చౌక్, రిమ్స్ వంటి ప్రధాన కూడళ్లలో అధికార యంత్రాంగం భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేసింది. వీటిని చూసిన ప్రతి ఒక్కరూ ఆ తేదీన ఏముందని చర్చించుకుంటూ పోలింగ్ తేదీని గుర్తు చేసుకుంటున్నారు. ఆ రోజున తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని భావిస్తుండటంతో ఈ ప్రచారానికి స్పందన లభిస్తోంది. ఇవి కూడా చదవండి: 'కారు పార్టీ' స్టీరింగ్ ఓవైసీల చేతుల్లోనే.. : రాజా సింగ్ -
'శ్రద్ధ' ప్రచారం పైనే.. పనులపై మాత్రం కాదు..!
ఆదిలాబాద్: రాజకీయ లబ్ధి కోసం చేయని పనులను చేసినట్లుగా భారీ హోర్డింగ్‌ల ద్వారా ప్రచారం చేసుకుంటున్న ఎమ్మెల్యే జోగు రామన్న పనుల పురోగతిని విస్మరించడం హాస్యస్పదంగా ఉందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని డాల్డా కంపెనీ వద్ద నిర్మిస్తున్న రైల్వే ఫ్లైఓవర్ వంతెన పనులను ఆదివారం ఆమె పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై అక్కడి ఇంజినీరింగ్ అధికారితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు నత్తనడకన సాగుతుండడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము అభివృద్ధికి ఏ మాత్రం వ్యతిరేకం కాదని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని స్వీకరిస్తామన్నారు. కానీ ఫ్లై ఓవర్ వంతెనకు సంబంధించి ఫిల్లర్ల నిర్మాణం కూడా కాకుండానే ప్రజలను మభ్యపెట్టేలా పూర్తి అయినట్లుగా దాని ఫొటోలతో హోర్డింగుల ద్వారా ప్రచారం చేయడం శోచనీయమన్నారు. పనులు ప్రారంభించి మూడు నెలలు దాటినా నేటికీ ఫిల్లర్ల నిర్మాణాలు జరుగకపోవడం ఎమ్మెల్యే చిత్తశుద్ధికి అద్దం పడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తే నిర్వాసితులకు పరిహారం ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అల్లూరి సంజీవ్ రెడ్డి , అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ, టీఆర్ఎస్ ప్రచార పోరు.. బల్దియాకు 30 లక్షల రాబడి
సాక్షి, హైదరాబాద్: దాదాపు వారం రోజులుగా జరిగిన హడావుడి ముగిసింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, విజయ సంకల్ప సభ నేపథ్యంలో బీజేపీ స్వాగత ఆర్భాట హోర్డింగులు, ఫ్లెక్సీలు.. అందుకు ప్రతిగా టీఆర్ఎస్ సంక్షేమ కార్యక్రమాల ఫ్లెక్సీలు, హోర్డింగుల యుద్ధం ముగిసింది. వీటి ఏర్పాటుకు సంబంధించి జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగానికి ట్విట్టర్ ద్వారా అందిన ఫిర్యాదులకు స్పందించిన సీఈసీ ఈ– చలానాలు జారీ చేస్తోంది. సోమవారం సాయంత్రం వరకు బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులకు దాదాపు రూ. 22 లక్షలు, టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులకు రూ. 3 లక్షలకు పైగా ఈచలానాలు జారీ చేసినట్లు సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఫిర్యాదుల వరద కూడా తగ్గడంతో దాదాపుగా ఇక వీటికి బ్రేక్ పడినట్లే భావిస్తున్నారు. కాషాయం అలా.. గులాబీ ఇలా.. ► బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతరత్రా అతిరథ మహారథులు హాజరు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ ప్రధానిని ఆహ్వానిస్తూ స్వాగత తోరణాలతో పాటు భారీయెత్తున ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయడం తెలిసిందే. అందుకు ప్రతిగా తామేం తక్కువ తినలేదన్నట్లు బీజేపీ ప్రభావం కనిపించకుండా నగరమంతా గులాబీరంగు కనిపించేలా టీఆర్ఎస్ శ్రేణులు సైతం నగరంలో అమల్లో లేని పథకాలతో సహ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ ప్రచార యుద్ధం ముగిసింది. ► వీటి ప్రభావం ఏమేరకు పడిందో పరిశీలిస్తే రెండు పార్టీలకు వెరసీ.. రూ. 25 లక్షల పెనాల్టీలు పడ్డాయి. వీటిల్లో రూ. 2వేల నుంచి మొదలుకొని లక్ష రూపాయల వరకు పెనాల్టీలున్నప్పటికీ, రూ. 5 వేల పెనాల్టీలు అధికసంఖ్యలో ఉన్నాయి. సగటున రూ. 5 వేలు లెక్కలోకి తీసుకున్నా రెండు పార్టీలవి మొత్తం కలిపి దాదాపు 500 ఫ్లెక్సీలకు పెనాల్టీలు విధించారు. వీటిలో ఏపార్టీ ఎన్నింటికి చెల్లిస్తుంది.. ఎంత మొత్తం చెల్లిస్తుంది అనేది తెలియడానికి సమయం పట్టనుంది. గతంలోనూ ఆయా పార్టీలకు భారీగా ఈ–చలానాలు జారీ చేసినా ఎవరు ఎన్ని చెల్లించారో సంబంధిత అధికారులు వెల్లడించలేదు. ప్రైవేట్ సంస్థలు పెనాల్టీలు చెల్లించకపోతే వాటిని సీజ్ చేస్తున్న సీఈసీ విభాగం వీరి విషయంలో ఏం చేయనుందో వేచి చూడాల్సిందే. చెత్త చార్జీలు రూ. 5 లక్షలు.. ► సీఈసీ పెనాల్టీలు విధిస్తుంది తప్ప ఫ్లెక్సీలు, హోర్డింగులు తొలగించడం లేదు. వీటి తొలగింపు బాధ్యతలు జీహెచ్ఎంసీలోని సంబంధిత సర్కిళ్లకు అప్పగించారు. గత రెండు రోజులుగా వీటి తొలగింపు పనులు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీలో సాధారణ రోజుల్లో సగటున 6500 మెట్రిక్‌టన్నుల వ్యర్థాలు వెలువడేవి కాగా వర్షాకాలం మొదలయ్యాక సగటున రోజుకు 7000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ► గడచిన రెండు రోజుల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు, ఇతరత్రా ప్రచార సామగ్రి తొలగింపు మొదలయ్యాక సగటున 7600 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. రెండు రోజుల్లో మొత్తం 1223 మెట్రిక్ టన్నుల చెత్త అదనంగా డంపింగ్ యార్డుకు చేరింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి జవహర్‌నగర్‌కు వ్యర్థాలు తరలించేందుకు జీహెచ్ఎంసీ మెట్రిక్ టన్నుకు రూ. 400 ఖర్చు చేస్తోంది. ఈ లెక్కన పార్టీల ప్రచార సామగ్రి వ్యర్థాల తరలింపునకు దాదాపు రూ. 5 లక్షలు ఖర్చయింది. అంటే ప్రధానమంత్రి నగర పర్యటన ప్రభావం దాదాపు రూ. 30 లక్షలన్న మాట! బీజేపీ నేతల తిరుగు పయనం మూడ్రోజుల పాటు నగరంలోనే మకాం వేసి గ్రేటర్ కేడర్‌లో జోష్ నింపిన బీజేపీ జాతీయ నేతలు సోమవారం ఉదయం తిరుగుముఖం పట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఏపీలోని భీమవరం బయలుదేరారు. హోం మంత్రి అమిత్‌షా సహా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర మంత్రులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇతర ముఖ్యమంత్రులు వారి రాష్ట్రాలకు పయనమయ్యారు. ఆదివారం జరిగిన విజయ సంకల్ప సభకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీగా జనం తరలిరావడం, రెండు గంటల పాటు పరేడ్ గ్రౌండ్ ప్రాంతమంతా మోదీ నామస్మరణలతో మార్మోగడం కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. (క్లిక్: పదవి కాపాడుకునేందుకు మేయర్ పడరాని పాట్లు!) -
ఢిల్లీలో టీఆర్ఎస్ ఫ్లెక్సీల కలకలం
-
‘చాయ్ తాగి పో’, ‘ఊకో కాక’.. ఇవన్నీ షాపుల పేర్లండి బాబోయ్!
సాక్షి, కరీంనగర్: ‘అరేయ్.. ఎక్కడున్నవ్’.. ‘చాయ్ తాగి పో’.. ‘ఊకో కాక’.. ‘కమాన్ ఫ్రెండ్’.. రాకేన్ రోల్.. ‘చాయ్ వాలా’.. ఇవీ మనం రోజువారీ సంభాషణలో మాట్లాడుకునే పదాలు. ఇప్పుడు ఇవే పదాలు కరీంనగర్‌లోని వ్యాపార కూడళ్లలో హోర్డింగ్‌లపై దర్శనమిస్తున్నాయి. మారిన ట్రెండ్‌కు అనుగుణంగా వ్యాపారులు కస్టమర్లను ఆకట్టుకునేలా సరికొత్తగా ఆలోచిస్తున్నారు. వాడుక భాష పదాలనే పేర్లుగా పెడుతున్నారు. గతంలో వ్యాపారాలకు దేవుళ్ల పేర్లు, ఇంటిలోనిపిల్లల పేర్లు, పెద్దల పేర్లు, ఇంటిపేర్లు పెట్టేవారు. ఇంకొందరు పేరు బలం చూసి, సంఖ్య, శాస్త్రప్రకారంగా పేర్లు పెట్టేవారు. ఇప్పుడు మన మాటలు.. వాడే ఊత పదాలు, వంటకాల పేర్లు, కూరగాయలు, పిండి వంటల పేర్లు హోర్డింగ్‌లకు ఎక్కుతున్నాయి. వెరైటీ పేర్లు ఇటు కస్టమర్లనూ ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ యాసలో.. తెలంగాణ యాసలో చాయ్ బాబు చాయ్, మిర్చి, చాయ్, అమ్మ కర్రిపాయింట్, జస్ట్ ఫర్ యూ వంటి క్యాచీ పేర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. వ్యాపారాలు నిర్వహించే వారు వాడుకభాషలో పేర్లు పెడుతున్నారు. అందరి నోళ్లలో నానిన పదాలతో పేర్లు పెట్టి ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఫ్రీ పబ్లిసిటీ.. కరీంనగర్లో ఏదైన షాప్ ప్రజల్లోకి వెళ్లాలాంటే పబ్లిసిటి తప్పని సరి. షాపులు, హోటల్స్ ఇతర వ్యాపార సంస్థలు యాడ్స్, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు పెట్టి ప్రచారం చేయాలి. వీఐపీలు, సెలబ్రెటీలతో ప్రారంభోత్సవాలు చేయించాలి. వ్యాపారం జోరుగా సాగాలంటే కూడా అదే స్థాయిలో ప్రచారం ఉండాలి. అవేవి లేకుండా కొత్త ట్రెండ్‌లో పేర్లు పెడుతూ రెట్టింపు పబ్లిసిటీ పొందుతున్నారు. జనం వాడుక భాషనే ప్రధానంగా చేసుకుని పేర్లు పెడుతున్నారు. పుల్గా ఉండాలని.. పెద్ద పెద్ద పేర్లు, నోరు తిరగని పేర్లు ఉండడం వల్ల జనానికి ఎక్కువగా గుర్తు ఉండదు. అందుకే సింపుల్‌గా అందరికీ అనువుగా గుర్తుండేలా కాస్త కొత్తగా ఉండేలా ‘తారక’ అనే పేరుపెట్టాం. పలకడానికి, వినడానికి కూడా బాగుండడంతో అందరి నుంచి స్పందన బాగుంది. – తోట కోటేశ్వర్, తారక రెస్టారెంట్, బస్టాండ్ రోడ్, కరీంనగర్ ఫ్రెండ్లీగా ఉండాలని.. అందరికీ సన్నితంగా, ఫ్రెండ్లీగా ఉండాలనే ఉద్దేశంతో చాయ్ తాగి పో.. పేరుతో వివిధ ఫ్లెవర్లలో టీ, స్నాక్స్ అందించే సెంటర్‌ను రెండు నెలల క్రితం ప్రారంభించా. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. పేరు కొత్తగా ఉండడంతో ప్రతిఒక్కరూ ఆసక్తిగా వస్తూ ఆదరిస్తున్నారు. – తాటికొండ రాజు, శివ థియేటర్ దగ్గర, జ్యోతినగర్, కరీంనగర్ ఆంధ్రాలో చూసి.. 12 ఏళ్ల కిత్రం కరీంనగర్లో రెడ్డి గారి వంటిల్లు పేరున మెస్ ప్రారంభించాం. ప్రజల ఆదరణ లభించింది. ఆంధ్రాలోని పలు ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ ఇలాంటి పేర్లు ఉండడం గమనించా. ఇక్కడ మెస్ ప్రారంభించే సమయంలో అదే ఆలోచనతో రెడ్డి గారి వంటిల్లు అని పేరు పెట్టా. అందరి ఆదరణ లభించి వ్యాపారం సాఫీగా సాగుతోంది. – బారాజు రామిరెడ్డి, డీఐజీ బిల్డింగ్ దగ్గర, జ్యోతినగర్, కరీంనగర్ -
అడ్డగోలు హోర్డింగులకు ఇక చెల్లు..
సాక్షి, సిటీబ్యూరో: ఆకాశహార్మ్యాలతో పోటీ పడుతున్న గ్రేటర్‌లోని హోర్డింగులు వాహనదారుల దృష్టి మళ్లిస్తూ పలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఎప్పుడు ఏ హోర్డింగ్ కుప్పకూలుతుందో తెలియక గుండెలు గుభేల్‌మనిపిస్తున్నాయి.స్టెబిలిటీ సర్టిఫికెట్లున్నప్పటికీఈ ప్రమాదాలు ఆగడం లేవు. మరోవైపు నగర అందాన్ని ఇవి హరించివేస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం గ్రేటర్ నగరానికి కొత్త అడ్వర్టయిజ్మెంట్ పాలసీని ప్రకటించింది. ఈ పాలసీ మేరకు ఇకనుంచి ఎత్తయినహోర్డింగులుండవు. భూమి నుంచి కేవలం 15 అడుగుల ఎత్తు వరకు మాత్రమే అనుమతిస్తారు. ఈ ఎత్తువరకు ఉన్నవాటిని సైతం క్రమబద్ధీకరిస్తారు. 15 అడుగులకుమించి ఇప్పటికే ఉన్నవాటిలో గడువు ముగిసిన వాటిని జీహెచ్ఎంసీ వెంటనే తొలగిస్తుంది. గడువున్న వాటిని గడువు ముగియగానే తొలగిస్తుంది. ఏ కారణంతో తొలగించినా, ఇతర ప్రదేశంలో అనుమతి ఇవ్వడం వంటివి ఉండవు. దాని ఏఐఎన్(అడ్వర్టయిజ్మెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్) ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. కొత్తగా అనుమతులిచ్చే వాటికి ముఖ్యంగా ప్రజల భద్రత, రోడ్ సేఫ్టీతోపాటు నగర అందం వంటివి పరిగణనలోకి తీసుకుని అనుమతిస్తారు. ఫ్లాషింగ్ లైట్లు/నాన్ స్టాటిక్ ఇల్యూమినేషన్ ప్రకటనలకు ట్రాఫిక్ పోలీసులు, హైకోర్టు నుంచి తగిన అనుమతి పొందాక అనుమతిస్తారు. ♦ భవనం ఫ్రంటేజ్లో 15 శాతం వరకు మాత్రమే నేమ్బోర్డులకు అనుమతిస్తారు. అంతేకాదు భవనం వెంటిలేషన్‌కు అవరోధాలు లేకుండా మాత్రమే నేమ్ బోర్డు ఏర్పాటు చేయాలి. పెద్ద వాణిజ్య భవనాలకు సంబంధించి 15 అడుగులకు మించిన ఎత్తులో నేమ్‌బోర్డులు ఏర్పాటు చేసుకునే అవకాశమిచ్చినప్పటికీ 10 అడుగుల వెడల్పు 5 అడుగుల ఎత్తు మించరాదు. ♦ ఎక్కడైనా రెండు ప్రకటనలకు మధ్య కనీసం 50 మీటర్ల దూరం ఉండాలి. రోడ్ సైనేజీలకు, ఇతర ప్రకటనలకు వాటి వల్ల ఆటంకం కలగొద్దు. బస్షెల్టర్లు, పబ్లిక్ టాయ్లెట్లకు సంబంధించిన ప్రకటనల్లో మాత్రం వీటికి మినహాయింపు ఉంటుంది. ఎలక్ట్రిసిటీ యాక్ట్ మేరకు ట్రాన్స్మిషన్ లైన్లు, రైల్వే ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ లైన్లకు పాటించాల్సిన కనీస దూరం పాటించాలి. ♦ ఎమర్జెన్సీ సర్వీస్ తదితర హెచ్చరికల మాదిరిగా కనిపించే ఎరుపు, నీలం, యాంబర్ వంటి రంగులను ఫ్లాషింగ్ లైట్లలో వాడరాదు.జంక్షన్ల వద్ద ఐఆర్సీ నిబంధనలు, లైటింగ్‌తో కూడిన ప్రకటనలకు సంబంధించి బీఈఈ, బీఐఎస్ నిబంధనలు పాటించాలి. వీటి వద్ద ప్రకటనల బోర్డులు నిషేధం.. ♦ చెరువులు, సరస్సులు, నదులు, నాలాలు, శిఖం (ప్రభుత్వ)భూములు,బ్రిడ్జిలు, రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఎలాంటి ప్రకటనల బోర్డులకు అనుమతి ఇవ్వరు. ♦ ఆర్కిలాజికల్, ఆర్కిటెక్చరల్, ఈస్తటికల్, హిస్టారికల్ లేదా హెరిటేజ్ ప్రాముఖ్యత ఉన్న భవనాల ముందుకానీ, వాటి గోడలపైన కానీ, ప్రహరీల లోపల కానీ ఎలాంటి ప్రకటనలకు వీల్లేదు. వీటి వెంటిలేషన్‌కు అడ్డుగా ఎలాంటి సైన్‌బోర్డులు, ప్రకటనల బోర్డులకు వీల్లేదు. ♦ మెట్రో రైలు సర్వీసులకు అవరోధం కలిగించేలా ఉంటే అనుమతివ్వరు. ♦ భవనాల రూఫ్‌టాప్‌లపై అనుమతివ్వరు. ♦ పాలసీకి అనుగుణంగా వాహనాలపై నాన్ లైటింగ్ ప్రకటనలకు అనుమతివ్వవచ్చు కానీ ప్రకటనల కోసం వాహనానికి అదనంగా ఎలాంటి బోర్డు లేదా నిర్మాణం వంటివి ఉండరాదు. ♦ ఎలక్ట్రికల్ట్రాన్స్మిషన్ లైన్లకు దగ్గరలో, పక్కన, పైన ఎలాంటి ప్రకటనలకు వీల్లేదు. ♦ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ కమిషనర్ నోటిఫై చేసిన ఇతర ప్రాంతాల్లోనూ అనుమతులివ్వరు. ఇవి తప్పని సరి.. ప్రతి సంవత్సరం ప్రభుత్వ, జీహెచ్ఎంసీకి సంబంధించిన పథకాలు, ప్రజలకుపకరించే సామాజిక సందేశాలతోకూడిన ప్రకటనలు కనీసం 10 శాతం ఉచితంగా ప్రదర్శించాలి. ప్రకటనల ఏర్పాటు, సామాగ్రిలో బయోడిగ్రేడబుల్కు ప్రోత్సాహకం. ప్రకటనలు ఏర్పాటు చేసేవారు జీహెచ్ఎంసీ కమిషనర్‌నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలి. ప్రైవేట్ స్థలాల్లో ఏర్పాటు చేసేందుకు స్థల, భవన యజ మాని నుంచి ఎన్ఓసీతోపాటు భవన అనుమతి పత్రం సమర్పించాలి. ప్రతి ఆరుమాసాలకోమారు స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ సమర్పించాలి.సంబంధిత అధికారులు స్ట్రక్చరల్ స్టెబిలిటీని తనిఖీ చేయాలి. గ్లాస్ బోర్డుల నుంచి హోర్డింగుల దాకా.. కొత్త అడ్వర్టయిజ్మెంట్ పాలసీ అన్ని రకాల ప్రకటనలకు వర్తిస్తుంది. వీటిల్లో హోర్డింగులు, యూనిపోల్, యూని స్ట్రక్చర్స్, నియాన్/గ్లో సైన్‌బోర్డులు, ఆర్చిలు, వాల్‌పెయింటింగ్స్, ఫ్లెక్సిబోర్డులు, గ్లాస్ బోర్డులు, షాప్ షట్టర్లు, లాలిపాప్స్, బస్ షెల్టర్లు, బెలూన్లు, బస్సులు, టాక్సీలు ఆటోలు తదితర వాహనాలపై మొబైల్ యాడ్స్ ఉన్నాయి. ఈమేరకు మార్గదర్శకాలతో మునిసిపల్ పరిపాలన, పట్టణాభివ్రుద్ధిశాఖ సోమవారం రాత్రి జీవో జారీచేసింది. ఉల్లంఘిస్తే జరిమానాలిలా.. ♦ 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో అక్రమంగా ఏర్పాటు చేస్తే : రోజుకు రూ. 1,00,000 ♦ 15 మీటర్లకంటే తక్కువ ఎత్తులో అక్రమంగా ఏర్పాటు చేస్తే :రోజుకు రూ. 50,000 ♦ అనుమతి లేకుండా ఫ్లాషింగ్ లైట్లు, నాన్ స్టాటిక్ లైటింగ్‌కు : రోజుకు రూ. 50,000 ♦ భవనం ఫ్రంటే జ్లో 15 శాతం కంటే ఎక్కువ స్థలంలో ఏర్పాటు చేస్తే: చదరపు అడుగుకు రోజుకు రూ. 100. వంతున ♦ మూవింగ్ , రొటేటింగ్ లేదా ఇతరత్రా మెసేజ్ అడ్వర్టయిజింగ్ డివైజ్ వినియోగిస్తే : రూ. 10,000 రోజుకు ♦ స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ లేకుండా ఏర్పాటు చేస్తే : రూ. 50,000 వేలు రోజుకు ♦ నిబంధనలకు విరుద్ధంగా వాహనాల ద్వారా ప్రచారం చేస్తే :రూ. 10,000 రోజుకు ♦ అనుమతించిన లైటింగ్ కంటే ఎక్కువ లైటింగ్‌తో ఏర్పాటు చేస్తే: రూ.10,000 రోజుకు -
హోర్డింగులపై నిషేధం!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో హోర్డింగులపై నిషేధం విధించారు. ఈనెల 15 నుంచి ఆగస్ట్ 15 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన వివిధ విభాగాల ఉన్నతాధికారుల సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలి కాలంలో హోర్డింగుల ఫ్లెక్సీల ఆటంకాలతో మెట్రో మార్గాల్లో పలు పర్యాయాలు మెట్రోరైళ్లు నిలిచిపోవడం తెలిసిందే. వర్షాకాలంలో వర్షాలతోపాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్‌లు, యూనిపోల్స్ కూలిపోయే అవకాశాలుండటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జలమండలి, రెవెన్యూ, ట్రాన్స్‌కో, మెట్రో రైలు, వాతావరణ శాఖ, నీటి పారుదల శాఖ, ఫైర్ సర్వీసులు, ఆర్టీసి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు, తదితర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు మార్గంలో 95 హోర్డింగ్‌లు ప్రమాదకరంగా ఉన్నాయని హైదరాబాద్ మెట్రోరైలు ఎండి ఎన్వీఎస్ ప్రస్తావించారు. అయితే మెట్రో రైలు మార్గంలో ఉన్న అన్ని హోర్డింగ్‌లపై నిషేధం విధించామని, కొన్ని హోర్డింగ్‌లపై అక్రమంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ అద్వైత్‌కుమార్ సింగ్ తెలిపారు. మెట్రో మార్గంలో ఉన్న అన్ని హోర్డింగ్‌లను తొలగించాలని సంబంధిత ఏజెన్సీలను ఆదేశించినట్లు పేర్కొన్నారు. అక్రమ హోర్డింగులెన్నో.. జీహెచ్ఎంసీ లెక్కల మేరకు నగరంలో దాదాపు 2600 హోర్డింగులున్నాయి. ఇవి కాక అనధికారికంగా మరో 2500 వరకు ఉంటాయి. అయితే జీహెచ్ఎంసీ తనిఖీల్లో మాత్రం 333 అక్రమ హోర్డింగుల్ని గుర్తించి దాదాపు 300 వరకు తొలగించినట్లు గత సంవత్సరం పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో మరికొన్ని అక్రమ హోర్డింగులు వెలిశాయి. ప్రమాణాలకు తిలోదకాలు.. హోర్డింగుల ఏర్పాటుకు సంబంధించి తగిన భద్రతా ప్రమాణాలు పాటించడం లేరనే ఆరోపణలున్నాయి. గతంలో హోర్డింగులు, యూనిపోల్స్ కూలిన నేపథ్యంలో జేఎన్టీయూకు చెందిన నిపుణులు కొన్ని సిఫారసులు చేశారు. స్ట్రక్చరల్ ఇంజినీర్ క్షేత్రస్థాయి తనిఖీల అనంతరమే తగిన సేఫ్టీ ఉందని భావించిన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. ఏర్పాటు విషయాన్ని జేఎన్టీయూకు కూడా సమాచారమివ్వాలి. గోడలపై, భూమిపై నుంచి ఏర్పాటుచేసే హోర్డింగులు 40 ఇంటూ 25 అడుగుల వరకు ఏర్పాటు చేసుకోవచ్చు. రూఫ్ టాప్‌పై ఏర్పాటు చేసేవి రెండంతస్తుల వరకు 30 ఇంటూ 25 అడుగులకు మించకుండా ఏర్పాటు చేసుకోవచ్చు. అలాంటి వాటికి ఏదైనా ప్రమాదం జరిగితే తమదే బాధ్యత అని ఏజెన్సీలు సొంత పూచీకత్తునివ్వాలి. అంతే కాకుండా ప్రతి అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ వేటికవిగా విడివిడిగా వ్యక్తిగతంగా అండర్‌టేకింగ్ ఇవ్వాలి. థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలి. అయినప్పటికీ ఇవేవీ పాటించకుండానే హోర్డిం గులు వెలుస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఆదాయం అంతంతే.. హోర్డింగుల వల్ల జీహెచ్ఎంసీకి పెద్దగా ఆదాయం కూడా రావడం లేదు. ఏటా రూ. 30 కోట్లకు పైగా రావాల్సి ఉన్నప్పటికీ, రూ. 15 కోట్ల వరకు మాత్రమే వసూలవుతోంది. -
హోర్డింగ్ డేంజర్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని టవర్లు, హోర్డింగ్‌లతో ప్రమాదం పొంచి ఉంది. తక్కువ వేగంతో వీస్తున్న గాలులకే ఇవి కుప్పకూలిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. వీటి నిర్మాణ నాణ్యత, మన్నిక పరిశీలనలో జీహెచ్ఎంసీ విఫలమవుతోంది. ఫలితంగా ప్రజా భద్రత గాలిలోదీపమవుతోంది. తాజాగా సోమవారం కురిసిన గాలివానకు ఎల్బీ స్టేడియంలోని ఫ్లడ్‌లైట్ల టవర్ కూలి ఓ వ్యక్తి మరణించడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. నగరంలో దాదాపు 2,600 హోర్డింగ్‌లు ఉండగా... వీటిలో కొన్ని దశాబ్దాల క్రితమే ఏర్పాటు చేసినవి కావడంతో అవి ఎప్పుడు కూలుతాయోన ని ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. 2016లో జూబ్లీహిల్స్‌లో ఓ భారీ హోర్డింగ్ యూనిపోల్ కుప్పకూలడం తో నగరంలో నూతన హోర్డింగ్‌లకు అనుమతులు నిషేధించారు. అయితే వ్యాపార, వాణిజ్య వర్గాలు ఆందోళనలు చేయడంతో షరతులతో కూడిన అనుమతులు మంజూ రు చేయాలని నిర్ణయించారు. ఈ నిబంధ నల ప్రకారమే 2017 నుంచి హోర్డింగ్‌లకు అనుమతులు ఇస్తున్నారు. అయితే కొన్ని నిబంధనలు కాగితాలకే పరిమితమవడం గమనార్హం. మరోవైపు హోర్డింగ్‌లకు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు గాలులు వీచినప్పుడు ఎగిరిపడి మెట్రోరైలు మార్గంలోని ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై పడుతుండడంతో రైళ్ల రాకపోకలకు తరచూ అంతరాయం ఏర్పడుతోంది. ఇటీవల బాలానగర్‌లో, అంతకుముందు తార్నాక, మెట్టుగూడ, బేగంపేట్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. పాలసీపై నిర్లక్ష్యం... గ్రేటర్లో హోర్డింగ్‌లతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ‘హోర్డింగ్ ఫ్రీ సిటీ’గా మారుస్తామని గతంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన సమయంలో కేటీఆర్ ప్రకటించారు. అయితే ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నగరంలో ప్రస్తుతమున్న 2,600 హోర్డింగ్‌ల నాణ్యత, మన్నిక ఎలా ఉందనే అంశంపై జేఎన్టీయూ, ఐఐటీ నిపుణులతో పరీక్షించే విషయంలో బల్దియా యంత్రాంగం విఫలమైంది. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. బెంగళూర్ తరహాలో ‘ప్రమాద రహిత హోర్డింగ్’ పాలసీ విధివిధానాలు రూపొందించడంలోనూ మున్సిపల్, బల్దియా యంత్రాంగాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. జీహెచ్ఎంసీ నోటీసులు... ఎల్బీ స్టేడియంలో ఉన్న ఫ్లడ్‌లైట్ టవర్ల స్ట్రక్చరల్ స్టెబిలిటీపై తక్షణం నివేదిక సమర్పించాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. సోమవారం రాత్రి కురిసిన గాలివానకు స్టేడియంలోని ఫ్లడ్‌లైట్ టవర్ కూలి ఒకరు మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మిగిలిన మూడు టవర్ల స్టెబిలిటీపై జేఎన్టీయూ, ఉస్మానియాకు చెందిన ఇంజినీరింగ్ నిపుణులతో అధ్యయనం చేయించి, తక్షణం నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ఆదేశించారు. మిగిలిన మూడింటిలో ఏదైనా టవర్ బలహీనంగా ఉన్నట్లు నివేదికలో తేలితే వెంటనే తొలగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నగరంలో హోర్డింగ్‌లు, యూనిపోల్స్ స్ట్రక్చరల్ స్టెబిలిటీపై గతేడాది పరీక్షలు నిర్వహించామన్నారు. ప్రధాన మార్గాల్లోని హోర్డింగ్‌లపై ఫ్లెక్సీలను తొలగించాలని ఆయా ఏజెన్సీలకు కమిషనర్ స్పష్టం చేశారు. అదే విధంగా గ్రేటర్‌లోని అన్ని సెల్టవర్ల మన్నిక సామర్థ్యం (స్ట్రక్చరల్ స్టెబిలిటీ)పై తక్షణం నివేదిక ఇవ్వాలని ఆయా సర్వీస్ ప్రొవైడర్లకు జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఈదురు గాలులకు హోర్డింగ్‌లు, టవర్లు కూలుతున్న నేపథ్యంలో ఈ నోటీసులిచ్చింది. నగరంలోని అన్ని సెల్టవర్ల స్ట్రక్చరల్ స్టెబిలిటీపై నిపుణులైన ఇంజినీర్లు లేదా ఉస్మానియా, జేఎన్టీయూ ఇంజినీరింగ్ విభాగాలతో పరీక్షించి నివేదికలు సమర్పించాలని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఇచ్చింది. కాగితాల్లోనే నిబంధనలు... ♦ గోడలకు, భూమి మీద ఏర్పాటు చేసే హోర్డింగ్‌ల సైజు 40 గీ25 ఫీట్లు మాత్రమే ఉండాలి. ♦ రూఫ్‌టాప్ మీద పెట్టేవి రెండంతస్తుల ఎత్తు మించరాదు. వీటి పరిమాణం కూడా 30 గీ25 మాత్రమే ఉండాలి. ♦ తాము ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లతో ఎలాంటి ప్రమాదాలు జరగబోవని సదరు ఏజెన్సీ అండర్‌టేకింగ్ ఇవ్వాలి. ♦ హోర్డింగ్ ఏర్పాటు సమయంలో, ఆ తర్వాత జేఎన్టీయూ, ఐఐటీ నిపుణులతో నిర్మాణ నాణ్యతను పరీక్షించాలి. ♦ గ్రేటర్లో అనధికారికంగా 330 భారీ హోర్డింగ్‌లు ఉన్నట్లు 2016లో గుర్తించారు. వీటిలో 300 వరకు 2018లో తొలగించారు. అయితే ఆ తర్వాత ఎక్కడ? ఎన్ని? అనధికారిక హోర్డింగ్‌లు వెలిశాయనేది బల్దియా యంత్రాంగం గుర్తించకపోవడం గమనార్హం. -
బాబులు..బాలలనూ వదల్లేదు
పాలక పార్టీ పెద్దల ప్రచార దాహం శ్రుతి మించుతోంది. ప్రధాన రహదారుల్లో హోర్డింగులు ఏర్పాటు చేసి, ఆర్టీసీ బస్సులపై పథకాలను వివరిస్తూ ప్రచారం పొందడం సరిపోదనుకుని బడి పిల్లలనూ వాడుకుంటున్నారు. వారి పుస్తకాల బ్యాగుల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నక్కా ఆనంద్‌బాబుల ఫొటోలు ముద్రించి ప్రచారం చేసుకోవడం చూసిన గుంటూరు జనం ఔరా.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.– ఫొటో: రామ్‌గోపాల్ -
ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ హోర్డింగ్స్
-
పుట్టినరోజున ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు వద్దు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తన పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయొద్దని మంత్రి కె.తారకరామారావు అభిమానులను కోరారు. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పటికే నగరంలో అక్కడక్కడ పెట్టిన హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తొలగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్లను కోరారు. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పత్రికలు, టీవీలకు ఇచ్చే ప్రకటనల ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేయాలని పిలుపునిచ్చారు. పూల బొకేలు, ఫ్లెక్సీలకు అయ్యే చిన్న మొత్తాలను సైతం సీఎం సహాయ నిధికి పంపించాలని కోరారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ తన పుట్టిన రోజున మొక్కలు నాటాలని కోరారు. -
హోర్డింగులపై నిషేధం
సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని రకాల హోర్డింగ్‌లు, యూనిపోల్స్, ఆర్చిలు, ఆబ్లిగేటరీ స్పాన్లు, యూనిస్ట్రక్చర్స్, కాంటిలివర్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలపై ప్రకటలను నిషేధిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలివర్షాలు, ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో హోర్డింగ్‌లు కూలడం, యూనిపోల్స్‌పై వినైల్ ఫ్లెక్సీ బ్యానర్లు చిరిగి చెల్లాచెదురుగా వేలాడటం వంటి ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. వాటి వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతోపాటు రహదారులపై ప్రయాణించే వారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసిందని కమిషనర్ తెలిపారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించిన వీటినుంచి తగిన భద్రత కల్పించేందుకు, ప్రమాదాలు జరుగకుండా నిరోధించేందుకు శుక్రవారం నుంచే నిషేధం అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఈ నిషేధం ఆగస్టు 14వ తేదీ వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. హోర్డింగ్‌లు, యూనిపోల్స్, ఆర్చిలు, ఫుట్‌ఓవర్‌బ్రిడ్జిలు, ఆబ్లిగేటరీ స్పాన్లపై ప్రస్తుతం ఉన్న ఫ్లెక్సీ బ్యానర్లను వెంటనే తొలగించాల్సిందిగా జనార్దన్‌రెడ్డి అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలను ఆదేశించారు. -
హోర్డింగ్‌లపై కొత్త పాలసీ
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఎన్ని హోర్డింగులకు అనుమతులున్నాయో, వాటికి ఎంత గడువుందో తెలియదు. అక్రమంగా ఏర్పాటైన హోర్డింగులెన్నో. వాటిద్వారా జీహెచ్ఎంసీ ఖజానాకు జరుగుతున్న నష్టానికి లెక్కేలేదు. ఈ నేపథ్యంలో అక్రమ హోర్డింగుల తొలగింపుతో పాటు అనుమతులున్న హోర్డింగులను ఆన్లైన్ నుంచే మానిటరింగ్ చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. జూలై 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ అమలు చేయనున్నట్టు పేర్కొంది. ఇందులో భాగంగా యూనిపోల్స్, హోర్డింగులు ఉన్న ప్రాంతాలు, వాటికి జారీ చేసిన అనుమతులు, కేటాయించిన నెంబరు, స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ తదితర వివరాలు కూడా ఆన్లైన్లోనే ఉంచనున్నారు. ఇందుకోసం ప్రకటనల విభాగానికి ప్రత్యేకంగా వెబ్‌ను రూపొందించారు. దీని ద్వారా హోర్డింగ్ జియోగ్రాఫికల్ లొకేషన్ కూడా తెలుసుకునే అవకాశం ఉంది. త్వరలో మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తేనున్నారు. క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లే అధికారులు యాప్ ద్వారా ఏవైనా అవకతవకలుంటే గుర్తించి కార్యాలయాల్లోని ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చు. నగర మేయర్, కమిషనర్లతో పాటు జీహెచ్ఎంసీ సీనియర్ అధికారులు కూడా ఈ యాప్ ద్వారా హోర్డింగ్‌లను నిరంతరం పరిశీలిస్తారు. లైసెన్స్‌ల చెల్లింపు కూడా ఆన్లైన్లోనే ఇప్పటి దాకా హోర్డింగులకు సంబంధించిన రికార్డులు, ఫైళ్ల నిర్వహణ మాన్యువల్‌గా ఉంది. లైసెన్సు ఫీజులు చెల్లించని వారికి సంబందిత క్లర్కులు నోటీసులిస్తేనే తెలిసేది. ఇకపై ఏజెన్సీలు తమ లాగిన్‌కు వెళితే చెల్లించాల్సిన ఫీజు, నోటీసులు నేరుగా తెలసుకుని ఆన్లైన్లోనే చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఐటీ వినియోగంతో జవాబుదారీతనం పెరుగుతుందని, ఇందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు. -
హోర్డింగులమయం
విజయవాడ: విజయవాడ నగరాన్ని హోర్డింగులు ముంచెత్తాయి. నిబంధనలకు విరుద్దంగా వాణిజ్య, రాజకీయ పరమైన హోర్డింగ్‌లు ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా పెట్టేస్తున్నారు. సగానికిపైగా హోర్డింగ్‌లు అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారు. రానున్న వర్షా కాలంలో హోర్డింగ్‌లతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని ప్రజలు భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈదురుగాలులు, భారీ వర్షాలకు హోర్డింగ్‌లు కుప్పకూలే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. పర్యవేక్షణ గాలికి.. విజయవాడ నగరంతో పాటు మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో కూడా నిబంధనలు పాటించకుండా వేల సంఖ్యలో హోర్డింగ్‌లు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. జనావాసాలు, నివాసప్రాంతాల్లో