Concerns farmer
-
వందోరోజుకు రైతు ఆందోళనలు
చండీగఢ్: కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేస్తున్న ఆందోళనలు 100వ రోజుకు చేరాయి. ఈ నేపథ్యంలో హరియాణాలో రైతు సంఘాలు కేఎంపీ ఎక్స్‌ప్రెస్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. శనివారం 11 గంటల నుంచి 4 గంటల వరకు హరియాణాలో పలు ప్రాంతాల్లో హైవేపై రాకపోకలను అడ్డుకున్నారు. తమ డిమాండ్లకు అంగీకరించడం లేదంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. రాస్తారోకో సందర్భంగా ఈ హైవేపై రాకపోకలను నియంత్రించిన పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. సంయుక్త కిసాన్‌మోర్చా ఈ రాస్తారోకోకు పిలుపునిచ్చింది. మూడు చట్టాలను ఉపసంహరించుకునేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని రైతు నేతలు చెప్పారు. తమ నిరసన శాంతియుతంగా ఉంటుందన్నారు. కేంద్ర అహంకారానికి నిదర్శనం సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన వందోరోజుకు చేరడం కేంద్ర దురహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్ దుయ్యబట్టింది. భారత ప్రజాస్వామ్యానికి ఇది మాయని మచ్చగా అభివర్ణించింది. ఆందోళన చేస్తున్న రైతుల్లో చాలామంది పిల్లలు సైన్యంలో చేరి దేశాన్ని కాపాడుతున్నారని, అలాంటి రైతులను అడ్డుకునేందుకు కేంద్రం రోడ్లపై మేకులు పరుస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ విమర్శించారు. రైతులు తమ హక్కులను కోరుతున్నారని, ప్రభుత్వం వారిపై దమనకాండ జరుపుతోందని ట్వీట్ చేశారు. అన్నదాతలు వందరోజులుగా నిరసన చేస్తున్నా, బీజేపీ ప్రభుత్వం అబద్దాలు, అహంకారంతో కాలం గడిపిందని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. రైతాంగ ఉద్యమం చరిత్రాత్మకం సాక్షి , న్యూఢిల్లీ: సాగు వ్యతిరేక చట్టాలపై వంద రోజులుగా సాగిన ఉద్యమం దేశ చరిత్రలోనే చరిత్రాత్మకమైందని ఆలిండియా కిసాన్ సభ, సంయుక్త కిసాన్ మోర్చా అభివర్ణించాయి. శనివారం ఈ రెండు రైతు సంఘాలు ప్రకటన విడుదల చేశాయి. 1930లో మహాత్మాగాంధీ నేతృత్వంలో జరిగిన దండి ఉద్యమం మాదిరిగా రైతు ఉద్యమం జరుగుతోందని స్పష్టంచేశాయి. రైతులు చేస్తున్న పోరాటం సామాన్యమైన విషయం కాదని, ఎన్నో ఇబ్బందులు, అటంకాలు, అవమానాలకి ఓర్చి ఇంత స్థాయిలో ఉద్యమిస్తున్న రైతాంగానికి ఏఐకేఎస్, ఎస్కేయూ ధన్యవాదాలు తెలిపాయి. బీజేపీ సర్కారు ఎన్నినిర్బంధాలు పెట్టినా రైతాంగం ఉద్యమించడం హర్షణీయమని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ పేర్కొన్నారు. -
రైతులకు మద్దతుగా ఆత్మహత్య
న్యూడిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా హరియాణాలోని కర్నాల్‌కు చెందిన మత ప్రబోధకుడు సంత్ బాబా రామ్ సింగ్(65) బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ శివార్లలోని సింఘు సరిహద్దు వద్ద తుపాకీతో కాల్చుకున్నారు. రామ్‌సింగ్‌కు పంజాబ్, హరియాణాల్లో అనుయాయులు ఉన్నారు. హరియాణా శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) సహా పలు ఆధ్యాత్మిక సంస్థల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. బాబా రామ్‌సింగ్ మృతదేహం సమీపంలో ఆయన పంజాబీలో రాసిన ఆత్మాహుతి లేఖ లభించింది. ‘హక్కుల కోసం రోడ్డుపై ఆందోళన చేస్తున్న రైతుల దీనస్థితిని, వారికి న్యాయం చేయకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేతను చూసి తట్టుకోలేకపోతున్నాను’ అని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. రైతులకు మద్దతుగా పలువురు తమకందిన ప్రభుత్వ పురస్కారాలను వెనక్కు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘రైతులకు మద్దతుగా, ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ సేవకుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇది ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా తీసుకుంటున్న చర్య’ అని వివరించారు. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. రామ్‌సింగ్ మృతికి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఆత్మహత్యకు మోదీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ రాక్షసత్వం అన్ని హద్దులు దాటిందని మండిపడ్డారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమిటీతో లాభం లేదు రైతు ఆందోళనలపై సుప్రీంకోర్టు సూచించినట్లుగా కమిటీని ఏర్పాటు చేయడం వల్ల పరిష్కారం లభించదని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దే ఏకైక పరిష్కారమని పేర్కొన్నాయి. కమిటీని ఏర్పాటు చేస్తామని చర్చల సందర్భంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదించిందని, ఆ ప్రతిపాదనను అప్పుడే తిరస్కరించామని రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సభ నేత అభిమన్యు కోహర్ వెల్లడించారు. ఇప్పటివరకు చర్చలు జరిపిన ప్రభుత్వ ప్రతినిధులు, రైతు ప్రతినిధులు కమిటీతో సమానమేనని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత, దానిపై ప్రభుత్వ స్పందనను గమనించిన తరువాత ఈ విషయంపై మాట్లాడుతామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ పేర్కొన్నారు. మరోవైపు, ఇతర రైతు సంఘాలతో సమాంతర చర్చలను నిలిపేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనల్లో పాల్గొంటున్న 40 రైతు సంఘాల ఐక్య కూటమి ‘సంయుక్త కిసాన్ మోర్చా’ కేంద్రానికి లేఖ రాసింది. యూపీ సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాలతో ఇటీవల కేంద్ర ప్రతినిధులు భేటీకావడం తెల్సిందే. వ్యవసాయ చట్టాలకు సవరణలు చేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని కేంద్రానికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. మరోవైపు, చిల్లా సరిహద్దు వద్ద భద్రతను మరింత పెంచారు. చిల్లా సరిహద్దును దిగ్బంధిస్తామని రైతు నేతలు హెచ్చరించిన నేపథ్యంలో ఢిల్లీ–నోయిడా మార్గంలోని చిల్లా సరిహద్దులో బలగాలను మోహరించారు. -
ముఖం చాటేసిన నైరుతి
వర్షాకాలం వచ్చేసింది. రైతు దుక్కి దున్ని ఆకాశంలోకి ఆశగా చూస్తున్నాడు. కానీ ఒక్క మబ్బు తునక కనిపించడం లేదు. నైరుతి రుతు పవనాలు ముఖం చాటేయడంతో ఖరీఫ్ సీజన్ వృథాయేనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. దక్షిణ భారతంలో రైతులకు జులై నెల అత్యంత కీలకం. ఈ నెలలో వర్షం కురిసే అవకాశాలు కనిపించడం లేదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంటోంది. ‘నైరుతి రుతు పవనాలు బలహీనపడి పోతున్నాయి. వచ్చే రెండు వారాల్లో మధ్య, దక్షిణ భారతంలో ఎక్కడా వానలు కురిసే అవకాశాల్లేవు’ అని భారత వాతావరణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. దేశం మొత్తమ్మీద చూస్తే 12 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మధ్య భారతంలో వానలు ఇప్పటికే దంచికొడుతున్నాయి. మరో నాలుగైదు రోజులపాటు ఉత్తర, ఈశాన్య భారతాల్లోని కొన్ని ప్రాంతాలు, గంగా పరీవాహక రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, బిహార్, బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి కశ్యపి పేర్కొన్నారు. అరేబియా సముద్రం, బంగాళాఖాతం ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం కనిపించడం లేదని ఆయన వివరించారు. మధ్య భారతంలో భారీ వర్షాలు నైరుతి రుతుపవనాలు భారత్‌లో ప్రవేశించిన తర్వాత తొలిసారిగా ఈ వారంలో కొన్ని ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. జులై మొదటి వారంలో గత 50 ఏళ్ల సగటు తీసుకుంటే 28 శాతం అత్యధికంగా వర్షపాతం నమోదైంది. సోయాబీన్, పత్తి అధికంగా పండించే మధ్యభారతంలో 38 శాతం అధిక వర్షాలు కురిస్తే, వరి పండించే దక్షిణాదిన 20శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. తీవ్రమవుతున్న నీటి సమస్య ఇప్పటివరకు కురిసిన వర్షాలు ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. ఎక్కడికక్కడ బోర్లు బావురుమంటున్నాయి. చెరువులు ఎండిపోయాయి. రిజర్వాయర్లలో నీటిమట్టం దిగువకి పడిపోయింది చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ఒక్క వారం ఆలస్యంగా రావడంతో పాటు అరేబియా సముద్రంలో నెలకొన్న వాయు తుఫాన్ ప్రభావం రుతుపవనాలపై పడింది. ఫలితంగా గత ఏడాదితో పోల్చి చూస్తే 27 శాతం వరకు విస్తీర్ణంలో పంటలు వేయడం తగ్గిపోయింది. ‘మన దేశంలో బంగారు పంటలు పండాలంటే వచ్చే రెండు, మూడు వారాల్లో అధికంగా వానలు కురవాలి. అప్పుడే జూన్‌లో తగ్గిన లోటు వర్షపాతం భర్తీ అవుతుంది. కానీ, ఇప్పుడు ఆ అవకాశాలు కనిపించడం లేదు’ అని భారత వాతావరణ శాఖకు చెందిన భారతి చెప్పారు. ఈ ఏడాది సరిగ్గా వానలు కురిసే అవకాశం లేదని వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేసే ప్రైవేటు సంస్థ స్కైమెట్ మే నెలలోనే ప్రకటించింది. చెన్నై చేరిన నీళ్ల రైలు చెన్నై: వెల్లూరులోని జోలార్‌పేటై నుంచి 25 లక్షల లీటర్ల నీటిని మోసుకుంటూ ఓ రైలు చెన్నైలోని విల్లివక్కమ్‌కు చేరుకుంది. ఈ రైల్లో మొత్తం 50 వ్యాగన్లు ఉండగా, ఒక్కో వ్యాగన్ సామర్థ్యం 50 వేల లీటర్లు. నీటిని శుభ్రపరిచేందుకు దాదాపు 100 పైపులను అమర్చి ప్లాంటుకు తరలిస్తున్నారు. శుద్ధి చేశాక పంపిణీ చేస్తామని చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అధికారులు తెలిపారు. ఈ పంపిణీ ఈశాన్య రుతుపవనాలు వచ్చే వరకు కొనసాగుతుందన్నారు. ఈశాన్య రుతుపవనాలు రావడానికి ఇంకా ఆరునెలల సమయం ఉంది. దక్షిణ మెట్రోపోలీస్ నుంచి జోలార్‌పేటై 217 కిలోమీటర్ల దూరంలో ఉంది. నీటి కొరతతో అల్లాడుతున్న చెన్నైకి నీటిని తరలించేందుకు సహాయం అందించాల్సిందిగా ప్రభుత్వం రైల్వేను కోరిన నేపథ్యంలో ఈ రైలు వెల్లూరు జిల్లా నుంచి నీటితో చెన్నై చేరుకుంది. జోలార్‌పేటై నుంచి నీటిని తెచ్చి, కొరతను తగ్గించేందుకు ముఖ్యమంత్రి కే. పళనిస్వామి రూ.65 కోట్లను కేటాయించారు. నీటి పంపిణీని తమిళనాడు మంత్రులు ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. చెన్నై నగరానికి రోజుకు 20 కోట్ల లీటర్లు నీరు అవసరం కాగా ఆ నీటిని అందించే నాలుగు ప్రధాన రిజర్వాయర్లలో నీరు అడుగంటిన సంగతి తెలిసిందే. -
ఆందోళనలో శనగ రైతులు
సాక్షి, బోధన్: శనగ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతల కష్టాలు తప్పడం లేదు. రైతులు అవసరాలు, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలను ఆసరాగా చేసుకున్న దళారులు, వ్యాపారులు శనగలను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి అనేక నిబంధనాలు ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నాఫెడ్ ద్వారా శనగ కొనుగోళ్లు రబీలో పండించిన శనగలను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నాఫెడ్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ మధ్యవర్తిత్వంతో ప్రాథమిక సహాకార సంఘాల ద్వారా కొనుగోలు చేస్తోంది. ప్రభుత్వం మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.4,620గా ప్రకటించింది. కానీ సవాలక్ష నిబంధనలు పెట్టారు. ప్రతి రైతు నుంచి ఎకరానికి 5 క్వింటాళ్ల చొప్పున 20 క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు చేస్తారు. అంతకు మించి కొనుగోలు చేయమని తేల్చి చెప్పారు. వ్యవసాయ శాఖ మాత్రం ఎకరానికి 5 నుంచి 6 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందని అంచనా వేస్తోంది. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్లు, మరికొన్ని ప్రాంతాల్లో 12 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తోందని రైతులంటున్నారు. దీంతో రైతుల నుంచి పూర్తిస్థాయిలో శనగలు కొనే పరిస్థితి లేదు. జిల్లాలో తొమ్మిది కొనుగోలు కేంద్రాలు జిల్లాలో మార్కెట్ కమిటీ నిజామాబాద్, ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘాలు బోధన్, సాలూర, కల్దుర్కి, హున్సా, పోతంగల్, రెంజల్, నీలా, జాకోరాలో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సొసైటీల ద్వారా కొనుగోళ్లు ప్రారంభించింది. ఫిబ్రవరి 22న కేంద్రాలు ప్రారంభించి తొలి విడతలో ఒక్కొక్క కేంద్రానికి నాలుగు వేల క్వింటాళ్లు కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కొన్ని మినహా చాలా సొసైటీల్లో టార్గెట్ ప్రకారం కొనుగోళ్లు పూర్తి చేశారు. నిజామాబాద్, బోధన్ కేంద్రాలకు అదనంగా 500 క్వింటాళ్లు కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. జాకోరా (వర్ని మండలం)కేంద్రంలో ఇప్పటి వరకు కొనుగోళ్లు నమోదు కాలేదు. కొన్ని కేంద్రాల్లో ప్రారంభించిన నాలుగైదు రోజుల్లో లక్ష్యం పూర్తయింది. దీంతో కొనుగోళ్లు నిలిపివేశారు. సాలూర, హున్సా, కల్దుర్కి కేంద్రాల్లో విక్రయానికి తీసుకొచ్చిన శనగ కుప్పల వద్ద రైతులు వారం రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నారు. రెండో విడతకు అనుమతి మళ్లీ రెండో విడత నాలుగు వేల క్వింటాళ్ల శనగ కొనుగోళ్లకు సోసైటీలకు అనుమతి ఇచ్చారు. తొలి విడత టార్గెట్ పూర్తి చేసిన కేంద్రాల్లో కొన్ని చోట్ల కొనుగోళ్లు ప్రారంభించారు. దిగుబడితో పోల్చుకుంటే రెండో విడత కొనుగోళ్లు కూడా కొన్ని సొసైటీల్లో మరో రెండు రోజుల్లో అయిపోయే పరిస్థితి ఉంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయిలో శనగలు కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం ప్రస్తుతం సొసైటీల్లో రెండు విడతల్లో 8 వేల క్వింటాళ్ల చొప్పున కొనుగోలుకు అనుమతి ఉంది. అదనంగా కొనుగోలుకు అనుమతి కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. జిల్లా వ్యాప్తంగా మరో 12 వేల టన్నులు కొనుగోలుకు అనుమతి కావాలని ప్రయత్నాలు చేస్తున్నాం. – ప్రవీణ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ జిల్లా అధికారి -
కేంద్రంపై తమిళనాడు కన్నెర్ర
సాక్షి ప్రతినిధి, చెన్నై: సుప్రీంకోర్టు తీర్పుననుసరించి కావేరీ నదీజలాల మేనేజ్మెంట్ బోర్డును వెంటనే ఏర్పాటుచేయాలన్న డిమాండ్లు తమిళనాడులో వెల్లువెత్తాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, ప్రధాని దిష్టిబొమ్మల దహనంతో తమిళనాడు ప్రజలు కేంద్రంపై తమ ఆగ్రహాన్ని చూపించారు. అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీల ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు మార్చి 30న ముగిసినా కేంద్రం స్పందించకపోవడంతో అన్నాడీఎంకే, ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆందోళనబాట పట్టాయి. చెన్నై, తిరువయ్యూరు, మదురై సహా తమిళనాడువ్యాప్తంగా 600 చోట్ల రాస్తారోకోలు నిర్వహించారు. కోయంబత్తూరు, తిరుచిరాపల్లి, పడుకొట్టాయ్సహా చాలాచోట్ల రైల్‌రోకో చేపట్టారు. కోయంబత్తూరులో ఇద్దరు డీఎంకే కార్యకర్తలు కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతికి ప్రయత్నించారు. తమిళనాడు విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరు కోర్టు ప్రాంగణంలో లాయర్లు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో పోలీసులు దాదాపు 1,000 మందిని అదుపులోకి తీసుకుని గొడవలు సద్దుమణిగాక వదిలేశారు. మంగళవారం రాష్ట్రబంద్‌కు రైతు సంఘాలు, వాణిజ్య సంఘాలు పిలుపునిచ్చాయి. కాగా, డీఎంకే నేతృత్వంలోని విపక్షపార్టీలు ఏప్రిల్ 5న బంద్ నిర్వహించనున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఒత్తిడి తేకుండా అన్నాడీఎంకే ప్రభుత్వం తమిళుల హక్కులను కాలరాస్తోందని డీఎంకే ఆరోపించింది. అన్నాడీఎంకే ఎంపీ రాజీనామా, ఉససంహరణ కావేరీ అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటులో కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యులు ముత్తుకరుప్పన్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. అయితే, సీఎం పళనిస్వామి ఆదేశాలతో తన రాజీనామాను ముత్తుకరుప్పన్ ఉపసంహరించుకున్నారు. మరోవైపు, కావేరీ వాటర్ బోర్డు త్వరగా ఏర్పాటుచేయాలని కోరుతూ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కావేరి అంశంపై మంగళవారం అన్నాడీఎంకే రాష్ట్రవ్యాప్త నిరాహారదీక్షలు చేపట్టనుంది. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, మంత్రులు ఈ దీక్షల్లో పాల్గొననున్నారు. కోర్టు ధిక్కార కేసు వింటాం: సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించని కేంద్రంపై తమిళనాడు దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఏప్రిల్ 9న ఈ కేసు విచారణకు రానుంది. నిరసనల నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ పురోహిత్ ఢిల్లీకి వెళ్లారు. -
పట్టా చేయడం లేదని రైతు ఆత్మహత్యాయత్నం
* తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఘటన * పట్టాదారు పాస్ పుస్తకం జారీలో వీఆర్వో నిర్లక్ష్యంతో ఆవేదన * వీఆర్వోకు రూ.20 వేలు లంచం ఇచ్చానన్న బాధితుడు స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : తన తాత నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని తన పేరిట పట్టా చేయాలని రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోకపోవడంతో ఓ రైతు ఆవేదన చెందాడు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహించి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం జరిగింది. బాధితుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని కొండాపూర్‌కు చెందిన వనమాల రాజు తన తాత వనమాల భద్రయ్య పేరిట సర్వే నంబర్ 229/ఏలో ఉన్న వ్యవసాయ భూమిని తన పేరిట పట్టా చేయాలని ఏడాది కాలంగా వీఆర్వో చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో కొండాపూర్ వీఆ ర్వో రామకృష్ణ రూ.20 వేలు లంచం అడగగా భార్య పుస్తెల తాడు అమ్మి ముట్టజెప్పాడు. అయినా అతడు రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తుండటంతో విసుగు చెందిన రాజు ఇటీవల తహసీల్దార్ రామ్మూర్తిని సంప్రదించాడు. కొద్దిరోజుల్లో పని పూర్తిచేస్తానని ఆయన హామీ ఇవ్వడంతో రాజు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగసాగాడు. అయితే ఆ తర్వాత తహసీల్దార్ కూడా పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన బాధితుడు బుధవారం సాయంత్రం తన తండ్రి సోమయ్యతో కలిసి వచ్చి తహసీల్దార్, వీఆర్వోను కలిశాడు. రోజూ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని, అసలు మీ పేరిట పట్టా కాదు.. దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ వీఆర్వో రామకృష్ణ వారిపై మండిపడడంతో రాజు మనోవేదనకు గురయ్యాడు. తీవ్ర మనోవేదనకు గురై వెంట తెచ్చుకున్న క్రిమిసంహార మందు తాగాడు. అక్కడే ఉన్న విద్యార్థి సంఘం నాయకుడు బానోతు సునీల్‌నాయక్‌తోపాటు స్థానికులు అతడి దగ్గర మందు డబ్బా లాగి పారేశారు. పక్కనే ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా సిబ్బం ది ప్రాథమిక చికిత్స చేశారు. సుమారు గంటపాటు ఆస్పత్రిలో బాధితుడు అవస్థ పడుతున్నా డాక్టర్లు రాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం సొంతగ్రామంలో దుస్థితిపై మండిపడ్డారు. అనంతరం 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా తన కుమారుడికి ఏం జరిగినా రెవెన్యూ అధికారులే బాధ్యత వహించాలని, వీఆర్వో వేధింపులతోనే పురుగులమందు తాగాడని బాధితుడి తండ్రి వాపోయారు. విచారణ చేపడతాం : తహసీల్దార్ రామ్మూర్తి ఈ విషయమై తహసీల్దార్‌ను వివరణ కోరగా పట్టాదారు భద్రయ్యకు ఆరుగురు కుమారులు కాగా మూడో కుమారుడు సోమయ్యకు ఇద్దరు కొడుకులున్నారని తెలిపారు. సోమయ్య పెద్ద కుమారుడు రాజు తాత పేరిట ఉన్న 2.38 ఎకరాలను తన పేరిట పట్టా చేయాలని జూలై 19, 2014న అఫిడవిట్‌తో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. రాజు తనని సంప్రదించగా ‘నీ పేరిట పట్టా చేయడం వీలుకాదని, నీ తండ్రి సోమయ్య పేరిట చేస్తామని’ చెప్పినట్లు తెలిపారు. తర్వాత గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ద్వారా రాజు పేరిట చేసుకోవచ్చని చెప్పామన్నారు. కానీ క్షణికావేశానికి గురై ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు. వీఆర్వోకు లంచం ఇచ్చిన విషయం తనతో చెప్పలేదని, విచారణ చేపట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.