ప్రకటనల పన్ను ఎగనామం | Advertisement tax Free In Ananthapur Politicians | Sakshi
Sakshi News home page

ప్రకటనల పన్ను ఎగనామం

Published Fri, Apr 27 2018 9:22 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

Advertisement tax Free In Ananthapur Politicians - Sakshi

నగరంలో నెహ్రూ బాలభవన్‌ ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

.. నగరంలోనే కాదు జిల్లాలోని దాదాపు అన్ని మున్సిపాలిటీల్లోఇదే పరిస్థితి. అనుమతి లేని హోర్డింగ్స్‌తో మున్సిపాలిటీ ఆదాయానికి గండికొడుతున్నా ఎవరూ అడగరు.

అనంతపురం న్యూసిటీ/ధర్మవరం: ఆస్తి పన్ను.. నీటి పన్ను.. ప్రజల విషయానికొస్తే ఎలాంటి పన్నునైనా ముక్కుపిండి వసూలు చేస్తారు. ఇందుకోసం ఇళ్ల వద్దకొచ్చి డప్పు కొడతారు.. చెత్తను తీసుకొచ్చి కుమ్మరిస్తారు. నిర్ణీత కాల పరిమితిలోపు పన్ను పెంచేస్తారు. అయితే ప్రకటన పన్ను విషయానికొస్తే మాత్రం ఉదారంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన కూడళ్లలో ఆకట్టుకునే హోర్డింగ్‌లతో ఏజెన్సీలు ప్రచారం చేసుకుంటున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. ఎలాంటి అనుమతి తీసుకోకుండానే అప్పనంగా లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. అనంతపురం నగరపాలక సంస్థలో 11 ఏజెన్సీలు 201 హోర్డింగ్‌లను నిర్వహిస్తున్నాయి. 2013 నుంచి ఏజెన్సీలు రూ.28,58,673 చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాదికి డిమాండ్‌తో కలుపుకుంటే మరో రూ.60లక్షలు బకాయి పడ్డాయి. అయితే నగరపాలక సంస్థ అధికారులు ఇంత వరకు పన్ను వసూళ్లకు సంబంధించి నోటీసులు కూడా జారీ చేయకపోవడంగమనార్హం.

ఈ పరిస్థితి ఒక్క నగరపాలక సంస్థలోనే కాదు.. ఫస్ట్‌ గ్రేడ్‌ మునిసిపాలిటీలైన గుంతకల్లు, తాడిపత్రి, సెకెండ్‌ గ్రేడ్‌ మునిసిపాలిటీలైన ధర్మవరం, కదిరి, రాయదుర్గంతో పాటు నగర పంచాయతీల్లోనూ అధికారులు మౌనం దాల్చారు. ప్రచార ప్రకటనలు.. పోస్టర్లు, బ్యానర్లు, గోడ రాతలు..  హోర్డింగ్‌ల ద్వారా మునిసిపాలిటీలకు చదరపు మీటర్‌ లెక్క ఆధారంగా డబ్బు చెల్లించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా కొన్ని హోర్డింగ్‌లు మినహా మిగితా వాటికి పన్ను వసూలు చేస్తున్న దాఖలాల్లేవు. పన్నుల రూపంలో వచ్చిన మొత్తంతో నగరపాలక సంస్థ, మునిసిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. అలాంటి పన్నుల విషయంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

14 ఏళ్లుగా ఒకే మొత్తం
హోర్డింగుల ఏర్పాటుకు సంబంధించి సైజును బట్టి ధర నిర్దేశిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేస్తుంది. ఐదారేళ్లకోసారి తాజా పరిస్థితులకు అనుగుణంగా ఈ రేట్లను సవరించాల్సి ఉంటుంది. 1998లో ప్రభుత్వం రేట్లను సవరించగా.. అక్లోబర్‌ 1, 2000 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికి 14 ఏళ్లు గడిచినా సవరణ దిశగా చర్యలు చేపట్టని పరిస్థితి. సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ అయిన  ధర్మవరంలో ప్రకటనల పన్ను రూపేణా రూ.2.5లక్షల ఆదాయం మాత్రమే సమకూరుతోంది. సక్రమంగా పన్ను రివిజన్‌ జరిగి ఉంటే మున్సిపాలిటీకి కనీసం రూ.5లక్షల ఆదాయం వచ్చేదని తెలుస్తోంది. ఇక అనధికార ప్రకటనలను గట్టిగా పట్టుకుంటే పన్ను మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

అనధికార ప్రకటనలే ఎక్కువ
అధికారిక వాణిజ్య ప్రకటన పన్ను పెంచకపోవడంతో ఆదాయం కోల్పోవడం ఒక ఎత్తయితే.. ప్రధాన కూడళ్లలో అనధికార ప్రకటనలే అధికంగా ఉంటున్నాయి. వీటి ద్వారా మున్సిపాలిటీలకు ఒక్క పైసా ఆదాయం ఉండదు. ప్రకటనల విషయంలో అధికారులు శ్రద్ధ వహిస్తే మున్సిపాలిటీలకు నిధుల విషయంలో కాస్త ఊరట లభిస్తుంది. కొన్నింటిని గుర్తించి ఏజెన్సీ నిర్వాహకులను అధికారులు ప్రశ్నిస్తే.. తాము కార్యకలాపాలు నిర్వహించడం లేదని, రాజకీయ పార్టీల నేతలు తమ హోర్డింగ్‌లను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారనే సమాధానం వస్తోంది. వాస్తవానికి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే మున్సిపల్‌ అధికారులు మిన్నకుండిపోతున్నట్లు తెలుస్తోంది.

అనధికార హోర్డింగ్‌లను తొలగిస్తాం
మునిసిపాలిటీల్లో అనధికారికంగా ప్రకటనల హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవు. అలాంటి హోర్డింగ్‌లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగిస్తాం. పన్ను వసూళ్లకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం. జీఎస్‌టీ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కమర్షియల్‌ ట్యాక్స్‌ పరిధిలోకి పన్ను వసూళ్లు వెళ్లనున్నాయి.– రవీంద్రబాబు, మున్సిపల్‌ ఆర్‌డీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement