హోర్డింగులమయం | Without Permission Hordings In Vijayawada | Sakshi
Sakshi News home page

హోర్డింగులమయం

Published Wed, Jun 6 2018 12:59 PM | Last Updated on Wed, Jun 6 2018 12:59 PM

Without Permission Hordings In Vijayawada - Sakshi

సింగ్‌నగర్‌ ఫ్లై ఓవర్‌ వద్ద నివాసాల మధ్య ఏర్పాటు చేసిన హోర్డింగ్‌

విజయవాడ: విజయవాడ నగరాన్ని హోర్డింగులు ముంచెత్తాయి. నిబంధనలకు విరుద్దంగా వాణిజ్య, రాజకీయ పరమైన హోర్డింగ్‌లు ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా పెట్టేస్తున్నారు. సగానికిపైగా హోర్డింగ్‌లు అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారు.  రానున్న వర్షా కాలంలో హోర్డింగ్‌లతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని ప్రజలు భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈదురుగాలులు,  భారీ వర్షాలకు హోర్డింగ్‌లు కుప్పకూలే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

పర్యవేక్షణ గాలికి..
విజయవాడ నగరంతో పాటు మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో కూడా నిబంధనలు పాటించకుండా వేల సంఖ్యలో హోర్డింగ్‌లు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. జనావాసాలు, నివాసప్రాంతాల్లో కూడా వీటిని పెడుతున్నారు.  విజయవాడ నగరంలో నాలుగైదు అంతస్తుల భవనాలపై కూడా బరువైన హోర్డింగ్‌లు ఉన్నాయి.  ఎత్తుపెరిగిన కొద్దీ గాలుల వల్ల హోర్డింగులు  విరిగిపడే ప్రమాదం ఉంది. హోర్డింగుల ఏర్పాటును  పర్యవేక్షించకుండా గాలికి వదిలేస్తున్నారు.  విజయవాడ నగరంలో 1800 హోర్డింగ్‌లు మాత్రమే టౌన్‌ ప్లానింగ్‌లో నమోదయ్యాయి. టౌన్‌ ప్లానింగ్‌ అనుమతులు లేకుండా నగరంలో మరో 3 వేల హోర్డింగులను అనామతుగా పెట్టేశారు.  విజయవాడలో ప్రధాన రహదారులుగా పేరుగాంచిన బందరురోడ్డు, ఏలూరు రోడ్డు, ఐదో నంబర్‌ రోడ్డు, ఒన్‌టౌన్‌ ప్రాంతంలో కుప్పలుతెప్పలుగా ప్రైవేటు భనవాలు, రోడ్లపై హోర్డింగులు ఉన్నాయి.

జిల్లాలోని పలు ప్రాంతాల్లో..
అదే విధంగా మచిలీపట్నం, జాతీయ రహదారి, చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారులు, జిల్లాలోని  ప్రధాన పట్టణాలైన గుడివాడ, మచిలీపట్నం, హనుమాన్‌జంక్షన్, నూజివీడు, నందిగామలలో కూడా హోర్డింగ్‌ల బెడదతో జనం ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా వ్యాపార సంబంధమైన ప్రచార హోర్డింగుల నుంచి వాణిజ్యపన్నుల శాఖకు ట్యాక్స్‌ కూడా కట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

నిబంధనలు ఇవి..
విజయవాడ నగర పాలక సంస్థలో ముందుగా టౌన్‌ప్లానింగ్‌ అధికారుల నుంచి అనుమతులు పొందాలి.
అనుమతులు జారీ చేసేటప్పుడు అధికారులు హోర్డింగుల ఎత్తు, పరిమాణం తదితరాలు తనిఖీ చేయాలి.
గాలుల వల్ల విరిగి పడినా, జనావాసాల మధ్య పడకుండా ఉండని ప్రాంతాల్లో మాత్రమే అనుమతులు ఇవ్వాలి
మున్సిపల్‌ కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో కూడా సంబంధిత స్థానిక సంస్థల నుంచి అనుమతులు పొందాలి.
విద్యుత్‌ టవర్లు, లైన్లకు దగ్గరలో హోర్డింగులు, కటౌట్ల ఏర్పాటుకు అనుమతించకూడదు.
అనుమతి మంజూరు చేసేటప్పుడు సంబంధిత అధికారులు విద్యుత్, అగ్నిమాపక అధికారుల నుంచి కూడా ఎన్‌ఓసీలు తీసుకోవాలి.
పంటపొలాల్లో, విద్యుత్‌ లైన్ల సమీపంలో అనుమతించకూడదు.
జాతీయ రహదారి పక్కనే ఏర్పాటు చేసేటప్పుడు సంబంధిత ఎన్‌హెచ్‌ అధికారుల అనుమతి తీసుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement