సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో హోర్డింగులపై నిషేధం విధించారు. ఈనెల 15 నుంచి ఆగస్ట్ 15 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన వివిధ విభాగాల ఉన్నతాధికారుల సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలి కాలంలో హోర్డింగుల ఫ్లెక్సీల ఆటంకాలతో మెట్రో మార్గాల్లో పలు పర్యాయాలు మెట్రోరైళ్లు నిలిచిపోవడం తెలిసిందే. వర్షాకాలంలో వర్షాలతోపాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్‌లు, యూనిపోల్స్ కూలిపోయే అవకాశాలుండటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జలమండలి, రెవెన్యూ, ట్రాన్స్‌కో, మెట్రో రైలు, వాతావరణ శాఖ, నీటి పారుదల శాఖ, ఫైర్ సర్వీసులు, ఆర్టీసి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లు, తదితర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు మార్గంలో 95 హోర్డింగ్‌లు ప్రమాదకరంగా ఉన్నాయని హైదరాబాద్ మెట్రోరైలు ఎండి ఎన్వీఎస్ ప్రస్తావించారు. అయితే మెట్రో రైలు మార్గంలో ఉన్న అన్ని హోర్డింగ్‌లపై నిషేధం విధించామని, కొన్ని హోర్డింగ్‌లపై అక్రమంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారని జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ అద్వైత్‌కుమార్ సింగ్ తెలిపారు. మెట్రో మార్గంలో ఉన్న అన్ని హోర్డింగ్‌లను తొలగించాలని సంబంధిత ఏజెన్సీలను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
అక్రమ హోర్డింగులెన్నో..
జీహెచ్‌ఎంసీ లెక్కల మేరకు నగరంలో దాదాపు 2600 హోర్డింగులున్నాయి. ఇవి కాక అనధికారికంగా మరో 2500 వరకు ఉంటాయి. అయితే జీహెచ్‌ఎంసీ తనిఖీల్లో మాత్రం 333 అక్రమ హోర్డింగుల్ని గుర్తించి దాదాపు 300 వరకు తొలగించినట్లు గత సంవత్సరం పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో మరికొన్ని అక్రమ హోర్డింగులు వెలిశాయి.
ప్రమాణాలకు తిలోదకాలు..
హోర్డింగుల ఏర్పాటుకు సంబంధించి తగిన భద్రతా ప్రమాణాలు పాటించడం లేరనే ఆరోపణలున్నాయి. గతంలో హోర్డింగులు, యూనిపోల్స్ కూలిన నేపథ్యంలో జేఎన్‌టీయూకు చెందిన నిపుణులు కొన్ని సిఫారసులు చేశారు. స్ట్రక్చరల్ ఇంజినీర్ క్షేత్రస్థాయి తనిఖీల అనంతరమే తగిన సేఫ్టీ ఉందని భావించిన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. ఏర్పాటు విషయాన్ని జేఎన్‌టీయూకు కూడా సమాచారమివ్వాలి. గోడలపై, భూమిపై నుంచి ఏర్పాటుచేసే హోర్డింగులు 40 ఇంటూ 25 అడుగుల వరకు ఏర్పాటు చేసుకోవచ్చు. రూఫ్ టాప్‌పై ఏర్పాటు చేసేవి రెండంతస్తుల వరకు 30 ఇంటూ 25 అడుగులకు మించకుండా ఏర్పాటు చేసుకోవచ్చు. అలాంటి వాటికి ఏదైనా ప్రమాదం జరిగితే తమదే బాధ్యత అని ఏజెన్సీలు సొంత పూచీకత్తునివ్వాలి. అంతే కాకుండా ప్రతి అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ వేటికవిగా విడివిడిగా వ్యక్తిగతంగా అండర్‌టేకింగ్ ఇవ్వాలి. థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలి. అయినప్పటికీ ఇవేవీ పాటించకుండానే హోర్డిం గులు వెలుస్తున్నాయనే ఆరోపణలున్నాయి.
ఆదాయం అంతంతే..
హోర్డింగుల వల్ల జీహెచ్‌ఎంసీకి పెద్దగా ఆదాయం కూడా రావడం లేదు. ఏటా రూ. 30 కోట్లకు పైగా రావాల్సి ఉన్నప్పటికీ, రూ. 15 కోట్ల వరకు మాత్రమే వసూలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment