Artificial rains
-
నవంబర్‌లో ఢిల్లీలో కృత్రిమ వర్షాలు.. ఎందుకంటే?
న్యూఢిల్లీ: దేశ రాజధానిని ప్రతిఏటా ఇబ్బంది పెట్టే విషయం వాయు కాలుష్టం. అక్టోబర్ చివరి నుంచే వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా రైతులు పంటల వ్యర్థాలు తగలబెట్టడానికి తోడు, చలికాలం కావడంతో దట్టమైన పొగ మంచు కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తుంది. దీన్ని కట్టడి చేసేందుకు ఆప్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈసారి కూడా వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది.నవంబర్‌లో వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉండటంతో నగరంలో కృత్రిమ వర్షం కురిపించేందుకు సిద్ధమైంది.నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు రాజధాని ప్రాంతంలో కృత్రిమ వర్షం కురిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం పేర్కొన్నారు. ఈ మేరకు కృత్రిమ వర్షాలు కురిపించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర పర్యావరణ మంత్రికి లేఖ రాసినట్లు చెప్పారు. కేంద్ర సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.చలికాలంలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోడానికి 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను మంత్రి విడుదల చేశారు. 2016 – 2023 మధ్య రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం 34.6 శాతం తగ్గిందని మంత్రి తెలిపారు. గడిచిన నాలుగేళ్లలో నగరంలో రెండు కోట్ల చెట్లను నాటామని, దీని ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించగలిగామని చెప్పారు. డ్రోన్ల ద్వారా కాలుష్య హాట్‌స్పాట్ ప్రాంతాలను రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో కాలుష్యాన్ని పర్యవేక్షించేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ, రవాణా మంత్రిత్వ శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ దిల్లీ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిబ్బందితో సహా 86 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. -
కృత్రిమ వర్షాలు.. వరమా? శాపమా ?
హార్ప్ : హై ఇంటెన్సిటీ ఆక్టివ్ ఆరోరల్ రీసెర్చ్ ప్రోగ్రాం : ఇది మానవ కల్యాణానికి ఉద్దేశించిన కార్యక్రమం అని ఒక పక్క ప్రచారం . 2018 సంవత్సరం రాజ్య సభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆనాటి మంత్రి అనిల్ మాధవ్ దవే దీన్ని అమెరికా చేతిలోని ఆయుధంగా అభివర్ణించారెందుకని ? దీని వల్ల భూతాపం పెరుగుతుందని మన దేశంలో గోధుమ, మొక్కజొన్న లాంటి పంటల దిగుమతి తగ్గనుందని ఆయన తన లిఖిత పూర్వక సమాధానములో చెప్పారెందుకని? మాటల్లో తప్పులు దొర్లే అవకాశం ఉంది. కానీ లిఖిత పూర్వక సమాధానమంటే, సీనియర్ అధికారులు అన్ని చెక్ చేశాకే రాస్తారు. మరో విషయం అనిల్ దవే మరణం. దానిపై విచారణ జరగాలని అయన మిత్రుడు తపన్ భట్టాచార్య మధ్య ప్రదేశ్ హై కోర్ట్‌ను ఆశ్రయించిన మాట నిజం కాదా? ప్రయోగాల పేరుతొ ఆయనొస్పీర్ లో మార్పులు తెస్తే వాటి దీర్ఘ కాలిక పరిణామాలు ఎలా ఉంటాయి ? SAI అంటే ఏంటి ? స్ట్రాటోస్పీరిక్ ఏరోసోల్ ఇంజక్షన్ . SRM అంటే సోలార్ రేడియేషన్ మానేజ్మెంట్ . భూతాపాన్ని తగ్గించడం కోసం అంటే భూమిని లేదా వాతావరణాన్ని చల్లబరచడం కోసం సల్ఫర్ డయాక్సైడ్, కాల్షియమ్ కార్బోనేట్, ఉప్పు లాంటి వాటిని విమానాల ద్వారా వాతావరణ పై పొరల్లో చల్లడం ద్వారా చల్లడం . అగ్నిపర్వతాలు బద్దలయినప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతుంది . దాని ప్రభావం తో సూర్య కిరణాలు భూమిని చేరకుండా వాతారణం కొన్ని రోజుల పాటు చల్లబడడం నిజమే . కానీ దాన్ని పట్టుకొని SAI, SRM లాంటి కార్యక్రమాలు చేబడితే రోగనికన్నా మందు ఎక్కువ కీడు చేస్తుంది అని శాస్త్రవేత్తలు హెచ్చరించిన మాట నిజం కదా ? ఏరోసోల్ ఇంజెక్క్షన్ ఏంటి ? దీని పై అంతర్జాతీయ నియంత్రణ ఏది ? వాతారణం తో ఆటలా ? కార్బన్ శాతాన్ని తగ్గించడం ద్వారా ఉష్ణోగ్రతలు తగ్గించడం అవసరం . కానీ మీరు వేసే ఈ వాతావరణ ఇంజెక్షన్ వల్ల కరోనా వాక్ సీన్ లా మంచి కన్నా చెడు ఎక్కువ జరగదు అని గ్యారెంటీ ఏంటి గాంలిన్ 1 : ఏంటిది ? చైనా చేపట్టిన కృత్రిమ వర్ష కార్యక్రమం. తమ దేశానికి చెందిన యాభై అయిదు లక్షల చదరపు కిలోమీటర్ ల ప్రాంతం లో కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ఉద్దేశించింది . దాదాపుగా 15 ఏళ్ళ క్రితమే ఈ టెక్నాలజీ ని వాడి బీజింగ్ ఒలింపిక్స్ ముందుగా తమ స్టేడియం లు ఎంత పటిష్టంగా ఉన్నాయో చెక్ చేసుకోవడానికి కృత్రిమ వానలు కురిపించిందని చెబుతారు. ఇండో చైనా సరిహద్దు .. మొత్తం కొండల ప్రాంతం . దీని పై చైనా ఎప్పుడో కన్ను వేసింది . ఆ ప్రాంతం లో ప్రజలను ఖాళీ చేయించి మెల్లగా వాటిని ఆక్రమించడానికి చైనా తన టెక్నాలజీతో భారీ స్థాయిలో కృత్రిమ వర్షాలు కురిపిస్తోంది అని జూన్ నెల్లోనే విశ్వ భారతి అనే పత్రిక ఆర్టికల్ ను ప్రచురించింది . ఇంతకీ వాతావరణ తారుమారు అనే కుట్ర జరుగుతోందా ? మామూలుగా అయితే నేను నమ్మేవాడిని కాను . కానీ వాక్ సీన్ విషయం లో జరిగిన మాయలు చూసి ఇక్కడ కూడా ఏదో జరుగుతోంది అని అనుమానిస్తున్నా. దీని పై చర్చ జరగాలి . మన దేశానికి చెందిన రా , ఐబి లాంటి సంస్థలు దీని పై నిఘా పెట్టి వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలి. - అమర్నాద్ వాసిరెడ్డి ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు -
డ్రోన్లతో మేఘాలకు ఎలక్ట్రిక్ షాక్..! కట్ చేస్తే..
దుబాయ్: మానవుడు తన మేధస్సుతో అనేక సమస్యలకు పరిష్కారాలను కనుగొంటున్నాడు. అతి తక్కువ వర్షపాతంను అధిగమించడం కోసం క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీనుపయోగించి కృత్రిమ వర్షాలు పడేలా చేస్తున్నాడు. క్లౌడ్ సీడింగ్‌తో పోలిస్తే.. మరింత తక్కువ ఖర్చుతో కృత్రిమ వర్షపాతం నమోదయ్యేలా శాస్త్రవేత్తలు మరో ఆవిష్కరణను రూపొందించారు. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి ఏడారి దేశాల్లో వీపరితమైన ఎండలు, గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగేలా కృత్రిమ వర్షపాతం నమోదయ్యేలా కొత్త ఆవిష్కరణకు శాస్త్రవేత్తలు పురుడుపోశారు. డ్రోన్లతో మేఘాలను విద్యుత్ ఆవేశానికి గురిచేసి కృత్రిమంగా వర్షాలు కురిసేలా శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం విజయవంతమైంది. దుబాయ్‌లో తాజాగా ఈ టెక్నాలజీనుపయోగించి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలను అధిగమించి కృత్రిమ వర్షం పడేలా శాస్త్రవేత్తలు చేశారు. దుబాయ్‌లో ఒక హైవేపై కృత్రిమ వర్షం పడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. క్లౌడ్ సీడింగ్ పోలిస్తే... సాధారణంగా క్లౌడ్ సీడింగ్ పద్దతిలో సిల్వర్ అయోడైడ్ లాంటి రసాయనాలను మేఘాల్లోకి విస్తరింపజేయడంతో కృత్రిమ వర్షపాతాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తారు. క్లౌడ్ సీడింగ్ పద్దతిను 1940లోనే కనుగొన్నారు. అనేక దేశాలు ఈ పద్దతినుపయోగించి ఇప్పటికే కృత్రిమ వర్షాలు నమోదుచేస్తున్నాయి.ఈ ప్రక్రియను చేయడానికి సాధారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌లను క్యారియర్లుగా ఉపయోగిస్తారు. యూఏఈ శాస్త్రవేత్తలు ఈ పద్దతికి బదులుగా కొత్త టెక్నాలజీను అభివృద్ధి చేశారు. మేఘాల్లోకి డ్రోన్ల సహయంతో ఎలక్ట్రిక్ ఛార్జ్‌ను విడుదల చేయడంతో వర్షం పడేలా మేఘాలను ప్రేరేపిస్తుంది. ఇతర క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ పోలిస్తే డ్రోన్లనుపయోగించి మేఘాలను ఎలక్ట్రిక్ ఛార్జ్ చేయడంతో కృత్రిమ వర్షపాతం కురిసేలా చేయడం మరింత సులువుకానుందని యూఏఈ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. డ్రోన్ల ఉపయోగం దుబాయ్‌లోనే కాదు...! డ్రోన్లనుపయోగించి కేవలం దుబాయ్‌లో కృత్రిమ వర్షాలు చేస్తున్నారంటే పొరపడినట్లే.. అమెరికాలోని ఎనిమిది రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందండం కోసం డ్రోన్ల సహాయంతో సిల్వర్ అయోడైడ్ రసాయనాలను మేఘాలపై విస్తరింపజేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో కృత్రిమ వర్షపాతం నమోదవుతుంది. منطقة النصلة #رأس_الخيمة #المركز_الوطني_للأرصاد #أمطار_الخير #أصدقاء_المركز_الوطني_للأرصاد #حالة_الطقس #حالة_جوية #هواة_الطقس #جمعة_القايدي #عواصف_الشمال pic.twitter.com/ZmoveP4OA7 — المركز الوطني للأرصاد (@NCMS_media) July 20, 2021 -
మేఘాలను మథిస్తారా?
కర్ణాటక, హుబ్లీ: రాష్ట్రంలో, ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలోని తీవ్ర వర్షాభావం నెలకొంది. కృష్ణమ్మ ఉప్పొంగుతున్నా, చినుకులేక రైతన్న కుంగిపోతున్నాడు. ఈ తరుణంలో కృత్రిమ వర్షాల కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందుకోసం ఒక చిన్న విమానం హుబ్లీ విమానాశ్రయానికి వచ్చి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం వర్షధారె పథకానికి ఒకటి, రెండు రోజుల్లో శ్రీకారం చుట్టనుంది. జూన్‌లో వర్షాలు కురవని సమయంలో మేఘ మథనం కోసం విమానం వచ్చి ఉంటే బాగుండేది. అయితే ప్రస్తుతం వర్షాలు ఓ మోస్తరుగా కురుస్తున్న వేళ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారా? అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. గత ఏడాది కూడా వర్షాలు పడుతున్నప్పుడు హుబ్లీ విమానాశ్రయం కేంద్రంగా మేఘమథనాన్ని ప్రారంభించారు. గత కుమారస్వామి ప్రభుత్వ హయాంలో గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ రూ.45 కోట్ల వ్యయంతో వర్షధారె పేరిట మేఘమథనాన్ని నిర్వహించింది. బీదర్‌ను కాదని హుబ్లీ నుంచి.. బీదర్‌లో వాయుసేన విమానాశ్రయం ఉంది. మేఘమథనం కార్యాచరణను అక్కడి నుంచే నిర్వహించడం సులభమే అయితే హుబ్లీ విమానాశ్రయాన్ని ఎంపిక చేసుకోవడంపై అనుమానాలు తలెత్తాయి. సురపురలో రాడార్ కేంద్రం ఉంది. ఆ ప్రాంతంలో అక్కడి నుంచే సిగ్నల్ పొందడానికి బదులుగా గదగ్ సమీపంలోని హులకోటి కేంద్రం నుంచి సిగ్నల్‌ను పొందాలని యోచించారు. ఇక్కడి నుంచి విమానం యాదగిరి ప్రాంతానికి వెళ్లేలోపు మేఘాలు మాయమైపోతే ఎలాగనే ప్రశ్నలున్నాయి. ఖ్యాతి సంస్థ చైర్మన్ ప్రకాశ్ కోళివాడ కాంగ్రెస్ ప్రముఖ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ రాణిబెన్నూరుకు చెందిన కేబీ కోళివాడ పుత్రుడు కావడంతో ఆయనకే ఆగమేఘాలపై కాంట్రాక్టు కట్టబెట్టినట్లు విమర్శలున్నాయి. రూ.45 కోట్ల లెక్కను తేల్చేవారెవరు? ఎంత మేర సిల్వర్ అయోడైడ్ వాడారు, ఎంత ప్రమాణంలో వర్షం వచ్చింది అన్న దానిపై కాంట్రాక్టర్లు, ప్రభుత్వ అధికారులు చెప్పిందే లెక్క. వర్షధారె పథకానికి రూ.45 కోట్లను కేటాయించారు. వరుణుడు కరుణించకపోయినా ఈసారి పూర్తిగా రూ.45 కోట్లను కృత్రిమ వర్షాలకు ఖర్చుపెట్టడం ఖాయమన్న విమర్శలు వినబడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కృత్రిమ వర్షాల ఫలితాలపై చాలా అనుమానాలు తలెత్తాయి. రాడార్ గుర్తిస్తుంది, విమానం వెళ్తుంది రాడార్ కేంద్రంలో ఆర్డీపీఆర్, ఐఐఎం, ఐఐటీ శాస్త్రవేత్తలు, నిపుణుల బృందం మేఘాల అధ్యయనం చేస్తారు. రాడార్ సుమారు 200 కిలోమీటర్ల వరకు గల మేఘాలను అధ్యయనం చేస్తుంది. తేమ శాతం గల ఫలవంతమైన మేఘాలను గుర్తించి పైలెట్లకు సూచిస్తుంది. పైలెట్లు విమానం ద్వారా ఆ మేఘాలపై సిల్వర్ అయోడైడ్ ద్రావణంను చల్లుతారు. అప్పుడు మేఘాలు ద్రవరూపం దాల్చి వర్షం కురుస్తుంది. నిపుణులు వర్షనమూనాలను పరిశీలించి ఈ వర్షం సిల్వర్ అయోడైడ్ వల్లనే కురిసిందా, లేదా అనేది నివేదిక ఇస్తారు. అమెరికా నుంచి విమానాల రాక ఖ్యాతి క్లైమేట్ మాడిఫికేషన్ కంపెనీకి మేఘమథనం బాధ్యతలను అప్పగించారు. ఆ మేరకు అమెరికా నుంచి రెండు ప్రత్యేక విమానాలు వచ్చాయి. జూలై 25న మైసూరులో కృత్రిమ వర్షాలకు శ్రీకారం చుట్టారు. కాగా హుబ్లీ విమానాశ్రయానికి ఓ ప్రత్యేక విమానం వచ్చింది. బెంగళూరు, గదగ్, సురపురలలో మూడు రాడార్ కేంద్రాలున్నాయి. గదగ్ రాడార్ కేంద్రం శాస్త్రవేత్తల మార్గదర్శనం ప్రకారం పైలెట్లు ఉత్తర కర్ణాటకలోని విజయపుర, బాగల్కోటె, రాయచూరు, యాదగిరి, బీదర్, కొప్పళ, ధార్వాడ, గదగ్, హావేరి తదితర జిల్లాల పరిధిలో మేఘమథనం జరుగుతుందని వర్షధారె పథకం నోడల్ ఆఫీసర్ డాక్టర్ చిదానందమూర్తి తెలిపారు. హైదరాబాద్ కర్ణాటక జిల్లాల్లో వర్షపాతం తగ్గింది. రాయచూరు, కలబుర్గి, యాదగిరి జిల్లాల్లో కొన్ని చోట్ల సరైన వర్షాలు లేనేలేవు. -
కృత్రిమ వర్షాలవైపు బీఎంసీ చూపు
సాక్షి, ముంబై: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువ కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో నగర పాలక సంస్థ(బీఎంసీ) అప్రమత్తమైంది. అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా కృత్రిమ వర్షం వైపు దృష్టిసారించింది. నగరంలో సుమారు కోటిన్నర జనాభా ఉంది. వీరందరికి ప్రతిరోజూ దాదాపు 450 ఎమ్మెల్డీల నీరు అవసరముంటుంది. ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలున్నాయనే హెచ్చరికల నేపథ్యంలో ఉన్న జలాలను సద్వినియోగం చేసుకోవడంతోపాటు ప్రత్యామ్నాయాలపై బీఎంసీ దృష్టిపెట్టింది. నగరానికి నీటిని సరఫరా చేస్తున్న ఏడు జలాశయాల్లో మూడు నెలలకు సరిపడేంత నీరు మాత్రమే నిల్వ ఉంది. ఒకవేళ సమయానికి అనుకున్నంత మేర వర్షాలు కురవకపోతే పరిస్థితిని ఎలా గట్టెక్కాలనే ఆలోచన నేపథ్యంలో బీఎంసీ ఈ కృత్రిమ వర్షాలవైపు మొగ్గు చూపుతున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. మేఘమథనం చేసి, కృత్రిమ వర్షాలను కురిపించే ప్రక్రియ భారీ వ్యయం, రిస్క్‌తో కూడుకున్నది కావడంతో పరిపాలన విభాగం తుది నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే నిపుణులతో కూడా చర్చించినట్లు సమాచారం. 2009లో వర్షాలు ముఖం చాటేయడంతో భాత్సా, అప్పర్ వైతర్ణ జలాశయాల ప్రాంతాల్లో కత్రిమ వర్షాల కోసం ప్రయత్నాలు చేశారు. కాని ఈ ప్రయోగం ఊహించిన స్థాయిలో సఫలీకృతం కాలేకపోయింది. కృత్రిమ వర్షం కోసం వినియోగించిన విమానాలు సరిగా పనిచేయకపోవడం, రాడార్ కారణంగా 160 సార్లు మేఘాలపై రసాయనాలు పిచికారి చేసినప్పటికీ చెదురుమదురు జల్లులు మినహా పెద్ద వర్షాలేవీ కురవలేదు. అయితే అదృష్టం బాగుండి ఆ తరువాత వర్షాలు కురవడంతో అప్పట్లో నీటి కొరత సమస్య పరిష్కారమైంది. గత మూడు సంవత్సరాల నుంచి సాధారణస్థాయిలో వర్షాలు కురవడంతో కృత్రిమ వర్షాల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం బీఎంసీకి రాలేదు. కాని ఈ ఏడాది వర్షాపాతం కొంత తక్కువ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించడంతో బీఎంసీ అప్రమత్తమైంది. భవిష్యత్తులో నీటి కొరత సమస్య తెరమీదకు రాకుండా జాగ్రత్త పడుతోంది. గత సంవత్సరం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు లేక కరవు తాండవించింది. అనేక పశువులు మృత్యువాత పడ్డాయి. గ్రామాలకు గ్రామాలే వలసలు పోయాయి. కాని ముంైబె నగరానికినీటిని సరఫరాచేసే జలాశయాల పరిధిలో మాత్రం పుష్కలంగా వర్షాలు కురవడంతో కరవు ప్రభావం ముంబైకర్లపై పెద్దగా కనిపించలేదు. జలాశయాల్లో నీటి నిల్వలను బట్టి బీఎంసీ ముందు జాగ్రత్త చర్యలు చేపడుతుంది. ఆ ప్రకారం ఏటా వర్షాకాలానికి కొద్ది రోజుల ముందు నుంచి నగర ప్రజలకు 10-15 శాతం వరకు నీటి కోత అమలు చేస్తుంది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు 25 శాతం కోత విధిస్తుంది. కాని ఈ సారి వాతావరణ శాఖ చాలా రోజుల ముందే హెచ్చరికలు జారీ చేయడంతో కోతలు కూడా భారీగానే ఉండే అవకాశముందని బీఎంసీ అధికారులు చెబుతున్నారు.