ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాలలో అదృష్టవంతుడైన నేత అని చెప్పాలి. ఆయన ఎమ్మెల్యే అవడం నుంచి ముఖ్యమంత్రి కావడం వరకు, అందులోను నాలుగుసార్లు సీఎంగా పగ్గాలు చేపట్టడం వరకు ఆయన అదృష్టం చెప్పలేనిది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రజలకు మేలు చేస్తే మంచిదే. అందుకు భిన్నంగా పాలన సాగిస్తే అపకీర్తిని మూటకట్టుకుంటారు. ప్రస్తుతం ఆయన ఆ దశలోనే ఉన్నారన్న అనుమానం కలుగుతోంది.
గత మూడు టరమ్‌లలో కన్నా ఈ విడత ఆయన పాలన తీరు మరీ నాసిరకంగా మారుతోందని చెప్పడానికి బాధ కలుగుతోంది. గతంలో కూడా అలవికాని వాగ్దానాలు చేసి, వాటిని అమలు చేయకుండా ఉన్నప్పటికీ, పాలన మరీ ఇంత అద్వాన్నంగా లేదని చెప్పాలి. ప్రత్యేకించి గత నెల రోజుల పాలనలో జరిగినన్ని అరాచకాలు ఇంతకు ముందెన్నడూ చూడనివి. ఆ రోజుల్లో ప్రజలు ఏమైనా అనుకుంటారేమోనని వెరచేవారు. ఇప్పుడు చంద్రబాబులో ఆ వెరపు పోయినట్లయింది.
జనాన్ని మాయచేయగలిగాం కాబట్టి ఎవరేం చేయలేరు అన్న అహంభావ ధోరణిలోకి వెళ్లి ఉండాలి. లేదా ఆయనకు సంబంధం లేకుండా పాలన సాగుతుండాలి. పూర్వం కూడా పోలీసులను ఆయన రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నా, మరీ ఇంతలా ప్రత్యర్దులను వేధించడానికి వినియోగించుకున్నారని చెప్పజాలం.
2024లో ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి అయ్యారో కాని, అసలు రాష్ట్రంలో పాలన ఉందా? లేక టీడీపీ అరాచక శక్తుల పాలన సాగుతోందా? అన్నట్లుగా పరిస్థితి తయారైంది. బహుశా పాలనలో తనకన్నా ఆయన కుమారుడు మంత్రి లోకేష్ పెత్తనం బాగా పెరిగి ఉండాలి. లోకేష్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్రలో కాని, ఇతరత్రా కాని ఒక మాట అంటుండేవారు. తాను మూర్ఖుడనని, తన తండ్రి మాదిరి ఉదారంగా ఉండనని, రెడ్ బుక్‌లో అధికారుల పేర్లు రాసుకుంటున్నానని హెచ్చరిస్తుండేవారు. అలాగే తనకు నచ్చని, లేదా తనను విమర్శించేవారి పేర్లను ఆ బుక్‌లో రాస్తున్నట్లు చెబుతుండేవారు.
అప్పట్లో టీడీపీ కార్యకర్తలు ఎంత పెద్ద కేసు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి అని ఊరించేవారు. చంద్రబాబును మించి అరాచకంగా ఉపన్యాసాలు చేశారు. సరిగ్గా ప్రస్తుతం పాలన అలాగే నడుస్తోంది. కాలం కలిసి వచ్చి చంద్రబాబు, లోకేష్ లు పాలన పగ్గాలు చేపట్టారు. వారికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు. పవన్‌ను వారు తమదారిలో పెట్టుకుని నోరు విప్పకుండా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి లోబరుచుకోగలిగారు.
దాడులు, విధ్వంసాలకు టీడీపీ నేతలు పాల్పడుతుంంటే, వారిపై కేసులు పెట్టడం లేదు కాని, వైఎస్సార్‌సీపీ వారిపై అక్రమ కేసులు పెట్టడం సర్వసాధారణం అయింది. కేంద్రంలో కూడా టీడీపీ, బీజేపీ కూటమే అధికారంలో ఉంది కనుక ఇక్కడ నెలకొన్న అశాంతిపై బీజేపీ పెద్దలు ఎవరూ కిమ్మనడం లేదు. ఈ పరిస్థితిలో ప్రజలు ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు తమను తాము రక్షించుకోవలసి వస్తోంది. ఇది ఎటువైపు దారితీస్తోందోనన్న భయం కలుగుతోంది.
ఇవి చాలవన్నాట్లు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన, మరికొందరు సీనియర్ ఐపిఎస్ అధికారులపైన తప్పుడు కేసులు బనాయించడం. చివరికి ప్రభుత్వ వైద్యశాల అధికారులను కూడా వదలిపెట్ట లేదు. ఈ సదర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రాజమండ్రిలో గోదావరి పుష్కరాలలో చంద్రబాబు నిర్వాకం వల్ల తొక్కిసలాట జరిగి ఇరవైతొమ్మిది మంది మరణించడం, చంద్రబాబు ప్రభుత్వం తిరుమలలో ఇరవైమంది కూలీలను ఎన్ కౌంటర్ చేయడం వంటి ఘటనలు తీవ్ర సంచలనం కలిగించాయి. వాటిని చంద్రబాబు తానే ముఖ్యమంత్రిగా ఉన్నందున మేనేజ్ చేసుకుని అవి తనకు చుట్టుకోకుండా జాగ్రత్తపడ్డారు.
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వాటిని తిరగదోడి ఉంటే చంద్రబాబు పరిస్థితి ఎలా ఉండేదని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాని జగన్ ఆ పని చేయలేదు. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుతో ఒక ఫిర్యాదు చేయించి, జగన్ పైన కేసు పెట్టిన తీరు చంద్రబాబు లేదా లోకేష్‌లు ఎంత కక్షపూరితంగా మారారో తెలియచేస్తున్నదని అంటున్నారు. ఆ కేసు పరిణామాలు ఏమి అవుతున్నాయన్నది ఇక్కడ చర్చకాదు.
చంద్రబాబు పాలన అధ్వాన్నంగా మారిందని చెప్పడానికి దీనిని ఒక ఉదాహరగా తీసుకుంటున్నారు. రఘురామకృష్ణంరాజు వైఎస్సార్‌సీపీ అసమ్మతి ఎంపీగా ఉన్నప్పుడు కులాలు, మతాల మద్య దారుణమైన విద్వేషాలు రెచ్చగొట్టే విదంగా ఉపన్యాసాలు చేస్తుంటే, సీఐడీ అన్ని ఆదారాలతో కేసు పెట్టి అరెస్టు చేసింది. ఆ సమయంలో తనను హింసించారన్నది రాజు ఆరోపణ. నిజంగా అలా జరిగి ఉంటే ఎవరం అంగీకరించం. కాని ఆయన అప్పుడు వీరెవ్వరిపైన ఆరోపణ చేయలేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తనను కొట్టారని ఆరోపించారు. బహుశా బెయిల్ కోసం ఇలా అంటుండవచ్చులే అనుకున్నారు.
న్యాయస్థానం ఆదేశాల ప్రకారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వారు ఆయనను మొత్తం పరీక్షించి గాయలేవీ లేవని నిర్దారించారు. అందుకుగాను వారిపై కూడా రాజు ఇప్పుడు కేసు పెడుతున్నారు. తెలుగుదేశంకు న్యాయ వ్యవస్థలో ఉన్నపట్టు ఈయనకు బాగా ఉపయోగపడిందని అంతా అనుకునేవారు. ఆ సమయంలో సుప్రీంకోర్టు ఈయనను మిలటరీ ఆస్పత్రిలో చేర్పించింది. వారి నివేదికలో సైతం ఆయనపై ఎవరో కొట్టిన గాయాలు ఉన్నట్లు తేల్చలేదు. పైగా ఈయన చెప్పాపెట్టకుండా ఆ ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
సుప్రీంకోర్టు ఈ కేసును విచారించి సిబిఐ దర్యాప్తు అవసరం లేదని భావించింది. అయినా ఇప్పుడు రాజుతో చంద్రబాబో, లేక లోకేషో గుంటూరులో పోలీసు కేసు పెట్టించారు. ఇది కేవలం వైఎస్సార్‌సీపీ నేతలను భయపెట్టడానికి, అధికారులను లొంగదీసుకోవడానికే అన్న అభిప్రాయం కలుగుతోంది. గత ప్రభుత్వ టైమ్‌లో చంద్రబాబు, ఇతర టీడీపీ నేతల స్కామ్‌లకు సంబంధించి సీఐడీ విచారణ చేసింది. ఆ సమయంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవి ఇప్పటికీ కోర్టులలో పెండింగులో ఉన్నాయి. ఆ కేసులలో ఈ అధికారులు తమకు అనుకూలంగా వ్యవహరించడానికి గాను.. బెదిరించడానికి ఇలా ఏమైనా వారిపై బనాయించారా అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. లేకుంటే సుప్రింకోర్టే తోసిపుచ్చిన కేసును ఇక్కడ తిరగతోడతారా? అన్న ప్రశ్న వస్తోంది.
అదే టైమ్‌లో రఘురాజు ఎంత అరాచకంగా కుల విద్వేషం పెంచడానికి ప్రయత్నించింది అన్నదానిపై కూడా కేసు పెట్టి ఉంటే, పోనీలే రెండు విషయాలలోను ప్రభుత్వం దర్యాప్తు చేపడుతుందేమోలే అనుకునేవారు. అలా చేయకపోవడంతో ఇది ప్రతీకారేఛ్చతో రగులుతూ పెట్టిన కేసు అని అర్ధం అవుతుంది. లేదా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఆడుతున్న డ్రామా అయి ఉండాలి. ఒక్క వృద్దాప్య పెన్షన్‌లను మాత్రం చెప్పినట్లు చేశారు. ఇక మిగిలినవి వేటిపైన నిర్దిష్టంగా చేయడం లేదు.
పెన్షన్ దారులలో అనర్హుల పేరిట ఇకపై కోతపెట్టవచ్చన్న వార్తలు వస్తున్నాయి. కాగా పలు అంశాలలో జగన్ ప్రభుత్వ విదానాలనే ఏదో రకంగా పాలో కావల్సి వస్తోంది. ఉదాహరణకు తాజాగా వచ్చిన జీపీఎస్ నోటిఫికేషన్. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ ఇవ్వడం ద్వారా జగన్ ప్రభుత్వం మోసం చేసిందని ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు, ఇప్పుడు దానినే పాటిస్తున్నారు. బ్రేక్ వేశామని చెప్పారే తప్ప రద్దు చేయకపోవడం గమనార్హం. అంటే మోసం చేసింది జగన్ కాదు.. చంద్రబాబు, పవన్ లేనని ఉద్యోగులు అనుకునే పరిస్థితి వచ్చింది.
ఇసుక ఉచితం అంటే జనం అంతా నమ్మారు. తీరా చూస్తే జగన్ ప్రభుత్వం పెట్టిన ఇసుక గుట్టలలో సగభాగం టీడీపీ, జనసేన నేతల పరం అయిపోయింది. మిగిలిన ఇసుకకు పెద్ద ఎత్తున చార్జీల పేరుతో రేట్లు పెట్టి వసూళ్లు చేస్తున్నారు. తల్లికి వందనం స్కీమ్ జిఓ ఇవ్వడం, ఆ తర్వాత అది ఏదో వేరే పనికి జిఓ ఇచ్చామని చెప్పడం.. అంటే ప్రభుత్వ పనితీరు తెలియచేస్తుంది. వలంటీర్ల గురించి ఎన్నికల ముందు ఏమి చెప్పారు? ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నారు. కొత్త ఉద్యోగాల సంగతేమో కాని వలంటీర్లకు వచ్చే గౌరవవేతనం కూడా అందేలా లేదు. ఆ రకంగా లక్షన్నర మందిని ఈ ప్రభుత్వం రోడ్డున పడవేసే సూచన కనిపిస్తోంది.
ఉచిత గ్యాస్ బండలు వస్తాయో, రావోకాని మహిళలంతా గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలు కట్టాల్సివచ్చింది. జగన్ టైమ్‌లో మహిళలు మహరాణుల మాదిరి ఇళ్ల వద్ద కూర్చుని ఉంటే వలంటీర్ల ద్వారా దరఖాస్తులను తీసుకునేవారు. ఇప్పుడేమో రోడ్డుమీద క్యూలలో గంటల తరబడి వేచి ఉండవలసి వస్తోంది. చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నమ్మినందుకు ప్రజలకు ఈ ప్రతిఫలం దక్కిందన్నమాట. శ్వేతపత్రాల పేరుతో జగన్ ప్రభుత్వంపై ఎంత దుష్ప్రచారం చేస్తున్నా, జనం వాటిని పట్టించుకోవడంలేదు. టీడీపీ నేతల దాష్టికాలవల్ల కొన్ని చోట్ల వైఎస్సార్‌సీపీ అభిమానులు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘట్టాలు జరిగాయి. అలాగే బాలికలపై అఘాయిత్యాలు సాగుతున్నాయి.
నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో జరిగిన బాధాకర ఘటన వీటికి నిదర్శనం. పలు ఇతర చోట్ల కూడా నేరాలు పెరిగాయి. నేరాలు ఏ ప్రభుత్వ టైమ్‌లో అయినా జరుగుతుండవచ్చు. కాని అప్పట్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు గోరంతల్ని కొండంతలు చేసి ప్రచారం చేశారు. పవన్ కల్యాణ్ అయితే 2017లో టీడీపీ హయాంలో జరిగిన సుగాలి ప్రీతి కేసును జగన్ ప్రభుత్వానికి అంటగట్టి దుష్ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఏ ఒక్క ఘటన జరగదని బీరాలు పలికారు.
ఇప్పుడు ఇన్ని దుర్మార్గపు ఘటనలు, దారుణమైన నేరాలు జరుగుతున్నా పవన్ నోరు విప్పడం లేదు. ఎందుకంటే ఆయన కోరుకున్న పదవి ఆయనకు వచ్చేసింది కాబట్టి అంతా బ్రహ్మాండంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన సుద్దులు చెబుతున్నారు తప్ప, ప్రభుత్వ వైఫల్యాలపై జవాబు ఇవ్వడం లేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ కారణంతో ఘర్షణలు జరిగినా, చంద్రబాబు నాయుడు నిందితులకు అనుకూలంగా మాట్లాడడానికి కొంత భయపడేవారు. జనంలో దెబ్బతింటామేమో అన్న వెరపు ఉండేది. ఘర్షణలకు టీడీపీ వారు కారణమైతే కనీసం కోప్పడినట్లు నటించేవారు. కాని ఈసారి ఏకంగా నిందితులను ఆయనే కాపాడుతున్న రీతిలో వ్యవహరిస్తున్నారన్న విమర్శలకు గురి అవుతున్నారు.
ఉదాహరణకు డెక్కన్ క్రానికల్ ఆఫీస్‌పై దాడిచేసిన టీడీపీ కార్యకర్తలను ఆయన మందలించకుండా పత్రికల ఆఫీస్‌ల వద్ద నిరసనలు చెప్పొద్దులే అని సలహా ఇచ్చి ఊరుకున్నారు. వైఎస్సార్‌సీపీ వారిపై వందల కొద్ది దాడులు జరిగినా, టీడీపీ వారు విధ్వంసాలకు పాల్పడుతున్నా, వాటిని అదుపు చేయకపోగా, వైఎస్సార్‌సీపీ వారే దాడులు చేస్తున్నారన్న భావన కలిగేలా మాట్లాడడం శోచనీయం. ఇవన్ని చూశాక ఏమనిపిస్తున్నందంటే చంద్రబాబే ఇలా విద్వేషపూరితంగా తయారయ్యారా? లేక ఆయన కుమారుడు లోకేష్ తాను అనుకున్నట్లు పోలీస్ రాజ్యాన్ని నడుపుతుంటే ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా? అన్న సందేహం సహజంగానే వస్తుంది. ఏది ఏమైనా చంద్రబాబుకు అదృష్టం వచ్చి మళ్లీ సీఏం పదవిలోకి రావడం, తమ దురదృష్టమని ప్రజలు అనుకునేలా పరిస్థితి రాకూడదని కోరుకోవడం తప్పుకాదు.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment