లానినో ఎఫెక్ట్.. తగ్గిన ఎండలు
రెండు, మూడు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం
వారం రోజులుగా పలుచోట్ల వర్షాలు
నెలాఖరు నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం:ఎల్‌నినో ప్రభావం తగ్గి.. లానినో పరిస్థితులు ఏర్పడడంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గిపోయింది. అక్కడక్కడా వర్షాలు కురుస్తుండడంతో వాతావరణం చల్లబడింది. ఆగస్టు నుంచి ఏప్రిల్ వరకు ఎల్‌నినో కొనసాగింది. ఏప్రిల్ నుంచి తగ్గుతూ లానినో పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఎండల తీవ్రత తగ్గింది. ఈ నెల 25వ తేదీ నుంచి రోహిణి కార్తె మొదలవుతున్నా.. దాని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
రాబోయే రోజుల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఉష్ణోగ్రతలు ఉన్నా 40 డిగ్రీలలోపే నమోదయ్యే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనాల్లో ఏమైనా మార్పులు ఉంటే ఒకటి, రెండు రోజులు ఎండలు పెరిగే అవకాశం ఉంటుందని, మార్పులు లేకపోతే ఆ ఎండలు కూడా ఉండవని చెబుతున్నారు.
కర్ణాటక, మహారాష్ట్రలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతుండటం, అరేబియన్ మహాసముద్రం నుంచి గాలులు వీస్తుండటం, తమిళనాడు, బంగాళాఖాతం వైపు నుంచి కూడా గాలులు వీస్తుండడంతో రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. ఈ నేపథ్యంలో వారం రోజులుగా రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, కోస్తాలోని కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
ముందుగానే నైరుతి రుతుపవనాలు
అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో ఈ సీజన్‌లో నైరుతి రుతుపవనాలు ముందే వచ్చే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే భారత వాతావరణ శాఖ తెలిపింది. అరేబియా మహా సముద్రంలో ఏర్పడిన ద్రోణి తుపానుగా మారకుండా ఉంటే.. రుతుపవనాలు ముందే కేరళను తాకవచ్చని చెబుతున్నారు. ఆ ద్రోణి బలపడే అవకాశం లేదని భావిస్తున్నారు.
ఒకవేళ అది బలపడి తుపానుగా మారితే రుతుపవనాలు కొంత ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. అలాగే బంగాళాఖాతంలో అండమాన్ పరిసరాల్లో ఈ నెలాఖరుకు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అది బలపడితే నైరుతి రుతుపవనాలు ఇంకా వేగంగా విస్తరించవచ్చని చెబుతున్నారు. ఏదైనా ఈ నెలాఖరుకల్లా రుతు పవనాలు కేరళను తాకవచ్చని.. జూన్ 1కల్లా ఏపీకి విస్తరించవచ్చని అంచనా వేస్తున్నారు.
నేటి నుంచి వర్షాలు
ద్రోణి ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక శనివారం ప్రకాశం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది.
ఈ మూడు రోజులు వానలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవిస్తాయని తెలిపింది. గంటకు 40–50 కి.మీల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని పేర్కొంది. కాగా.. శనివారం శ్రీకాకుళం జిల్లాలో 16, విజయనగరం జిల్లాలో ఆరు, పార్వతీపురం మన్యం జిల్లాలో రెండు మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment