నేను ఫలానా వాళ్లను కొట్టబోతున్నాను.. లేదా చంపబోతున్నాను అని ఎవరైనా పెద్ద హోర్డింగ్ పెడితే ఏమవుతుంది. వెంటనే పోలీసులు చర్య తీసుకుని అలాంటి హోర్డింగ్ ను తొలగించడమే కాకుండా, అలా చేసినవారిని అదుపులోకి తీసుకుంటారు. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో అయినా జరిగే ప్రక్రియ. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎవరు ఏమైనా చేసుకోవచ్చు. బహిరంగంగా హోర్డింగ్ లు పెట్టి రెడ్ బుక్ సిద్ధం అంటూ తమ నేత బొమ్మ వేసుకుని మరీ ప్రచారం చేసుకోవచ్చు. అయినా పోలీసులు స్పందించరు. రాష్ట్ర ప్రభుత్వం ఆనందంగా చూస్తుంటుంది. కేంద్ర ప్రభుత్వం పట్టి, పట్టనట్లు వ్యవహరిస్తుంది. వారికి ఇష్టమైన మీడియా ఆహో, ఓహో అని భజన చేస్తాయి. ఇదో చిత్రమైన పరిస్థితి అని చెప్పాలి.
⇒ ఏపీలో తెలుగుదేశం ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతోనే ఇలాంటి దారుణమైన పోకడలు సాగుతున్నాయి. దీనిని అదుపు చేసే పరిస్థితి ఇప్పట్లో ఉండదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయాలలో వైరుధ్యాలు, వైషమ్యాలు ఉండవచ్చు. కోప, తాపాలు ఉండవచ్చు. లేదా ఎదుటివారు ఎదైనా తప్పు చేశారనుకుంటే చట్టపరంగా కేసులు పెట్టవచ్చు. ఇవేవి కాకుండా మీ అంతు చూస్తామంటూ బహిరంగంగా బోర్డులు పెడుతున్నారు. అదేదో గొప్ప పనిగా వారు చెప్పుకుంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరైన చర్యేనా అనే ప్రశ్న వస్తే, మైట్ ఈజ్ రైట్ అన్నట్లుగా, రౌడీలు, గూండాలు చెలరేగిపోయినా పట్టని కాలంలో మాత్రమే ఇలాంటివాటిని సమర్థించగలం.
⇒ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటివి జరగకూడదు. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నలభైఆరేళ్లుగా రాజకీయాలలో అత్యంత క్రియాశీలకంగా ఉన్నారు. దేశంలోనే ఆయన అంత అదృష్టవంతుడైన నేత లేరంటే అతిశయోక్తి కాదు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగాను, అంతకన్నా ఎక్కువకాలం ప్రతిపక్ష నేతగాను వ్యవహరించారు. ఆయనకు నిబంధనలు, చట్టం, రాజ్యాంగం గురించి తెలియవని అనుకుంటే పొరపాటు. అయినా ఆయన ఏలుబడిలో ఇలాంటి దుశ్చర్యలు ఎలా కొనసాగుతున్నాయంటే ఏమి చెబుదాం. ఆయనలో ఇంకా కక్షపూరిత రాజకీయాలు పోలేదన్న అభిప్రాయానికి తావిస్తున్నారు.
⇒ గత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే వెంటనే తీవ్రంగా స్పందించి, రాజారెడ్డి రాజ్యాంగం అని, ఇంకొకటని అరిచి ఘీ పెట్టిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు తాము అధికారంలోకి రాగానే కొత్త రాజ్యాంగం సృష్టించుకున్నారని అనుకోవాలా? చంద్రన్న రాజ్యాంగం అమలులోకి వచ్చినట్లా? దీని ప్రకారం ఎవరినైనా తాము కొట్టవచ్చని, తిట్టవచ్చని, చంపవచ్చని, ఎవరూ మాట్లాడడానికి వీలు లేదని కొత్త నిబంధనలు తయారు చేశారా! పైగా వాటిని బహిరంగంగా హోర్డింగ్ ల ద్వారా ప్రజలందరికి తెలియచేసే కొత్త సంస్కృతికి తెరదీశారా? ఇదేనా చట్టబద్దమైన, రాజ్యాంగ పాలన అంటే!
⇒ ప్రతిపక్షంలో ఉండగా, ఎవరు సలహా ఇచ్చారో కానీ లోకేష్ తన యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ అంటూ పట్టుకు తిరిగారు. తమ పట్ల అనుచితంగా వ్యవహరించారన్న భావన కలిగితేనో, అధికారుల శైలి తమకు నచ్చకపోతేనో, లేక తాము చేసే అల్లర్లకు అడ్డుపడితేనో, కేసులు పెడితేనో, వారి పేర్లను రెడ్ బుక్ లో రాసుకుంటున్నామని, అధికారంలోకి రాగానే వారి సంగతి చూస్తామని బెదిరిస్తుండేవారు. తొలుత ఎవరూ దీనిని సీరియస్ గా తీసుకోలేదు.
⇒ కొందరు సరదాగా తీసుకుంటే, పోలీసు అధికారులు సైతం పెద్దగా స్పందించలేదు. అయితే చంద్రబాబు, లోకేష్ లపై ఆయా స్కాములకు సంబంధించి కేసులు పెట్టిన సందర్భంలో అప్పటి సీఐడీ అధికారులు ఈ రెడ్ బుక్ వ్యవహారంపై కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని కోర్టు ఇంకా తేల్చలేదు. ఈలోగానే వైఎస్సార్‌సీపీ అధికారం కోల్పోయి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో రెడ్ బుక్ కేసు ఏమవుతుందో కానీ, అధికారులు ఎవరూ దానిని పర్స్యూ చేసేపరిస్థితి ఉండదు. రెడ్ బుక్ అంటూ తిరిగిన వ్యక్తి లోకేష్ మంత్రి అయ్యారు. ఆ రెడ్ బుక్ ను విశాఖ సభలో ఆయన తన తండ్రి చంద్రబాబుకు అందచేశారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.
⇒ ఆ రెడ్ బుక్ లో పలువురు అధికారుల పేర్లు, వైఎస్సార్‌సీపీ నేతల పేర్లు.. లేదా ఇంకొందరు తమను వ్యతిరేకించేవారి పేర్లు రాసుకుని ఉండవచ్చు. ఆయా సభలలో కొందరి పేర్లను లోకేష్ ప్రకటిస్తూ వచ్చారు కూడా. చిత్తూరులో ఒక ఎస్పీ పేరును ఇలానే అప్పట్లో ప్రకటించారు. అలా అధికారులను బెదిరించవచ్చా! నిజంగానే అధికారంలోకి వచ్చారు కనుక వారిపై చర్య తీసుకుంటామని బహిరంగంగా బోర్డులు పెట్టవచ్చా! గతంలో ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి ఘట్టాలు చోటు చేసుకున్నాయా! అసలే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హింసాకాండతో రాష్ట్రం అట్టుడుకుతుంటే, అది చాలదన్నట్లు రెడ్ బుక్ సిద్దం అంటూ ప్రజలను భయభ్రాంతులను చేసే ప్రకటనలు ఏమిటో తెలియదు.
⇒ టీడీపీ నేత బుద్దా వెంకన్న వంటివారు వారిని అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని రాజకీయ ప్రకటనలు చేస్తుంటే అదేదో మామూలేనని అనుకుంటాం. నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు, మరొక టీడీపీ నేత కూర్చుని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ, చావలేదు.. అని అంటుంటే వీరి మనసులో ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయా? అన్న విషయం బహిర్గతం అయిపోతుంది. దానికి తగినట్లుగానే రెడ్ బుక్ హోర్డింగ్ లు పెడుతున్నారన్న అనుమానం ప్రజలలో ప్రబలుతుంది.
⇒ పూర్వకాలంలో తమ అధికారానికి అడ్డు పడుతారనుకునే వారిని రాజులు, నియంతలు చంపించేసేవారట. ఉత్తర కొరియా వంటి దేశాలలో ఇప్పటికీ అలాంటి రాక్షస సంస్కృతి ఉంది. చైనాలో ఎవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరెత్తే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అది కమ్యూనిజం ముసుగులో ఉన్న నియంత రాజ్యం కనుక. చైనాలో సాంస్కృతిక విప్లవం పేరుతో ఎన్ని ఘోరాలు జరిగాయో చరిత్ర చెబుతుంది. రష్యాలో పుతిన్ కు ఎదురుతిరిగినవారిని బతకనివ్వడం లేదని వార్తలు వచ్చాయి. కానీ ప్రజాస్వామ్యదేశంగా ఉన్న భారత్ లో అలాంటివి సాధ్యమేనా? అందులోను ఒక రాష్ట్రంలో ఇలా జరుగుతుందా? అది ఎల్లకాలం అయ్యే పనేనా? అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఉండేది ఐదేళ్ల కాలపరిమితే అన్న సంగతి మర్చిపోయి ఇష్టారాజ్యంగా చెలరేగిపోతే తర్వాత ప్రజలు వాటిని గుర్తుంచుకోరా?
⇒ గొప్ప నేతగా పేరుపొందిన ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి పెట్టి ప్రత్యర్ధి రాజకీయ పార్టీల నేతలను జైళ్లపాలు చేసిన తర్వాత కొంతకాలం అధికారంలో ఉండగలిగారు కానీ, ఆ తర్వాత ఎన్నికలలో ఘోర పరాజయం చెందారు. కొన్ని రాష్ట్రాలలో ఇలాంటి అనుభవాలు ఎదురుకాకపోలేదు. అయినా రాజకీయ నేతలు గుణపాఠాలు నేర్చుకోరు. పోలీసులు తమ చేతిలో ఉంటారు కనుక ఏమైనా చేయవచ్చని, ఇతర వ్యవస్థలను ప్రభావితం చేయవచ్చన్న విశ్వాసంతో అరాచకాలకు పాల్పడుంటారు. కానీ ఆ తర్వాత వారు కూడా ఏదో నాడు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కోవలసి వస్తుందని మర్చిపోతారు.
⇒ ఎంత పిల్లి అయినా గదిలో పెట్టి కొడితే తిరగబడుతుందని సామెత. ఒకపక్క రాష్ట్రంలో రౌడీయిజాన్ని సహించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటిస్తున్న సమయంలోనే ఈ రెడ్ బుక్ ప్రకటనలు ఇంత బహిరంగంగా హోర్డింగ్ ల రూపంలో జనంలోకి వస్తే, గూండాలను, మాఫియాలను ఎంకరేజ్ చేసినట్లా? కాదా? అన్నది వారే ఆలోచించుకోవాలి.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment