నవంబర్‌లో ఢిల్లీలో కృత్రిమ వర్షాలు.. ఎందుకంటే? | Delhi prepares for artificial rain in November, pollution expected to peak | Sakshi
Sakshi News home page

నవంబర్‌ నెలలో ఢిల్లీలో కృత్రిమ వర్షాలు.. ఎందుకంటే?

Published Wed, Sep 25 2024 3:22 PM | Last Updated on Wed, Sep 25 2024 3:50 PM

Delhi prepares for artificial rain in November, pollution expected to peak

న్యూఢిల్లీ: దేశ రాజధానిని ప్రతిఏటా ఇబ్బంది పెట్టే విషయం వాయు కాలుష్టం. అక్టోబర్‌ చివరి నుంచే వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్‌, హర్యానా రైతులు పంటల వ్యర్థాలు తగలబెట్టడానికి తోడు, చలికాలం కావడంతో దట్టమైన పొగ మంచు కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తుంది. 

దీన్ని కట్టడి చేసేందుకు ఆప్‌ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈసారి కూడా వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది.నవంబర్‌లో వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉండటంతో నగరంలో కృత్రిమ వర్షం  కురిపించేందుకు సిద్ధమైంది.

నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు రాజధాని ప్రాంతంలో కృత్రిమ వర్షం కురిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌ రాయ్‌ బుధవారం పేర్కొన్నారు.  ఈ మేరకు కృత్రిమ వర్షాలు కురిపించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర పర్యావరణ మంత్రికి లేఖ రాసినట్లు చెప్పారు. కేంద్ర సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.

చలికాలంలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోడానికి 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను మంత్రి విడుదల చేశారు. 2016 – 2023 మధ్య రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం 34.6 శాతం తగ్గిందని మంత్రి తెలిపారు. గడిచిన నాలుగేళ్లలో నగరంలో రెండు కోట్ల చెట్లను నాటామని, దీని ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించగలిగామని చెప్పారు. డ్రోన్ల ద్వారా కాలుష్య హాట్‌స్పాట్ ప్రాంతాలను రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తామన్నారు. 

రాజధాని ప్రాంతంలో కాలుష్యాన్ని పర్యవేక్షించేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ, రవాణా మంత్రిత్వ శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ దిల్లీ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ సిబ్బందితో సహా 86 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement