సాక్షి, సిటీబ్యూరో: ఆకాశహార్మ్యాలతో పోటీ పడుతున్న గ్రేటర్‌లోని హోర్డింగులు వాహనదారుల దృష్టి మళ్లిస్తూ పలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఎప్పుడు ఏ హోర్డింగ్ కుప్పకూలుతుందో తెలియక గుండెలు గుభేల్‌మనిపిస్తున్నాయి.స్టెబిలిటీ సర్టిఫికెట్లున్నప్పటికీఈ ప్రమాదాలు ఆగడం లేవు. మరోవైపు నగర అందాన్ని ఇవి హరించివేస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం గ్రేటర్ నగరానికి కొత్త అడ్వర్టయిజ్‌మెంట్ పాలసీని ప్రకటించింది. ఈ పాలసీ మేరకు ఇకనుంచి ఎత్తయినహోర్డింగులుండవు. భూమి నుంచి కేవలం 15 అడుగుల ఎత్తు వరకు మాత్రమే అనుమతిస్తారు. ఈ ఎత్తువరకు ఉన్నవాటిని సైతం క్రమబద్ధీకరిస్తారు. 15 అడుగులకుమించి ఇప్పటికే ఉన్నవాటిలో గడువు ముగిసిన వాటిని జీహెచ్‌ఎంసీ వెంటనే తొలగిస్తుంది. గడువున్న వాటిని గడువు ముగియగానే తొలగిస్తుంది. ఏ కారణంతో తొలగించినా, ఇతర ప్రదేశంలో అనుమతి ఇవ్వడం వంటివి ఉండవు. దాని ఏఐఎన్(అడ్వర్టయిజ్‌మెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్) ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. కొత్తగా అనుమతులిచ్చే వాటికి ముఖ్యంగా ప్రజల భద్రత, రోడ్ సేఫ్టీతోపాటు నగర అందం వంటివి పరిగణనలోకి తీసుకుని అనుమతిస్తారు. ఫ్లాషింగ్ లైట్లు/నాన్ స్టాటిక్ ఇల్యూమినేషన్ ప్రకటనలకు ట్రాఫిక్ పోలీసులు, హైకోర్టు నుంచి తగిన అనుమతి పొందాక అనుమతిస్తారు.
♦ భవనం ఫ్రంటేజ్‌లో 15 శాతం వరకు మాత్రమే నేమ్‌బోర్డులకు అనుమతిస్తారు. అంతేకాదు భవనం వెంటిలేషన్‌కు అవరోధాలు లేకుండా మాత్రమే నేమ్ బోర్డు ఏర్పాటు చేయాలి. పెద్ద వాణిజ్య భవనాలకు సంబంధించి 15 అడుగులకు మించిన ఎత్తులో నేమ్‌బోర్డులు ఏర్పాటు చేసుకునే అవకాశమిచ్చినప్పటికీ 10 అడుగుల వెడల్పు 5 అడుగుల ఎత్తు మించరాదు.
♦ ఎక్కడైనా రెండు ప్రకటనలకు మధ్య కనీసం 50 మీటర్ల దూరం ఉండాలి. రోడ్ సైనేజీలకు, ఇతర ప్రకటనలకు వాటి వల్ల ఆటంకం కలగొద్దు. బస్‌షెల్టర్లు, పబ్లిక్ టాయ్‌లెట్లకు సంబంధించిన ప్రకటనల్లో మాత్రం వీటికి మినహాయింపు ఉంటుంది. ఎలక్ట్రిసిటీ యాక్ట్ మేరకు ట్రాన్స్‌మిషన్ లైన్లు, రైల్వే ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ లైన్లకు పాటించాల్సిన కనీస దూరం పాటించాలి.
♦ ఎమర్జెన్సీ సర్వీస్ తదితర హెచ్చరికల మాదిరిగా కనిపించే ఎరుపు, నీలం, యాంబర్ వంటి రంగులను ఫ్లాషింగ్ లైట్లలో వాడరాదు.జంక్షన్ల వద్ద ఐఆర్‌సీ నిబంధనలు, లైటింగ్‌తో కూడిన ప్రకటనలకు సంబంధించి బీఈఈ, బీఐఎస్ నిబంధనలు పాటించాలి.
వీటి వద్ద ప్రకటనల బోర్డులు నిషేధం..
♦ చెరువులు, సరస్సులు, నదులు, నాలాలు, శిఖం (ప్రభుత్వ)భూములు,బ్రిడ్జిలు, రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఎలాంటి ప్రకటనల బోర్డులకు అనుమతి ఇవ్వరు.
♦ ఆర్కిలాజికల్, ఆర్కిటెక్చరల్, ఈస్తటికల్, హిస్టారికల్ లేదా హెరిటేజ్ ప్రాముఖ్యత ఉన్న భవనాల ముందుకానీ, వాటి గోడలపైన కానీ, ప్రహరీల లోపల కానీ ఎలాంటి ప్రకటనలకు వీల్లేదు. వీటి వెంటిలేషన్‌కు అడ్డుగా ఎలాంటి సైన్‌బోర్డులు, ప్రకటనల బోర్డులకు వీల్లేదు.
♦ మెట్రో రైలు సర్వీసులకు అవరోధం కలిగించేలా ఉంటే అనుమతివ్వరు.
♦ భవనాల రూఫ్‌టాప్‌లపై అనుమతివ్వరు.
♦ పాలసీకి అనుగుణంగా వాహనాలపై నాన్ లైటింగ్ ప్రకటనలకు అనుమతివ్వవచ్చు కానీ ప్రకటనల కోసం వాహనానికి అదనంగా ఎలాంటి బోర్డు లేదా నిర్మాణం వంటివి ఉండరాదు.
♦ ఎలక్ట్రికల్‌ట్రాన్స్‌మిషన్ లైన్లకు దగ్గరలో, పక్కన, పైన ఎలాంటి ప్రకటనలకు వీల్లేదు.
♦ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ కమిషనర్ నోటిఫై చేసిన ఇతర ప్రాంతాల్లోనూ అనుమతులివ్వరు.
ఇవి తప్పని సరి..
ప్రతి సంవత్సరం ప్రభుత్వ, జీహెచ్‌ఎంసీకి సంబంధించిన పథకాలు, ప్రజలకుపకరించే సామాజిక సందేశాలతోకూడిన ప్రకటనలు కనీసం 10 శాతం ఉచితంగా ప్రదర్శించాలి. ప్రకటనల ఏర్పాటు, సామాగ్రిలో బయోడిగ్రేడబుల్‌కు ప్రోత్సాహకం. ప్రకటనలు ఏర్పాటు చేసేవారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలి. ప్రైవేట్ స్థలాల్లో ఏర్పాటు చేసేందుకు స్థల, భవన యజ మాని నుంచి ఎన్‌ఓసీతోపాటు భవన అనుమతి పత్రం సమర్పించాలి. ప్రతి ఆరుమాసాలకోమారు స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ సమర్పించాలి.సంబంధిత అధికారులు స్ట్రక్చరల్ స్టెబిలిటీని తనిఖీ చేయాలి.
గ్లాస్ బోర్డుల నుంచి హోర్డింగుల దాకా..
కొత్త అడ్వర్టయిజ్‌మెంట్ పాలసీ అన్ని రకాల ప్రకటనలకు వర్తిస్తుంది. వీటిల్లో హోర్డింగులు, యూనిపోల్, యూని స్ట్రక్చర్స్, నియాన్/గ్లో సైన్‌బోర్డులు, ఆర్చిలు, వాల్‌పెయింటింగ్స్, ఫ్లెక్సిబోర్డులు, గ్లాస్ బోర్డులు, షాప్ షట్టర్లు, లాలిపాప్స్, బస్ షెల్టర్లు, బెలూన్లు, బస్సులు, టాక్సీలు ఆటోలు తదితర వాహనాలపై మొబైల్ యాడ్స్ ఉన్నాయి. ఈమేరకు మార్గదర్శకాలతో మునిసిపల్ పరిపాలన, పట్టణాభివ్రుద్ధిశాఖ సోమవారం రాత్రి జీవో జారీచేసింది.
ఉల్లంఘిస్తే జరిమానాలిలా..
♦ 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో అక్రమంగా ఏర్పాటు చేస్తే : రోజుకు రూ. 1,00,000
♦ 15 మీటర్లకంటే తక్కువ ఎత్తులో అక్రమంగా ఏర్పాటు చేస్తే :రోజుకు రూ. 50,000
♦ అనుమతి లేకుండా ఫ్లాషింగ్ లైట్లు, నాన్ స్టాటిక్ లైటింగ్‌కు : రోజుకు రూ. 50,000
♦ భవనం ఫ్రంటే జ్‌లో 15 శాతం కంటే ఎక్కువ స్థలంలో ఏర్పాటు చేస్తే: చదరపు అడుగుకు రోజుకు రూ. 100. వంతున
♦ మూవింగ్ , రొటేటింగ్ లేదా ఇతరత్రా మెసేజ్ అడ్వర్టయిజింగ్ డివైజ్ వినియోగిస్తే : రూ. 10,000 రోజుకు
♦ స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ లేకుండా ఏర్పాటు చేస్తే : రూ. 50,000 వేలు రోజుకు
♦ నిబంధనలకు విరుద్ధంగా వాహనాల ద్వారా ప్రచారం చేస్తే :రూ. 10,000 రోజుకు
♦ అనుమతించిన లైటింగ్ కంటే ఎక్కువ లైటింగ్‌తో ఏర్పాటు చేస్తే: రూ.10,000 రోజుకు
Comments
Please login to add a commentAdd a comment