సాక్షి, ముంబై: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువ కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో నగర పాలక సంస్థ(బీఎంసీ) అప్రమత్తమైంది. అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా కృత్రిమ వర్షం వైపు దృష్టిసారించింది. నగరంలో సుమారు కోటిన్నర జనాభా ఉంది. వీరందరికి ప్రతిరోజూ దాదాపు 450 ఎమ్మెల్డీల నీరు అవసరముంటుంది. ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలున్నాయనే హెచ్చరికల నేపథ్యంలో ఉన్న జలాలను సద్వినియోగం చేసుకోవడంతోపాటు ప్రత్యామ్నాయాలపై బీఎంసీ దృష్టిపెట్టింది. నగరానికి నీటిని సరఫరా చేస్తున్న ఏడు జలాశయాల్లో మూడు నెలలకు సరిపడేంత నీరు మాత్రమే నిల్వ ఉంది.
ఒకవేళ సమయానికి అనుకున్నంత మేర వర్షాలు కురవకపోతే పరిస్థితిని ఎలా గట్టెక్కాలనే ఆలోచన నేపథ్యంలో బీఎంసీ ఈ కృత్రిమ వర్షాలవైపు మొగ్గు చూపుతున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. మేఘమథనం చేసి, కృత్రిమ వర్షాలను కురిపించే ప్రక్రియ భారీ వ్యయం, రిస్క్‌తో కూడుకున్నది కావడంతో పరిపాలన విభాగం తుది నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే నిపుణులతో కూడా చర్చించినట్లు సమాచారం. 2009లో వర్షాలు ముఖం చాటేయడంతో భాత్సా, అప్పర్ వైతర్ణ జలాశయాల ప్రాంతాల్లో కత్రిమ వర్షాల కోసం ప్రయత్నాలు చేశారు.
కాని ఈ ప్రయోగం ఊహించిన స్థాయిలో సఫలీకృతం కాలేకపోయింది. కృత్రిమ వర్షం కోసం వినియోగించిన విమానాలు సరిగా పనిచేయకపోవడం, రాడార్ కారణంగా 160 సార్లు మేఘాలపై రసాయనాలు పిచికారి చేసినప్పటికీ చెదురుమదురు జల్లులు మినహా పెద్ద వర్షాలేవీ కురవలేదు. అయితే అదృష్టం బాగుండి ఆ తరువాత వర్షాలు కురవడంతో అప్పట్లో నీటి కొరత సమస్య పరిష్కారమైంది. గత మూడు సంవత్సరాల నుంచి సాధారణస్థాయిలో వర్షాలు కురవడంతో కృత్రిమ వర్షాల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం బీఎంసీకి రాలేదు. కాని ఈ ఏడాది వర్షాపాతం కొంత తక్కువ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించడంతో బీఎంసీ అప్రమత్తమైంది. భవిష్యత్తులో నీటి కొరత సమస్య తెరమీదకు రాకుండా జాగ్రత్త పడుతోంది. గత సంవత్సరం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు లేక కరవు తాండవించింది. అనేక పశువులు మృత్యువాత పడ్డాయి. గ్రామాలకు గ్రామాలే వలసలు పోయాయి.
కాని ముంైబె నగరానికినీటిని సరఫరాచేసే జలాశయాల పరిధిలో మాత్రం పుష్కలంగా వర్షాలు కురవడంతో కరవు ప్రభావం ముంబైకర్లపై పెద్దగా కనిపించలేదు. జలాశయాల్లో నీటి నిల్వలను బట్టి బీఎంసీ ముందు జాగ్రత్త చర్యలు చేపడుతుంది. ఆ ప్రకారం ఏటా వర్షాకాలానికి కొద్ది రోజుల ముందు నుంచి నగర ప్రజలకు 10-15 శాతం వరకు నీటి కోత అమలు చేస్తుంది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు 25 శాతం కోత విధిస్తుంది. కాని ఈ సారి వాతావరణ శాఖ చాలా రోజుల ముందే హెచ్చరికలు జారీ చేయడంతో కోతలు కూడా భారీగానే ఉండే అవకాశముందని బీఎంసీ అధికారులు చెబుతున్నారు.
కృత్రిమ వర్షాలవైపు బీఎంసీ చూపు
Published Tue, Apr 29 2014 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM
Advertisement
Advertisement