కూడా వీటిని పెడుతున్నారు. విజయవాడ నగరంలో నాలుగైదు అంతస్తుల భవనాలపై కూడా బరువైన హోర్డింగ్‌లు ఉన్నాయి. ఎత్తుపెరిగిన కొద్దీ గాలుల వల్ల హోర్డింగులు విరిగిపడే ప్రమాదం ఉంది. హోర్డింగుల ఏర్పాటును పర్యవేక్షించకుండా గాలికి వదిలేస్తున్నారు. విజయవాడ నగరంలో 1800 హోర్డింగ్‌లు మాత్రమే టౌన్ ప్లానింగ్‌లో నమోదయ్యాయి. టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండా నగరంలో మరో 3 వేల హోర్డింగులను అనామతుగా పెట్టేశారు. విజయవాడలో ప్రధాన రహదారులుగా పేరుగాంచిన బందరురోడ్డు, ఏలూరు రోడ్డు, ఐదో నంబర్ రోడ్డు, ఒన్‌టౌన్ ప్రాంతంలో కుప్పలుతెప్పలుగా ప్రైవేటు భనవాలు, రోడ్లపై హోర్డింగులు ఉన్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో.. అదే విధంగా మచిలీపట్నం, జాతీయ రహదారి, చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారులు, జిల్లాలోని ప్రధాన పట్టణాలైన గుడివాడ, మచిలీపట్నం, హనుమాన్‌జంక్షన్, నూజివీడు, నందిగామలలో కూడా హోర్డింగ్‌ల బెడదతో జనం ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా వ్యాపార సంబంధమైన ప్రచార హోర్డింగుల నుంచి వాణిజ్యపన్నుల శాఖకు ట్యాక్స్ కూడా కట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలు ఇవి.. ♦ విజయవాడ నగర పాలక సంస్థలో ముందుగా టౌన్‌ప్లానింగ్ అధికారుల నుంచి అనుమతులు పొందాలి. ♦ అనుమతులు జారీ చేసేటప్పుడు అధికారులు హోర్డింగుల ఎత్తు, పరిమాణం తదితరాలు తనిఖీ చేయాలి. ♦ గాలుల వల్ల విరిగి పడినా, జనావాసాల మధ్య పడకుండా ఉండని ప్రాంతాల్లో మాత్రమే అనుమతులు ఇవ్వాలి ♦ మున్సిపల్ కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో కూడా సంబంధిత స్థానిక సంస్థల నుంచి అనుమతులు పొందాలి. ♦ విద్యుత్ టవర్లు, లైన్లకు దగ్గరలో హోర్డింగులు, కటౌట్ల ఏర్పాటుకు అనుమతించకూడదు. ♦ అనుమతి మంజూరు చేసేటప్పుడు సంబంధిత అధికారులు విద్యుత్, అగ్నిమాపక అధికారుల నుంచి కూడా ఎన్ఓసీలు తీసుకోవాలి. ♦ పంటపొలాల్లో, విద్యుత్ లైన్ల సమీపంలో అనుమతించకూడదు. ♦ జాతీయ రహదారి పక్కనే ఏర్పాటు చేసేటప్పుడు సంబంధిత ఎన్‌హెచ్ అధికారుల అనుమతి తీసుకోవాలి. -
ప్రకటనల పన్ను ఎగనామం
.. నగరంలోనే కాదు జిల్లాలోని దాదాపు అన్ని మున్సిపాలిటీల్లోఇదే పరిస్థితి. అనుమతి లేని హోర్డింగ్స్‌తో మున్సిపాలిటీ ఆదాయానికి గండికొడుతున్నా ఎవరూ అడగరు. అనంతపురం న్యూసిటీ/ధర్మవరం: ఆస్తి పన్ను.. నీటి పన్ను.. ప్రజల విషయానికొస్తే ఎలాంటి పన్నునైనా ముక్కుపిండి వసూలు చేస్తారు. ఇందుకోసం ఇళ్ల వద్దకొచ్చి డప్పు కొడతారు.. చెత్తను తీసుకొచ్చి కుమ్మరిస్తారు. నిర్ణీత కాల పరిమితిలోపు పన్ను పెంచేస్తారు. అయితే ప్రకటన పన్ను విషయానికొస్తే మాత్రం ఉదారంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన కూడళ్లలో ఆకట్టుకునే హోర్డింగ్‌లతో ఏజెన్సీలు ప్రచారం చేసుకుంటున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. ఎలాంటి అనుమతి తీసుకోకుండానే అప్పనంగా లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. అనంతపురం నగరపాలక సంస్థలో 11 ఏజెన్సీలు 201 హోర్డింగ్‌లను నిర్వహిస్తున్నాయి. 2013 నుంచి ఏజెన్సీలు రూ.28,58,673 చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాదికి డిమాండ్‌తో కలుపుకుంటే మరో రూ.60లక్షలు బకాయి పడ్డాయి. అయితే నగరపాలక సంస్థ అధికారులు ఇంత వరకు పన్ను వసూళ్లకు సంబంధించి నోటీసులు కూడా జారీ చేయకపోవడంగమనార్హం. ఈ పరిస్థితి ఒక్క నగరపాలక సంస్థలోనే కాదు.. ఫస్ట్ గ్రేడ్ మునిసిపాలిటీలైన గుంతకల్లు, తాడిపత్రి, సెకెండ్ గ్రేడ్ మునిసిపాలిటీలైన ధర్మవరం, కదిరి, రాయదుర్గంతో పాటు నగర పంచాయతీల్లోనూ అధికారులు మౌనం దాల్చారు. ప్రచార ప్రకటనలు.. పోస్టర్లు, బ్యానర్లు, గోడ రాతలు.. హోర్డింగ్‌ల ద్వారా మునిసిపాలిటీలకు చదరపు మీటర్ లెక్క ఆధారంగా డబ్బు చెల్లించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా కొన్ని హోర్డింగ్‌లు మినహా మిగితా వాటికి పన్ను వసూలు చేస్తున్న దాఖలాల్లేవు. పన్నుల రూపంలో వచ్చిన మొత్తంతో నగరపాలక సంస్థ, మునిసిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. అలాంటి పన్నుల విషయంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. 14 ఏళ్లుగా ఒకే మొత్తం హోర్డింగుల ఏర్పాటుకు సంబంధించి సైజును బట్టి ధర నిర్దేశిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేస్తుంది. ఐదారేళ్లకోసారి తాజా పరిస్థితులకు అనుగుణంగా ఈ రేట్లను సవరించాల్సి ఉంటుంది. 1998లో ప్రభుత్వం రేట్లను సవరించగా.. అక్లోబర్ 1, 2000 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికి 14 ఏళ్లు గడిచినా సవరణ దిశగా చర్యలు చేపట్టని పరిస్థితి. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ అయిన ధర్మవరంలో ప్రకటనల పన్ను రూపేణా రూ.2.5లక్షల ఆదాయం మాత్రమే సమకూరుతోంది. సక్రమంగా పన్ను రివిజన్ జరిగి ఉంటే మున్సిపాలిటీకి కనీసం రూ.5లక్షల ఆదాయం వచ్చేదని తెలుస్తోంది. ఇక అనధికార ప్రకటనలను గట్టిగా పట్టుకుంటే పన్ను మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. అనధికార ప్రకటనలే ఎక్కువ అధికారిక వాణిజ్య ప్రకటన పన్ను పెంచకపోవడంతో ఆదాయం కోల్పోవడం ఒక ఎత్తయితే.. ప్రధాన కూడళ్లలో అనధికార ప్రకటనలే అధికంగా ఉంటున్నాయి. వీటి ద్వారా మున్సిపాలిటీలకు ఒక్క పైసా ఆదాయం ఉండదు. ప్రకటనల విషయంలో అధికారులు శ్రద్ధ వహిస్తే మున్సిపాలిటీలకు నిధుల విషయంలో కాస్త ఊరట లభిస్తుంది. కొన్నింటిని గుర్తించి ఏజెన్సీ నిర్వాహకులను అధికారులు ప్రశ్నిస్తే.. తాము కార్యకలాపాలు నిర్వహించడం లేదని, రాజకీయ పార్టీల నేతలు తమ హోర్డింగ్‌లను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారనే సమాధానం వస్తోంది. వాస్తవానికి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే మున్సిపల్ అధికారులు మిన్నకుండిపోతున్నట్లు తెలుస్తోంది. అనధికార హోర్డింగ్‌లను తొలగిస్తాం మునిసిపాలిటీల్లో అనధికారికంగా ప్రకటనల హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవు. అలాంటి హోర్డింగ్‌లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగిస్తాం. పన్ను వసూళ్లకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం. జీఎస్టీ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కమర్షియల్ ట్యాక్స్ పరిధిలోకి పన్ను వసూళ్లు వెళ్లనున్నాయి.– రవీంద్రబాబు, మున్సిపల్ ఆర్డీ -
హోర్డింగ్స్‌పై సమాధానమివ్వండి..
గుంటూరు లీగల్: నగరంలోని ప్రధాన కూడళ్లలో అనధికారికంగా కొనసాగుతున్న గ్రౌండ్‌సైడ్ హోర్డింగ్‌లతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎదుట మన లక్ష్యం పోస్టర్ ఫ్రీ అనే స్వచ్ఛంద సేవాసంస్థ దాఖలు చేసిన ఫిర్యాదుపై ఈ నెల 25న నగరపాలక సంస్థ సమాధానం దాఖలు చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.లక్ష్మీనరసింహారెడ్డి శనివారం ఆదేశాలు జారీచేశారు. నగరంలో అనధికారికంగా గ్రౌండ్‌సైడ్ హోర్డింగ్స్ కొనసాగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేసిన హోర్డింగ్స్ కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ మన లక్ష్యం పోస్టర్ ఫ్రీ అనే సంస్థ గతంలో దాఖలు చేసిన ఫిర్యాదుపై కమిషనర్, పట్టణ ప్రణాళికాధికారులు అక్టోబర్ 15న హాజరై తమ సమాధానం దాఖలు చేయాని ఆదేశించిన విషయం విదితమే. ఈ మేరకు శనివారం జిల్లా న్యాౖయసేవాధికార సంస్థ ఎదుట పట్టణ ప్రణాళికాధికారి రమేష్‌బాబు హాజరయ్యారు. కొంత సమయం ఇస్తే తమ సమాధానం దాఖలు చేస్తామని న్యాయమూర్తికి విన్నవించారు. న్యాయమూర్తి లక్ష్మీనరసింహారెడ్డి స్పందిస్తూ గ్రౌడ్‌సైడ్ హోర్డింగ్స్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉదని నగరపాలక సంస్థ అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 25వ తేదీన సమాదానం దాఖలు చేయాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు. -
హోర్డింగ్స్ తొలగించి.. ఇనుము తీసుకెళ్లండి
సాక్షి, సిటీబ్యూరో: వివిధ పనులకు ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సంస్థలపై ఆధారపడుతున్న జీహెచ్ఎంసీ.. చివరకు అక్రమ హోర్డింగ్‌ల కూల్చివేతలను సైతం కాంట్రాక్టుకిచ్చేందుకు సిద్ధమైంది. కుప్పలు తెప్పలుగా వెలుస్తున్న అక్రమ హోర్డింగులు పలు ప్రమాదాలకు కారణమవుతున్న విషయం తెలిసిందే. కొద్దినెలల క్రితం నిజాం కాలేజీ వద్ద హోర్డింగ్ కుప్పకూలడంతో, హోర్డింగ్‌ల సామర్ధ్యంపై కళ్లు తెరచిన అధికారులు.. అదే సమయంలో అక్రమ హోర్డింగ్లపైనా దృష్టి పెట్టారు. అక్రమ హోర్డింగ్స్‌లో ఇప్పటికే కొన్ని తొలగించగా.. ఇంకా 162 ఉన్నట్లు గుర్తించారు. వీటి ని తొలగించే పనులను కాంట్రాక్ట్‌కు ఇవ్వడంతో పాటు సదరు హోర్డింగుల ఇనుమును కూడా వారికి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ ఇనుము విక్రయించగా వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని.. కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీకి ఎంతమేర తిరిగి చెల్లించగలరో కోరుతూ టెండర్లను ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. ఇనుము విలువ పెరిగిపోవడంతో..ఒక్కో హోర్డింగ్ ఏర్పాటులో ఎంత ఇనుము వినియోగించారనేది తెలుసుకునేందుకు ఇటీవల సర్వే నిర్వహించారు. ఒక్కో హోర్డింగ్‌కు వినియోగించిన ఇనుము రెండున్నర నుంచి మూడు మెట్రిక్ టన్నుల వరకు ఉన్నట్లు గుర్తించారు. ఈ అంచనాతో హోర్డింగ్స్ తొలగింపు పనుల్ని కాంట్రాక్టుకిస్తే.. తమకు వాటిని తొలగించే శ్రమ తప్పడంతో పాటు జీహెచ్ఎంసీకి అంతో ఇంతో ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే టెండర్లకు సిద్ధమవుతున్నారు. అధికారుల ఈ ఆలోచన ఏ మేరకు ఫలితాలిస్తుందో వేచి చూడాల్సిందే. ఇది ఫలితమిస్తే.. భవిష్యత్తులో అక్రమ భవనాల కూల్చివేతలకు సైతం జీహెచ్ఎంసీ అధికారులు ఇలాంటి ఆలోచనలే చేస్తారేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి