సాక్షి, సిటీబ్యూరో : కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చిన్నా పెద్దా తేడా లేకుండా కోట్లాది మందిని ఆ‘కట్టు’కున్న టిక్‌టాక్ సందడికి తెరపడింది. ఇక భారతదేశంలో టిక్‌టాక్ సౌండ్ వినపడదు. కొన్నేళ్లుగా ఈ యాప్‌ని వదలక అంటిపెట్టుకుని సందడి చేస్తూ.. వీక్షకులకు వినోదాన్ని పంచుతూ తమదైన స్టార్ స్టేటస్‌ని సొంతం చేసుకున్నవారెందరో.. నగరంతో టిక్ టాక్ అనుబంధం తెగిపోయిన నేపథ్యంలో ఆ స్టార్స్ ఏమంటున్నారు? మొత్తం 59 యాప్స్‌ని కేంద్రం బ్యాన్ చేసింది. అందులో అత్యంత ప్రజాదరణ పొందిన టిక్‌టాక్ కూడా ఉంది. లక్షలాది మంది యువతీ యువకులు దీన్ని ఆధారం చేసుకుని హాస్యాన్ని పండించారు. సంగీతాన్ని సంధించారు. నత్యాన్ని అందించారు. మరెన్నో సృజనాత్మక వీడియోలకు అక్కడక్కడా అవాంఛనీయ ఘటనలకూ కారణమైంది టిక్‌టాక్. యూట్యూబ్ తర్వాత ప్రతిభావంతులకు అంతటి భారీ వేదిక టిక్‌టాక్ మాత్రమే..
మన సేఫ్టీ కోసమే కదా..
టిక్‌టాక్ ఎందరో ప్రతిభావంతులకు వారి సామర్థ్యాలను సానబెట్టుకునే వేదిక ఇచ్చిందనేది నిజం. నేనైతే తొలుత ఇన్‌స్ట్రాగామ్‌లో వీడియోలు పోస్ట్ చేస్తూ తర్వాత టిక్‌టాక్‌కు కూడా వచ్చాను. ఇన్‌స్ట్రాగామ్‌లో 4లక్షలపైగా, టిక్‌టాక్‌లో 2.2 మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఈ పాప్యులారిటీతోనే సూర్యకాంతం అనే సినిమాలో హీరోయిన్ నిహారిక ఫ్రెండ్‌గా, మరికొన్ని సినిమాల్లోనూ నటించాను. టిక్‌టాక్ బ్యాన్ అయినంత మాత్రాన ఏమీ అయిపోదు. టాలెంట్ ఉన్నవారికి రకరకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఏదేమైనా దేశం కన్నా ఏదీ గొప్పది కాదు.
– నయని పావని టిక్‌టాక్‌స్టార్, తెల్లాపూర్
వార్‌కి ఆన్సర్..
రెండేళ్లలో దాదాపు వెయ్యి టిక్‌టాక్ వీడియోలు చేశా. 4,80 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. టిక్‌టాక్ నుంచి చాలా విషయాలు తెలుసుకున్నా. ఎంతో మంది గృహిణులు తమ టాలెంట్‌ని ప్రదర్శించడానికి ఇది హెల్పయింది. మరోవైపు వేరే పనేమీ లేనట్టు కొందరు టిక్‌టాక్ గురించి టైమ్ వేస్ట్ చేసుకున్నారు. కాస్త ఫ్యాన్స్‌ని మిస్ అవుతాననే భావన ఉన్నా, టిక్ టాక్ బ్యాన్ అవడం హ్యాపీగానే అనిపిస్తోంది. చైనా యుద్ధ వాతావరణం సృష్టిస్తోంది. ఈ పరిస్థితిలో మన దేశానికి సపోర్ట్ చేయక తప్పదు. ఇన్‌స్ట్రాగామ్‌తో పాటు చాలా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి.
– సుప్రీత, (నటి సురేఖావాణి కుమార్తె), టిక్‌టాక్ ఆర్టిస్ట్
ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి..
ఇప్పటి వరకు 700 వీడియోస్ అప్‌లోడ్ చేశాను. నాకు 1.90 లక్షల ఫాలోయర్స్ ఉన్నారు. రీసెంట్‌గా టిక్ టాక్ నుంచి నోటిఫికేషన్ కూడా వచ్చింది. నాకు అఫిషియల్‌గా కొంత మొత్తం చెల్లిస్తానని చెప్పారు. అప్పటి నుంచి సీరియస్ ప్రొఫెషన్‌గా మారింది. అయితే ఈ లోగా యాప్ బ్యాన్ అయ్యింది. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితిలో ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయానికి మనం మద్దతు ఇవ్వాలి. లోటుపాట్లున్నా చాలా మంది జీవితాలను టిక్ టాక్ మార్చేసిందనేది నిజం. చైనాకి టిట్ ఫర్ టాట్‌లా అంతకన్నా యూజ్‌ఫుల్ యాప్ మనవాళ్లు చేస్తే బాగుంటుంది.
– కీర్తి విజేందర్, ఎల్బీనగర్
Comments
Please login to add a commentAdd a comment