న్యూఢిల్లీ: దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసిందని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సగటున 9 శాతం లోటు వర్షపాతం నమోదయిందని వెల్లడించింది. బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రమైన లోటు వర్షపాతం రికార్డయిందని పేర్కొంది. గతేడాదిలాగే ఈ సంవత్సరం కూడా నైరుతి రుతుపవనాలతో సగటు కన్నా తక్కువ వర్షమే కురిసిందని తెలిపింది. అనుకున్నదాని కంటే మూడు రోజులు ముందుగా కేరళలో మే 28న నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. శనివారం నుంచి వీటి నిష్క్రమణ ప్రారంభమైంది.
నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయినప్పటికీ దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో అక్టోబర్ మొదటి వారంలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈసారి నైరుతి రుతుపననాల ప్రభావంతో దేశవ్యాప్తంగా 91 శాతం వర్షపాతం నమోదయిందనీ, ఇది అంచనా వేసిన దానికంటే తక్కువేనని వెల్లడించింది. తూర్పు, ఈశాన్య భారతంలో అత్యధిక లోటు వర్షపాతం నమోదుకాగా, సెంట్రల్ ఇండియా, వాయవ్య రాష్ట్రాలు లోటు వర్షపాతంలో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. నైరుతి రుతుపవనాల కారణంగా జూన్ నెలలో 95 శాతం, జూలైలో 94 శాతం, ఆగస్టులో 92 శాతం వర్షపాతం సంభవించింది. ఇక సెప్టెంబర్‌లో అయితే వర్షపాతం ఏకంగా 76 శాతానికి పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment