Southwest monsoon period
-
India Meteorological Department: ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం
న్యూఢిల్లీ: ఎండలు, వడగాడ్పులతో అల్లాడుతున్న వేళ భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లని కబురు మోసుకొచ్చింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో దేశంలో సమృద్ధిగా వానలు కురుస్తాయని శుభవార్త చెప్పింది. ‘లా నినో’ వాతావరణ పరిస్థితులు కలిసిరావడంతో దేశంలో ఈసారి సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనావేసింది. వాతావరణ శాఖ అంచనా వివరాలను కేంద్ర భూవిజ్ఞానశాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ సోమవారం ఢిల్లీలో వెల్లడించారు. ‘‘దీర్ఘకాల సగటు వర్షపాతం 106 శాతం మేర పడొచ్చు. అంటే 87 సెంటీమీటర్లకు మించి నమోదు కావచ్చు. ప్రస్తుతం భూమధ్య రేఖ పసిఫిక్ ప్రాంతంలో మధ్యస్థ ఎల్‌నినో పరిస్థితులున్నాయి. ఈ ఎల్ నినో (వర్షాభావ పరిస్థితులు) నైరుతి రుతుపవనాల ప్రవేశం (జూన్) నాటికి బలహీనపడి, ద్వితీయార్థంలో లా నినో (వర్షాలకు అనుకూల) పరిస్థితులు ఏర్పడనున్నాయి. గడచిన మూడు నెల్లో ఉత్తరార్థ గోళం, యూరేసియాలో మంచు సాధారణం కన్నా తక్కువగా ఉంది. దీంతో ఈసారి భారత్‌లో వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువ నమోదు కావచ్చు’’ అని పేర్కొన్నారు. దేశ సాగు విస్తీర్ణంలో 52 శాతం పంటలు వర్షాధార పంటలే. రిజర్వాయర్లు అడుగంటి తాగునీటికి సైతం జనం కష్టాలు పడుతున్న ఈ తరుణంలో వాతావరణ శాఖ ప్రకటన రైతాంగాన్ని భారీ ఊరటనిస్తోంది. అయితే వాయవ్య, తూర్పు, ఈశాన్య భారతావనిలోని కొన్ని ప్రాంతాత్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదుకావచ్చని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర అంచనావేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్లలో వర్షపాత వివరాలను ఐఎండీ వెల్లడించలేదు. గత 50 ఏళ్ల సగటున అయిన 87 సెంటీమీటర్ల వర్షపాతంలో 96 శాతం నుంచి 104 శాతాన్ని ‘సాధారణ వర్షపాతం’గా ఐఎండీ గణిస్తోంది. దీర్ఘకాల సగటులో 90 శాతం కన్నా తక్కువ వర్షపాతం కురిస్తే దానిని వర్షాభావ పరిస్థితిగా లెక్కిస్తారు. 90–95 శాతం కురిస్తే దానిని సాధారణ వర్షపాతంగా, 105–110 శాతం కురిస్తే సాధారణం కన్నా ఎక్కువగా పరిగణిస్తారు. 1951–2023 కాలంలో పరిశీలిస్తే ఎల్ నినో తర్వాత వచ్చే లా నినో సందర్భాల్లో తొమ్మిదిసార్లు దేశంలో రుతుపవన కాలాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. లా నినో సంభవించిన 22 సంవత్సరాల్లో 20 సార్లు సాధారణం/సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. -
Weather Report: ఏపీకి ఐఎండీ చల్లని కబురు..
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఏటా జూన్ నుంచి మొదలయ్యే నైరుతి రుతుపవనాల సీజను ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణానికి మించి వర్షాలను కురిపిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సాధారణ వర్షాలే కురుస్తాయని తాజాగా వెల్లడించినా రాష్ట్రానికి మాత్రం సమృద్ధిగా వానలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. ఈ వార్త ఇటు రైతాంగానికి, ప్రభుత్వానికి ఎంతో ఊరటనిస్తోంది. గడచిన మూడేళ్లుగా రాష్ట్రంలో ఇటు నైరుతి, అటు ఈశాన్య రుతుపవనాలు మంచి వర్షాలే కురిపిస్తున్నాయి. ఫలితంగా పంటల దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి. గత ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో సాధారణం కంటే 19 శాతం అధిక వర్షపాతం నమోదైంది. చదవండి: సర్ప్రైజ్ అంటూ కళ్లు మూసుకోమని కాబోయే భర్త గొంతు కోసి.. 2021లో ఈ జిల్లాల్లో అధికం ఇక రాష్ట్రంలో నైరుతి సీజనులో సగటు సాధారణ వర్షపాతం 514 మిల్లీమీటర్లు కాగా.. 2021లో (జూన్–సెపె్టంబర్) 613.3 మిల్లీమీటర్లు (+19 శాతం) కురిసింది. కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. అనంతపురం, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. -
రుతుపవనాల సూచన తేదీల మార్పు
న్యూఢిల్లీ: మారుతున్న వర్షపాతం విధానంతో రుతుపవనాల సూచనల తేదీలలో మార్పులుంటాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఈ ఏడాది నుంచి నైరుతి రుతుపవనాల సూచన తేదీలను ఉపసంహరించుకున్నట్లు ఎర్త్‌సైన్స్ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. రుతుపవనాల సూచనల తేదీల మార్పు పంటలు సాగు చేసేందుకు రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని పేర్కొంది. జూన్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు నాలుగు నెలల రుతుపవనాల సీజన్‌గా పేర్కొంటారు. కేరళ మీదుగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నాటికే వస్తాయని, అయితే మిగతా రాష్ట్రాలు, నగరాల్లో ఈ తేదీలో మార్పులుంటాయని తెలిపింది. అయితే, మధ్య భారత వాతావరణ శాఖ కూడా ఈ రుతుపవనాల సూచన తేదీలను మార్పు చేస్తుందని పేర్కొంది. ఏప్రిల్‌లో విడుదలచేసే అవకాశముందని వెల్లడించింది. -
ముఖం చాటేసిన నైరుతి
వర్షాకాలం వచ్చేసింది. రైతు దుక్కి దున్ని ఆకాశంలోకి ఆశగా చూస్తున్నాడు. కానీ ఒక్క మబ్బు తునక కనిపించడం లేదు. నైరుతి రుతు పవనాలు ముఖం చాటేయడంతో ఖరీఫ్ సీజన్ వృథాయేనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. దక్షిణ భారతంలో రైతులకు జులై నెల అత్యంత కీలకం. ఈ నెలలో వర్షం కురిసే అవకాశాలు కనిపించడం లేదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంటోంది. ‘నైరుతి రుతు పవనాలు బలహీనపడి పోతున్నాయి. వచ్చే రెండు వారాల్లో మధ్య, దక్షిణ భారతంలో ఎక్కడా వానలు కురిసే అవకాశాల్లేవు’ అని భారత వాతావరణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. దేశం మొత్తమ్మీద చూస్తే 12 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మధ్య భారతంలో వానలు ఇప్పటికే దంచికొడుతున్నాయి. మరో నాలుగైదు రోజులపాటు ఉత్తర, ఈశాన్య భారతాల్లోని కొన్ని ప్రాంతాలు, గంగా పరీవాహక రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, బిహార్, బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి కశ్యపి పేర్కొన్నారు. అరేబియా సముద్రం, బంగాళాఖాతం ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం కనిపించడం లేదని ఆయన వివరించారు. మధ్య భారతంలో భారీ వర్షాలు నైరుతి రుతుపవనాలు భారత్‌లో ప్రవేశించిన తర్వాత తొలిసారిగా ఈ వారంలో కొన్ని ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. జులై మొదటి వారంలో గత 50 ఏళ్ల సగటు తీసుకుంటే 28 శాతం అత్యధికంగా వర్షపాతం నమోదైంది. సోయాబీన్, పత్తి అధికంగా పండించే మధ్యభారతంలో 38 శాతం అధిక వర్షాలు కురిస్తే, వరి పండించే దక్షిణాదిన 20శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. తీవ్రమవుతున్న నీటి సమస్య ఇప్పటివరకు కురిసిన వర్షాలు ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. ఎక్కడికక్కడ బోర్లు బావురుమంటున్నాయి. చెరువులు ఎండిపోయాయి. రిజర్వాయర్లలో నీటిమట్టం దిగువకి పడిపోయింది చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ఒక్క వారం ఆలస్యంగా రావడంతో పాటు అరేబియా సముద్రంలో నెలకొన్న వాయు తుఫాన్ ప్రభావం రుతుపవనాలపై పడింది. ఫలితంగా గత ఏడాదితో పోల్చి చూస్తే 27 శాతం వరకు విస్తీర్ణంలో పంటలు వేయడం తగ్గిపోయింది. ‘మన దేశంలో బంగారు పంటలు పండాలంటే వచ్చే రెండు, మూడు వారాల్లో అధికంగా వానలు కురవాలి. అప్పుడే జూన్‌లో తగ్గిన లోటు వర్షపాతం భర్తీ అవుతుంది. కానీ, ఇప్పుడు ఆ అవకాశాలు కనిపించడం లేదు’ అని భారత వాతావరణ శాఖకు చెందిన భారతి చెప్పారు. ఈ ఏడాది సరిగ్గా వానలు కురిసే అవకాశం లేదని వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేసే ప్రైవేటు సంస్థ స్కైమెట్ మే నెలలోనే ప్రకటించింది. చెన్నై చేరిన నీళ్ల రైలు చెన్నై: వెల్లూరులోని జోలార్‌పేటై నుంచి 25 లక్షల లీటర్ల నీటిని మోసుకుంటూ ఓ రైలు చెన్నైలోని విల్లివక్కమ్‌కు చేరుకుంది. ఈ రైల్లో మొత్తం 50 వ్యాగన్లు ఉండగా, ఒక్కో వ్యాగన్ సామర్థ్యం 50 వేల లీటర్లు. నీటిని శుభ్రపరిచేందుకు దాదాపు 100 పైపులను అమర్చి ప్లాంటుకు తరలిస్తున్నారు. శుద్ధి చేశాక పంపిణీ చేస్తామని చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అధికారులు తెలిపారు. ఈ పంపిణీ ఈశాన్య రుతుపవనాలు వచ్చే వరకు కొనసాగుతుందన్నారు. ఈశాన్య రుతుపవనాలు రావడానికి ఇంకా ఆరునెలల సమయం ఉంది. దక్షిణ మెట్రోపోలీస్ నుంచి జోలార్‌పేటై 217 కిలోమీటర్ల దూరంలో ఉంది. నీటి కొరతతో అల్లాడుతున్న చెన్నైకి నీటిని తరలించేందుకు సహాయం అందించాల్సిందిగా ప్రభుత్వం రైల్వేను కోరిన నేపథ్యంలో ఈ రైలు వెల్లూరు జిల్లా నుంచి నీటితో చెన్నై చేరుకుంది. జోలార్‌పేటై నుంచి నీటిని తెచ్చి, కొరతను తగ్గించేందుకు ముఖ్యమంత్రి కే. పళనిస్వామి రూ.65 కోట్లను కేటాయించారు. నీటి పంపిణీని తమిళనాడు మంత్రులు ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. చెన్నై నగరానికి రోజుకు 20 కోట్ల లీటర్లు నీరు అవసరం కాగా ఆ నీటిని అందించే నాలుగు ప్రధాన రిజర్వాయర్లలో నీరు అడుగంటిన సంగతి తెలిసిందే. -
13న రాష్ట్రంలోకి నైరుతి
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళను తాకాయి. ఆదివారం ఉదయం కేరళను తాకినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతాలు పూర్తిగా, దక్షిణ అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాలు, లక్ష దీవుల్లో చాలా ప్రాంతాలు, కేరళ, దక్షిణ తమిళనాడుల్లో కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పుమధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతాల్లో కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి, సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. అక్కడినుంచి ఈ నెల 11 లేదా 12 తేదీల్లో రాయలసీమలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయన్నారు. అనంతరం 13న తెలంగాణలోకి ప్రవేశిస్తాయని తెలిపారు. ఆ తర్వాత ఈ నెల 15వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని పేర్కొన్నారు. వాస్తవంగా రుతుపవనాలు ముందు ప్రకటించినట్లుగా ఈ నెల 6న కేరళలోకి, 11న తెలంగాణలోకి ప్రవేశించాలి. రెండ్రోజులు ఆలస్యంగా కేరళలోకి ప్రవే శించాయి. భూమి వేడి తగ్గితేనే రుతుపవనాలు వేగం గా ప్రవేశిస్తాయని, వాటికి అనుకూల పరిస్థితులు ఏర్పడాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాది 97 శాతం వర్షాలు... సాధారణంతో పోలిస్తే ఈసారి 97 శాతం వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంటే ఆ లెక్కను కూడా సాధారణ వర్షాలుగానే పరిగణిస్తామని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో సాధారణ నైరుతి సీజన్ వర్షపాతం 755 మిల్లీమీటర్లు కాగా, 97 శాతం లెక్కన ఈసారి 732 ఎంఎంలు కురిసే అవకాశముంది. గతేడాది ఇదే సీజలో సాధారణ వర్షపాతాలే కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించినా కేవలం 92 శాతమే వర్షం కురిసింది. 2016లోనైతే సాధారణం కంటే ఏకంగా 19 శాతం అధిక వర్షపాతం తెలంగాణలో నమోదైంది. రుతుపవనాలు ఒకసారి ప్రవేశించాక రెండ్రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తాయి. కొన్నిసార్లు విస్తరించడానికి నాలుగైదు రోజులు పడుతుంది. గతేడాది ఒకేసారి రాష్ట్రమంతటా విస్తరించాయి. కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించడం గత ఆరేళ్ల లెక్కలతో పోలిస్తే ఇప్పుడే మరింత ఆలస్యంగా వచ్చాయి. గతేడాది మే 29న రాగా, 2016లో జూన్ 7న ప్రవేశించాయి. ఇప్పుడు 8న వచ్చాయి. ఉపరితల ఆవర్తనంతో అక్కడక్కడా వర్షాలు.. మరోవైపు తూర్పు పశ్చిమ షియర్ జోన్ దక్షిణ భారత్ మీదుగా 2.1 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల మధ్య కొనసాగుతుందని వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణ దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు. ఫలితంగా రాగల మూడు రోజులు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. మరోవైపు రాగల మూడురోజులు ఉత్తర తెలంగాణ ప్రాంతాలలో వడగాడ్పులు వీచే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గి కాస్తంత ఉపశమనం ఏర్పడింది. రుతుపవనాల రాకకు ముందు కొన్నిచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వివిధ సంవత్సరాల్లో కేరళకు, తెలంగాణల్లోకి చల్లబడ్డ హైదరాబాద్... నైరుతి రుతుపవనాలు నాలుగు రోజుల్లో నగరాన్ని తాకనున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి నగరంలో పలుచోట్ల తేలికపాటి వర్షం కురవటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. ఎండ వేడితో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులు శుక్ర, శనివారాల్లో కాసింత ఉపశమనం పొందారు. ఇదిలా ఉంటే శనివారం నగరంలో పగటిపూట 34 డిగ్రీల సెల్సియస్ రికార్డు కాగా, అత్యల్పంగా 22.7 డిగ్రీలుగా నమోదైంది. సాధారణంతో పోలిస్తే 3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు తక్కువ కావటం విశేషం. కాగా, శుక్రవారం నగరంలో అత్యధికంగా హకీంపేటలో 26.4 ఎంఎం, మేడ్చల్‌లో 17.8 ఎంఎం వర్షం కురిసింది. వ్యవసాయ ప్రణాళిక విడుదలపై అధికారుల నిర్లక్ష్యం... ఖరీఫ్ మొదలైంది. త్వరలో రాష్ట్రంలోకి రుతుపవనాలు రానున్నాయి. రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఆ ప్రకారం వ్యవసాయశాఖ ప్రణాళిక విడుదల చేయాలి. మే నెలలోనే రైతుల ముందుకు తీసుకురావాల్సి ఉండగా ఇప్పటికీ విడుదల చేయలేదు. ఆ ప్రణాళిక ప్రకారమే రాష్ట్రంలో వ్యవసాయశాఖ కార్యక్రమాలు చేపడుతుంది. సాధారణ పంటల సాగు 2019–20 ఖరీఫ్, రబీల్లో ఎంతెంత చేసే అవకాశముందో ప్రణాళికలో వివరిస్తారు. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్న తరుణంలో వచ్చే ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో అదనంగా ఏడెనిమిది లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశముంది. ఆ ప్రకారం ఎంత సాగు పెరిగే అవకాశముందో అంచనా వేస్తారు. అంటే సాధారణ సాగు విస్తీర్ణం, పెరిగే విస్తీర్ణాన్ని ప్రణాళికలో ప్రస్తావిస్తారు. మరోవైపు ఉత్పత్తి, ఉత్పాదకతల లక్ష్యాన్ని కూడా వ్యవసాయ శాఖ తన ప్రణాళికలో ప్రస్తావిస్తుంది. ఎరువులు, విత్తనాల లక్ష్యం, సరఫరాలను ప్రస్తావిస్తారు. కానీ ఇంతవరకు ప్రణాళికను అధికారులు విడుదల చేయకపోవడంపై సర్కారు పెద్దలు గుర్రుగా ఉన్నారు. మరోవైపు రైతుబంధు పథకం కింద నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటివరకు ఖరీఫ్‌కు సంబంధించి రెండు విడతల సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. -
నైరుతి సీజన్ ముగిసింది
న్యూఢిల్లీ: దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసిందని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సగటున 9 శాతం లోటు వర్షపాతం నమోదయిందని వెల్లడించింది. బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రమైన లోటు వర్షపాతం రికార్డయిందని పేర్కొంది. గతేడాదిలాగే ఈ సంవత్సరం కూడా నైరుతి రుతుపవనాలతో సగటు కన్నా తక్కువ వర్షమే కురిసిందని తెలిపింది. అనుకున్నదాని కంటే మూడు రోజులు ముందుగా కేరళలో మే 28న నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. శనివారం నుంచి వీటి నిష్క్రమణ ప్రారంభమైంది. నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయినప్పటికీ దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో అక్టోబర్ మొదటి వారంలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈసారి నైరుతి రుతుపననాల ప్రభావంతో దేశవ్యాప్తంగా 91 శాతం వర్షపాతం నమోదయిందనీ, ఇది అంచనా వేసిన దానికంటే తక్కువేనని వెల్లడించింది. తూర్పు, ఈశాన్య భారతంలో అత్యధిక లోటు వర్షపాతం నమోదుకాగా, సెంట్రల్ ఇండియా, వాయవ్య రాష్ట్రాలు లోటు వర్షపాతంలో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. నైరుతి రుతుపవనాల కారణంగా జూన్ నెలలో 95 శాతం, జూలైలో 94 శాతం, ఆగస్టులో 92 శాతం వర్షపాతం సంభవించింది. ఇక సెప్టెంబర్‌లో అయితే వర్షపాతం ఏకంగా 76 శాతానికి పడిపోయింది. -
భారీ వర్షాలకు వణికిన ముంబై
సాక్షి, ముంబై / న్యూఢిల్లీ / కోల్‌కతా: నైరుతీ రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ముంబై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కేవలం ఒక్కరోజులో 231.4 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం ప్రభావంతో ముంబై, థానేలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పరేల్, దాదర్, హిందుమాత, భైకళ, కింగ్ సర్కిల్ తదితర లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. థానేలోనూ 229.8 మీల్లిమీటర్ల భారీ వర్షం కురవడంతో పలుచోట్ల ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. పశ్చిమ, సెంట్రల్, హార్బర్ 3 మార్గాల్లో లోకల్ రైళ్లన్నీ ఆలస్యంగా నడిచాయి. దక్షిణ ముంబైలోని మెట్రో థియేటర్ వద్ద చెట్టు కూలడంతో ఆదివారం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో థానేలోని వాడోల్లో ఇంటి పక్కనున్న గోడ కూలిపోవడంతో కిరణ్ గైక్వాడ్(13) అనే బాలుడు చనిపోయాడు. నవీముంబైలోని మలాద్‌లోని మురికికాలువలో పడిపోవడంతో నాగేందర్ అనే యువకుడు మృతి చెందాడు. ముంబైలోని వడాలా ప్రాంతంలో ఓ పెద్ద ప్రహరి గోడ కూలిపోవడంతో 15 కార్లు శిథిలాల కింద చిక్కుకున్నాయి. ఈ కార్లలో ప్రజలెవరైనా చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానంతో అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రవాహంతో ఇక్కడి రోడ్డు సైతం కుంగిపోయింది. కాగా, రాబోయే 24 నుంచి 48 గంటల్లో ముంబైలో భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఓవైపు వర్షాలు.. మరోవైపు ఎండలు పశ్చిమబెంగాల్లో భారీ వర్షాలు, పిడుగుపాటుకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పిడుగుపాటుకు పురూలియాలో ఓ బాలుడు, 24 ఉత్తర పరగణాల జిల్లాలో ఇద్దరు, 24 దక్షిణ పరగణాల జిల్లాలో మరొకరు చనిపోయారు. కూచ్‌బెహార్ జిల్లాలో వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్న సుతుంగా నదిలో మునిగిపోయి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో గుజరాత్‌లోని వల్సాద్, సూరత్, నవ్సారి జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. అస్సాంలోని చఛర్ జిల్లాలో ఇద్దరు వరదలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో వరద తాకిడికి చనిపోయిన ప్రజల సంఖ్య 26కు చేరుకుంది. ఓవైపు ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తుండగా.. మరోవైపు వేడి కూడా రికార్డు స్థాయిలో నమోదయింది. ఆదివారం ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రత 42.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సాయంత్రంకల్లా ఆకాశం మేఘావృత్తం కావడంతో పాటు గాలిదుమారం వచ్చే అవకాశముందని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్‌లోని బందా నగరంలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించారు. రాబోయే 2–3 రోజుల్లో తూర్పు యూపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశముందన్నారు. చండీగఢ్‌లో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. -
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు
విశాఖపట్నం : నైరుతి రుణపవనాల రాకతో బంగాళాఖాతంలో ఏర్పడిన అప్పపీడనం బలపడి వాయుగుండంగా మారనుంది. రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ శనివారం ప్రకటనలో తెలిపింది. కోస్తా తీరంవెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. కాగా ఈ సమయంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతవరణ అధికారులు తెలిపారు. వేటకు వెళ్లకుండా ఉండడం మంచిదని వెల్లడించారు. -
ఆశలు ఆవిరి
సాక్షి, ఖమ్మం: నైరుతి రుతు పవన కాలం ముగుస్తోంది.. వరుణుడు ఈ ఖరీఫ్‌లో ముఖం చాటేశాడు. సాధారణం కన్నా తక్కువగా వర్షపాతం నమోదైంది.. అప్పుడప్పుడు కురిసిన వర్షాలతో సాగు చేసిన పంటలూ వడబడుతున్నాయి.. దీంతో జిల్లాలో కరువు ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే నాలుగు మండలాల్లో తీవ్ర వర్షాభావం ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మరోవైపు నాగార్జునసాగర్ ఆయకట్టు రెండోజోన్ పరిధిలో ఉన్న జిల్లాకు నీరు విడుదల చేయకపోవడంతో ఆయకట్టు బీడు భూమిగా మారే పరిస్థితి నెలకొంది. వర్షాభావంతో జిల్లా వ్యాప్తంగా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతు పవనాలతో ఈ ఖరీఫ్‌లో తగినంత వర్షం పడకపోవడంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. అప్పుడప్పుడు కురిసిన వర్షంతో సాగు చేసిన పత్తి, మిర్చి ఇతర పంటలు కూడా ఎండిపోతున్నాయి. గత పదిరోజులుగా ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తుండడంతో పంటలు ఇక చేతికి రావని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 10 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో నీటి ఆధారం, వర్షాధారంగా వేసే పత్తి 4.6 లక్షలు, సాగర్ ఆయకట్టు, చెరువులు, రిజర్వాయర్ల కింద సాగయ్యే వరి 3.31 లక్షల ఎకరాలుగా ఉంది. ఇతర పంటలు 3 లక్షల పైచిలుకు ఎకరాల్లో సాగు కావాలి. కానీ ఈ ఖరీఫ్‌లో పత్తి 3.93 లక్షల ఎకరాల్లో, చెరువులు, బోరుబావుల కింద వరి 77 వేల ఎకరాలు, మిర్చి 3,232 ఎకరాల్లో సాగు చేశారు. అయితే వర్షాలు పడకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ప్రధానంగా వర్షాధార పంట అయిన పత్తి రోజురోజుకూ వడబడుతోంది. గత వారం రోజులుగా 32 నుంచి 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే పంటలు చేతికందక అప్పుల ఊబిలో కూరుకుపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నైరుతి రుతు పవనాల విజృంభణ ఈ ఖరీఫ్‌లో ఆశించినంతగా లేకపోవడం, ఇక పవనాలతో వర్షం పడే పరిస్థితులు కూడా కనిపించకపోవడంతో జిల్లాలో కరువు కోరలు జాసింది. జిల్లాలో తీవ్ర వర్షాభావం.. జిల్లాలో నైరుతి రుతు పవనాల ఆగమనం జూన్ నుంచి మొదలు కావాలి. అయితే ఈ మూడు నెలల్లో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. గత నెలలో కొంత వర్షం పడడంతో రైతులు పత్తి, మిర్చి, బోరుబావుల కింద వరి సాగు చేశారు. ఈ నెలలో వర్షాలు పడతాయని ఆశిస్తే.. అడియాశలే అయ్యాయి. జూన్ సాధారణ వర్షపాతంలో 77 శాతం, జూలైలో 23 శాతం, ఈనెలలో ఇప్పటి వరకు 62.6 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. జిల్లాలో తిరుమలాయపాలెం, కొణిజర్ల, బోనకల్, చింతకాని మండలాల్లో సాధారణం కన్నా తక్కువగా వర్షపాతం నమోదు కావడంతో ప్రభుత్వం ఈ మండలాలను తీవ్ర వర్షాభావ మండలాలుగా గుర్తించింది. ఈనెల చివరి నాటికి సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో ఈ మండలాల సంఖ్య ఇంకా పెరగవచ్చు. వచ్చే నెలలో కూడా ఇదే పరిస్థితి ఉంటే పశువులు తాగడానికి కూడా చెరువులు, కుంటల్లో నీళ్లు ఉండవని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆయకట్టుకు నీరందేనా..? నాగార్జున సాగర్ గరిష్ట నీటినిలువ సామర్థ్యం 590 అడుగులు. నైరుతి రుతు పవనాలతో వర్షం లేకపోవడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండలేదు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం తగ్గడంతో ప్రస్తుతం సాగర్‌లో 537 అడుగుల నీరు మాత్రమే ఉంది. సాగర్ ఎడమ కాలువ పరిధిలో జిల్లాలోని 16 మండలాల్లో 2.51 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో మొదటి జోన్లో 14 వేలు, రెండో జోన్లో 2.37 ఎకరాల ఆయకట్టు ఉంది. మొదటి జోన్‌కు నీటి విడుదల చేయడంతో జిల్లాలోని కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ మండలాలకు మాత్రమే సాగు నీరు అందుతోంది. ఇక రెండో జోన్‌కు నీరు ఎప్పుడందుతుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ పదిరోజులు, వచ్చే నెలలో భారీగా వర్షాలు పడితేనే ఎగువ నుంచి వచ్చే వరదతో సాగర్ నిండే అవకాశం ఉందని, దానికి అనుగుణంగా నీటి విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఎన్నెస్పీ అధికారులు పేర్కొంటున్నారు.