పట్టా చేయడం లేదని రైతు ఆత్మహత్యాయత్నం
* తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఘటన
* పట్టాదారు పాస్ పుస్తకం జారీలో వీఆర్వో నిర్లక్ష్యంతో ఆవేదన
* వీఆర్వోకు రూ.20 వేలు లంచం ఇచ్చానన్న బాధితుడు
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : తన తాత నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని తన పేరిట పట్టా చేయాలని రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోకపోవడంతో ఓ రైతు ఆవేదన చెందాడు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహించి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం జరిగింది.
బాధితుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని కొండాపూర్‌కు చెందిన వనమాల రాజు తన తాత వనమాల భద్రయ్య పేరిట సర్వే నంబర్ 229/ఏలో ఉన్న వ్యవసాయ భూమిని తన పేరిట పట్టా చేయాలని ఏడాది కాలంగా వీఆర్వో చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో కొండాపూర్ వీఆ ర్వో రామకృష్ణ రూ.20 వేలు లంచం అడగగా భార్య పుస్తెల తాడు అమ్మి ముట్టజెప్పాడు.
అయినా అతడు రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తుండటంతో విసుగు చెందిన రాజు ఇటీవల తహసీల్దార్ రామ్మూర్తిని సంప్రదించాడు. కొద్దిరోజుల్లో పని పూర్తిచేస్తానని ఆయన హామీ ఇవ్వడంతో రాజు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగసాగాడు. అయితే ఆ తర్వాత తహసీల్దార్ కూడా పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన బాధితుడు బుధవారం సాయంత్రం తన తండ్రి సోమయ్యతో కలిసి వచ్చి తహసీల్దార్, వీఆర్వోను కలిశాడు.
రోజూ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని, అసలు మీ పేరిట పట్టా కాదు.. దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ వీఆర్వో రామకృష్ణ వారిపై మండిపడడంతో రాజు మనోవేదనకు గురయ్యాడు. తీవ్ర మనోవేదనకు గురై వెంట తెచ్చుకున్న క్రిమిసంహార మందు తాగాడు. అక్కడే ఉన్న విద్యార్థి సంఘం నాయకుడు బానోతు సునీల్‌నాయక్‌తోపాటు స్థానికులు అతడి దగ్గర మందు డబ్బా లాగి పారేశారు. పక్కనే ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా సిబ్బం ది ప్రాథమిక చికిత్స చేశారు.
సుమారు గంటపాటు ఆస్పత్రిలో బాధితుడు అవస్థ పడుతున్నా డాక్టర్లు రాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం సొంతగ్రామంలో దుస్థితిపై మండిపడ్డారు. అనంతరం 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా తన కుమారుడికి ఏం జరిగినా రెవెన్యూ అధికారులే బాధ్యత వహించాలని, వీఆర్వో వేధింపులతోనే పురుగులమందు తాగాడని బాధితుడి తండ్రి వాపోయారు.
విచారణ చేపడతాం : తహసీల్దార్ రామ్మూర్తి
ఈ విషయమై తహసీల్దార్‌ను వివరణ కోరగా పట్టాదారు భద్రయ్యకు ఆరుగురు కుమారులు కాగా మూడో కుమారుడు సోమయ్యకు ఇద్దరు కొడుకులున్నారని తెలిపారు. సోమయ్య పెద్ద కుమారుడు రాజు తాత పేరిట ఉన్న 2.38 ఎకరాలను తన పేరిట పట్టా చేయాలని జూలై 19, 2014న అఫిడవిట్‌తో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
రాజు తనని సంప్రదించగా ‘నీ పేరిట పట్టా చేయడం వీలుకాదని, నీ తండ్రి సోమయ్య పేరిట చేస్తామని’ చెప్పినట్లు తెలిపారు. తర్వాత గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ద్వారా రాజు పేరిట చేసుకోవచ్చని చెప్పామన్నారు. కానీ క్షణికావేశానికి గురై ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు. వీఆర్వోకు లంచం ఇచ్చిన విషయం తనతో చెప్పలేదని, విచారణ చేపట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.