ముఖం చాటేసిన నైరుతి | Monsoon likely to revive in July's last week | Sakshi
Sakshi News home page

ముఖం చాటేసిన నైరుతి

Published Sat, Jul 13 2019 3:46 AM | Last Updated on Sat, Jul 13 2019 4:53 AM

Monsoon likely to revive in July's last week - Sakshi

చెన్నైకి నీళ్లతో వచ్చిన వ్యాగన్ల రైలు

వర్షాకాలం వచ్చేసింది. రైతు దుక్కి దున్ని ఆకాశంలోకి ఆశగా చూస్తున్నాడు. కానీ ఒక్క మబ్బు తునక కనిపించడం లేదు.  నైరుతి రుతు పవనాలు ముఖం చాటేయడంతో ఖరీఫ్‌ సీజన్‌ వృథాయేనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. దక్షిణ భారతంలో రైతులకు జులై నెల అత్యంత కీలకం. ఈ నెలలో వర్షం కురిసే అవకాశాలు కనిపించడం లేదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంటోంది. ‘నైరుతి రుతు పవనాలు బలహీనపడి పోతున్నాయి.

వచ్చే రెండు వారాల్లో మధ్య, దక్షిణ భారతంలో ఎక్కడా వానలు కురిసే అవకాశాల్లేవు’ అని భారత వాతావరణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. దేశం మొత్తమ్మీద చూస్తే 12 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మధ్య భారతంలో వానలు ఇప్పటికే దంచికొడుతున్నాయి. మరో నాలుగైదు రోజులపాటు ఉత్తర, ఈశాన్య భారతాల్లోని కొన్ని ప్రాంతాలు, గంగా పరీవాహక రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, బిహార్, బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి కశ్యపి పేర్కొన్నారు. అరేబియా సముద్రం, బంగాళాఖాతం ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం కనిపించడం లేదని ఆయన వివరించారు.  

మధ్య భారతంలో భారీ వర్షాలు  
నైరుతి రుతుపవనాలు భారత్‌లో ప్రవేశించిన తర్వాత తొలిసారిగా ఈ వారంలో కొన్ని ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. జులై మొదటి వారంలో గత 50 ఏళ్ల సగటు తీసుకుంటే 28 శాతం అత్యధికంగా వర్షపాతం నమోదైంది. సోయాబీన్, పత్తి అధికంగా పండించే మధ్యభారతంలో 38 శాతం అధిక వర్షాలు కురిస్తే, వరి పండించే దక్షిణాదిన 20శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.  

తీవ్రమవుతున్న నీటి సమస్య  
ఇప్పటివరకు కురిసిన వర్షాలు ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. ఎక్కడికక్కడ బోర్లు బావురుమంటున్నాయి. చెరువులు ఎండిపోయాయి. రిజర్వాయర్లలో నీటిమట్టం దిగువకి పడిపోయింది చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ఒక్క వారం ఆలస్యంగా రావడంతో పాటు అరేబియా సముద్రంలో నెలకొన్న వాయు తుఫాన్‌ ప్రభావం రుతుపవనాలపై పడింది. ఫలితంగా గత ఏడాదితో పోల్చి చూస్తే 27 శాతం వరకు విస్తీర్ణంలో పంటలు వేయడం తగ్గిపోయింది. ‘మన దేశంలో బంగారు పంటలు పండాలంటే వచ్చే రెండు, మూడు వారాల్లో అధికంగా వానలు కురవాలి. అప్పుడే జూన్‌లో తగ్గిన లోటు వర్షపాతం భర్తీ అవుతుంది. కానీ, ఇప్పుడు ఆ అవకాశాలు కనిపించడం లేదు’ అని భారత వాతావరణ శాఖకు చెందిన భారతి చెప్పారు. ఈ ఏడాది సరిగ్గా వానలు కురిసే అవకాశం లేదని వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేసే ప్రైవేటు సంస్థ స్కైమెట్‌ మే నెలలోనే ప్రకటించింది.  

చెన్నై చేరిన నీళ్ల రైలు
చెన్నై: వెల్లూరులోని జోలార్‌పేటై నుంచి 25 లక్షల లీటర్ల నీటిని మోసుకుంటూ ఓ రైలు చెన్నైలోని విల్లివక్కమ్‌కు చేరుకుంది. ఈ రైల్లో మొత్తం 50 వ్యాగన్లు ఉండగా, ఒక్కో వ్యాగన్‌ సామర్థ్యం 50 వేల లీటర్లు. నీటిని శుభ్రపరిచేందుకు దాదాపు 100 పైపులను అమర్చి ప్లాంటుకు తరలిస్తున్నారు. శుద్ధి చేశాక పంపిణీ చేస్తామని చెన్నై మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అధికారులు తెలిపారు. ఈ పంపిణీ ఈశాన్య రుతుపవనాలు వచ్చే వరకు కొనసాగుతుందన్నారు. ఈశాన్య రుతుపవనాలు రావడానికి ఇంకా ఆరునెలల సమయం ఉంది.

దక్షిణ మెట్రోపోలీస్‌ నుంచి జోలార్‌పేటై 217 కిలోమీటర్ల దూరంలో ఉంది. నీటి కొరతతో అల్లాడుతున్న చెన్నైకి నీటిని తరలించేందుకు సహాయం అందించాల్సిందిగా ప్రభుత్వం రైల్వేను కోరిన నేపథ్యంలో ఈ రైలు వెల్లూరు జిల్లా నుంచి నీటితో చెన్నై చేరుకుంది. జోలార్‌పేటై నుంచి నీటిని తెచ్చి, కొరతను తగ్గించేందుకు ముఖ్యమంత్రి కే. పళనిస్వామి రూ.65 కోట్లను కేటాయించారు. నీటి పంపిణీని తమిళనాడు మంత్రులు ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. చెన్నై నగరానికి రోజుకు 20 కోట్ల లీటర్లు నీరు అవసరం కాగా ఆ నీటిని అందించే నాలుగు ప్రధాన రిజర్వాయర్లలో నీరు అడుగంటిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement